దిల్లీ నిరసనలపై ప్రత్యేక విచారణలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

- రచయిత, వినీత్ భల్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
దిల్లీలో శనివారం జరిగిన నిరసనలపై పోలీసుల తీవ్ర చర్యల తదనంతర పరిణామాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఆదివారం అత్యంత అరుదైన ప్రత్యేక విచారణ జరిపింది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో సాగిన ఈ ప్రదర్శనలపై నిన్న పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను జస్టిస్ జోయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదివారం ఉదయం 10:30 గంటలకు విచారించింది.
విచారణ సందర్భంగా అధికారులు ఒక నివేదికతో పాటు నిర్బంధించిన వ్యక్తుల వివరాలను మంగళవారం సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటరల్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.


ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
చట్టప్రకారం ప్రజలు నగరంలో స్వేచ్చగా సంచరించేందుకు అనుమతి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే, చట్టంలో నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం తప్ప ఎవరినీ నిర్బంధించకూడదని పేర్కొంది.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 అమలులో లేని ప్రాంతాల వెలుపల ప్రజలకు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది.
న్యాయం కోసం ప్రజలు సులభంగా చేరుకునేలా చూడటం కోసం, సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలలో సెక్షన్ 163 అమలులో ఉన్నట్లు హెచ్చరించే బోర్డులను వెంటనే తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది.
చట్టపరంగా నిలిపివేయాల్సిన అవసరం వస్తే తప్ప మెట్రో, రైలు సేవలు సాధారణంగా నడవాలి. నిరసనకారులను అడ్డుకునేందుకు 45 మెట్రో స్టేషన్లను మూసివేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్టికల్ 19(2) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని బారికేడ్ల ఏర్పాట్లను పునఃసమీక్షించాలని తెలిపింది.
చట్టానికి లోబడి ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదు.
న్యాయం కోసం సుప్రీంకోర్టును లేక ఇతర ఏ న్యాయస్థానాన్నైనా వ్యక్తిగతంగా ఆశ్రయించే హక్కును నిరోధించడానికి వీల్లేదని తెలిపింది.
దిల్లీలో శనివారం జరిగిన నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నాయకత్వం వహించారు. ఈ విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు అధికారులను మంగళవారం నాటికి నివేదికను, నిర్బంధంలోకి తీసుకున్న వారి వివరాలను సమర్పించాలని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
విచారణకు వచ్చిన పిటిషన్లు
దిల్లీలో పోలీసుల చర్యల గురించి దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
హెబియస్ కార్పస్ పిటిషన్: కస్టడీలో ఉన్న వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని, వారి నిర్బంధం చట్టబద్ధమేనా కాదా అని పరిశీలించాలని కోరే చట్టపరమైన ప్రక్రియ ఇది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ మనేకా గురుస్వామి దీన్ని దాఖలు చేశారు.
శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచి వేయడానికి పోలీసులు నాయకులను వారి నివాసాల నుండి ఏకపక్షంగా నిర్బంధించలేరని, నలుగురు మాజీ ముఖ్యమంత్రుల ముందస్తు నిర్బంధాన్ని ఆమె ఇందులో సవాలు చేశారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్: అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శనివారం ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఛైర్మన్తో కూడిన అధికారులు ఉల్లంఘించారని త్రిపాఠి ఆరోపించారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మెట్రో స్టేషన్లను మూసివేయడాన్ని తప్పు పట్టారు.
అధికారిక విచారణ జాబితాలో లేనప్పటికీ, అత్యవసర ప్రాధాన్యత కింద న్యాయవాదులు మరో రెండు పిటిషన్లను కోర్టు దృష్టికి తెచ్చారు
మనోజ్ ఝా పిటిషన్: రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా దాఖలు చేసిన పిటిషన్లో శనివారం నాటి పోలీసుల చర్యను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
దిల్లీలో 6,000 మందికి పైగా అక్రమ నిర్బంధం, ముందస్తుగా 250 రైళ్ల రద్దు, సెంట్రల్ దిల్లీలో మొబైల్ ఫోన్ జామర్ల ఏర్పాటు వంటి అంశాలను ఆయన లేవనెత్తారు.
అమన్ ప్రసాద్ పిటిషన్: అడ్వకేట్ అమన్ ప్రసాద్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో దిల్లీ పోలీసులు ప్రజలపై విచక్షణారహితంగా హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.
పోలీసులు తప్పనిసరిగా ధరించాల్సిన నేమ్ ట్యాగ్లు ధరించలేదని, నిరాయుధులైన పౌరులను కొట్టారని, మహిళలతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగి బస్సులోకి ఎక్కించిన ఘటనతో పాటు రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించిన ఉదంతాలను ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























