యుగాండాలో చింపాంజీల ‘సివిల్ వార్’, 24 మృతి.. కలసికట్టుగా ఉండే ఈ జంతువులు ఎందుకలా దాడులు చేసుకుంటున్నాయి?

    • రచయిత, హఫ్‌సా ఖలీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రపంచంలోనే కలిసికట్టుగా జీవిస్తాయని భావించే అతిపెద్ద అడవి చింపాంజీల గుంపు ఇప్పుడు విడిపోయింది. ఈ చింపాంజీలు ఎనిమిదేళ్లగా తమలో తాము కలహించుకుంటున్నాయని పరిశోధకులు అంటున్నారు.

యుగాండాలోని కిబాలే నేషనల్ పార్క్‌లో ఒకప్పుడు కలిసి దగ్గరగా జీవించిన కింట్ కమ్యూనిటికీ చెందిన ఎన్‌గొగొ చింపాంజీలు ఇప్పుడు ఒకదానికొకటి ఎందుకు దూరమయ్యాయనేదానిపై స్పష్టత లేదు.

2018 నుంచి 17 కూనలతో సహా 24 చింపాంజీలు చనిపోయినట్టు శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు.

''ఒకప్పుడు చేతులు పట్టుకుని ఉండే చింపాంజీలు. ఇప్పుడవి ఒకదాన్నొకటి చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి'' అని ఈ ఆర్టికల్ రాసిన ప్రధాన రచయిత ఏరోన్ శాండెల్ చెప్పారు.

జర్నల్ సైన్స్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ హింసలోని తీవ్రత, ఇది కొనసాగుతున్న సమయం మనుషుల మధ్య తొలినాళ్లలో సంక్షోభాలు ఎలా మొదలయ్యాయనేదానిపై మనకు సమాచారం ఇవ్వొచ్చనేది అధ్యయనకర్తల అభిప్రాయం.

చింపాంజీల మధ్య దూరం ఎందుకు పెరిగింది?

చింపాంజీలకు ప్రాంతీయ అధికార భావం చాలా ఉంటుందని, ఇతర గ్రూపులకు చెందిన చింపాంజీలతో శత్రువుల తరహాలో ప్రవర్తిస్తాయని అమెరికాలోని టెక్సస్ యూనివర్శిటీకి చెందిన ఆంత్రోపాలజిస్ట్ శాండెల్ చెప్పారు.

''కొత్తవారంటే భయపడడం లాంటిదే ఇది'' అని సైన్స్ పాడ్‌కాస్ట్‌లో ఆయన చెప్పారు.

దాదాపు 200 ఎన్‌గొగొ చింపాంజీలు కలిసికట్టుగా, శాంతియుతంగా అనేక దశాబ్దాలపాటు జీవించాయని శాండెల్ చెప్పారు.

అవి రెండు గ్రూపులుగా ఉండేవి. పరిశోధకులు ఆ గ్రూపులను వెస్ట్రన్, సెంట్రల్‌గా చెబుతారు. అయితే మొత్తం మీద అవి ఓ సమూహంగానే కలిసి జీవించాయి.

చింపాంజీలు విడిపోతున్నాయని 2015 జూన్‌లో గుర్తించామని శాండెల్ చెప్పారు. వెస్ట్రన్ చింపాంజీలు పరిగెత్తుతుంటే సెంట్రల్ గుంపు వాటిని వెంబడించింది.

‘అంతలోనే కొట్టుకుని, అంతలోనే కలిసిపోయి’

''చింపాంజీల్లో కొంచెం మెలోడ్రామా ఉంటుంది. వాదోపవాదాల తర్వాత అవి అరుస్తూ ఒకదాన్నొకటి వెంబడించుకుంటాయి. తర్వాత అవి ఒకదాన్నొకటి శుభ్రపరుచుకుంటూ సహకరించుకుంటాయి.

కానీ 2015లో వచ్చిన విభేదాల తర్వాత రెండు గుంపులు ఆరువారాల పాటు దూరంగా ఉన్నాయని, తర్వత అవి కలిసే సందర్భాలు బాగా తగ్గిపోయాయని పరిశోధకులు చెప్పారు.

కలిసినప్పుడు అవి మరింత దూకుడుగా, ఆగ్రహంగా ఉండేవని శాండెల్ చెప్పారు.

2018లో రెండు గుంపులను కలిపినప్పుడు వెస్ట్రన్ గుంపు చింపాంజీలు సెంట్రల్ చింపాంజీలమీద దాడి చేయడం మొదలుపెట్టాయి.

అవి విడిపోయిన దగ్గరనుంచి 24 దాడులు జరిగాయని, సెంట్రల్ గుంపులోని ఏడు మగ చింపాంజీలు, 17కూనలు చనిపోయాయని అధ్యయనంలో తేలింది. చనిపోయిన చింపాంజీల అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

గుంపు పరిమాణం, వనరుల కోసం పోటీ, పునరుత్పత్తి కోసం మగ చింపాంజీల మధ్య పోటీ కారణాలు కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

కలిపి ఉంచే చింపాంజీలు లేవు

ఈ పరిస్థితికి మూడు ముఖ్య కారణాలున్నాయని వారు భావిస్తున్నారు. మొదటికారణం 2014లో ఒక ఆడ చింపాంజీ ఐదు మగ చింపాంజీలు చనిపోయాయి. అవి ఎందుకు చనిపోయాయో తెలియదు. ఇది చిన్నచిన్న చింపాంజీ గ్రూపుల మధ్య సామాజిక సంబంధాలను దెబ్బతీసుండొచ్చు.

తర్వాతి సంవత్సరం ఆల్ఫా మేల్(ప్రధాన నాయకుడు) మార్పు. వెస్ట్రన్, సెంట్రల్ గుంపుల మధ్య తొలిసారి విభజన మొదలైన సమయంలోనే ఈ మార్పు జరిగిందని అధ్యయనం చెబుతోంది. గుంపులో నాయకత్వ ఆధిపత్యంలో మార్పువస్తే చింపాంజీల్లో దాడి స్వభావం పెరుగుతుందని, ఒకదానికొకటి దూరంగా ఉండడం ఎక్కువవుతుందని ఆ అధ్యయనం తెలిపింది.

2017లో చివరి విభజన జరగడానికి ముందు శ్వాస సంబంధిత మహమ్మారితో 25 చింపాంజీలు చనిపోయాయి. గుంపులను కలపడంలో కీలకంగా ఉండే ఓ మగ చింపాంజీ ఆ సమయంలో చనిపోయిందని రీసెర్చ్ పేపర్‌లో ఉంది.

‘మనుషుల మధ్య సంక్షోభాలకు కారణం తెలుసుకునే అవకాశం’

మనుషుల మధ్య సంక్షోభం, యుద్ధవాతావరణంపై ఇప్పటిదాకా మనకు తెలిసిన సమాచారంపై పునరాలోచన చేసే దిశగా చింపాంజీల గురించి తెలిసిన సమాచారం ఉపయోగపడుతుందని శాండెల్, ఆయన సహచరులు చెప్పారు.

ఏళ్లపాటు కలిసి జీవించిన, ఆహారం సేకరించిన, గస్తీ కాసిన చింపాంజీలు ఎన్‌గొగొ గుంపు విడిపోయిన సమయంలో కొత్తగా ఏర్పడిన గుంపులతో కలిసి ఒకదానికొకటి ప్రాణాంతక దాడులకు లక్ష్యంగా మారాయి.

''జన్యుపరంగా మనుషులకు అత్యంత దగ్గరగా ఉండే జాతుల్లో చింపాంజీలు ఒకటి. మతం, రాజకీయ నమ్మకాలు, నైతికత వంటి మనుషులు సృష్టించుకున్న అంశాలు లేకుండానే అవి ఇలా కలహాలకు దిగుతున్నాయంటే సంబంధాల మార్పులు మనుషుల మధ్య జరిగే సంక్షోభాల్లో మనం ఊహించినదానికన్నా ఎక్కువపాత్ర పోషిస్తుండొచ్చు'' అని వాళ్లు చెప్పారు.

గుంపులుగా విడిపోవడం మానవ సమాజాలకు ఎంత ప్రమాదకరమో ఇది తెలియజేస్తుందని జర్మనీలోని జర్మన్ ప్రైమేట్ సెంటర్ పరిశోధకులు జేమ్స్ బ్రూక్స్ చెప్పారు.

ఇతర జాతులు గుంపులను ఆధారం చేసుకుని కనబర్చే వైఖరి నుంచి మనుషులు యుద్దంలో అయినా, శాంతిలో అయినా చాలా నేర్చుకోవాలని, అదే సమయంలో వారి పరిణామ చరిత్ర భవిష్యత్తును నిర్ణయించబోదని గుర్తించాలని ఆ అధ్యయనంపై జేమ్స్ బ్రూక్స్ స్పందించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)