'ఇదొక ట్రాప్, తప్పించుకోలేరు', తల్లి అయినందుకు చింతిస్తున్న మహిళలు.. వారు ఏమంటున్నారు?

మాతృత్వం, పిల్లలు, మహిళలు, అలసిపోవడం, మానసికంగా కుంగిపోవడం, థెరపిస్ట్, కెరీర్, శరీరం, కలలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కిర్‌స్టీ బ్రూవర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

కార్మెన్‌కు తన పదేళ్ల కుమారుడు టియో అంటే చాలా ఇష్టం. అయితే, కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే తాను ఎన్నటికీ తల్లిని అవ్వనని ఆమె అంటున్నారు.

'మాతృత్వం నా ఆరోగ్యం, సమయం, డబ్బు, శరీరం, శక్తిని లాగేసుకుంది' అని అన్నారు. 'అది భారీ మూల్యం, జీవితకాలం చెల్లించాల్సిందే' అని కార్మెన్ అంటున్నారు.

తల్లి అయినందుకు పశ్చాత్తాపపడుతున్న మహిళల రహస్య సమూహంలో ఈ నలభై ఏళ్ల ఉపాధ్యాయురాలు కూడా సభ్యురాలు.

ఈ బాధని బహిరంగంగా వ్యక్తపరచడం చాలా అరుదు. నన్ను సంప్రదించిన మహిళలు తమ గుర్తింపు గోప్యంగా ఉంచితేనే తమ అభిప్రాయాలు నాతో పంచుకుంటామన్నారు. ఎందుకంటే వారి కఠినమైన ఆలోచన గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియదు.

తల్లి అయినందుకు బాధ పడుతున్నట్లు కొన్నేళ్ల కిందట కార్మెన్ ఒక సాధారణ తల్లిదండ్రుల ఫోరమ్‌లో చెప్పినప్పడు కొందరు సానుభూతి చూపించారు. మరికొందరు ఆమెను భయంకరమైన వ్యక్తిగా, రాక్షసి అన్నట్లు స్పందించారని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్కార్‌కు నామినేటైన 'ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యూ' సినిమాలో తల్లి కావడంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి, త్యాగం గురించి ప్రధానంగా చూపించారు.

తన కుమార్తె అవసరాలను తీర్చడానికి పోరాడుతూ, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ, ఒంటరిగా ఫీలయ్యే, అలసిపోయిన తల్లిపాత్రలో నటి రోజ్ బర్న్ అద్భుతంగా నటించారు.

'ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యూ' సినిమాలో లిండా అనే తల్లిపాత్రలో నటించారు రోజ్ బర్న్. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసుకుంటూ, ఒత్తిడితో కుంగిపోయే పాత్ర అది.

మాతృత్వం, పిల్లలు, మహిళలు, అలసిపోవడం, మానసికంగా కుంగిపోవడం, థెరపిస్ట్, కెరీర్, శరీరం, కలలు

ఫొటో సోర్స్, Logan White/A24

ఫొటో క్యాప్షన్, 'ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యూ' అనే చిత్రంలోని స్టిల్.

'తల్లిని అయినందుకు బాధపడ్డాను'

కార్మెన్ ఈ చిత్రంలోని ఇతివృత్తాలతో తనను తాను పోల్చుకుంటారు.

'మాతృత్వం అనేది అంతులేని పని.. నీకు పనిచేయాలని లేకపోయినా చేయాల్సిందే, ఎందుకంటే ఒక చిన్నారి నీపై ఆధారపడి ఉంటుంది. అదొక బంధనం. మీరు తప్పించుకోలేరనిపిస్తుంది' అని ఆమె చెప్పారు.

తల్లిగా ఉండడం తనకు ఎంతకష్టంగా ఉంటుందో చాలా నిజాయితీగా, ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పారామె. కానీ, తన కుమారుడి గురించి అడిగినప్పుడు.. ఆమె స్వరంలో ఒక వెలుగు, ఆనందం స్పష్టంగా కనిపించాయి.

'నా ఆందోళనకు, టియోకు ఏ సంబంధం లేదు. అతను అద్భుతమైన, ముద్దొచ్చే పిల్లాడు. టియో అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితాన్ని వాడి కోసం ధారపోస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. వాడు మంచివాడు, అందరితో కలిసిపోతాడు. తెలివైన పిల్లాడు' అని ఆమె చెప్పారు.

'తల్లి అయినందుకు మహిళలు తమకు ఏ సమస్యా లేదనుకున్నప్పుడే మాట్లాడతారు. అయితే అది ప్రేమ లేకపోవడం గురించి కాదు. ఒంటరితనం, విసుగు, తమకు గుర్తింపు లేదనే భావన' అని సైకోథెరపిస్ట్ అన్నా మాథూర్ చెప్పారు.

తనను తాను పరిపూర్ణమైన వ్యక్తిగా భావించే కార్మెన్‌కి 'మంచి పౌరుడిని, ఆనందంగా ఉండే వ్యక్తిని' పెంచడమనే బాధ్యత భారంగా అనిపిస్తుంది.

తాను పెరిగిన పరిస్థితులు టియోకు ఎదురు కాకూడదని కార్మెన్ భావించారు. ఆమె పేదరికం, పని లేని నేపథ్యం నుంచి వచ్చారు. ఆమె పెరిగిన ప్రాంతంలో 'హింస ప్రధాన అంశంగా ఉండేది'. ఆమెకు ప్రేమ లభించిన అనుభూతి ఎప్పుడూ కలగలేదు.

తల్లి కావడం మొదట్లో ఆనందంగా అనిపించిందని, టియో బాగా నిద్రపోయేవాడని ప్రసూతి సెలవులో తన కుమారుడిని చూసుకుంటూ గడిపిన రోజులను ఆస్వాదించానని ఆమె చెప్పారు.

కానీ, ఆమె కుమారుడిలో ఎదుగుదల లోపాన్ని పరిశీలించినప్పుడు, ప్రతీ క్షణం ఆందోళన చెందినట్లు కార్మెన్ చెప్పారు.

'నాకు గిల్టీగా అనిపించేది. వాడి జీవితం యుద్ధంగా మారుతుందేమోనని ఆందోళన చెందాను' అని ఆమె చెప్పారు.

అయితే, టియోకు అలాంటి సమస్యలేవీ రాలేదు. అతను బాగానే ఉన్నాడు. కానీ ఆ ఒత్తిడి, నిరంతర ఆందోళన వల్ల తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని కార్మెన్ చెప్పారు.

మాతృత్వం, పిల్లలు, మహిళలు, అలసిపోవడం, మానసికంగా కుంగిపోవడం, థెరపిస్ట్, కెరీర్, శరీరం, కలలు

ఫొటో సోర్స్, Getty Images

'పిల్లల్ని కన్నందుకు చింతిస్తున్నా'

"ఎందుకు తల్లినయ్యానా అని చింతించడాన్ని... ప్రేమలేని, నిర్లక్ష్యపూరిత పెంపకానికి ముడిపెట్టడం తప్పు" అని రిగ్రెటింగ్ మదర్‌హుడ్: ఏ స్టడీ పుస్తక రచయిత్రి, ఇజ్రాయెల్‌కు చెందిన సోషియాలజిస్ట్ ఓర్నా డోనాత్ అన్నారు.

డోనాత్ 23 మంది తల్లులను ఇంటర్వ్యూ చేశారు. వారిలో ప్రతి ఒక్కరూ తల్లైనందుకు పశ్చాత్తాప భావనకూ, తమ పిల్లల పట్ల వారికున్న భావనకూ మధ్యనున్న తేడాను స్పష్టంగా చెప్పారు.

మాతృత్వం అనేది సమాజం చెబుతున్నంత గొప్పగా ఉండదని, ఈ విషయంలో తాము మోసపోయామని కొందరు భావించారు.

'నేను తల్లినైనందుకు బాధపడుతున్నాను, కానీ నా పిల్లల్ని చాలా ప్రేమిస్తాను. వాళ్లను వద్దనుకోవడం లేదు. కానీ నాకసలు తల్లి అవ్వాలనే లేదు' అని అధ్యయనంలో పాల్గొన్న ఒక తల్లి చెప్పారు. ఆమెకు ఇద్దరు యుక్తవయసులో ఉన్న పిల్లలున్నారు.

ఇదేమీ అసాధారణ అభిప్రాయం కాదు. 2023లో పోలండ్‌లో నిర్వహించిన ఓ సర్వేలో 5 నుంచి 14 శాతం మంది పిల్లలను కనడంపై చింతిస్తున్నట్లు చెప్పారు. కాలాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం ఉంటే పిల్లలు లేని జీవితాన్ని ఎంచుకుంటామన్నారు.

చాలామంది తల్లిదండ్రులు తమ బాధని బహిరంగంగా చెప్పకపోయినా, ఆ భావనను పంచుకునే వేదికలను ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.

కార్మెన్ తన అనుభవాన్ని పంచుకోవడానికి "ఐ రిగ్రెట్ హావింగ్ చిల్డ్రన్" అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరినప్పుడు, తనలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని ఆమెకు అర్థమైంది.

ఈ గ్రూప్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 96,000 మంది సభ్యులు తమ భావాలను పంచుకుంటున్నారు.

"మాతృత్వం మధురమైన క్షణాలతో నిండి ఉంటుంది. కానీ నాకు దక్కాల్సిన స్వేచ్ఛకు అవి ప్రత్యామ్నాయం కావు" అని ఆస్ట్రేలియాలో ఐదేళ్ల బిడ్డతో నివసిస్తున్న ఆ గ్రూపులోని ఒక తల్లి బీబీసీకి చెప్పారు.

"నా కూతురి దగ్గర నా భావాలను దాచిపెడతాను. అయితే ఆమె నిద్రపోయాక, నేను, నా భర్త కలిసి ఉన్నప్పుడు నా ఆలోచనల గురించి చెబుతాను. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను" అని ఆమె అన్నారు.

పిల్లల్ని కనడం అంటే ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణించడం, బిజినెస్ ప్రారంభించడం, ఆస్తుల్ని పోగు చేయడం లాంటి లక్ష్యాలు, కోరికల్ని పక్కకు పెట్టడమే అని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రమాదకర ప్రపంచంలో ఒక మంచి మనిషిని పెంచడానికి ప్రయత్నించడం తప్ప, ఏదైనా చేయాలనే ఉత్సాహాం పూర్తిగా పోయింది" అని ఆమె అన్నారు.

మాతృత్వం, పిల్లలు, మహిళలు, అలసిపోవడం, మానసికంగా కుంగిపోవడం, థెరపిస్ట్, కెరీర్, శరీరం, కలలు

ఫొటో సోర్స్, Getty Images

వాళ్ల కోసం ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్

"సంతోషంగా లేని ఒక తల్లి.. ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతోందని ప్రజలు అనుకోవడం నాకు అవమానంగా అనిపిస్తుంది" అని యూకేకు చెందిన ఒక తల్లి చెప్పారు.

"కానీ, ప్రజలకు అలా అనుకోవడమే బాగుంటుంది. నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు, కానీ నేను పొందలేకపోయిన ఆ జీవితం గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను"

"ఇప్పుడు నేను భవిష్యత్తులో పుట్టబోయే మనవళ్లను చూసుకోవడం గురించి ఆందోళన చెందుతున్నా. ఈ సంరక్షణ బాధ్యత ఎప్పటికీ ముగియదు" అని ఆమె అన్నారు.

'ఐ రిగ్రెట్ హావింగ్ చిల్డ్రన్' అనే ఫేస్‌బుక్ గ్రూప్‌ని 2007లో క్రియేట్ చేశారు. దీనిలోని కంటెంట్ నేరుగా తల్లిదండ్రుల నుంచే వస్తుంది.

వీరిలో అధిక శాతం మహిళలే. వారు తమ కథలను ప్రైవేట్‌గా మెసేజ్ చేస్తారు, ఆ తర్వాత వాటిని వారిపేరు లేకుండా ఈ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు.

"తల్లిదండ్రులను అవమానించడం లేదా ఒక నిర్దిష్ట జీవనశైలిని ప్రోత్సహించడం మా లక్ష్యం కాదు" అని ఈ గ్రూప్ నిర్వాహకురాలు అమెరికాకు చెందిన 44 ఏళ్ల శాస్త్రవేత్త గియానినా అన్నారు.

'రోజువారీ సంభాషణల్లో చోటు దక్కని ఒక విషయం గురించి చర్చించడమే మా ఉద్దేశం' అని ఆమె చెప్పారు.

"ఈ కమ్యూనిటీ చాలా పెద్దది, ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే, ఇలాంటి భావాలు ఉండకూడదు అని విన్న చాలామంది తల్లిదండ్రులు నిశ్శబ్దంగా పోరాడుతున్నారు" అని ఆమె చెప్పారు.

"నాకు పిల్లలు ఉండాలా వద్దా అన్న విషయంలో సందిగ్ధంలోనే ఉన్నా. కానీ ఈ ఫోరమ్‌లోని కథనాలను చదవిన తర్వాత చివరికి పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నా" అని గియానినా చెప్పారు.

"ఈ కాలం యువత పిల్లల్ని కనాలా, వద్దా అనే అంశాన్ని పాతతరాలకంటే పూర్తి భిన్నంగా చూస్తోంది" అని ఐర్లాండ్‌కు చెందిన కౌన్సిలర్, సైకోథెరపిస్ట్ మార్గరెట్ ఓకానర్ అన్నారు.

"ఇదొక ఎంపిక, మీరు తప్పనిసరిగా చేయల్సిన పనికాదు అనే విషయంపై అవగాహన బాగా పెరుగుతోంది" అని ఆమె చెప్పారు.

"నా వద్దకు 20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు వస్తుంటారు. వారు కచ్చితంగా పిల్లల్ని కనాలనుకుంటారు. కానీ, ఎదురయ్యే సవాళ్ల గురించి కొంత ఆందోళనతో ఉంటారు. ఆ ప్రయాణాన్ని ఎదుర్కోవడానికి వారికి మద్దతు అవసరం" అని ఓకానర్ చెప్పారు.

తల్లిని కావాలనే తన నిర్ణయం పట్ల ఒక మహిళ పశ్చాత్తాపపడవచ్చు అని సూచించే ప్రమాద సంకేతాలను గుర్తించడం కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరి అనుభవం వేరుగా ఉంటుంది అని ఓకానర్ అన్నారు.

"ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు మీపై మీకు భరోసా ఉండాలి. మీ భాగస్వామి లేదా మీ తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కాకుండా మీరు కనాలనుకున్నప్పుడే పిల్లలగురించి ఆలోచించాలి" అని ఆమె సూచించారు.

"ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు అనే భావనను అంత సులభంగా నమ్మకూడదు" అని ఆమె అన్నారు.

"సాధారణంగా మేమందరం బిడ్డను చూసుకోవడానికి ఇక్కడే ఉంటాం అని మాకు చెబుతుంటారు. కానీ చాలామంది అలా ఉండరు. మీ బిడ్డ బాధ్యత మీదే" అని ఆమె అన్నారు.

తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దది, శ్రమతో కూడుకున్నది కాబట్టి వారు పశ్చాత్తాపపడటం పూర్తిగా సహజమని ఓకానర్ అంటున్నారు.

"ఆ పశ్చాత్తాపానికి మూలకారణం తెలుసుకోవడానికి, మిమ్మల్ని ఎవరూ విమర్శించని సురక్షితమైన ప్రదేశంలో మాట్లాడటానికి ఒక థెరపిస్ట్‌ను కలవండి" అని ఆమె సూచించారు.

"తల్లైనందుకు బాధ కలిగితే, దాన్ని తొలగించలేమన్నది నిజం" అని మాథుర్ అంటున్నారు.

మద్దతు, విశ్రాంతి, సమయం, పరిస్థితులలో మార్పుతో కొంతమంది మహిళల్లో ఆ పశ్చాత్తాప భావనలు తగ్గుతాయని మాథుర్ అన్నారు.

"మరికొందరికి ఆ భావనలోని కొన్ని అంశాలు ఎప్పటికీ మిగిలి ఉండవచ్చు. ఆ భావనలను అవమానంగా భావించకుండా నిజాయితీగా అంగీకరించడం చాలా ముఖ్యం" అని మాథుర్ తెలిపారు.

మాతృత్వం, పిల్లలు, మహిళలు, అలసిపోవడం, మానసికంగా కుంగిపోవడం, థెరపిస్ట్, కెరీర్, శరీరం, కలలు

ఫొటో సోర్స్, Getty Images

'నేను రాక్షసిని కాదనిపిస్తోంది'

అమ్మ అవడంపై బాధ కొంతమందిలో ఎప్పటికీ తొలగిపోదని ఓర్నా డోనాత్ అధ్యయనం పేర్కొంది.

"నేను మాట్లాడిన మహిళలందరూ తమ పశ్చాత్తాపాన్ని పక్కనపెట్టి, తమకు వీలైనంత ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు" అని ఆమె చెప్పారు.

'తల్లి అయినందుకు బాధపడుతున్న ఒక మహిళ నుంచి కొన్నేళ్ల క్రితం నాకు ఒక లేఖ వచ్చింది. ఎప్పటికైనా ఇది మాయమైపోతుందనే ఆశ పెట్టుకోకపోవడమే తనకు సహాయపడుతుందని ఆమె రాసింది. దానితో పోరాడి, అది పోదని అర్థమైన ప్రతిసారీ కుంగిపోవడం కంటే, దానిని అంగీకరించడానికే ఆమె ఇష్టపడింది' అని ఓర్నా డోనాత్ చెప్పారు.

తన విషయంలో ఆ భావన శాశ్వతమైనదని, ఎందుకంటే ఎప్పటికీ త్యాగం చేస్తూనే ఉండాలని కార్మెన్ అంటున్నారు.

అయితే, ఆమె కొన్నేళ్లుగా థెరపిస్ట్‌తో మాట్లాడుతున్నారు. అది తనను తాను అంగీకరించడానికి, మాతృత్వం పట్ల తనకున్న భావాలను అర్థం చేసుకోవడానికి సాయపడిందని కార్మెన్ చెబుతున్నారు.

"నేను ఇకపై బాధపడను" అని ఆమె చెప్పారు.

ఆమె ఇప్పుడు జిమ్‌కు వెళ్లడానికి, స్నేహితులను కలవడానికి సమయం కేటాయిస్తూ, పరిపూర్ణత కోసం ఆరాటపడకూడదని తనలా తానుండాలని ప్రయత్నిస్తున్నారు.

'కుదరదు, క్షమించండి, నేను అలసిపోయాను, త్వరగా పడుకుంటాను, రాత్రి భోజనానికి నీకు ఏది కావాలంటే అది తిను, సాయం కావాలంటే నాన్ననడుగు అని ఇప్పుడు చెప్పగలుగుతున్నా' అని కార్మెన్ అన్నారు.

తాను ఇలా చెప్పినప్పుడు ప్రపంచమేమీ కుప్పకూలిపోదని ఆమెకు అర్థమైంది.

'నేను కూడా ఒక మనిషినే అని, పర్ఫెక్ట్ కాదని టియో అర్థం చేసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు' అని ఆమె అన్నారు.

తన కొడుకుతో గడిపే సమయంలో సంతోషంగా ఉంటారా అని నేను కార్మెన్‌ను అడిగాను.

రాత్రి పూట టియో నిద్రపోయే ముందు, తల్లీ కొడుకు మంచం మీదవాలి ఆ రోజంతా జరిగిన విషయాలను పంచుకుంటారు. టియో దుప్పటి కప్పుకుని తన తల్లి ఒడిలో సేదతీరుతాడు.

"టియోతో మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రపంచంలో నేను చాలా ఇష్టడే వ్యక్తిని చూస్తాను" అని ఆమె చెప్పారు.

"నేనొక రాక్షసినని ఇప్పుడు అనిపించడం లేదు" అని ఆమె అన్నారు.

.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)