ఆంధ్రప్రదేశ్: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్, అసలు కేసేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
''అదే రోజు రాత్రి విజయవాడలోని ఏసీబీ కోర్టులో శాంతిని హాజరుపరచగా... న్యాయాధికారి ఈనెల 21వరకు రిమాండ్ విధించారని, దీంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించినట్లు'' ఏసీబీ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆమెపై క్రైం నెంబర్ 05/2026, అవినీతి నిరోధక (2018లో సవరించిన) చట్టం, 1988లోని సెక్షన్ 13(2) ఆర్‌బైడబ్ల్యూ 13(1)(బి) కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
ఆమె వ్యక్తిగత జీవిత అంశాలతోపాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపించాయి.


ఫొటో సోర్స్, UGC
మంగళవారం ఉదయం తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేపట్టారు.
సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీ+2 భవనాన్ని గుర్తించారు.
వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టు ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
''నిందితురాలు కాళింగిరి శాంతి 2020 సంవత్సరంలో ఏపీపీఎస్‌సీ ద్వారా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆమె విశాఖపట్నం, విజయవాడలో పనిచేశారు. విధి నిర్వహణలో పలు ఆరోపణల నేపథ్యంలో ఆమె జూలై 2024 నుంచి మార్చి 2026 వరకు సస్పెన్షన్‌లో ఉండి, ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు'' అని ఏసీబీ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
అసిస్టెంట్ కమిషనర్ శాంతి నేపథ్యం ఏంటి?
ఆదివాసీ అయిన కాళింగిరి శాంతి నంద్యాల జిల్లాకు చెందినవారు. 2020లో రాష్ట్ర దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా చేరారు.
విశాఖపట్నంలో 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు పనిచేశారు. ఆ తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆమెను అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో జూలై 2న రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
2021 ఆగస్టు 5న తొలిసారి శాంతి వార్తల్లోకి వచ్చారు.
విశాఖ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తన ఛాంబర్లో ఉండగా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న శాంతి లోపలికి వచ్చి, ఆయన ముఖంపై ఇసుక విసిరారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తనపై డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్దన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శాంతి ఆరోపించారు. ఆమె ఆరోపణలను పుష్పవర్ధన్ ఖండించారు.
ఆ తర్వాత 2024లో, శాంతిపై ఆమె భర్త కె.మదన్ మోహన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు చర్చనీయమయ్యాయి. అప్పట్లో ఆయన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఫిర్యాదు చేశారు.
కె.మదన్ మెహన్ చేసిన ఆరోపణలను శాంతి ఖండించారు. ఆ తర్వాత ఆమె ప్రెస్‌మీట్ పెట్టి, వివరణ ఇచ్చారు.
"2013 నవంబర్‌లో మదన్ మోహన్‌తో వివాహమైంది. 2015లో మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. మదన్ మోహన్ నన్ను హింసిస్తుండటంతో 2016లో మేం గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకుల ఒప్పందం రాసుకున్నాం. ఆ తరువాత 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లిపోయారు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత న్యాయవాది సుభాష్‌ను పెళ్లి చేసుకున్నాను" అని శాంతి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































