ఏడు నిమిషాలు చనిపోయిన ఫుట్‌బాలర్, కోచ్‌గా మారి చాంపియన్ బ్రెజిల్‌ను ఇంటికి పంపించారు, ఎవరాయన?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ న్యూస్ ముండో
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
‘‘అమ్మ నా అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు’’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు స్టాల్ సోల్బాకెన్.
కానీ, ఆ రోజు మరణాన్ని జయించి, ఇటీవల చరిత్ర సృష్టించారు స్టాల్ సోల్బాకెన్.
58 ఏళ్ల సోల్బాకెన్ నార్వే నేషనల్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్.
ఆదివారం అమెరికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆయన జట్టు.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ను ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఓడించి, సంచలనం సృష్టించింది.
మ్యాచ్ తర్వాత.. సోల్బాకెన్ తన కుటుంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దానికి కారణం ప్రత్యేకమైనది. దాదాపు 25 సంవత్సరాల కిందట 2001 మార్చి 13న, ఆయన గుండె ఏడు నిమిషాల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. తర్వాత 26 గంటల పాటు కోమాలోనే ఉన్నారు.

ఇటలీ వార్తాపత్రిక ‘లా గజ్జెట్టా డెలో స్పోర్ట్’ తో మాట్లాడిన స్టాల్ సోల్బాకెన్.. ''అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆమెకు నా అసలు పరిస్థితి ఏంటో తెలియదు. దారి పొడవునా ఆమె నా అంత్యక్రియలు ఎలా జరపాలి అనే దాని గురించే ఆలోచిస్తూ ఉంది'' అని చెప్పారు.
కానీ, సోల్బాకెన్ మరణాన్ని జయించారు.
దశాబ్దాలుగా అత్యంత ప్రతిభావంతులతో నిండిన నార్వే ఫుట్‌బాల్ జట్టులో ఆయన ఒకప్పుడు సభ్యుడు. ఇప్పుడు కోచ్.
ప్రస్తుతం ఆయన కోచ్‌గా వ్యవహరిస్తున్న నార్వే జట్టులో మార్టిన్ ఓడెగార్డ్ (ఆర్సెనల్), అలెగ్జాండర్ సార్లోత్ (అట్లెటికో మాడ్రిడ్), ఇర్లింగ్ హాలాండ్ (మాంచెస్టర్ సిటీ) వంటి ఆటగాళ్లు ఉన్నారు.
బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో హాలాండ్ రెండు గోల్స్ చేశాడు.
దీనితో అతను ఈ ప్రపంచ కప్‌లో ఏడు గోల్స్ సాధించి, లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాపేల రికార్డును సమం చేశాడు.
"నార్వే ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద రోజు" అని బ్రెజిల్‌పై విజయం సాధించిన తర్వాత సోల్బాకెన్ అన్నారు.
కానీ, సోల్బాకెన్ అద్భుతమైన కథ కూడా బ్రెజిల్‌తో ముడిపడి ఉన్న మరొక చిరస్మరణీయ విజయంతోనే మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
మిడ్‌ఫీల్డర్
1990ల్లో స్టాల్ సోల్బాకెన్ నార్వే జట్టు ప్రముఖ మిడ్‌ఫీల్డర్. ఈ సమయంలో, టోర్ ఆండ్రే ఫ్లో, ఓలె గున్నార్ సోల్స్క్జార్ వంటి ఆటగాళ్లున్న నార్వే జట్టు 1994, 1998లో వరుసగా రెండు ప్రపంచకప్‌లకు అర్హత సాధించింది.
1998 ప్రపంచకప్‌లో.. గ్రూప్ స్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచకప్ చాంపియన్స్ బ్రెజిల్‌ను 2-1 తేడాతో ఓడించిన జట్టులో సోల్బాకెన్ కూడా ఉన్నారు.
ఆ విజయంతో... తొలిసారి ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ఫైనల్స్కు నార్వే చేరుకుంది. అయితే, ఆ తర్వాత ఆ జట్టు ఇటలీ చేతిలో ఓటమి పాలైంది.
ఈ సమయం వరకు.. నార్వే ఫుట్‌బాల్ చరిత్రలో దాన్ని అతిపెద్ద విజయంగా పరిగణిస్తారు.
తర్వాత 2000లో డానిష్ క్లబ్ ఎఫ్‌సీ కోపెన్‌హాగన్‌లో 33 ఏళ్ల సోల్బాకెన్ చేరారు.
అయితే, 2001 మార్చి 13న ట్రైనింగ్ సెషన్లో ఉండగా.. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. మైదానంలోనే కుప్పకూలారు.
ఆ జట్టు డాక్టర్ ఫ్రాంక్ ఓడెగార్డ్ వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, అంబులెన్స్ పిలిపించారు.
ఏడు నిమిషాల పాటు ఆయన ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్య పరిభాషలో ఆయన మరణించినట్లు ప్రకటించారు వైద్యులు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రికి వెళ్లే దారిలో వైద్యులు ఆయనకు స్పృహ తెప్పించారు. కానీ, ఆయన 26 గంటల పాటు కోమాలోనే ఉండిపోయారు.
''నేనొక నీలం రంగు కాంతిని, ఆ తర్వాత ఒక సొరంగాన్ని చూశాను. ఆ సమయంలో, మరికొద్దిసేపు అక్కడే ఉంటే బాగుండు అనిపించింది'' అని తర్వాత ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు సోల్బాకెన్.
ఆ సమయంలో ఆయన తల్లి నార్వే నుంచి కోపెన్‌హాగన్‌కు వచ్చారు. ఒకవేళ తన కొడుకు బతకకపోతే అంత్యక్రియలు ఎలా, ఒకవేళ బతికి మెదడు దెబ్బతింటే ఆయన జీవితం ఎలా ఉంటుందో అని ఆమె బాగా ఆలోచించారు.
ఆయనకు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బు ఉన్నట్లు పరీక్షలలో బయటపడింది. ఆయన ఫుట్‌బాల్‌ను వదులుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.
పేస్‌మేకర్‌ను అమర్చడంతో, 33 ఏళ్ల వయసులోనే ఆయన క్రీడా జీవితం ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆటగాడి నుంచి సక్సెస్ఫుల్ కోచ్‌గా..
ఈ ఘటన తర్వాత సోల్బాకెన్ కోచ్‌గా తన జీవితం ప్రారంభించారు.
గత 26 ఏళ్లుగా డెన్మార్క్, ఇంగ్లండ్, జర్మనీలకు కోచ్‌గా వ్యవహరించారు. ఎఫ్‌సీ కోపెన్హాగన్ కోచ్‌గా ఆయన గొప్ప విజయాన్ని అందుకున్నారు.
2020 డిసెంబర్లో నార్వే నేషనల్ టీమ్‌కు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.
అదే సమయంలో ఇర్లింగ్ హాలాండ్, మార్టిన్ ఓడెగార్డ్లు వంటి యువ ఆటగాళ్లు ఎదగడం ప్రారంభమైంది.
2022 ప్రపంచకప్‌కు, 2024 యూరోపియన్ చాంపియన్‌షిప్‌కు ఆయన జట్టు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ.. నార్వేజియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆయనపై పూర్తి విశ్వాసాన్ని ఉంచింది.
2026 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఇటలీతో సహా పలు బలమైన జట్లను నార్వే జట్టు ఎదుర్కొంది. ఆ జట్టు గ్రూప్ దశలోని ఎనిమిది మ్యాచ్‌లలోనూ గెలిచి, నేరుగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
ఈ ప్రపంచ కప్‌లో నార్వే తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది.
గ్రూప్ దశలో ఫ్రాన్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు, నాకౌట్ దశలో ఐవరీ కోస్ట్, ఆ తర్వాత బ్రెజిల్‌ను ఓడించి తొలిసారిగా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
''ఈ ఆటగాళ్లు కేవలం నార్వే ఫుట్‌బాల్ చరిత్రను మార్చడమే కాకుండా.. యావత్ దేశ చరిత్రను కూడా మార్చారు'' అని నార్వేజియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ షేర్ చేసిన వీడియోలో సోల్బాకెన్ అన్నారు.
‘‘ఈరోజు మనం పొందుతున్న ఈ ఆనందం నార్వే దేశమంతా అనుభవిస్తోంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు నార్వే తొలిసారిగా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఘనత వెనుక ఉన్న వారి కోచ్ అసాధారణ ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకం.
"నేను ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను. ఇక ఇప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలను" అని సోల్బాకెన్ ఒకప్పుడు అన్నారు.
ఆరోజు ఆయన అన్న మాట ఈరోజు కూడా ఆయన జీవితానికి, ఫుట్‌బాల్ ప్రయాణానికి సరిగ్గా సరిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























