భర్తను చంపేశారంటూ ఏడుస్తున్న భార్య వీడియో వైరల్, ఆమెనే అరెస్టు చేసిన పోలీసులు.. అసలేమైందంటే..

మధ్యప్రదేశ్, భార్య ప్లాన్, వీడియో డ్రామా, భర్త హత్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రియాంక పురోహిత్ తన ప్రియుడు కమలేష్ పురోహిత్‌తో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నారని ధార్ పోలీసులు తెలిపారు.
    • రచయిత, సమీర్ ఖాన్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో మిరపకాయల వ్యాపారి దేవకరణ్ పురోహిత్‌ హత్య కేసులో ఆయన భార్య ప్రియాంక పురోహిత్‌ను అరెస్టు చేశారు.

ప్రియాంక తన ప్రియుడు కమలేష్ పురోహిత్‌తో కలిసి ఈ హత్యకు కుట్రపన్నారని ధార్ పోలీస్ సూపరింటెండెంట్ మయంక్ అవస్థీ వెల్లడించారు.

భర్త హత్య తర్వాత, భార్య ప్రియాంక అపస్మారక స్థితిలో ఘటన వివరాలను వివరిస్తున్న పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దుండగులు గదిలోకి చొరబడి నగలు దోచుకున్నారని, తన భర్తపై దాడి చేసి పారిపోయారని ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఘటన రాజోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోందీ ఖేడా గ్రామంలో జరిగింది.

ఇంట్లోనే హత్య జరిగిందని, ఆరు గంటల్లోనే కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మిరపకాయల వ్యాపారి దేవకరణ్ పురోహిత్, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, Samir Khan

ఫొటో క్యాప్షన్, మిర్చి వ్యాపారి దేవకరణ్ పురోహిత్(మృతుడు)

అసలేం జరిగింది?

ఏప్రిల్ 7న, మిర్చి వ్యాపారి దేవకరణ్ పురోహిత్, ఆయన భార్య ప్రియాంకలపై వారి ఇంట్లోనే దొంగలు దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.

నిద్రిస్తున్న తన భర్తపై పదునైన ఆయుధంతో దాడి చేశారని, తనను బంధించి కొట్టారని, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారని ప్రియాంక పోలీసులకు చెప్పారు. దుండగులు నగలు దోచుకెళ్లారని, ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త మరణించారని చెప్పారు. ఆ సమయంలో దేవకరణ్ పురోహిత్ తల్లి మరో గదిలో నిద్రిస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ సూపరింటెండెంట్ మయంక్ అవస్థీ మాట్లాడుతూ, "ఈ కేసు తీవ్రతను బట్టి ఘటనా స్థలం నుంచి సాక్ష్యాలు సేకరించాం. దర్యాప్తులో ఇది దోపిడీ కాదని, నేరపూరిత కుట్రగా తేలింది. ఈ హత్యకు మృతుడి భార్య తన ప్రియుడు కమలేష్ పురోహిత్‌తో కలిసి ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుపారీ ఇచ్చారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగింది, కావాలనే ఇంటి తలుపు తెరిచి ఉంచారు" అని చెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేంద్ర ప్రతాప్ సింగ్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. మృతుడి భార్య, కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో భార్య ప్రియాంక నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఒక వైరల్ వీడియో, ప్రియాంక , మధ్యప్రదేశ్, భర్త హత్య

ఫొటో సోర్స్, Samir Khan

ఫొటో క్యాప్షన్, ఒక వైరల్ వీడియోలో, దొంగలు తమ గదిలోకి చొరబడి నగలు దోచుకున్నారని, తన భర్తపై దాడి చేసి పారిపోయారని ప్రియాంక పేర్కొన్నారు.

మృతుడి భార్య ఏమన్నారు, తల్లి ఏం చెప్పారు..

అంతకుముందు, భర్త హత్యానంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. దాడి చేసినవారు తన నోరుమూసి, నగలు, డబ్బు మొత్తం ఇచ్చేయమన్నారని, అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారని అన్నారు.

"అంతా తీసుకోండి కానీ, మమ్మల్ని వదిలేయండని చెప్పాను. ఆ తర్వాత నా చేతులు-కాళ్లు కట్టేసి నన్ను కొట్టారు. నేను అన్నీ తీసి ఇచ్చాను. అరిస్తే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు" అన్నారు ప్రియాంక.

ఎంతమంది దాడి చేశారని మీడియా ప్రశ్నించగా, "నాకు ఇద్దరు కనిపించారు, మిగిలినవారు అటూఇటూ తిరుగుతున్నారు" అని చెప్పారు.

భర్తపై దాడి గురించి అడిగితే, "నన్ను బంధించారు, ఆయన్ను ఎప్పుడు చంపారో తెలియదు" అన్నారు ప్రియాంక.

పోలీసులు చెబుతున్నదాని ప్రకారం.. దేవకరణ్ పురోహిత్, ప్రియాంకల వివాహం 2015లో జరిగింది. పెళ్లి సమయంలో ప్రియాంక మైనర్. 2021 నుంచి వీరు కలిసి ఉంటున్నారు, తర్వాత మనస్పర్థల కారణంగా ప్రియాంక పుట్టింటికి వెళ్లిపోయారు. హత్యకు వారం రోజుల ముందే ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చారు.

ఘటన జరిగిన రాత్రి 2 - 2.30 గంటల సమయంలో, వదిన (మృతుడి భార్య) ఎందుకు అరుస్తోందంటూ పక్కింటివాళ్లు ఫోన్ చేశారని, అప్పుడే విషయం తెలిసిందని మృతుడి తల్లి ఖేచీ బాయి చెప్పారు.

"నా గదిలో నుంచి వెళ్లి చూశాను, నా కొడుకు మంచంపై పడి ఉన్నాడు. కోడలు నోరు కట్టేసి ఉంది, ఆమె ఏదో చెబుతోంది. నా కొడుకును లేపాలని చూశాను, మంచమంతా రక్తం కనిపించింది" అని మృతుడి తల్లి ఖేచీ బాయి అన్నారు .

తన కోడలికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఖేచీ బాయి డిమాండ్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)