ఇస్లామాబాద్: అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు, మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి.

పాకిస్తాన్ సమక్షంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య, ప్రస్తుతం త్రైపాక్షిక ప్రత్యక్ష చర్చలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు బీబీసీ ఉర్దూకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మొదట చర్చలు మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నాయని, అంటే పాకిస్తాన్ అధికారులు రెండు దేశాల ప్రతినిధి బృందాలకు సందేశాలు చేరవేస్తున్నట్లు వెల్లడించాయి.

చర్చలు సానుకూలంగా సాగి, వాతావరణం అనుకూలంగా ఉంటే, రెండు దేశాలు ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపారు.

చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఉదయం ఇస్లామాబాద్‌కు చేరుకుంది.

దీనికి ముందు.. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం ఉందని ఇస్లామాబాద్‌లోని బీబీసీ సౌత్ ఏసియా కరస్పాండెంట్ ఆజాదే మోషిరి తెలిపారు.

ఈ చర్చలు కాల్పుల విరమణ పొడిగింపునకు లేదా ఏదైనా ఒప్పందానికి, లేదంటే కనీసం ఈ చర్చలు కొనసాగుతాయన్న సంకేతాలు వెలువడతాయేమో చూడాలని ఆయన పేర్కొన్నారు.

త్రైపాక్షిక చర్చలను ధ్రువీకరించిన అమెరికా

అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య ముఖాముఖి త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నట్లు వైట్ హౌస్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు ధ్రువీకరించారు. పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు కూడా అంతకుముందే బీబీసీకి ఇదే విషయాన్ని తెలిపాయి.

అమెరికా తరపున చర్చల్లో ఎవరెవరు పాల్గొంటున్నారనే అంశంపై సదరు అధికారి మరిన్ని వివరాలు అందించారు. ప్రధాన ప్రతినిధుల బృందంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఉన్నట్లు స్పష్టం చేశారు.

అమెరికా ఉన్నత స్థాయి అధికారి సమాచారం ప్రకారం.. ఈ బృందంలో జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ బేకర్, ఆసియా వ్యవహారాల సలహాదారు మైఖేల్ వాన్స్ కూడా ఉన్నారు.

వివిధ రంగాలకు చెందిన అమెరికా నిపుణులు ఇస్లామాబాద్‌లోని చర్చల్లో పాల్గొంటున్నారని, మరికొందరు వాషింగ్టన్ డీసీ నుంచి సహకారం అందిస్తున్నారని ఆ అధికారి తెలిపారు.

అయితే, ఇదే సమయంలో ఈ ఘర్షణలో ఇరాన్ "ఘోరంగా ఓడిపోతోంది" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

'ఘోరంగా ఓడిపోతోంది'

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్టులో, కొన్ని మీడియా సంస్థలు "ఇరాన్ గెలుస్తోందని చెబుతున్నాయి, కానీ వాస్తవానికి వారు ఘోరంగా ఓడిపోతున్న సంగతి అందరికీ తెలుసు" అని ఆయన రాశారు.

ఈ ఘర్షణ సమయంలో అమెరికా యంత్రాంగం చేసిన వాదనలను మరోసారి చెబుతూ, "వారి నౌకాదళం తుడిచిపెట్టుకుపోయింది. వైమానిక దళం పోయింది, వారి వైమానిక రక్షణ వ్యవస్థ లేదు, వారి రాడార్ లేదు, వారి క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయి. మరీముఖ్యంగా, సుదీర్థకాలం పాలించిన వారి నేత లేరు" అని చెప్పారు.

సముద్రంలోని ఇరాన్ మైన్లను ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాల కోసం హార్ముజ్ జలసంధిని శుభ్రం చేయడం ప్రారంభించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ సమక్ష్యంలో ప్రత్యక్ష చర్చలు జరుగుతుండగా, మరోవైపు లెబనాన్‌పై దాడులు కొనసాగుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకారం, గత 24 గంటల్లో లెబనాన్‌లో 200కు పైగా హిజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసింది.

లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దక్షిణ లెబనాన్‌లో జరిగిన దాడుల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)