భారత్ తన నాగాస్త్ర, శేషనాగ్ డ్రోన్ల సంఖ్య పెంచాల్సిందేనా? రూ. లక్షల విలువైన ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికాను చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?

    • రచయిత, సుచేత్ వీర్ సింగ్
    • హోదా, రక్షణ రంగ నిపుణులు, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఉపయోగిస్తున్న కామికాజి షాహెద్ డ్రోన్లపై చర్చ జరుగుతోంది.

ఈ చౌక రకం డ్రోన్లు మిడిల్ ఈస్ట్‌లో విధ్వంసం సృష్టించడం, అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో సమర్థంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

దీంతో తక్కువ ఖర్చుతోనే యుద్ధం చేయగలగే విషయంలో ఈ డ్రోన్లు కొత్త చర్చకు దారితీశాయి.

మిడిల్‌ఈస్ట్‌లోని నివాస ప్రాంతాలను, విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను, చమురు గ్యాస్ మౌలిక సదుపాయాలను, సైనిక స్థావరాలను, రాడార్లను, సెన్సర్లను లక్ష్యంగా చేసుకుని దూకుడుగా దాడి చేసేందుకు బాలిస్టిక్ క్షిపణులతో పాటు షాహెద్ డ్రోన్లనూ ఇరాన్ ఉపయోగించింది.

గత నెల రోజులుగా గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు, ఎయిర్ పవర్ ప్రాముఖ్యాన్ని మరోసారి చాటిచెప్పాయి.

షాహెద్ డ్రోన్ వల్ల కలిగే భారీ నష్టం.. తక్కువ ఖర్చుతో కూడిన కామికాజి డ్రోన్లను పెద్ద ఎత్తున సైనిక ఆయుధాగారాలలో చేర్చడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాన్ని తెలియజేస్తుంది.

భారత్‌కు ఈ పాఠం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రస్తుత సంక్షోభ ప్రాంతం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, భారత్ సరిహద్దుల చుట్టూ 'శత్రువులు' ఉన్నారు.

ఫిబ్రవరి 28న ఈ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి.. లక్ష్యాలను ఛేదించేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను వాడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు షాహెద్-136, షాహెద్-107, షాహెద్-238 డ్రోన్లను వాడింది.

షాహెద్ -136, షాహెద్-107లు పిస్టన్ ఇంజిన్‌తో ఉండే సింగిల్-బారల్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ (లక్ష్యం ఉన్న ప్రాంతంపైనే తిరిగే ఆయుధాలు) కాగా, షాహెద్-238 డ్రోన్లు జెట్ ఇంజిన్‌తో పనిచేసే లాయిటరింగ్ మ్యూనిషన్.

ఇరాన్ డ్రోన్ల అతిపెద్ద బలం ఏంటంటే.. అవి చౌకగా దొరకడం, తయారీ సౌలభ్యం. షాహెద్ డ్రోన్ల ధర ఒక్కోటి 20 వేల డాలర్ల ( భారత కరెన్సీలో సుమారు రూ.18.52 లక్షల) నుంచి 50 వేల డాలర్ల (రూ.46.30 లక్షల) మధ్యలో ఉంటుంది.

వీటికి భిన్నంగా.. వీటిని అడ్డుకునే అమెరికా, ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలు చాలా ఖరీదైనవి.

అమెరికా టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) సిస్టమ్ లేదా పేట్రియాట్ మిసైల్ సిస్టమ్ (పీఏసీ-3)లు తమవైపు వస్తున్న క్షిపణిని లేదా డ్రోన్‌ను అడ్డుకుని, కూల్చేవేసిన ప్రతిసారీ 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.9 కోట్లకు పైబడి) నుంచి 4 మిలియన్ డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) మధ్యలో ఖర్చవుతుందని అంచనా.

ఖర్చులో ఇంత పెద్ద మొత్తంలో తేడాతో పాటు.. ఇంటర్‌సెప్టార్ మిసైల్స్ చాలా త్వరగా తరిగిపోవడం, తిరిగి వీటిని తయారు చేసి, మోహరించేందుకు చాలా సమయం పట్టడం వంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.

సప్లయి చెయిన్‌లో అంతగా లేకపోవడంతో.. యుద్ధంలో ప్రయోగించిన తోమహాక్ క్షిపణుల స్థానంలో కొత్తవాటిని తీసుకురావడానికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి.

సంక్షోభం ప్రారంభ రోజుల్లో.. ఇరాన్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకునేందుకు 800కి పైగా ఇంటర్‌సెప్టార్ మిసైళ్లను అమెరికా, దాని మిత్రదేశాలు వాడాయి. అయితే, 2025 ఏడాదంతా కేవలం 620 పీఏసీ-3 మిసైళ్లను మాత్రమే లాక్‌హీడ్ మార్టిన్ ఉత్పత్తి చేసింది.

వాస్తవానికి, ఇరాన్ డ్రోన్ల ఖర్చుకు, ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు వాడే ఇంటర్‌సెప్టార్ సిస్టమ్‌ల ఖర్చుకు మధ్య చాలా తేడా ఉంది.

ఖర్చుల్లో ఈ అసమతుల్యత, నిర్మాణాత్మక సరఫరా గొలుసులో ఉన్న పరిమితులు, వాటి స్థానంలో కొత్తది తీసుకురావడంలో ఇబ్బందులు ఈ సంక్షోభంలో ప్రతికూల ఆర్థిక పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇది ఇరాన్‌కు తనకంటే బలమైన, ఐక్యంగా ఉన్న ప్రత్యర్థులపై తన సైనిక బలహీనతను అధిగమించడానికి అవకాశం కల్పించింది.

యుద్ధంతో మారిన ఆర్థిక పరిస్థితులు తనకు ప్రయోజనకరంగా నిలుస్తున్న వ్యూహాలను అనుసరించేందుకు ఇరాన్‌కు వీలు కలిగించాయి.

ఇంటర్‌సెప్టార్ల కంటే ఇరాన్ డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. తేలికగా తయారు చేయొచ్చు. అందువల్ల, ఇజ్రాయెల్, అమెరికా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఆర్థిక భారం పెరుగుతోంది.

ఖర్చుల విషయంలో ఉన్న ఈ ప్రతికూల పరిస్థితితో కొన్ని గల్ఫ్ దేశాలు ఈ ఇంటర్‌సెప్టార్ నిల్వలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను అనుసరించాల్సి వచ్చింది.

షాహెద్ డ్రోన్‌లను కూల్చివేయడానికి గల్ఫ్ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను మోహరించాయి. అయితే, ఈ పద్ధతి కూడా చాలా ఖరీదైనది. ఒక ఎఫ్-16 విమానాన్ని ఆకాశంలో మోహరించేందుకు గంటకు సుమారు 25,000 డాలర్లు (రూ.23 లక్షలు) ఖర్చవుతుంది.

ప్రస్తుత పరిస్థితిలో.. కాస్ట్-ఎక్స్చేంజ్ రేషియో ఇరాన్‌కు అనుకూలంగా ఉంది. కొత్త ఆయుధాలను, ఇంటర్‌సెప్టార్లను అందించేందుకు పాశ్చాత్య దేశాల పారిశ్రామిక సామర్థ్యంపై ఒత్తిడి పెరిగింది.

యుద్ధ సాంకేతికత నిర్మాణానికి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అంతరాయం కలిగిస్తున్నాయి.

సాంకేతికంగా అధునాతన ఎంపికలు సైనిక సామర్థ్యాలను పెంపొందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ... భవిష్యత్ సంక్షోభాల కోసం తక్కువ ఖర్చుతో దాడి చేయగలిగే రక్షణ వ్యవస్థలు ఈ సైన్యాలకు కావాల్సి ఉంది.

మిడిల్‌ఈస్ట్ సంక్షోభానికి భారత్ దూరంగా ఉండవచ్చు. కానీ, యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక, ఇంధన ప్రభావాల నుంచి మాత్రం ఇది పూర్తిగా మినహాయింపు కాదు.

గత వేసవిలో భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణ నెలకొన్నప్పుడు స్పష్టమైనట్లుగా, ఇప్పుడు దక్షిణాసియా సంక్షోభాల్లో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారత సైన్యానికి చెందిన డ్రోన్ భాండాగారంలో పలు అత్యాధునిక డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లలో ఇజ్రాయెలీ నిఘా డ్రోన్లు అయిన ఐఏఐ సెర్చర్ అండ్ హార్పర్, ఆపరేషన్ సిందూర్‌లో వాడిన హారోప్, హార్పీ వంటి ఇజ్రాయెల్ లోయిటరింగ్ మ్యూనిషన్స్ ఉన్నాయి.

హార్పీ వేరియంట్‌ స్కై స్ట్రైకర్‌ను భారత్‌లో కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు. అమెరికాలో తయారైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కూడా కాలక్రమేణా భారత ఆయుధాగారంలోకి చేర్చనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాగాస్త్ర 1 వంటి స్వదేశీ కామికాజి డ్రోన్‌లను కూడా మోహరించారు.

అయితే, భారత ఆయుధాగారాలలో చౌకగా, తేలికగా తయారు చేసే కామికాజి డ్రోన్లు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.

భారత్ కామికాజి డ్రోన్ల ఉత్పత్తిని, వాటి సమీకరణ ప్రణాళికలను గణనీయంగా పెంచాల్సి ఉంది. నాగాస్త్ర వంటి స్వదేశీ పరిష్కారాలు, కాల్(కేఏఎల్), శేషనాగ్ డ్రోన్లు వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. పెద్ద మొత్తంలో మోహరించడానికి స్వల్పస్థాయిలో కొనుగోళ్లు సరిపోవు.

సైన్యం పదివేలు, వేల సంఖ్యలో కాకపోయినా.. తక్కువ ధర కలిగిన కామికాజీజి డ్రోన్‌లను ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంది. పరిమిత సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చి, వాటిని సరఫరా చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రస్తుత విధానం.. ముఖ్యంగా తయారీదారులకు ఆర్థికంగా, దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉండదు.

యుద్ధాల్లో తక్కువ ధరలోని లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడకం పెరుగుతుంది. ఇరాన్ వ్యూహాలతో ఇది మరింత పెరుగుతోంది.

ప్రస్తుత సంక్షోభంలో ఇరాన్ అసమానమైన ఎత్తుగడలకు బదులిచ్చేందుకు అమెరికా కూడా లోకాస్ట్ అన్‌మాన్డ్ కంబాట్ అటాక్ సిస్టమ్‌ను (ఎల్‌యూసీఏఎస్) మోహరించింది. అమెరికాకు ఉన్న విస్తారమైన సైనిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల దృష్ట్యా, భారత్‌కు దీని ప్రాముఖ్యం మరింత ఎక్కువ.

మిడిల్‌ఈస్ట్ నుంచి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం.. యుక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో అలాంటి వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లే, చవకైన, తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ నిరోధక వ్యవస్థలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి, తయారు చేసి, సేకరించాల్సిన అవసరం ఉంది.

గల్ఫ్ దేశాల్లో ఇలాంటి వ్యవస్థలు తక్కువగా ఉన్నాయి. అందుకే, ప్రస్తుత సంక్షోభంలో ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే ఉన్న వాయు రక్షణ వ్యవస్థలకు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ వ్యవస్థలు అదనపు లేయర్‌లా పనిచేస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)