‘బొద్దింక’ వ్యాఖ్యలు: ఒక వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఒక కేసు విచారణ సందర్భంగా శుక్రవారంనాడు తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చారని లైవ్ లా, బార్ అండ్ బెంచ్ తెలిపింది.
యువతను తాను విమర్శించినట్లు మీడియాలో ఓ వర్గం తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని ఆయన అన్నారు.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగడంతో ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారు గురించి వ్యాఖ్యలు చేశానని, దేశంలోని సాధారణ యువత గురించి కాదని అందులో వివరణ ఇచ్చారు.
"నిన్న ఓ కేసు విచారణ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఓ వర్గం వక్రీకరించడాన్ని చూసి నాకు బాధ కలిగింది. నకిలీ డిగ్రీల సాయంతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారిని ప్రత్యేకంగా విమర్శించారు. అలాంటివారే మీడియా, సోషల్ మీడియా ఇతర గౌరవప్రదమైన వృత్తులలోకి కూడా ప్రవేశించారు. అందువల్ల వారు పరాన్నజీవుల వంటివారు" అని ఆయన తన వివరణలో పేర్కొన్నారు.


శుక్రవారంనాటి విచారణతో మొదలు..
సీనియర్ అడ్వకేట్ హోదా ఇవ్వాలని కోరుతూ లాయర్ ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శుక్రవారం విచారించారు.
ఈ సందర్భంగా న్యాయవ్యవస్థపై పెరుగుతున్న 'అన్యాయమైన దాడుల' గురించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తల్లోని' కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థపై నిరంతరంగా దాడి చేస్తున్నాయని సీజేఐ అన్నారు.
"సమాజంలో వ్యవస్థలపై కొందరు పరాన్న జీవుల్లా దాడి చేస్తున్నారు. వాళ్లకు ఉద్యోగం ఉండదు. వాళ్లు చేస్తున్న పనిలో గుర్తింపు ఉండదు. వారిలో కొంతమంది మీడియాలోకి ఇంకొందరు సోషల్ మీడియాలో మరి కొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరి మీద దాడులు చేస్తుంటారు" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
పిటిషన్ విచారణ సమయంలో న్యాయవాది ప్రవర్తన పట్ల జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.
న్యాయవాదులకు సీనియర్ హోదా ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దిల్లీ హైకోర్టు అమలు చేయడంలో ఆలస్యం చేస్తోందని, దిల్లీ హైకోర్టుపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని న్యాయవాది సంజయ్ దూబే పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం, సీనియర్ అడ్వకేట్ హోదా కోర్టు ఇస్తుందని అది హోదాకు చిహ్నం కాదని చెబుతూ పిటిషన్‌ను కొట్టేసింది.
"సమాజంలో ఇప్పటికే వ్యవస్థపై కొన్ని పరాన్న జీవులు దాడి చేస్తున్నాయి. మీరు కూడా వారితో చేరాలనుకుంటున్నారా? కొంతమది యువకులు ఉద్యోగాలు లేకపోవడం, తమ వృత్తిలో రాణించలేకపోవడం వల్ల వాళ్లంతా బొద్దింకల్లా ప్రతిచోటకూ విస్తరిస్తారు. వారిలో కొందరు మీడియాలో, మరికొందరు సోషల్ మీడియాలోకి వస్తారు. ఇంకొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపైనా దాడి చేస్తుంటారు" అని జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అసలు ఏం జరిగింది?
ఈ వ్యాఖ్యల తర్వాత పిటిషన్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
సీనియర్ హోదా ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హైకోర్టు అమలు చేయడంలేదని లాయర్ కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు 'సీనియర్ అడ్వకేట్ హోదా' తప్ప మీ దగ్గర మరో కేసు ఏదీ లేదా అని బెంచ్ అడిగింది.
"సీనియర్ హోదా ఇస్తారు. కానీ దాన్ని పాటించరు" అని జస్టిస్ బాగ్చీ అన్నారు.
హైకోర్టులో ప్రస్తుతం సీనియర్ న్యాయవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని బెంచ్‌కు తెలియజేశారు.
దీంతో జస్టిస్ సూర్యకాంత్ "మొత్తం ప్రపంచం అంతా సీనియర్ అనే హోదాకు అర్హత పొంది ఉండవచ్చు. మీరు మాత్రం అందుకు అర్హులు కాదు. హైకోర్టు మీకు సీనియర్ హోదా ఇచ్చినా వృత్తిపరంగా మీ ప్రవర్తన చూసిన తర్వాత దాన్ని మేము రద్దు చేస్తాం" అని అన్నారు.
న్యాయవాదుల లాడిగ్రీల ధృవీకరణ ప్రక్రియ గురించి మట్లాడిన ప్రధాన న్యాయమూర్తి సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేస్తున్న కంటెంట్ చూసిన తర్వాత చాలామంది న్యాయమూర్తుల డిగ్రీలపై తనకు సందేహాలు వస్తున్నాయని అన్నారు.
"మేము ఏమీ గమనించడం లేదని మీరు అనుకుంటున్నారా?"అని పిటిషనర్‌ను చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
లా డిగ్రీల విషయంలో సరైన కేసు కోసం ఎదురు చూస్తున్నానని, దిల్లీలోని అనేకమంది న్యాయవాదుల డిగ్రీలపై సీబీఐతో విచారణ జరిపించాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అనేక కారణాల వల్ల న్యాయమూర్తుల డిగ్రీలను పరిశీలించే పని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరిగ్గా చేయలేకపోతోందని ఆయన అన్నారు.

న్యాయవాది సంజయ్ దూబే ఏమన్నారు?
లాయర్లకు సీనియర్ హోదా కేటాయించడంలో అక్రమాలు జరుగుతున్నాయని పిటిషనర్ సంజయ్ దూబే పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"వాస్తవానికి సీనియర్ హోదా అనే కేసు హైకోర్టుకు సంబంధించినది. సీనియర్ హోదా నమోదు కోసం 2014లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో నేను కూడా దీనికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే హోదా కేటాయింపులో కొన్ని అక్రమాలు జరిగాయి. అక్రమాలను చూసిన తర్వాత కమిటీలో సభ్యుడిగా ఉన్న సుధీర్ నంద్రజోగ్ రాజీనామా చేశారు" అని సంజయ్ దూబే తెలిపారు.
"ఆ తర్వాత ఈ విధానాన్ని సవాలు చేస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాం. ఈ కేసులో జస్టిస్ ఓక్ మార్గదర్శకాలు జారీ చేశారు. కొంతమంది అనర్హులకు సీనియర్ హోదా ఇచ్చారు. అర్హులను పక్కన పెట్టారు. సీనియర్ హోదా ఇచ్చే సమంయలో సరైన విధానాన్ని పాటించలేదు. నిర్ణయం తీసుకునేటప్పుడు రికార్డులను పట్టించుకోలేదు" అని దూబే తెలిపారు.
సీనియర్ హోదా ఇచ్చేటప్పుడు ప్రతిభను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
సీజేఐ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అనేక స్పందనలు వచ్చాయి.
ప్రధాన న్యాయమూర్తి భాష గురించి రాష్ట్రీయ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా బహిరంగ లేఖ రాశారు.
"మీ తాజా వ్యాఖ్యల్లో భాగంగా బొద్దింకలు, పురుగులు, పరాన్నజీవులు అనే మాటలు విని దేశంలోని అనేకమంది ప్రజల మాదిరిగానే నేను కూడా తీవ్రంగా కలత చెందాను. ఈ వ్యాఖ్యలలో ప్రతిబింబించే వైఖరి గురించింది కూడా" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో రాశారు.
నిరుద్యోగ యువత, ఆర్టీఐ కార్యకర్తలు, మీడియా సిబ్బంది, అసమ్మతి వాదులను బొద్దింకలు, పరాన్నజీవులు అని ప్రజాస్యామ్య దేశంలో సుప్రీరంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని పోల్చినప్పుడు అది కేవలం వ్యక్తిగత కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, దాని మౌలిక రాజ్యాంగ సంస్కృతికే అవమానం’’ అని ఆయన అందులో రాశారు.
"భారత్‌లోని నిరుద్యోగ యువత, ఆర్టీఐ కార్యకర్తలు, స్వతంత్ర పాత్రికేయులు, భిన్నాభిప్రాయాలున్న పౌరులు ప్రజాస్వామ్యంలో నివసించే కీటకాలు కాదు" అని ఆయన రాశారు.
"రాజకీయ సంభాషణల్లో మర్యాద ఇప్పటికే క్షీణిస్తున్న తరుణంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధ సంయమనానికి, గౌరవానికి చివరి ఆశ్రయంగా నిలుస్తుందని ఆశించాం" అని ఆయన రాశారు.

యాక్టివిస్టులు, జర్నలిస్టులు, లాయర్లు ఏమన్నారు?
సీజేఐ వ్యాఖ్యలపై ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు
"పరాన్నజీవి, బొద్దింక వంటి పదాలను ఉపయోగించడం తగదు" అని ఆమె అన్నారు.
"సర్, ప్రశ్నలు అడిగే హక్కు ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిది. ప్రభుత్వాన్ని సమాధానాలు చెప్పాలని అడిగే వారు వ్యవస్థపై దాడి చేయడం లేదు. వ్యవస్థను బలోపేతం చేయడం కోసం తమ పాత్ర పోషిస్తున్నారు" అని ఆమె అందులో రాశారు.
"గౌరవ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి నిరుద్యోగులైన యువకులు బొద్దింకల్లాంటివారని, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలు కూడా అలాంటి వారేనని అన్నారు. ఇది పూర్తిగా వక్రీకరించిన వ్యాఖ్య కాకపోతే, దీనిని వర్ణించడానికి మాటలు లేవు" అని రచయిత, సీనియర్ జర్నలిస్ట్ సబా నఖ్వీ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
"వ్యవస్థలోని లోపాలను బయటపెట్టే యువత, ఆర్టీఐ కార్యకర్తలు 'బొద్దింకలా'? నిజంగానా, సార్? ఇప్పుడు మన 'ప్రజాస్వామ్యం' పరిస్థితి ఇదేనా? నిజంగానా? దీనిపై జస్టిస్ కృష్ణ అయ్యర్ వంటి వారు ఏమంటారో అని ఆశ్చర్యంగా ఉంది" అని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
"యువత గురించి సీజేఐ వ్యాఖ్యలు దురదృష్టకరం. అవి అందరినీ ఉద్దేశించి అన్నట్లు ఉన్నాయి. ఆయన ముందు నిల్చున్న యువకుడు బాధ్యతారహితంగా వ్యవహరించారని నేను అంగీకరిస్తున్నాను" అని సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్‌లో రాశారు.
"అయితే అలా అందర్నీ ఒకే గాటన కట్టేసి మాట్లాడటం చూస్తే యాక్టివిస్టుల పట్ల ఆయనకున్న శత్రుత్వానికి నిదర్శనం. ఇది ప్రస్తుత ఫాసిస్ట్ పాలకవర్గ ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉంది. ఆయన క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి" అని ప్రశాంత్ భూషణ్ తన సందేశంలో రాశారు.
"ఓ బొద్దింక సుప్రీంకోర్టులో పిటిషన్ పైల్ చేసిందన్నది నిజమేనా?" అని నటుడు అతుల్ కులకర్ణి ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
బొద్దింక వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు, కామెంట్లు వెల్లువెత్తడంతో చివరకు చీఫ్ జస్టిస్ దీనిమీద వివరణ ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






















