‘నెలసరి రక్తం ముఖానికి పూసుకుని, చనిపోయినట్టుగా నటించా....ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కా...’

అప్గానిస్తాన్, తాలిబాన్లు, ఎవరెస్ట్, నేపాల్

ఫొటో సోర్స్, Sandro Gromen-Hayes

ఫొటో క్యాప్షన్, రివర్ అహ్మద్
    • రచయిత, నావిన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్న క్షణం రివర్ అహ్మద్ మనసు సంతోషంతో నిండిపోయింది.

మే 21న 11గంటల సుదీర్ఘ పర్వాతరోహణ తరువాత ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి అఫ్గాన్ మహిళగా 30 ఏళ్ల రివర్ అహ్మద్ నిలిచారు.

''ప్రపంచం శిఖరాగ్రాన నిల్చున్నప్పుడు నేనెంతో శక్తిమంతురాలిని అనిపించింది’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

''ఓ లక్ష్యం కోసం, స్వేచ్ఛ కోసం, చదువు కోసం'' తాను ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నాని పర్వాతారోహణకు బయల్దేరే ముందు రివర్ అహ్మద్ తెలిపారు. తాను సాధించిన ఘనతను అఫ్గానిస్తాన్‌లో మహిళల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించుకోవాలని ఆమె అనుకుంటున్నారు.

తాలిబాన్లు 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికల విద్యపై ఆంక్షలు విధించారు. 12ఏళ్లు పైబడిన బాలికలకు ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో చదువుకునే వీలు లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఫ్గానిస్తాన్‌, తాలిబాన్లు, ఎవరెస్ట్, నేపాల్

ఫొటో సోర్స్, River Ahmad

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో మహిళల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికే తాను పర్వతారోహణను ఉపయోగించుకుంటున్నానని రివర్ అహ్మద్ తెలిపారు.

అఫ్గానిస్తాన్‌ నుంచి ఎవరెస్ట్ అధిరోహణ దాకా..

రివర్ అహ్మద్ క్యాంప్ 4 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించారు . ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు 7,950 మీటర్ల ఎత్తులో ఉండే చివరి బేస్‌క్యాంప్ ఇది. ఇక్కడ నుంచి మరో 899 మీటర్లు ఎక్కితే 8,849 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతారోహణ పూర్తవుతుంది. అందుకోసం సముద్రమట్టంతో పోలిస్తే 30 శాతం మాత్రమే ఆక్సిజన్ స్థాయులు ఉండే ''డెత్ జోన్''గుండా ప్రయాణించాలి.

క్లిష్టమైన ఎవరెస్ట్ అధిరోహణలో తనకు జీవితంలో ఎదురైన అనుభవాలన్నింటినీ తలుచుకున్నానని, ఈ పర్వతాన్ని ఎక్కడానికి కావాల్సిన ధైర్యాన్ని అవే ఇచ్చాయని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నుంచి మాట్లాడిన రివర్ అహ్మద్ చెప్పారు.

తాలిబాన్ల దాడి నుంచి చనిపోయినట్టు నటించి తప్పించుకోవడం, ఆస్ట్రేలియాకు వెళ్లడం, అక్కడి సంస్కృతికి అలవాటు పడటంగురించి తన ప్రయాణంలో ఆలోచించానని ఆమె తెలిపారు.

ఆగ్నేయ అఫ్గానిస్తాన్‌లోని ఘజ్నిలో రివర్ అహ్మద్ బాల్యం గడిచింది.

''స్కూల్‌కు చేరుకోవడానికి ప్రతిరోజూ నేను మంచులో పర్వత ప్రాంతాలు ఎక్కి దిగుతూ నాలుగు గంటల పాటు నడిచేదాన్ని'' అని రివర్ అహ్మద్ చెప్పారు.

అమ్మాయిల చదువుపై తీవ్రమైన నిషేధం అమలవుతున్న తాలిబాన్ల తొలి పాలనాకాలంలో రివర్ అహ్మద్ పుట్టారు.

తాలిబాన్ల ప్రభుత్వాన్ని అమెరికా 2001లో కూల్చివేసిన తర్వాత బాలికలు పాఠశాలకు తిరిగి వెళ్లగలిగారు. ఉన్నత విద్య చదువుకోగలిగారు. ఉద్యోగాలు చేసే అవకాశం లభించింది.2014లో కాబూల్ యూనివర్శిటీలో చదువుకునేందుకు రివర్ అహ్మద్ తన కుటుంబాన్ని ఒప్పించారు. యూనివర్సిటీకి వెళ్లే బస్సును ఆపి తాలిబాన్లు కాల్పులు జరిపినప్పుడు ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఏకైక మహిళ ఆమె.

ఆ సమయంలో ఆమె పీరియడ్స్‌లో ఉన్నారు. నెలసరి రక్తాన్ని ముఖంపై రాసుకుని చనిపోయినట్టుగా పడుకున్నానని, తుపాకీతో తన దగ్గరకు వచ్చిన వ్యక్తి తాను చనిపోయాననుకుని వెళ్లిపోయారని రివర్ అహ్మద్ గుర్తుచేసుకున్నారు.

తర్వాత ఆమె కుటుంబం కాబూల్‌కు మారింది. అక్కడ ఆమె జర్నలిజం చదివి మారుపేరుతో రేడియో జర్నలిస్ట్‌గా పనిచేశారు. 2019లో ఆమె భారత్‌కు వచ్చారు. మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ ఇంగ్లీషు నేర్చుకుని ఫర్నీచర్ కంపెనీలో పనిచేశారు.

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు, ఎవరెస్ట్, నేపాల్

ఫొటో సోర్స్, Pemba Sherpa

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ పర్వతారోహకుల క్యూ లైన్

జకియా అహ్మద్ ‘రివర్ అహ్మద్‌’గా ఎలా మారారంటే...

ఓ విషాదం తర్వాత తనకు పర్వతారోహకురాలిగా మారాలనే ఆసక్తి కలిగిందని రివర్ అహ్మద్ చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆరు నెలలు ఉన్న తర్వాత తన సోదరుడు 20ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని ఆమె తెలిపారు.

ఆ తర్వాత ఆమె తన పేరును జకియా నుంచి రివర్‌గా మార్చుకున్నారు. ఆస్ట్రేలియాలో నదులును చూసి స్ఫూర్తి పొంది పేరు మార్చుకున్నానని ఆమె చెప్పారు.

''నదులు శుభ్రంగా ఉంటాయి. నిరంతరాయంగా ప్రవహిస్తుంటాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా పరుగులు పెడుతుంటాయి. నేను కూడా అలాగే ఉండాలనుకున్నా'' అని ఆమె పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వివరించారు.

తర్వాత ఆమె సిడ్నీ హార్బర్ బ్రిడ్జి ఎక్కారు.

''ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తులో ఉండే పర్వతాలను చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడే పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలన్న ఆలోచన మొదలైంది'' అని రివర్ అహ్మద్ తెలిపారు.

తర్వాత ఆమె శిక్షణ పొందడం ప్రారంభించారు. జిమ్‌లో చేరారు. మెల్‌బోర్న్‌ సమీపంలోని పర్వతాలను ఎక్కారు. అదే సమయంలో ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన 85 వేల డాలర్ల నిధుల సమీకరణకు ప్రయత్నించారు. అందులో నాలుగోవంతు తాను పొదుపు చేసుకున్న మొత్తమని, మిగిలిన మొత్తం ఓ సంస్థ నుంచి లోన్‌ రూపంలో తీసుకున్నానని రివర్ అహ్మద్ తెలిపారు.

''నిధులు సమీకరించడం చాలా కష్టమైన విషయం. నాకు స్పాన్సర్ ఎవరూ దొరకలేదు. కానీ భవిష్యత్తులో నాకు స్పాన్సర్స్ దొరుకుతారన్న ఆశతో ఉన్నా'' అని ఆమె చెప్పారు.

మార్చిలో ఎవరెస్ట్ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె 6 వేల మీటర్ల కన్నా ఎత్తున్న రెండు పర్వతాలు ఎక్కారు. అలాగే ఎత్తయిన ప్రాంతాలకు శరీరం అలవాటుపడేందుకు అనేక వారాల శిక్షణ తీసుకున్నారు.

అప్గానిస్తాన్, తాలిబాన్లు, ఎవరెస్ట్, నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణం మొదలవుతుంది.

‘వెయ్యికన్నా ఎక్కువమందే ఎవరెస్ట్ ఎక్కారు’

ఎవరెస్ట్ ఎక్కడానికి ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం అనుమతించిన దాదాపు 500మందిలో ఆమె ఒకరు. ఎవరెస్ట్ అధిరోహణకు నేపాల్ ఈసారి రికార్డు స్థాయిలో అనుమతులిచ్చింది. పర్వతారోహకులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సవాళ్లు మరింత పెరిగాయి.

పర్వతాన్ని ఎక్కే ప్రతి ఒక్కరూ కనీసం ఓ సహాయకుణ్ణి వెంట తీసుకెళ్లాలి. సాధారణంగా వీళ్లు షెర్పా కమ్యూనిటీకి చెందిన నేపాలీలు అయ్యుంటారు. అంటే మొత్తంగా పర్వతారోహకులు, సహాయకుల సంఖ్య కలిపి ఎవరెస్ట్ శిఖరానికి చేరుకునేవాళ్ల సంఖ్య వెయ్యికిపైగా ఉంది.

చైనా వైపున టిబెట్ నుంచి వెళ్లే మార్గం ఈ ఏడాది విదేశీ పర్వతారోహకులకు మూసివేయడం మరింత ఒత్తిడి పెంచింది.

ఎవరెస్ట్ శిఖరగ్రానికి చేరుకోగల వాతావరణ పరిస్థితులు ఏడాదిలో చాలా తక్కువ రోజులే ఉంటాయి. సాధారణంగా మే రెండో వారం అనుకూలంగా ఉంటుంది. వాతావరణం బాగున్న సమయంలో భారీ క్యూలు కనిపించాయి.

తాను, తన షెర్పా గైడ్స్ ఇద్దరు శిఖరానికి దగ్గర మైనస్ 25సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో నాలుగు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని రివర్ అహ్మద్ చెప్పారు. ఈ ఏడాది అక్కడ నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత అదే.

''ట్రాఫిక్ జామ్ చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా భయమేసింది'' అని రివర్ అహ్మద్ చెప్పారు.

ట్రాఫిక్ జామ్ వల్ల తన పర్వతారోహణకు ఆటంకం కలుగుతుందేమోనని భావించానని ఆమె అన్నారు. క్యూలైన్ల వల్ల సరిపడా ఆక్సిజన్ వెంట తీసుకెళ్లని వాళ్లకు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయని, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువసేపు గడిపిన వారికి చలికి శరీర భాగాలు దెబ్బతినడం స్నో బ్లైండ్‌నెస్ వంటివి జరిగే ప్రమాదముందని నిపుణులు చెప్పారు.

రివర్ అహ్మద్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన రోజు అనుమతులు అవసరం లేని నేపాలీ సహాయక సిబ్బంది సహా 160 మంది శిఖరానికి చేరుకున్నారు. అంతకు ముందు రోజు రికార్డు స్థాయిలో 274 మంది అధిరోహించారు. తర్వాతి రోజు భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు కిందకి దిగుతూ మరణించారు.

ఎవరెస్ట్ ఎక్కాలనుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో నేపాల్ ప్రభుత్వం అనుమతుల ఫీజు ఇటీవల కాలంలో పెంచింది. నిబంధనలను కఠినతరం చేసింది.

పర్వతారోహకులు వేర్వేరు సమయాల్లో ఎవరెస్ట్ అగ్రభాగానికి చేరుకునేలా చేయడానికి పర్వతారోహణ యాత్రలను నిర్వహించే సంస్థలతో కలిసి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఈ చర్యలు సరిపోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్గానిస్తాన్, తాలిబాన్లు, ఎవరెస్ట్, నేపాల్

ఫొటో సోర్స్, AFP / GETTY / PROJECT POSSIBLE

ఫొటో క్యాప్షన్, 2019లో పర్వతారోహకుల క్యూలైన్

‘మనం నిజంగా అధిరోహించాల్సిన పర్వతమేదంటే...’

తన గైడ్స్ చేసిన సహాయానికి, వారి నైపుణ్యానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రివర్ అహ్మద్ చెప్పారు. ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నప్పుడు, దిగుతున్నప్పుడు తాను అద్వితీయ ఆనందాన్ని అనుభవించానని ఆమె అన్నారు. ఎవరెస్ట్ ఎక్కడం కన్నా దిగడం తొందరగా పూర్తయిందని తెలిపారు.

''ఈ సంతోషం ఎవరెస్ట్‌ అధిరోహణకు సంబంధించినది మాత్రమే కాదు. భూమ్మీద అత్యత ఎత్తయిన ప్రాంతం నుంచి ప్రకృతిని చూసే జీవితకాల అనుభవం లభించినందుకు. ఆ అద్భుతమైన క్షణాన్ని నేను పూర్తిస్థాయిలో ఆస్వాదించా'' అని ఆమె చెప్పారు.

తాను ఎవరెస్ట్ అధిరోహించడంపై అఫ్గాన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దీనిపై స్పందించారని ఆమె తెలిపారు. ఇది అఫ్గాన్ మహిళలు సాధించిన విజయంగా హమీద్ కర్జాయ్ అభినందించారని రివర్ అహ్మద్ తెలిపారు.

''ఎంత కష్టమైన పనైనా మనం చేయగలమనే సందేశాన్ని ఇది మా దేశానికి పంపించింది'' అని ఆమె చెప్పారు.

కానీ, తన అసలు ఉద్దేశం పర్వతారోహణ కంటే పెద్దదని ఆమె అన్నారు.

''ఇవాళ్టికి కూడా లక్షలాది మంది అఫ్గాన్ బాలికలకు ప్రాథమిక విద్యాహక్కు అమలవ్వడం లేదు. మనం నిజంగా అధిరోహించాల్సిన పర్వతమిదే'' అని ఆమె అన్నారు.

మహిళలు సెకండరీ, ఉన్నత విద్య చదవకుండా నిషేధం విధించడం తాత్కాలికమేనని, భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వం మొదట తెలిపింది.

ఇటీవల తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధిని బీబీసీ దీనిపై ప్రశ్నించగా.. ఆయన దాన్ని విద్యాశాఖకు పంపించారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అఫ్గాన్ మహిళలకు సాయమందించేందుకు వీలుగా నిధులు సేకరించాలని రివర్ అహ్మద్ భావిస్తున్నారు.

''ధైర్యంగా ఉండాలి. మన చరిత్రలోనే అత్యంత చీకటి కాలాన్ని అధిగమించగల నమ్మకాన్ని పెంచుకోవాలి. మనం ఇది చేయగలం'' అని రివర్ అహ్మద్ అఫ్గాన్ మహిళలకు సందేశాన్నిచ్చారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.