AI: ఇది మీ మెదడుని నిర్వీర్యంగా మార్చకుండా ఎలా ఆపాలి?

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC/ Getty Images
- రచయిత, థామస్ జెర్మైన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
మనం వెళ్లాల్సిన దిశ గురించి మనకున్న సహజ జ్ఞానాన్ని జీపీఎస్ నాశనం చేసింది. సెర్చ్ ఇంజిన్లు మన జ్ఞాపకశక్తిని బలహీన పరిచాయి.
సృజనాత్మకత నుంచి విమర్శనాత్మక ఆలోచన వరకు ప్రతీ అంశంలో ఏఐ వల్ల కూడా ఇలాంటి ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం, నేను వీలైనంత తరచుగా ఏఐని ఉపయోగించడం ప్రారంభించాను. ఏఐ గురించి రాయడానికి కూడా అదే టెక్నాలజీ ఉపయోగించాల్సి వచ్చింది.
అయితే ఏఐ గురించి ఏడాదిగా వస్తున్న కొన్ని అధ్యయనాలు నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ ప్రక్రియలో నా మెదడుకు నేనే హాని చేసుకుంటున్నానా?

చాట్ జీపీటీ వంటి సాధనాలపై ఎక్కువగా ఆధారపడే వ్యక్తులు సృజనాత్మకత, ఏకాగ్రత, విమర్శనాత్మక ఆలోచన, జ్ఞాపకశక్తి, మరి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
రోజువారీ కార్యక్రమాల్లో ఏఐని ఎక్కువగా ఉపయోగించేవారు ఆలోచనలకు పదును పెట్టే జ్ఞాన జిజ్ఞాసను కోల్పోవచ్చని, సామాజిక అంశాల పట్ల అవగాహన తగ్గిపోతుందని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ వాడకం వల్ల వచ్చిన, వస్తున్న, రానున్న సమస్యలు కొత్తవి. ఇంకా ఇందులో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. దీని గురించి మనం ఆందోళన చెందాలా?

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC/ Getty Images
ఈ ముప్పు నుంచి బయటపడేదెలా?
"అవును. కచ్చితంగా ఆందోళన చెందాల్సిందే" అని అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో న్యూరో సైన్స్ ప్రొఫెసర్ ఆడమ్ గ్రీన్ చెప్పారు.
ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. అయితే మనుషులు ఆలోచించి చేసే పనిని ఏఐ చేస్తుంది.
"మీరు వాస్తవంగా ఆలోచించాల్సి చేయాల్సిన చోట ఆలోచించడం లేదంటే మీ ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పేందుకు కావల్సినన్ని ఆధారాలున్నాయి" అని ఆయన అన్నారు.
మీరు చాట్ జీపీటీ లేదా క్లాడ్ లాంటి వాటిని వాడాలని అనుకోకున్నా గూగుల్‌లోకి వెళ్లగానే ఏఐ ఇచ్చే సమాధానాలే ఎక్కువగా కనిపిస్తాయి.
మన ఫోన్లలోకి వాటిని మరింతగా చొప్పించి మనం వాటి మీదనే ఆధారపడేలా చేసేందుకు టెక్ సంస్థలు పరుగులు తీస్తున్నాయి.
టెక్నాలజీని పక్కన పెట్టడం అసాధ్యమే కావచ్చు. అయితే దాని వల్ల వచ్చే ప్రమాదాలను తప్పించుకోవడానికి మార్గాలున్నాయి.
అయితే దీని వల్ల మీ పురోగతి అంతా ఆగిపోదని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లో ప్రొఫెసర్ జేరెడ్ బెంజ్ అభిప్రాయం.
ఏఐని ఉపయోగించడం వల్ల మీకు ఏదో హాని జరుగుతుందని కాదు. ఉదాహరణకు మీ మెదడులోని స్థలాన్ని ఇతర ముఖ్య విషయాల కోసం కేటాయిస్తే, అది మీ గ్రహణ శక్తికి మంచి విషయం కావచ్చు.
"మన మెదడు ఇప్పటికే ఆలోచించిన దాని కంటే ఏఐ ఇంకా భిన్నంగా ఉంటుందని మనం ఎందుకు అనుకుంటున్నాం?" అని బెంజ్ అంటున్నారు.
"ఒక సాధనం మంచిది లేదా చెడ్డది అనేది దాని స్వభావంలో ఉండదు" అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీలో మిగతా వాటిలాగే ఏఐని కూడా మనం ఉపయోగించే విధానమే అది మనకు సాయపడుతుందా లేక హాని చేస్తుందా అనేది నిర్ణయిస్తుంది.
అయితే ప్రజల్లో ఆందోళనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, మరీ ఆలస్యం కాకముందే ఏఐ పరికరాలను ఉపయోగించడం గురించి ఆలోచించడం మంచిదని భావిస్తున్నారు.
ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏఐని ఉపయోగించడం వల్ల మన మేధస్సు, మెదడు మొద్దుబారకుండా ఉండేలా దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకునేందుకు నేను ఈ రంగంలోని కొంతమంది నిపుణులతో మాట్లాడాను.

ఫొటో సోర్స్, Getty Images
మన ఆందోళన దేని గురించి?
ఇరవై ఏళ్ల కిందట సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఒక రకమైన "డిజిటల్ మతిమరుపు" ఏర్పడింది. దీంతో స్వల్పకాలిక జ్ఞాపక శక్తి, జ్ఞాన సంపద క్షీణించవచ్చనే ఆలోచన ఏర్పడింది.
ఇటీవల 4 లక్షల 11వేల మందికి పైగా యువకులపై నిర్వహించిన 57 అధ్యయనాలను పరిశీలించిన మెటా విశ్లేషణకు జెరేడ్ బెంచ్ సహ రచయిత.
అయితే ఈ పరిశోధనలో జెరేడ్‌తో పాటు అతని సహ రచయితలు డిజిటల్ మతిమరుపుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు.
నిజానికి టెక్నాలజీ వాడటం వల్ల వారి జ్ఞానం ఇంకా పెరిగింది.
అయితే దీనర్ధం ఏఐ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని కాదు.
ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జీపీఎస్ ఉపయోగిస్తున్న ప్రజలు తమ ఆలోచనా శక్తి, ప్రాంతాల గురించి అవగాహనను పక్కన పెడుతున్నారు. దీని వల్ల కొన్ని రోజులకు వారు పూర్తిగా జీపీఎస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇలాంటిదే మరొకటి 'గూగుల్ ఎఫెక్ట్'. ఈ సెర్చ్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఏదైనా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గిపోయిది.
ఏ సమాచారం కావాలన్నా సెర్చ్ ఇంజిన్ల మీద ఆధారపడటం పెరిగింది.
ఇదెలా తయారైందంటే మనం ఏదైనా తెలుసుకునేందుకు, జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మెదడు చిరాకు పడే దశకు చేరింది.
ఇందులో ఏఐ అనేది శక్తివంతమైన సమాచార కేంద్రంగా మారింది.
"ఏఐతో ఏం జరుగుతోంది. అది మనకు కావల్సిన ఫలితాలను త్వరగా తేలిగ్గా అందిస్తోంది" అని గ్రీన్ అంటున్నారు. అది ఇంకా మెరుగ్గా చెప్పవచ్చు. అది చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండవచ్చు. రిటైర్‌మెంట్ పార్టీలో చెప్పే జోక్ మాదిరిగా ఆనందం కలిగించవచ్చు.
కానీ మానసిక శ్రమ, ఆలోచన ఆందోళన, తడబాటు, చివరకు మీకు ఏం కావాల్నో మీ మెదడు అందిస్తుంది.
"ఇది మీరు జిమ్‌లో ఉండి వ్యాయామం చేయాల్సినప్పుడు అక్కడే ఉన్న ఒక రోబోట్ వెయిట్స్ ఎత్తడం, ట్రెడ్‌మిల్ మీద పరుగెత్తడం లాగా ఉంటుంది. మీరు ఏమీ చేయలేరు" అని ఆయన అన్నారు.
ఇలాంటప్పుడు మీరు ఏఐని ఉపయోగించుకుంటూనే మీ మెదడును పదునుగా ఎలా ఉంచుకోగలరు?

ఫొటో సోర్స్, Getty Images
ఏఐ చెప్పేదంతా నిజమేనా?
ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్న వారు సాధారణ విమర్శనాత్మక ఆలోచనా పరీక్షలో తక్కువ స్కోర్లు సాధించారని ఇటీవలి అధ్యయనంలో తేలింది.
దీని కారణం వారు ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఆ పనిని చాట్‌బోట్లకు అప్పగించడమేనని స్పష్టమైంది.
అన్నింటి కంటే విషాదకరమైన అంశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏఐ తప్పు చేసినప్పుడు కూడా ప్రజలు తమ సొంత జ్ఞానంకంటే ఏఐనే ఎక్కువగా నమ్ముతున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని "కాగ్నిటివ్ సరెండర్" అని పిలుస్తున్నారు.
రోజువారీ అంశాలపై అవగాహన, జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య తీవ్రం అవుతుంది.
మీకు ఒక విషయం గురించి అవగాహన తక్కువగా ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ రీసర్చ్ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.
"ఒక సాంకేతికత ఇస్తున్న అవుట్‌పుట్ బాగుందా లేదా అని నిర్ధరించే నైపుణ్యం దాన్ని ఉపయోగిస్తున్న వారికి లేకపోవడమే అసలు ప్రమాదం" అని మైక్రోసాఫ్ట్ అధ్యయన సహ రచయిత హాంక్‌లీ అన్నారు.
మీరు యాప్ తెరవక ముందు మీకు పరిష్కారం సిద్ధంగా ఉంటుంది. మీ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని మీరు నమ్మలేకపోతే, మీరు ఏఐని కూడా నమ్మకూడదని లీ చెబుతున్నారు.
సరిగ్గా ఇలాంటి విషయాల్లోనే మీరు సొంత విచక్షణ ఉపయోగించాలి.
మీరు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న దాని గురించి మీరు రఫ్‌గా ఒక అభిప్రాయం ఏర్పరచుకోండి. అది కచ్చితమైనదేనా కాదా అని ఏఐని సవాలు చేయండి. ఆ తర్వాత రోబోట్ సాయం తీసుకోండి. అలా ఏఐ మీ ఆలోచనల్ని అణచి వేయకుండా ఒత్తిడి ద్వారా వాటిని పరీక్షించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Estudio Santa Rita
ప్రతిదానికీ సెర్చ్ ఇంజిన్‌ను నమ్ముకోవాలా?
"మీరు ఏదైనా చూస్తున్నారంటే అది మీ ముందు ఉంది. మీ కళ్లు దాన్ని చూస్తున్నాయి. అది మీ పాత జ్ఞాపకాలలో లేనప్పటికీ, దాన్ని ఎక్కడో చూసినట్లు మీరు అనుకుంటారు" అని యూనివర్సిటీ ఆఫ్ ఓక్లండ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బార్బరా ఓక్లీ చెప్పారు. మెదడు ఎలా నేర్చుకుంటుందనే దాని గురించి ఆమె అధ్యయనం చేస్తున్నారు.
మీ మెదడు సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యాన్ని ఏఐ దెబ్బ తీయగలదని చెప్పే ప్రాథమిక పరిశోధనలు ఉన్నాయి.
494 మంది విద్యార్థుల మీద చేసిన ఓ సర్వేలో చాట్ జీపీటిని ఎక్కువగా ఉపయోగించినవారు జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లు గుర్తించారు.
అయితే వ్యక్తులు సొంతంగా చెప్పిన అభిప్రాయాలు శాస్త్రీయమైన ఆధారాలు కావు.
ఏఐ చాట్‌బాట్లను ఉపయోగించే ముందు తేలిక పాటి సమస్యలను పరిష్కరిస్తూ మీ మెదడును సిద్ధం చేసుకోవడం వల్ల ఏఐ నుంచి మీరు మరింత నేర్చుకోవచ్చని 2024లో ప్రచురణకు నోచుకోని ఓ అధ్యయనం, మరి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
మీరు గుర్తుంచుకోవల్సిన సమాచారం కోసం ఏఐని అడిగే దశకు చేరుకున్నప్పుడు ఏఐ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.
కొన్ని అంశాల విషయంలో నోట్స్ రాసుకోండి. మీరే మీ చేత్తో రాసుకోవడం మరింత మంచిది. టైప్ చేసి సేవ్ చేసుకున్నా ఫర్వాలేదు. మిమ్మల్ని ప్రశ్నించమని ఏఐని అడగండి లేదా ఫ్లాష్ కార్డులను చూపించమని కోరండి.
దీని వల్ల ఆ విషయం బాగా గుర్తుంటుంది. ఇది కాస్త అతిగా అనిపించవచ్చు కానీ మెదడుకు ఆ మాత్రపు శ్రమ ఇవ్వడం అవసరం.

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC/ Getty Images
ఏదైనా గుర్తుకు రాకపోతే వదిలేయండి
ఏఐ కొత్త ఐడియాలు ఇవ్వడంలో అద్భుతంగా పని చేస్తుంది. అసలు సమస్య అదే. క్రియేటివ్ వర్క్ కోసం ఏఐని ఉపయోగించేవాళ్లు సృష్టించే కంటెంట్, దాన్ని ఉపయోగించకుండా చేసే వారికంటే గొప్పగా ఏమీ ఉండదు. ఏఐని ఉపయోగించడం వల్ల మీ సృజనాత్మక శక్తి బలహీన పడుతుంది.
ఊహించని వాటిని ఎదుర్కోవడం వల్ల మీ మెదడులో సృజనాత్మక శక్తి పెరుగుతుందని గ్రీన్ చెప్పారు. మీరు ఆ పనిని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అప్పగిస్తే మీ మెదడును మీరే పాడు చేసినట్లు.
"మీ సృజనాత్మక శక్తి తగ్గిపోతుందేమోనన్నదే మా ఆందోళన" అని గ్రీన్ చెప్పారు.
"ఏఐ మనల్ని మరింత క్రియేటివ్‌గా మారుస్తోందని మనం భావించడానికి అది అనేక రకాలుగా మనల్ని మోసం చేస్తోంది" అని ఆయన అన్నారు.
దీన్ని అధిగమించడానికి ఒక మార్గం ఏంటంటే, మీ ఆలోచనలు అవి ఎలాంటివైనా సరే, అవి సంపూర్ణంగా లేకున్నా.. ముందుగా వాటిని ఒక కాగితం మీద రాయాలి.
ముందు ఖాళీ కాగితం తీసుకోండి. మీకు ఏ ఆలోచన రాకపోయినా సరే దాన్ని పడేయవద్దు. చాలాసేపటి తర్వాతైనా ఏదో ఒకటి రాయండి.
అది గొప్ప విషయమై ఉండాల్సిన అవసరం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే మీ మెదడు ఏం ఆలోచిస్తుందో మీకే తెలుస్తుంది.
మీ సొంత అనుభవాలు, జ్ఞాపకాలు, జ్ఞానంతో కేవలం మీరు మాత్రమే ఒక ఆలోచనను సృష్టించడం. ఇదే మెదడుకు మీరు పెట్టే పరీక్ష.
మీరు రాసిన దాన్ని మరింత మెరుగుపరచడానికి లేదా అందులో లోపాలు ఉంటే తెలుసుకోవడానికి ఏఐని ఉపయోగించండి.

ఫొటో సోర్స్, Getty Images
శ్రద్ధ పెట్టండి
మీరు ఈ కథనాన్ని ఇక్కడి వరకు చదివారు. మంచిది.
కానీ ఇది చదివేటప్పుడు మీ మనసు పదేపదే పక్కకు లాగుతున్నట్లు అనిపించిందంటే అది మీ ఒక్కరి సమస్యే కాదు. బహుశా ఈ స్టోరీ మీకు విసుగు పుట్టిస్తూ ఉండవచ్చు.
సాంకేతికత వెల్లువ మనుషుల్లో ఏకాగ్రతను మరింత కష్టంగా మారుస్తోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కృత్రిమ మేథ ఈ సమస్యను మరింత జఠిలం చేస్తుంది.
ఎందుకు అనే ప్రశ్న వస్తే, సమాధానం మీ చేతి వేళ్ల కొనల్లోనే ఉంటుంది.
ఈ అసౌకర్యాన్ని తొలగించుకోవడం, ఈ కష్టాలను దాటడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images/BBC
మనిషి మెదడు చాలా ముఖ్యమైనది
చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై లాంటి ఏఐ చాట్‌బాట్‌లను వాడటం ఆపేయాలని నేను మీకు చెప్పడం లేదు. అయితే నా మెదడును నా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నంలో మరింత అవగాహనతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను.
అలా చేయడం మనం భవిష్యత్‌లో మంచి మానసిక ఆరోగ్యంతో ఉంటాం
ఏఐ కంటే మనిషి మెదడు నిర్మాణాత్మకంగా చాల ముఖ్యమైన విషయంలో భిన్నంగా ఉంటాయని గ్రీన్ చెబుతున్నారు.
మనం వ్యక్తిగతమైన, ఊహించని కొత్త సంబంధాలను సృష్టించుకుంటాం. మానవ సంబంధాలను డిజిటల్ యంత్రాలు, చాట్‌బోట్లు మన మెదడు అర్థం చేసుకున్నట్లు అర్థం చేసుకోలేవు.
"మనుషుల ఆలోచనల్లో వైవిధ్యం, ప్రత్యేక లాంటివి భవిష్యత్‌లో చాలా విలువైనవిగా మారతాయి" అని గ్రీన్ అన్నారు.
సమాజంలో బతకాలంటే "చాట్‌బాట్‌ల పరిధిని దాటి ఆలోచించడం" అనేది సహజమైన ప్రేరణగా నిలుస్తుందని గ్రీన్ అంచనా వేస్తున్నారు.
మనం ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చామని జెరేడ్ బెంజ్ చెబుతున్నారు.
"మన మెదళ్లు సాంకేతికకు అనుగుణంగా మారుతూ వస్తున్నాయి. మనం ప్రతిదానికీ అలవాటు పడుతున్నాం. ఒక జాతిగా అదే మన బలం" అని ఆయన అన్నారు.
"మనకు కార్లు వచ్చాయని పరుగెత్తే సామర్థ్యాన్ని కోల్పోయామా? లేదు కదా. ఎందుకంటే మనం కార్లో ప్రయాణించాలని కోరుకున్నాం. అలాగే పరుగెత్తాలని కూడా అనుకున్నాం" అని ఆయన చెప్పారు.
టెక్నాలజీ, సాధనాలు మారతాయి. కానీ ఆలోచించడం, కొత్తవి కనుక్కోవడం, కొత్త వాటిని సృష్టించడం లాంటి వాటిని మెకనైజ్ చేయడం కష్టం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























