అలసిపోతున్నారా? మహిళలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న 8 పనులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెలిసా హోగెన్‌బూమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
సోషియాలజిస్ట్ లీ రుప్పనర్ బీబీసీ సీనియర్ హెల్త్ ప్రతినిధి మెలిసా హోగెన్‌బూమ్‌తో మాట్లాడారు. ఇంటి నిర్వహణకు సంబంధించిన బాధ్యతల గురించి ఇంకా మహిళలే ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నారు.. ఈ ఆలోచనలు ఇన్నివిధాలుగా ఎందుకుంటున్నాయో తెలుసుకోవడం అధిక ఒత్తిడి వల్ల కలిగే అలసట తగ్గడానికి ఎంత కీలకమో ఆమె వివరించారు.
వేగంగా సాగిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో అనేకమంది మహిళలపై కనిపించని బాధ్యతలు చాలా ఉంటున్నాయి. ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఇంటి నిర్వహణ, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేయడం, కుటుంబమంతా సంతోషంగా ఉండేందుకు ఎలాంటి పనులు చేయాలో ఆలోచించడంవంటివన్నీ మానసికంగా పనిభారాన్ని పెంచేవే.
లీ రుప్పనర్ ఆస్ట్రేలియాలో సోషియాలజీ ప్రొఫెసర్. ఆమె డ్రైన్డ్ అనే పుస్తకం రాశారు. మానసిక భారం ఒక రూపంలో ఉండదని మొత్తంగా మహిళలపై ఎనిమిది రకాల మానసిక భారాలుంటాయని ఆమె చెప్తున్నారు. వీటిలో కొన్నింటికి పరిమితులు ఉండవు. ముగింపు ఉన్నట్టు కనిపించదన్నది ఆమె చెప్పే మాట.
ఇప్పుడు మగవారు ఇళ్లల్లో ఆడవాళ్లకు ఎంతో సాయం చేస్తున్నారు. అయినా సరే కనిపించని ఎంతో భారాన్ని మహిళలు మోస్తున్నారు. ఇది వాళ్లను అలిసిపోయినట్టు, మానసికంగా బలహీనపడ్డట్టు అనిపించేలా చేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ మానసిక భారాన్ని ఓ జంట కలిసి పంచుకుంటే పని, ఆరోగ్యం, అనుబంధం మెరుగుపడతాయి.
‘సమాజం మహిళల మానసిక భారాన్ని ఎలా పెంచుతుందో’ ఈ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
మానసిక భారాన్ని ఎలా నిర్వచిస్తారు?
మానసిక భారమన్నది భావోద్వేగ ఆలోచన. అందుకే ఆ భావన చాలా అలసటను కలిగిస్తుంది. కొన్నిసార్లు అది సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఎక్కువగా ఆందోళననే కలిగిస్తుంది. అది ఆగదు. మనం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఉతకాల్సిన దుస్తులను మోసుకెళ్లం. కానీ మన మానసిక భారాన్ని మనం వెళ్లే ప్రతిచోటకు తీసుకెళ్తాం.
మానసిక భారం కంటికి కనిపించదని మహిళలు చెబుతుంటారు. దానికి స్పష్టమైన పరిమితులు లేవు. దీర్ఘకాలం కొనసాగుతుంది. వారిని అలసటకు గురిచేస్తుంది. దీన్నసలు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ భారం తగ్గించడంలో ప్రజలకు సాయం చేయగలం. అందుకే నేను ఎనిమిది కేటగిరీలు తయారుచేశాను అన్నారు లీ రుప్పనర్.

ఫొటో సోర్స్, Getty Images
1) లైఫ్ ఆర్గనైజేషన్
మానసిక భారాన్ని అర్ధం చేసుకోవడానికి బహుశా ఇది అత్యంత సంప్రదాయవిధానం.
ఇంట్లో రోజువారీ పనుల ప్రణాళిక, నిర్వహణ.
దీనివల్ల అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది.
2) ఎమోషనల్ సపోర్ట్
ఇతరుల భావాల గురించి ఆలోచించడం. కుటుంబం, స్నేహితులు, తోటి ఉద్యోగులు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తుంటాం.
వాళ్లు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, నిరాశగా ఉన్నారా వంటివన్నీ గమనిస్తుంటాం.
వాళ్లకు అండగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్లు బాగుండేలా చూసుకుంటాం.
3) రిలేషన్‌షిప్ హైజీన్
పిల్లలు, స్నేహితులు, భాగస్వామి, కుటుంబంతో మంచి అనుబంధాలు ఏర్పరుచుకోవడం.
పని ప్రదేశాల్లో దీన్ని నెట్‌వర్కింగ్ అని పిలుస్తారు. అందరూ ఒకరితో ఒకరు అనుబంధంతో ఉండేలా చూసుకోవడం, అందరినీ ముఖ్యమైన వ్యక్తులుగా చూడడం, అందరినీ ప్రేమించడం వంటి బాధ్యతల నిర్వహణ మహిళలపై ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
4) మ్యాజిక్ మేకింగ్
సంప్రదాయాలు కొనసాగించడం, జీవితంలో ప్రత్యేక అనుభూతులు ఉండేలా చేయడం, భావోద్వేగ ఆలోచనలు.
పండుగల సమయంలో ప్రత్యేక అనుభూతులు ఎలా కలుగుతున్నాయో, ఆ వేడుక అంతా జరిగేలా ఎవరు చూస్తున్నారో ఓ సారి ఆలోచించండి.
5) డ్రీమ్ బిల్డింగ్
మనకు దగ్గరివాళ్లు తమ కలలు, లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సరైన అవకాశాలు వెతుక్కునేలా సహాయం చేయడం వంటివి.
ఉదాహరణకు మీ పిల్లలను వాళ్లకిష్టమైనవాటిల్లో చేర్పించి ప్రోత్సహించడం, మీ భాగస్వామి గోల్ఫ్ ఆడేందుకు టైమ్ ఉండేలా చేయడం, కెరీర్ కోసం ఎక్కువ గంటలు పనిచేయగలిగే పరిస్థితులు కల్పించడం వంటివి.
6) వ్యక్తిగత నిర్వహణ
మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి.
మంచి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి.
మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటున్నారా, అలాగే ఇతరుల ముందు అదంతా ఎలా ప్రదర్శిస్తున్నారు అనే అంశం ఈ బాధ్యతలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
7) భద్రత
ఇది మనం ప్రేమించే వ్యక్తులు, సమూహం భద్రంగా ఉండాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తుండడం. నిజమైన ప్రమాదాలు, భవిష్యత్తులో తలెత్తబోయే ముప్పులు వంటివి కూడా ఇందులో ఉంటాయి.
వర్ణవివక్ష ఎదుర్కొనే కుటుంబాలు, వికలాంగులైన పిల్లలున్న కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
వారి భద్రత, వారి కుటుంబ భద్రత వారికెప్పుడూ ఆందోళన కలిగిస్తుంటుంది.
8) మెటా కేర్
ఇది కొంచెం లోతైన విషయం, కానీ మనం కోరుకునే ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామా లేదా మనం చేసే పనిలో మార్పు అవసరమా అనే ఆలోచనకు సంబంధించినది.
దీనికోసం ఆయా రంగాలలో మన బాధ్యతలను గుర్తించడం, మన జీవితాలు మన విలువలకి అనుగుణంగా సాగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉన్నతమైన ఆలోచనా దృక్పథం అవసరం.
అనుకున్న విధంగానే పిల్లలను పెంచడం వంటివి ఇందులో భాగమే.
అధ్యయనంలో ఇది ఎందుకు ముఖ్యమైనదంటే?
మానసిక భారం గురించి నేను చదవడం మొదలుపెట్టాను. ఇందులో మనం గమనించని విషయం ఉందని నాకర్థమైంది. దీంతో నేను చాలా సంవత్సరాల పాటు జెండర్, పని, కుటుంబం, ఇంటిపనులు, ఇంటి వ్యవహారాల నిర్వహణపై అధ్యయనం చేశాను. ఇంటిపనుల్లో మగవారు భాగమవుతున్నారని, కొంత పురోగతి జరుగుతోందని అనిపిస్తూనే ఉంది.
కానీ మొత్తమంతా సౌకర్యవంతంగా లేదు. మనం గుర్తించని విషయం, పరిగణనలోకి తీసుకోని విషయం ఏదో ఉందని అర్ధమయింది. అసలదేమిటో అందరూ స్పష్టంగా అర్ధం చేసుకునేలా చేయాలని నేను నిర్ణయించుకున్నా.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు ఎంతగా అలిసిపోయారంటే..
నేను మానసిక భారాన్ని కొలిచే స్కేల్ ఒకటి రూపొందించాను. మహిళలను కొన్ని ప్రశ్నలడిగాను.
అత్యవసర సమయాల్లో స్పందించడానికి తగ్గట్టుగా మీకు శక్తి దొరుకుతుందా? రోజంతా చేసే మానసిక పనితో చివరకు మీరు అలిసిపోతున్నారా? మీకు బాధ్యతలు ఎక్కువైపోయాయనిపిస్తోందా?
ఫలితాల్లో ఓ విషయం స్పష్టంగా కనిపించింది. తండ్రులకు శక్తి సరిపోతుంది. వాళ్లకేమీ నిస్సత్తువగా అనిపించడం లేదు. కానీ నేను మాట్లాడిన ప్రతి తల్లీ శక్తి సరిపోవడం లేదనే చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేంత, దానికి బాధ్యత తీసుకునేంత మానసిక శక్తి మహిళలకు ఉంది.
అదే సమయంలో నేను వారినో ప్రశ్న అడిగా. మీ జీవితంలో వచ్చే ఓ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోడానికి మీ దగ్గర సరిపడాశక్తి ఉందా? అని.
దానికి వాళ్లు లేదు అని సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు?
ఇప్పుడే జీవితం ప్రారంభించినవారు మన భావాలను మనం అనుభూతి చెందడం చాలా విలువైన విషయమన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతేగానీ ప్రతిఒక్కరి భావాలకు మనం బాధ్యులంకాదు. అలాగే పర్ఫెక్ట్ కుటుంబాన్ని సృష్టించడం మన బాద్యత కాదు. ఈ భావాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. చిన్నప్పటినుంచి చాలా మంది మహిళలను దయగా, మర్యాదగా, జాగ్రత్తగా, వినయంగా ఉండాలని తమ అవసరాలను పక్కనపెట్టి ఇతరుల కోసం ఆలోచించాలని, ఇవ్వాలని సమాజం అలవాటుచేసింది. పురుషుల భావాలను కాపాడడమే మహిళల బాధ్యత అన్నట్టు ప్రవర్తించడం ఆపాలి. మహిళలు తమను తాము నష్టపరుచుకుంటూ అందరి భావాలకూ బాధ్యత వహించాలని చెప్పడం కూడా ఆపాలి.
మహిళలను శక్తివంతం చేయడం అనేది వాళ్లకే కాకుండా అందరికీ ఉపయోగపడే విషయం.
మనం అవసరానికి మించి ఎప్పడు మానసిక భారాన్ని మోస్తామో గుర్తించాలి. మనం వెన్నంటి ఉండి భావోద్వేగమద్దతు ఎప్పుడివ్వాలి, ఎప్పుడివ్వకూడదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మనం అలవాటుగా లేదా ఇలా చేయాలి అని సొసైటీ చెప్పినట్టు కాకుండా కొంచెం వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి. ఉదాహరణకు నేను నా కూతురికి ఎప్పుడూ ఇలా చెప్తా. నీ శక్తిని పెంచుకోవాలా?లేక నీ భావోద్వేగాలను పెంచుకోవాలా? కానీ అది నిజంగా అవసరమా? విలువైనదా? అని తేల్చుకోమని చెప్తాను.

ఫొటో సోర్స్, Getty Images
మీ పరిశోధన నుంచి ఏం నేర్చుకోవాలి?
పశ్చాత్తాపం చెందడం, ప్రతిదానికీ బాధ్యత వహించడం మొదట ఆపేయాలి. నేను చిన్న ప్రయోగాత్మక అధ్యయనం చేశాను. అందులో మహిళల మానసిక భారం తగ్గించేందుకు వారికి డబ్బుఇచ్చాను. వారిలో చాలా మంది మహిళలకు తమకోసం తాము ఆ డబ్బులు ఖర్చుపెట్టుకోవడం కష్టంగా అనిపించింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని కుటుంబానికి ఆ డబ్బులు ఖర్చుపెట్టాలని వాళ్లు భావించారు. ఆ డబ్బును తమ కోసం ఉపయోగించుకోవాలన్న ఆలోచనను తప్పు చేసినట్టుగా వారు భావిస్తున్నారు.
మొత్తానికి మన సమాజం మహిళలను ఇలా పెంచింది. వాళ్లెప్పుడూ ప్రాధాన్యతలో చివర్లో ఉండాలని భావించేటట్టు. ముఖ్యంగా తల్లులైన తర్వాత తమపై పెట్టే ఏ ఖర్చు అయినా, శ్రద్ధ అయినా పిల్లలకు కలిగించే నష్టంగా వాళ్లు భావించేటట్టు. మనకు ఎంత అర్ధం లేని అబద్ధం చెప్పారో గమనించండి.
కొంతకాలం తర్వాత ఆ డబ్బు ఖర్చుచేసిన తర్వాత వారి మానసిక భారం తగ్గింది. ఇది వారి అన్ని సమస్యలను పరిష్కరించిందా? కచ్చితంగా కాదు. కానీ అది వారి భారం కొంత తగ్గించింది. ముఖ్యంగా వారి ఆలోచనావిధానం మారింది. ఈ విషయం వారికి అర్ధమయింది. తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం ఎంతముఖ్యమో వారు గ్రహించారు.
నేను డబ్బులిచ్చిన ఓ మహిళ పేరు కత్రినా. ఆమె ఆ డబ్బును వీకెండ్ ట్రిప్‌కు ఖర్చుచేశారు. ఇతర ఖర్చుల గురించి ఆలోచించకుండా తన కోసం ఆ డబ్బులను ఖర్చుపెట్టుకున్నాని ఆమె చెప్పారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆమె భాగస్వామి ఇల్లు శుభ్రం చేశారు. ఫ్రిజ్‌లో కావల్సినవి ఉంచారు. దుస్తులు సర్దారు.
మన మానసిక శక్తిని ఎలా ఖర్చుచేస్తున్నాదనేదానిపై స్పష్టత వస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం కొన్నిసార్లు మనం ఇతరుల సాయం తీసుకోవాలి. కొన్నిసార్లు స్వీయ సంరక్షణ అవసరం.
మహిళలు ఎంత విద్యావంతులైతే, ఎంత శక్తిమంతులైతే వారికి ఉద్యోగ అవకాశాలు అంతగా లభిస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం ఉంటుంది. పురుషులతో వారి అనుబంధాలు మెరుగ్గా ఉంటాయి.
కాబట్టి మహిళలను శక్తివంతం చేయడమంటే అది వాళ్లకే కాదు..కుటుంబమంతటికీ ఉపయోగపడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































