దిల్లీ: ఉద్యమాన్ని ప్రభుత్వం కఠినంగా అణచివేసిందా? విశ్లేషకుల మాటేంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఇతర సంఘాలు శనివారం దిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ఈ నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు తీసుకున్న కఠిన చర్యలు పోలీసుల సీనియర్ రిటైర్డ్ అధికారులను, రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేశాయి.
ఇంత భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
సుమారు 20 వేల మంది ఆందోళనకారులను అడ్డుకోవడానికి దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో దిల్లీ పోలీసులతో పాటు ఇతర భద్రతా బలగాల జవాన్లు కూడా ఉన్నారు.
ప్రజల సంచారాన్ని పూర్తిగా నియంత్రించడానికి దిల్లీ మెట్రోకు చెందిన 50కి పైగా స్టేషన్లను మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే దాదాపు 245 రైళ్లు ఆలస్యమయ్యాయి లేదా దిల్లీలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు.

అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారులు విమానంలోకి ప్రవేశించిన తీరు కూడా చర్చనీయంగా మారింది.
అరెస్టును తాము వ్యతిరేకించడం లేదని, పోలీసులు తొందరపడకూడదని దీప్కే పదే పదే చెప్పారు.
నిరసనల తీవ్రతతో పోలిస్తే పోలీసుల చర్యలు పూర్తిగా అసమానంగా ఉన్నాయని పలువురు మాజీ సీనియర్ పోలీసు అధికారులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
రాజకీయ నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయా?
"పోలీసింగ్‌లో వివిధ పద్ధతులు ఉంటాయి, కానీ ప్రస్తుత చర్యలు రాజకీయ నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయి. బిహార్‌లో రైలు రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న ప్రజల ఫోటోను నేను చూశాను. దీని ప్రభావం దిల్లీపై మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పడింది" అని కర్ణాటక మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్.టి. రమేశ్ బీబీసీతో అన్నారు.
ఈ అంశంపై ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ప్రత్యేక డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్‌తో కూడా బీబీసీ మాట్లాడింది. నిరసనకారులపై కఠిన ఆంక్షలు విధిస్తే, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి పోలీసు కమిషనర్ ముందుగానే వివరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ అభిప్రాయాలు లేదా ఆదేశాలకు ప్రభావితం కాకుండా పోలీసు కమిషనర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందన్న ఎస్‌టీ రమేశ్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.
"జెన్-జెడ్ యువతకు తమ భావాలను వ్యక్తపరచడానికి జంతర్-మంతర్ కంటే పెద్ద ప్రదేశాన్ని కేటాయించాల్సింది. చివరకు నీట్ సంస్కరణల అంశం మరుగైపోయింది. పోలీసుల చర్యల కారణంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య శత్రుత్వం ఏర్పడింది. దీనివల్ల చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభించే అవకాశాలు మూసుకుపోతాయి" అని ఆజాద్ పేర్కొన్నారు.
అయితే, తాము నిరసనలకు వ్యతిరేకంకాదని బీజేపీ స్పష్టం చేసింది.
"మేం నిరసనలకు వ్యతిరేకం కాదు. కానీ, తమ ఓటమి కారణంగా వీరు రోడ్లపై నిరసనలను ఓ ఆయుధంగా మార్చుకున్నారు. అందులోనూ ఓ పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది" అని పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ శనివారం అన్నారు.
"మొదటి మూడు రోజులు రాహుల్ గాంధీ ఉన్నారు, ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున షాడో-బాక్సింగ్ చేసే సీజేపీ వచ్చింది. సీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం షాడో-బాక్సింగ్ చేస్తుంది. ఉదయం నుంచి వారి హడావుడి కొనసాగింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్, ఇతరులు వచ్చారు" అన్నారు.
"మమతా బెనర్జీ కూడా తామెందుకు వెనుకబడాలని భావించి వచ్చారు. ఆ తర్వాత సీపీఐ, సీపీఎం నేతలు కూడా చేరుకున్నారు" అని పేర్కొన్నారు.
అయినప్పటికీ, సీనియర్ రిటైర్డ్ అధికారులు మరో కోణాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఘటనాస్థలిలో ఉన్న అధికారే అత్యంత సరైన వ్యక్తి అని వారు పేర్కొన్నారు.
"గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి వేరే మార్గం ఉండదు. క్షేత్రస్థాయిలో అంచనా తప్పిందా లేదా రాజకీయ ఒత్తిడి వల్ల అలా జరిగిందా అనేది నిర్ధరించడం కష్టం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ రిటైర్డ్ అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images
'పోలీసుల ఏర్పాట్లు అవసరమే'
దిల్లీ పోలీసుల ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్‌తోనూ బీబీసీ మాట్లాడింది. ఈ సందర్భంగా దిల్లీ పోలీసులను ఏమాత్రం తప్పుపట్టబోనని ఆయన అన్నారు.
''వారు చేసిన ఏర్పాట్లు అవసరమే. ఇంటర్నెట్, మెట్రో సేవలు లేకుండా కొంతకాలం గడపాల్సి రావడంతో దేశ ప్రజలు ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ, సీజేపీ సృష్టించిన గందరగోళంతో పోలిస్తే ఇదేమీ పెద్ద విషయం కాదు'' అని విక్రమ్ సింగ్ అన్నారు.
''జంతర్ మంతర్ వద్ద నిరసన జరిగినప్పుడు పరిస్థితులను ఎదుర్కోవడంలో పోలీసులకు అనుభవం తక్కువగా ఉందని స్పష్టమైంది. గుంపులను నియంత్రించడం, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆగ్రహంతో ఉన్న గుంపుల ప్రవర్తనను అదుపు చేయడం పోలీసులకు తెలిసి ఉండాలి. బలప్రయోగాన్ని దశలవారీగా చేయాలి'' అన్నారు.
''నిరసనలు, శత్రుత్వంతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం నాగరిక సమాజంలో జీవిస్తున్నాం. చివరికి మీరు విచారణ జరిపితే, అరెస్టయిన వారిలో కనీసం 25 శాతం మంది మీ దూరపు బంధువులే అయి ఉంటారని మీకు అర్థమవుతుంది. అందుకే బలప్రయోగం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి'' అని విక్రమ్ సింగ్ అన్నారు.
అయితే, అసలు సమస్య నీట్ పరీక్ష నిర్వహణ తీరుతోనే మొదలైందని ఆయన అన్నారు.
''ఏదైనా సమస్య ఉంటే అది మరింత తీవ్రం కాకముందే పరిష్కరించాలి. నెపోలియన్ చెప్పినట్లు.. 'సమస్య వచ్చి మనల్ని ముంచెత్తే వరకు నేను ఎదురుచూడను. సమస్య ఎంత తీవ్రంగా మారవచ్చో ముందే అంచనా వేసి, దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన దానికంటే పది రెట్లు ఎక్కువగా సిద్ధమవుతాం' అన్నారాయన.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
జెన్-జెడ్ రాజకీయ అవగాహన
జులైలో నీట్ పరీక్షల్లో జరిగిన లోపాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని చూసి ప్రభుత్వం ఆశ్చర్యపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జెన్-జెడ్‌తో ఇటీవల జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడాన్ని వారు ఈ కోణంలో చూస్తున్నారు.
ఆ నిరసనల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైనందునే ఈసారి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలకు దిగినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
''ఇప్పటి వరకు బీజేపీకి మిలీనియల్స్ నుంచి మద్దతు లభిస్తూ వచ్చింది. జీవితంలో ఎదగడం, పురోగతి సాధించడం మిలీనియల్స్‌కు ప్రధాన అంశాలుగా ఉండేవి. కానీ ,ఈ తరాన్ని అర్థం చేసుకోవడం పూర్తిగా భిన్నమైన సవాలు. వారికి సొంత ఆకాంక్షలు ఉన్నాయి. గత తరంతో పోలిస్తే వారి ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంది. వారి ఆశలు, రాజకీయాల పట్ల వారి దృక్పథాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది'' అని రాజకీయ విశ్లేషకురాలు రాధికా రామశేషన్ బీబీసీతో అన్నారు.
పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రజల స్పందనను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందన్న రాధికా రామశేషన్ అభిప్రాయంతో రాజకీయ వ్యాఖ్యాత ఆరతి జెరాత్ పాక్షికంగా ఏకీభవించారు.
''జులైలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆందోళనకు గురైంది. పెల్లెట్ గన్లను ఉపయోగించడం ప్రారంభించింది. దీంతో అది పెద్ద ఉద్యమంగా మారింది. ఈసారి ప్రభుత్వం మరో వైపు వెళ్లింది. అవసరానికి మించి కఠినంగా స్పందించి దిల్లీలో భయానక వాతావరణాన్ని సృష్టించింది'' అని జెరాత్ అన్నారు.
''విద్యార్థులతో చర్చలు జరిపి ప్రభుత్వం రాజకీయంగా ఒక సందేశం ఇవ్వాల్సింది. కానీ, ప్రధాని, హోంమంత్రి మాత్రం పశ్చిమ బెంగాల్‌లో రెండు ఉప ఎన్నికల్లో గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించి, రాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్లీ చేర్చారు'' అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఆనంద్ సహాయ్ బీబీసీతో అన్నారు.
దేశంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడానికి ముందు జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని గుర్తుచేస్తూ సహాయ్ మరో విషయం చెప్పారు.
''అప్పట్లోనూ ప్రత్యర్థులతో చర్చలు జరిపేందుకు రాజకీయ మార్గం ఎప్పుడూ తెరిచే ఉండేది. ప్రజలు నిరసన తెలిపే హక్కును ఏ దశలోనూ అడ్డుకోలేదు'' అన్నారాయన.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ఒక విధంగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయని రాధికా రామశేషన్ అన్నారు.


ఫొటో సోర్స్, Reuters
ఇకపై ఏం జరగవచ్చు?
ప్రభుత్వం ఏదో ఒక దశలో తన వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఆరతి జెరాత్ అభిప్రాయపడ్డారు.

రాజకీయంగా పరిస్థితి సంక్లిష్టంగా మారిందని రాధికా రామశేషన్ అన్నారు.
''నీట్ అంశం కుల, మతపరమైన హద్దులకు అతీతంగా ఉంది. కానీ ఎస్‌ఐఆర్ అంటే ఇతర వర్గాలతో పోలిస్తే మైనారిటీలు, దళితులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ ప్రధాన ఓటర్లు.. ప్రస్తుత కఠిన వైఖరిని సమర్థించే అవకాశం ఉంది'' అని ఆమె అన్నారు.
''ఏదైనా మారిందంటే, ఇరు పక్షాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమవడమే. సమీప భవిష్యత్తులో ఈ అంతరాన్ని తగ్గించే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ అత్యంత కఠిన వైఖరిని కొనసాగించడమే ఇప్పుడు సవాలుగా మారింది. జులైలో ఈ వైఖరికి ఎదురుదెబ్బ తగిలింది'' అని పేర్కొన్నారు.
అయితే, పోలీసులు కఠినంగా వ్యవహరించడం, సీజేపీ నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగినప్పటికీ.. యువత దిల్లీలోని వివిధ ప్రాంతాలకు చేరుకుని నిరసనలు తెలుపగలిగారని, పోలీసుల చేతిలో అరెస్టయినా వెనక్కి తగ్గలేదని ఆనంద్ సహాయ్ అన్నారు.
''ఈ ఉద్యమానికి నాయకత్వం లేదు. ఎందుకంటే నాయకులందరినీ పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ యువత నిరసనలు కొనసాగించగలిగారు. ఇందుకు వారిని అభినందించాలి'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























