అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ పాకిస్తాన్‌కు భారీ దౌత్య విజయమా? భారత్‌కు ఎలాంటి సంకేతం?

    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో సుమారు 13 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు.

ఏప్రిల్ 7న సాయంత్రం డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. కానీ, మరుసటి రోజే రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించారు.

పాకిస్తాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ నిరంతరం బెదిరిస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా నిలిచి, కాల్పుల విరమణకు సాయపడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఈ చర్చల్లో షరీఫ్, మునీర్ పాత్రను ప్రశంసించారు.

మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ కీలక శక్తిగా ఎదిగిందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ ఘర్షణల్లో వందలాది మంది చనిపోయారు. అనేక దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి.

ఇలాంటి సమయంలో, ట్రంప్ స్వయంగా షాబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ పేర్లను ప్రస్తావిస్తూ క్రెడిట్ ఇవ్వడం పాకిస్తాన్‌కు గొప్ప దౌత్య విజయంగా కనిపిస్తోంది.

'పాకిస్తాన్‌కు పెద్ద విజయం'

వాషింగ్టన్‌లోని అట్లాంటిక్ కౌన్సిల్ సౌత్ ఏసియా రెసిడెంట్ సీనియర్ ఫెలో మైఖేల్ కుగెల్‌మన్ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. "పాకిస్తాన్‌ ఈ రాత్రి అతిపెద్ద దౌత్య విజయం సాధించింది. పాక్ ఇంతటి సంక్లిష్టమైన, ప్రమాదకరమైన పనిని చేయలేదన్న విమర్శలను తప్పని నిరూపించింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరాన్‌లో జరగబోయే భారీ వినాశనాన్ని ఆపడంలో తోడ్పడింది" అని తెలిపారు.

ఏ కోణంలో చూసినా ఇది పాకిస్తాన్‌కు అతిపెద్ద దౌత్య విజయమని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ ఫెలో సదానంద్ ధుమే తెలిపారు. ఒక ప్రపంచ విపత్తును నివారించడంలో పాకిస్తాన్‌ బాధ్యతాయుతమైన దేశంగా ఎదిగిందని అభిప్రాయపడ్డారు.

"ఇది పాకిస్తాన్‌ సాధించిన భారీ దౌత్య విజయం. దశాబ్ద కాలంలో ఆ దేశ విదేశాంగ విధానం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. ప్రస్తుతానికైతే ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన పోరాటాల్లో ఒకదానిని నివారించడంలో ఇది తోడ్పడింది" అని కుగెల్‌మన్ అమెరికన్ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు.

ఈ పోరాటానికి శాశ్వత ముగింపు పలికేందుకు చర్చల నిమిత్తం అమెరికా, ఇరాన్ ప్రతినిధులను షరీఫ్ ఇస్లామాబాద్‌కు ఆహ్వానించారు. తదుపరి చర్చలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు.

చివరి నిమిషంలో చైనా జోక్యం చేసుకుని, ఇరాన్‌ను శాంతించాలని కోరడం వల్లే ఆ దేశం కాల్పుల విరమణకు అంగీకరించిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇరాన్‌ను ఒప్పించడంలో చైనా కూడా కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నానని డోనల్డ్ ట్రంప్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

'ఓవైపు ఒత్తిడి, మరోవైపు చర్చలు'

ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా విధానం కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకప్పుడు ఇరాన్‌ను అంతం చేస్తామన్న అమెరికా, ఇప్పుడు షరతులతో కూడిన చర్చలకు సిద్ధమైంది. ఇరాన్‌ను వాషింగ్టన్ బలహీనపరిచినప్పటికీ, తన రాజకీయ లక్ష్యాలను మాత్రం సాధించలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా లక్ష్యం స్పష్టంగా లేదని ఈ కాల్పుల విరమణ తెలియజేస్తోందని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ మీనన్ రావు ఎక్స్ పోస్టులో తెలిపారు.

ఆ పోస్టులో, "ఈ కాల్పుల విరమణ కేవలం ఒక విరామం మాత్రమే, అంతకంటే ముఖ్యమైనది ఇప్పుడు ఎవరు ఏ పక్షాన ఉన్నారనేది. అమెరికా తనే సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల నుంచి ఇప్పుడు వెనక్కి తగ్గింది. నిన్నటి వరకు బెదిరింపులకు దిగిన అమెరికా, ఇప్పుడు చర్చల ద్వారా షరతులతో కూడిన శాంతికి అంగీకరించడం దాని పరిమితులను సూచిస్తోంది. సైనిక పరంగా కొన్ని విజయాలు సాధించినా, రాజకీయంగా అమెరికా ఏం సాధించాలనుకుంటున్నదనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే" అని రాశారు.

"ఇజ్రాయెల్ పరిస్థితి మరింత సందిగ్ధంలో పడింది. తన నియంత్రణలో లేని ఒక దౌత్య ప్రక్రియలో చిక్కుకుంది. ఇరాన్‌లో అధికార మార్పిడి లేదా దాన్ని దీర్ఘకాలం పాటు బలహీనపరచడం వంటి ఇజ్రాయెల్ ఆశయాలకు, ప్రస్తుత చర్చలకు పొంతన కుదరడం లేదు."

"ఇరాన్ తన వ్యూహాత్మక చతురతను చాటుకుంది. దాడులను తట్టుకుంటూనే, చర్చలను తనకు అనుకూలమైన దిశగా (ఆంక్షల సడలింపు, రక్షణ హామీలు) మళ్లించుకోగలిగింది. ఎక్కడా తన మౌలిక సిద్ధాంతాలను వదులుకోకుండానే ఈ ఘనత సాధించింది."

"పాకిస్తాన్‌ ఇక్కడ ఒక వ్యూహకర్తగా కాకుండా, కేవలం ఒక వారధిగా పనిచేసింది. రెండు దేశాల మధ్య సందేశాలను చేరవేయడానికి, చర్చల ద్వారా దౌత్యపరమైన అవకాశాలను కల్పించడానికి ఒక మార్గాన్ని చూపింది. ఇది సంప్రదాయ మధ్యవర్తిత్వం కాకపోయినా, దీనిని సులువుగా కొట్టిపారేయలేం. యుద్ధం ఇంకా ముగియలేదు, అది కేవలం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఇక్కడ ఒకవైపు ఒత్తిడి, మరోవైపు చర్చలు రెండూ సమాంతరంగా సాగుతాయి" అని అభిప్రాయపడ్డారు నిరుపమ రావు.

పాకిస్తాన్ 'కీలకపాత్ర'

"భారత్‌కు స్పష్టమైన సంకేతమిది. దీన్ని కేవలం ఉద్రిక్తతల తగ్గింపు చర్యగా మాత్రమే చూడకూడదు. ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపకుండా సమతుల్యంగా వ్యవహరించాలి" ని నిరుపమ రావు అన్నారు.

"ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ఇది సమతుల్యతతో, ఆలోచనాత్మక వ్యాఖ్యానం అవసరమైన సమయం."

ఇరాన్‌పై దాడులు పాకిస్తాన్‌కు ఏమాత్రం క్షేమకరం కాదు. ఇరాన్‌తో ఆ దేశానికి 909 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. పైగా పాకిస్తాన్‌ జనాభాలో 20 శాతం మంది షియా ముస్లింలు ఉన్నారు. మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం కారణంగా, సౌదీపై ఇరాన్ దాడులు చేసినప్పుడు పాకిస్తాన్‌ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ పాకిస్తాన్‌కు కూడా మేలు చేసేదే.

'ది హిందూ' వార్తాపత్రికకు పాకిస్తాన్‌ కరస్పాండెంట్‌గా పనిచేసిన, విదేశీ వ్యవహారాల నిపుణురాలు నిరుపమ సుబ్రమణియన్ కూడా ఒప్పందంలో ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు.

"పాకిస్తాన్‌కు ఇంతకుముందు అంతర్జాతీయ వేదికపై ఇలాంటి ఉనికి లేదు. సౌదీ అరేబియా వైపు నుంచి కూడా పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ తరపున యుద్ధం చేయడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదు. అలా జరిగితే పాకిస్తాన్‌లో అంతర్గతంగా తిరుగుబాటు వచ్చేది. అందుకే పాకిస్తాన్‌ ఎలాగైనా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంది" అని నిరుపమ సుబ్రమణియన్ తెలిపారు.

మధ్యవర్తిగా పాకిస్తాన్‌ విజయం చాలావరకు ట్రంప్ అధికార యంత్రాంగంతో దానికి పెరుగుతున్న సన్నిహిత సంబంధాలతో ముడిపడి ఉంది.

నిరుపమ సుబ్రమణియన్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ ప్రభుత్వంతో పాకిస్తాన్‌ సాన్నిహిత్యం పెంచుకుంది. దాని ఫలితం ఇప్పుడు దక్కుతోంది. అదే సమయంలో భారత్, అమెరికా సంబంధాల్లో ఒక రకమైన సందిగ్ధత ఏర్పడింది.

భారత్‌తో శాంతి స్థాపన కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్‌ మద్దతు పలికింది. ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడమే కాకుండా, ఆయన శాంతి ప్రయత్నాలను పదేపదే ప్రశంసించింది. గత ఏడాది కాలంలో మునీర్ అనేకసార్లు వాషింగ్టన్ వెళ్లారు.

ట్రంప్ ఆయనను "అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్" అని కూడా సంబోధించారు.

పాకిస్తాన్‌కు ఇరాన్‌తో చారిత్రక సాన్నిహిత్యం ఉంది. అదే సమయంలో, తెహ్రాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రభావితమైన గల్ఫ్ దేశాలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ చర్చలు ఒక కచ్చితమైన శాంతి ఒప్పందానికి దారితీసినా లేకున్నా, పాకిస్తాన్‌ ఇప్పటికే భారీ దౌత్య విజయాన్ని సాధించిందని నిపుణులు భావిస్తున్నారు.

"పాకిస్తాన్‌ కోణంలో చూస్తే, ఒప్పందం జరిగినా జరగకపోయినా ఇది లాభదాయకమైన స్థితి. ఒంటరి అయిపోయిందనే ముద్రను తొలగించుకుని, అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారడం పాకిస్తాన్‌ సాధించిన గొప్ప విజయం" అని అమెరికాలో పాకిస్తాన్‌ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.

అయితే, ఈ మధ్యవర్తిత్వ పాత్రలో రిస్క్ కూడా ఉంటుంది.

ఒమన్‌లో పాకిస్తాన్‌ మాజీ రాయబారి ఇమ్రాన్ అలీ వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడుతూ, "ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్యపరమైన సమతుల్యతను కాపాడుకోవడం పాకిస్తాన్‌కు చాలా కష్టమైన పని" అన్నారు.

కోల్డ్ వార్, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సమయంలో అమెరికా.. పాకిస్తాన్‌ను ఒక మిత్రదేశంగా చూసింది. సెప్టెంబర్ 11 దాడులకు కారకులైన అల్-ఖైదా ఉగ్రవాదులను, ముఖ్యంగా ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడంలో పాకిస్తాన్‌ సైన్యం, నిఘా సంస్థలతో సీఐఏ కలిసి పనిచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)