రాజస్థాన్: బయానా మాజీ ఎమ్మెల్యే హత్య- గ్రామ ప్రజలే కొట్టి చంపారని కేసు, క్రషర్ వివాదంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు కొట్టిచంపినట్టు కేసు నమోదు

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.
"కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.
"గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్‌కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.
ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.
మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.






