You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేటో నుంచి బయటకు వచ్చేయాలని ట్రంప్ ఎందుకు అనుకుంటున్నారు? అమెరికా వైదొలగితే నేటో ఏమవుతుంది?
- రచయిత, లైసీ డోసెట్
- హోదా, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్
- చదివే సమయం: 5 నిమిషాలు
ట్రంప్ హెచ్చరికల్లో ఎక్కువగా వినిపించేది నేటో మిలటరీ కూటమి నుంచి అమెరికా బయటకు రావడం. ఇప్పుడాయన మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు.
నేటోలో అమెరికా సభ్యత్వంపై పునరాలోచనలో ఉన్నారా అని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ప్రతినిధి అడగగా.. ''అవును. పునరాలోచించాల్సిన స్థితిని కూడా దాటిపోయింది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న మిలటరీ కార్యకలాపాల్లో నేటో భాగస్వామ్యదేశాలు పాల్గొనకపోవడాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
''అసలది దానంతటదే జరిగిపోవాలి'' అని ట్రంప్ అన్నారు.
ఈ కూటమి ఎలా పనిచేస్తుందనేది ట్రంప్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
నేటో ఆర్టికల్ 5 సమష్టి రక్షణకు కట్టుబడి ఉంటుంది. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే మిగిలిన దేశాలపైనా దాడి జరిగినట్టు భావిస్తారు. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోవడానికి సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. 1949 ఒప్పందం ప్రకారం యూరప్, ఉత్తర అమెరికాలో తలెత్తే సంక్షోభాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
‘అమెరికా లేకపోతే..’
తమను ముందుగా సంప్రదించకుండా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనకుండా ఒక్కో దేశం వెనక్కి తగ్గింది.
నేటో ఆర్టికల్ 5 ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి ఉపయోగించారు. అమెరికాలో 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత ఇది ప్రయోగించారు.
ట్రంప్ టెలిగ్రాఫ్‌తో యుక్రెయిన్ గురించి కూడా మాట్లాడారు. ''యుక్రెయిన్ సహా అన్ని విషయాల్లో మా అంతట మేమే సాయం చేశాం'' అని చెప్పారు.
2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పాశ్చాత్య దేశాల ప్రతిస్పందనకు నాయకత్వం వహించారు. ఎందుకంటే పుతిన్ చర్యలు అందరికీ ప్రమాదమని ఆయన భావించారు. అప్పుడు ఓ కూటమిలా నేటో సాయపడింది. కానీ నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా జాగ్రత్త పడింది.
2017లో మొదటిసారి అధ్యక్షుడు కావడానికి ముందునుంచే ట్రంప్ నేటోను ''కాగితం పులి''లా మారిందని, పాతదైపోయిందని, దాని కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతోందని ఆరోపించారు.
నేటోకు అమెరికా అండగా లేకపోతే యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమించేదని ఆయన అన్నారు.
మిలటరీ ఖర్చును భారీగా పెంచిన సభ్యదేశాలు
మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019లో ట్రంప్ దాదాపు నేటో నుంచి బయటకు వచ్చారు.
''ట్రంప్ తన బెదిరింపును నిజం చేయబోతున్నట్టు సంకేతాలు కనిపించాయి'' అని నేటో మాజీ సెక్రటరీ జనరరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తన ఇటీవలి మెమోయిర్ ''ఆన్ మై వాచ్''లో రాశారు.
నేటో సభ్యదేశాలపై ఒత్తిడి తెచ్చి, మిలటరీపై ఖర్చును పెంచేలా ట్రంప్ చేశారని తాను ఫాక్స్ న్యూస్‌తో చెప్పినట్టు స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు.
ట్రంప్ వెంటనే సోషల్ మీడియాలో వినిపించిన కామెంట్లను గుర్తించారని, నేటో నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టుగా వైట్ హౌస్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని ఆయన చదవలేదని చెప్పారు.
ఆయాదేశాలు జీడీపీలో రెండు శాతం రక్షణకు ఖర్చు చేయాలని 2014లో ఓ ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో దాన్ని ''గైడ్‌లైన్'' అన్నారు.
దాదాపు అన్ని నేటో సభ్యదేశాలు మిలటరీపై ఖర్చును భారీగా పెంచాయి. ట్రంప్ బెదిరింపులు ఇందుకు కొంత కారణమైతే, రష్యా నుంచి ముప్పు పెరుగుతోందని భావించడం మరో కారణం.
ఈ కొత్త సంక్షోభం యూరప్ దేశాలు, కెనడా తమ రక్షణ రంగాలను బలోపేతం చేసుకోవాలన్న, భద్రత కోసం తమపైతాము ఆధారపడాలన్న దృఢసంకల్పం కలిగించాయి. ఒక నిజం ఏంటంటే అమెరికా సైన్యం శక్తి చాలా ముఖ్యమైనది. ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపుతోంది.
అమెరికా సైనిక బడ్జెట్ ఇప్పుడు నేటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 62శాతం ఉంటుంది. పెంటగాన్ సైనిక వనరులకు, గూఢచారి సామర్థ్యానికి ఇతర దేశాలు సరితూగలేవు.
‘నేటో వల్ల అమెరికాకు కలుగుతున్న ప్రయోజనమేంటి?’
అమెరికా విదేశాంగ మంత్రి, తనను తాను నేటో కూటమికి మద్దతుదారునని చెప్పుకునే మార్కో రుబియో కూడా దీనిపై స్పందించారు.
''ఈ ఘర్షణ ముగిసిన తర్వాత ఆ సంబంధాన్ని మళ్లీ పరిశీలించాల్సిన అవసరం వస్తుందని నేననుకుంటున్నా'' అని ఆయన ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.
యూరప్‌లోని అమెరికా స్థావరాలను గురించి ప్రస్తావించారు. వాటిని అమెరికా ప్రయెజనాలను పరిరక్షించడానికి ఉపయోగించకపోవడం అంటే నేటో ‘వన్ వే’ అనుకోవడమేనని ఆయన విశ్లేషించారు.
అమెరికా యుద్ధవిమానాలకు బ్రిటన్ తొలుత అనుమతి నిరాకరించింది. తర్వాత తన విధానం మార్చుకుంది. రక్షణాత్మక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆ ఆలస్యంపై ట్రంప్, ఆయన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ విమర్శలు చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి స్టార్మర్‌ను రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నాయకుడైన చర్చిల్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు.
యుద్ధ కార్యకాలపాల కోసం మిడిల్ ఈస్ట్‌కు వెళ్తున్న అమెరికా విమానాలు తమ భూభగాగంలో ల్యాండ్ అయ్యేందుకు ఇటలీ నిరాకరించింది. ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా విమానాలకు స్పెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది.
‘కాంగ్రెస్ ఆమోదం ఉంటేనే’
ఈ సమస్యను పరిష్కరించడం అధ్యక్షుని చేతిలోనే ఉందని రూబియో అన్నారు.
కానీ ఇది ఆయనకొక్కరి నిర్ణయమే కాదు.
నేటో నుంచి ఏకపక్షంగా బయటకు రావడాన్ని వ్యతిరేకిస్తూ 2023 చివర్లో అమెరికా కాంగ్రెస్ ఓటేసింది. కాంగ్రెస్ చట్టం లేకుండా, మూడింట రెండొంతుల సెనేట్ మెజార్టీ లేకుండా ఇది సాధ్యం కాదు.
నేటో నాయకులు ముఖ్యంగా ప్రస్తుత సెక్రటరీ జనలర్ మార్క్ రుటే ట్రంప్‌ను ఒప్పించడానికి, అమెరికా నేటోలో కొనసాగేలా చేయడానికి మళ్లీ ప్రయత్నించాలి.
స్టోల్టెన్‌బర్గ్ లానే రూట్‌ని కూడా ''ట్రంప్‌ని ఒప్పించగలవ్యక్తి''గా భావిస్తారు. రూట్ డచ్ మాజీ నాయకుడు.
ఈ ఏడాది ప్రారంభంలో గ్రీన్‌ల్యాండ్‌ని ఆక్రమించుకుంటామని చేసిన హెచ్చరికలనుంచి ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేయడంలో రూట్ కీలక పాత్ర పోషించారని భావిస్తారు.
అయితే ఇరాన్‌పై యుద్ధానికి మద్దతిచ్చినందుకు నేటో దేశాల నుంచి రూట్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ మొత్తం ప్రపంచాన్ని సురక్షితంగా మారుస్తున్నారని రూట్ వ్యాఖ్యానించారు.
కానీ ఆయన ప్రధాన లక్ష్యం నేటో కూటమిని యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్, వైట్ హౌస్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల మధ్య కూడా కొనసాగేలా చేయడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)