భారత్ వర్సెస్ ఇంగ్లండ్: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. తొలి మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశాడంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్‌తో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. టీమ్ వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అతనికి డెబ్యూ క్యాప్ అందించారు.
సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు దిగిన వైభవ్ 10 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించారు. పురుషుల క్రికెట్లో అత్యంత తక్కువ వయసులోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా నిలిచి, సచిన్ తెందూల్కర్ రికార్డును ఆయన బద్దలు కొట్టారు.
సచిన్ 1989లో పాకిస్తాన్‌పై 16 ఏళ్ల వయసులో టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయగా, వైభవ్ సూర్యవంశీ వయసు ప్రస్తుతం 15 ఏళ్లు మాత్రమే.
సచిన్ రికార్డును భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ గతంలోనే అధిగమించారు. ఆమె 2019లో 15 ఏళ్ల 289 రోజుల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు.
కానీ, ఇప్పుడు వైభవ్ ఆ షెఫాలీ రికార్డును సైతం తిరగరాశాడు. అతను కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.


ఫొటో సోర్స్, Ashley Allen/Getty Images
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నారు?
వైభవ్ అరంగేట్రంపై భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. "గత కొన్ని నెలలుగా మీరు అతడిని చూశారు. అతడు బౌలర్లను ఎదుర్కొనే విధానంలోనే ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. అతడిని ఆడించాలనే ఒత్తిడేమీ లేదు, తన ప్రతిభతోనే జట్టులో ఈ స్థానాన్ని సంపాదించుకున్నాడు" అన్నాడు.
"అతడు అస్సలు ఒత్తిడి తీసుకోడు. ఎలాంటి భయం లేకుండా ఆడతాడు, అతడు జట్టులో ఉండటం మంచి పరిణామం. ఈ మ్యాచ్‌లలో తన ముందు ఎలాంటి సవాళ్లు రాబోతున్నాయో అతడికి బాగా తెలుసు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. నెట్స్‌లో అతడి బ్యాటింగ్ చూస్తేనే ఆ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది" అన్నాడు.
"జట్టులో స్థానం కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. గత రెండేళ్లలో భారత్ ఎందరో ప్రతిభావంతులను తయారుచేసింది, దానివల్ల ప్రతి మ్యాచ్‌తోనూ ఈ పోటీ మరింత పెరుగుతోంది" అని అయ్యర్ అన్నాడు.
మరోవైపు, ఇంగ్లండ్ తరఫున జోష్ టంగ్ కూడా నేడు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశారు.
ప్లేయింగ్ ఎలెవన్ - ఇండియా
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ప్లేయింగ్ ఎలెవన్ - ఇంగ్లండ్
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.

ఫొటో సోర్స్, Reuters
ఐర్లాండ్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కలేదు.
మ్యాచ్‌కు ముందురోజు జరిగిన విలేఖరుల సమావేశంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించిన ప్రశ్నకు భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. "అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను పక్కన పెట్టడం సరికాదు" అన్నారు.
జాతీయ జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు అండగా నిలవడమే భారత జట్టు నమ్ముతుందని మోర్కెల్ చెప్పారు.
భారత జట్టు ప్రస్తుత పర్యటనలో సంజూ శాంసన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో ఆయన కేవలం 5, 0, 1 పరుగులు మాత్రమే చేయడంతో జట్టు మేనేజ్మెంట్పై ఒత్తిడి పెరిగింది.
అంతకుముందు భారత మాజీ క్రికెటర్లు సైతం మేనేజ్మెంట్ నిర్ణయాలను ప్రశ్నించారు. సునీల్ గవాస్కర్ అయితే.. "వైభవ్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలి" అన్నారు.
మరోవైపు, మోర్నీ మోర్కెల్ ప్రకటన తర్వాత వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో 'న్యూ చాప్టర్' (కొత్త అధ్యాయం) అంటూ ఒక స్టోరీ షేర్ చేశారు. దాంతో అతనికిక రెండో టీ-20 మ్యాచ్‌లోనే అవకాశం దక్కబోతోందనే అంచనాలు నిజమయ్యాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























