క్రిస్టా పైక్: పసి వయసులోనే లైంగిక దాడికి గురైన ఈ మహిళ మరణశిక్షను ఎందుకు ఎదుర్కొంటున్నారు?

ఫొటో సోర్స్, Christa Pike/Tennesse Department of Corrections
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
మరణశిక్ష ఎదుర్కొంటున్న క్రిస్టాపైక్ తన స్నేహితురాలు ఆష్లీ సెల్లార్స్‌కు చివరిసారిగా ఈ వారం ప్రారంభంలో మెసేజ్ చేశారు. మరణశిక్ష అమలు చేసే జైలు నుంచి ఆమె ఈ మెసేజ్ పంపారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఆమెకు మరణశిక్ష విధించారు.
తన మరణదండనను అమలు చేసే సెప్టెంబర్ 30న తన ఆత్మీయులెవరూ అక్కడకు రాకూడదని ఆ మెసేజ్‌లో పైక్ కోరారు.
‘‘మేం ఆ బాధను చూడకూడని ఆమె భావిస్తున్నారు’’ అని సెల్లార్స్ చెప్పారు.
ఇతరులంటే భాధ్యత, జాలి, దయ కలిగిన వ్యక్తిగా మాత్రమే పైక్ నాకు తెలుసు అంటారు సెల్లార్స్.
కానీ 31ఏళ్ల క్రితం ఓ ఘోరమైన నేరం చేసిన మహిళ ఈమేనంటే సెల్లార్స్ నమ్మలేకపోతున్నారు.

పైక్ వయసు ఇప్పుడు 50ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో తన బాయ్‌ఫ్రెండ్ టడారిల్ షిప్‌తో కలిసి కొల్లీన్ స్లెమ్మర్ అనే యువతిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు. అప్పుడు కొల్లీన్ వయసు 19ఏళ్లు.
సమస్యల్లో ఉన్న టీనేజర్ల కోసం నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో వాళ్లు కొల్లీన్‌ను కలిశారు.
ఈ హత్య 1995లో టెన్నెస్సీలోని నాక్స్‌విల్లేలో సంచలనం సృష్టించింది. కోల్లీన్ ఛాతీపై నక్షత్రం గుర్తును చెక్కినట్టు కనిపించింది. ఈ గుర్తును దుష్ట ఆచారానికి ప్రతీకగా భావిస్తారు.
కొల్లీన్ తనను అవమానించిందని, తన ప్రియుడిని తన నుంచి దూరం చేయడానికి ప్రయత్నించిందని పైక్ ఆరోపించారు. అయితే హత్యకు ముందు, తర్వాత కూడా పైక్ దాని గురించి గొప్పగా చెప్పుకున్నారని, కొల్లీన్ పుర్రెలోని ఒక ముక్కను తమకు చూపించారని ఆ శిబిరంలో ఉన్న మరో ఇద్దరు యువకులు కోర్టులో సాక్ష్యం చెప్పారు.
బాల్యంలో భయంకర అనుభవాలు
హత్య జరిగిన ఏడాది తర్వాత పైక్‌కు మరణశిక్ష విధించారు. అప్పటికి 17ఏళ్ల వయసున్న షిప్‌కు పెరోల్ పొందే అవకాశం ఉన్న జీవితఖైదు విధించారు.
ఈ కేసులో అనేక అప్పీళ్లు విఫలమైన తర్వాత పైక్‌కు సెప్టెంబర్ 30న మరణశిక్ష అమలుచేయాలని నిర్ణయించారు. ఈ శిక్ష అమలైతే టెన్నెస్నీ రాష్ట్రంలో దాదాపు 200 సంవత్సరాలకు పైగా కాలంలో మరణశిక్షకు అనుభవించిన తొలి మహిళ పైక్ అవుతారు. 1970లనుంచి ఇప్పటివరకు అమెరికాలో 18మంది మహిళలకు మాత్రమే మరణశిక్ష అమలుచేశారు. అదే సమయంలో 1,663 మంది పురుషులకు మరణ దండన అమలైంది.
పైక్‌కు మరణశిక్ష అమలుజరగాలని కోరుకుంటున్నానని, అప్పుడే తన కుమార్తె ఆత్మకు శాంతి లభిస్తుందని కొల్లీన్ తల్లి చెప్పారు.
అయితే 226 పేజీల క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేసిన పైక్ న్యాయవాదులు చివరి నిమిషంలోనైనా మరణశిక్షను ఆపుతారనే ఆశతో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కులు నిపుణులు కూడా ఈ మరణశిక్షను ఆపాలని కోరారు.
పైక్ చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనట్టు, కుటుంబసభ్యులు పట్టించుకోలేదని, నిర్లక్ష్యానికి గురైనట్టు అధికారిక రికార్డుల్లో ఉంది. పైక్ ఈ రోజుల్లో టీనేజర్‌గా ఉండి...అదే నేరంలో దోషిగా తేలి ఉంటే, ఆమెకు మరణశిక్ష విధించేవారుకాదని ఆమె లాయర్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Family handout
‘లైంగిక దాడి గురించి చెప్పినా నమ్మని తల్లి’
పైక్‌కు శిక్ష విధించిన తదుపరి సంవత్సరాల్లో ఆమె చిన్నతనానికి సంబంధించిన కొన్ని వివరాలను ఆమె తరఫు లాయర్లు వెలుగులోకి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించే అవకాశం జ్యూరీకి ఎప్పుడూ రాలేదని వారు చెబుతున్నారు.
''ఆమెపై జరిగిన వేధింపులు, అత్యాచారాల గురించి కిందికోర్టుల్లోని అప్పటి లాయర్లకు తెలిసినప్పటికీ వాటిలో ఏ ఒక్క విషయాన్నీ కోర్టు ముందు ఎందుకు ఊంచలేదో అర్దం చేసుకోవడం చాలా కష్టం'' అని కార్నెల్ లా స్కూల్‌లో మరణశిక్ష అంశాల నిపుణురాలు సాండ్రా బాబ్ కాక్ అన్నారు. సాండ్రా పైక్ తరఫున వాదించారు.
''ఆమెపై జరిగిన లైంగిక హింస ఎంత భయంకరమైనదో చెప్పలేం. ఆమె చిన్న వయసు, మానసిక అనారోగ్యం ఇవన్నీ కూడా ఈ కేసులో ముఖ్యమైనవి. తీవ్రంగా పరిగణించాల్సినవి'' అన్నారు.
పైక్ తరఫు లాయర్లు 1995లో ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ డాక్టర్ డయానా మెక్‌కాయ్‌ను నియమించారు. ఆమె పరిశీలనలో పైక్‌ను ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసినట్టు తేలింది.
పైక్ తల్లిని వివాహం చేసుకున్నవారు, ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌లో పలువురు పైక్‌పై శారీరక, లైంగిక దాడి చేశారని మెక్‌కాయ్ రిపోర్టు చేశారు. పైక్‌పై అనేకసార్లు లైంగిక దాడి చేశారు. పైక్‌కు 11 ఏళ్ల వయసులోనూ, 17 ఏళ్ల వయసులోనూ ఈ లైంగికదాడులు జరిగాయి. పైక్ అమ్మమ్మ బాయ్ ఫ్రెండ్ కూడా పైక్ పసివయసులో ఉన్నప్పుడు పదేపదే లైంగిక దాడి జరిపాడు. కానీ పైక్ తల్లి ఈ లైంగికదాడులు జరిగిన విషయాన్ని నమ్మలేదని మెక్ కాయ్ చెప్పారు.
కానీ కోర్టులో పైక్‌పై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె తరపు లాయర్ మెక్‌కాయ్‌ను సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఆమె సూచించిన అనేకమంది సాక్షులను కూడా పిలవలేదు. పదేళ్లకు పైగా గడచిన తర్వాత కోర్టు విచారణలో ఈ వివరాలు బయటపడ్డాయి. కొత్తగా వచ్చిన లాయర్లు ఆమెకు గతంలో సరైన న్యాయసహాయం అందలేదని వాదించారు. ఆ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Christa Pike
‘మరణశిక్ష అమలు చేయడం హాస్యాస్పదం’
పైక్‌కు 2021లో బైపోలార్ డిజార్డర్ ఉన్నట్టు నిర్ధరణ అయింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
తర్వాత మరో ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ డాక్టర్ బెథనీ బ్రాండ్ 2023లో పైక్‌ను పరిశీలించారు. ఆమెను కాపాడాల్సిన ఎంతోమంది వ్యక్తులే ఆమెను వేధించడం వల్ల పైక్ కేసు చాలా అరుదైందని బ్రాండ్ చెప్పారు.
''ఆమె బాల్యం మొత్తం శారీరక, లైంగిక, భావోద్వేగ వేధింపులతో నిండిపోయింది. ఆమెకు స్కూల్‌కు వెళ్లే వయసు రాకముందే పలువురు పురుషులు లైంగికంగా హింసించడం మొదలుపెట్టారు'' అని ఆమె చెప్పారు.
‘‘బైపోలార్ డిజార్డర్ కారణంగా పైక్‌కు తీవ్రమైన ఉన్మాదంలాంటి దశలుండేవి. వాటికి చికిత్స అందలేదు. అలాగే పీటీఎస్‌డీకి చికిత్స అందలేదు’’అని బ్రాండ్ చెప్పారు.
ఈ రెండు సమస్యలు కలిసి చివరకు హత్య చేసిన యువతి వల్ల తనకు ప్రమాదం ఉందని పైక్ భావించేలా చేశాయని, అలాగే ఆ పరిస్థితిలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితిలోకి నెట్టివేశాయని తెలిపారు.
''ఆమెకు మరణశిక్ష అమలుచేస్తే ఈ దేశంలో మరణశిక్ష విధానం ఓ హాస్యాస్పదమైన విషయమని అర్ధమవుతుంది. అత్యంత ఘోరమైన నేరాలు చేసినవారికే ఇది వర్తించడం లేదు. అత్యంత తీవ్రంగా నష్టపోయి, బలహీన స్థితిలో ఉన్నవారికి ఇది వర్తిస్తోంది'' అని బాబ్‌కాక్ అన్నారు.

ఫొటో సోర్స్, Tennesse Department of Corrections
‘మహిళా సిబ్బంది శిక్ష అమలుచేయాలని విజ్ఞప్తి’
పైక్ మరణశిక్షను తగ్గించడానికి లేదా మార్చడానికి సరైన పరిస్థితులను చూపించలేక పోయారని టెన్నెస్సీ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. ఆమె అప్పీళ్ల ప్రక్రియ మొత్తం పూర్తయింది. అనంతరం మరణశిక్ష అమలు తేదీని నిర్ణయించారు.
అంతకుముందు ఒక ఫెడరల్ అప్పీళ్ల కోర్టు, పైక్ విచారణ సమయంలో ఆమె తల్లి, తండ్రి, అత్త ఇచ్చిన సాక్ష్యాల ద్వారా ఆమె కష్టమైన బాల్యం గురించి జ్యూరీకి ఇప్పటికే తెలిసిందని తీర్పు ఇచ్చింది. బైపోలర్ డిజార్డర్, పీటీఎస్‌డీ, మెదడు దెబ్బతినడం గురించి కొత్తగా సమర్పించిన ఆధారాలు జ్యూరీ ఇప్పటికే విన్న విషయాలనే ఎక్కువగా పునరావృతం చేశాయని, అవి తీర్పును మార్చేంత ప్రభావం చూపేవి కావని కోర్టు పేర్కొంది.
ఈ వివాదానికి, ఓ హత్య కేసులో దోషిగా తేలిన లిసామోంట్ గోమెరీకి సంబంధించిన ప్రముఖ కేసుతో కొన్ని పోలికలున్నాయి. ఆమె లాయర్లు కూడా ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న, వేధింపులకు గురైన బాధితురాలని ఆమెపై కరుణ చూపాలని వాదించారు.
మోంట్‌గోమెరీ చేసిన న్యాయపరమైన ప్రయత్నాలు ఆమె మరణశిక్షను మార్చలేక పోయాయి. 2021లో ఇండియానాలో ఆమెకు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేశారు.
టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ క్షమాభిక్ష మంజూరు చేయకపోతే సెప్టెంబర్ 30న పైక్‌కు మరణశిక్ష అమలు చేస్తారు. ఈ నిర్ణయం చివరిక్షణం వరకు వెలువడకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు మరణశిక్ష కేసులో లీ ఎప్పడూ క్షమాభిక్ష మంజూరు చేయలేదు.
ఈ వారం పైక్ మరణశిక్షను ఆపాలని చేసిన అభ్యర్థనను టెన్నెస్సీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యల గురించి తాము చర్చిస్తున్నామని లాయర్లు తెలిపారు.
తనకు మరణశిక్ష అమలు చేసే రోజు మహిళా సిబ్బందితో కూడిన బృందం ఉండాలని పైక్ కోరారు. పురుషుల బృందం తనను బలవంతంగా పట్టుకోవడం వల్ల తనలోని పాత మానసిక గాయాలు మరింత తీవ్రమవుతాయని ఆమె చెప్పారు.
కొల్లీన్ తల్లి మే మార్టినెజ్ మరణశిక్ష అమలు చేయడాన్ని సమర్థిస్తున్నారు.
''ఆమె నేరం చేసింది. దానికి ఆమె శిక్ష అనుభవించాలని భావిస్తున్నాను'' అని ఆమె 2021లో నాక్స్‌విల్లే టీవీ చానల్ డబ్ల్యుబీఐఆర్‌తో చెప్పారు. ఈ వారం కూడా ఆ మాటలకే తాను కట్టుబడి ఉన్నానని బీబీసీకి చెప్పారు.
పైక్ చనిపోయే ముందు బాధ అనుభవించాలని మార్టినెజ్ చెప్పారు. కొల్లీన్ అనుభవించిన బాధను ఆమె కూడా అనుభవిస్తే తనకు కొంత ఉపశమనంగా ఉంటుందన్నారు.
''ప్రతిరోజూ నా గుండె పగిలిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ ఘటనను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూనే ఉన్నా. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోయేలోపు ఇది జరగాలని కోరుకుంటున్నా''అని ఆమె అన్నారు.
''కొల్లీన్ గురించి, ఆమె ఎలా చనిపోయింది, ఎంత భయంకరంగా చనిపోయింది అనే విషయాల గురించి ఆలోచించని రోజు ఒక్కటి కూడా లేదు. పైక్‌కు మరణశిక్ష అమలుకావాలని కోరుకుంటున్నా'' అని కొల్లీన్ తల్లి అన్నారు.

ఫొటో సోర్స్, J. Miles Carey/USA TODAY/Imagn Images via Reuters
‘చిన్ననాటి మానసిక గాయాల గుర్తుల ప్రభావం’
బాధితుల హక్కుల కోసం పనిచేసే జస్టిస్ కొయిలిషన్ అనే సంస్థ మరణశిక్షను చూసేందుకు మార్టినెజ్ టెన్నెస్సీకి వెళ్లేందుకు అవసరమైన డబ్బును సేకరించింది.
ఈ శిక్షను జ్యూరీ నిర్ణయించిందని, కొల్లీన్ కుటుంబం కూడా ఇదే కోరుకుంటోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబర్ట్ బ్రేస్‌వేల్ చెప్పారు.
''సెప్టెంబర్ 30న ఆమెకు మరణశిక్ష అమలు జరగాలన్న కుటుంబం అభిప్రాయానికి మేం పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాం'' అని ఆయన అన్నారు.
ఆషీ, కొల్లీన్ గురించి రెండు పరస్పర విరుద్ధంగా కనిపించే ఆలోచనల మధ్య తర్జనభర్జన పడుతున్నారు. ఒక వైపు న్యాయం జరిగిందని భావించే హక్కు కొల్లీన్ తల్లికి ఉందని, మరోవైపు తన స్నేహితురాలు పైక్‌తో సహా ప్రతి ఒక్కరికీ తమ తప్పుల నుంచి మారి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉండాలని సెల్లార్ భావిస్తున్నారు.
''మీ చిన్న వయసులో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగితే ఆ మానసిక గాయాలు మీలోనే ఉండిపోతాయి. అవి తర్వాత మన సమాజంలో మీ ప్రవర్తన ద్వారా బయటకు వచ్చి మీరు మరొకరికి హాని చేసే పరిస్థితికి దారి తీయవచ్చు'' అని ఆమె అన్నారు.
ఒక దోపిడీ హత్య కేసులో 25ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో జైలులో పైక్‌ను సెల్లార్స్ కలుసుకున్నారు. అత్యంత భద్రత ఉన్న జైలులో తమ గదుల్లోపలికి ఆహారం అందించే చిన్న కిటికీల ద్వారా వారు ఒకరు ఒకరితో మాట్లాడుకునేవారు. ఇప్పుడు సెల్లార్స్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, నేరాల బాధితుల హక్కుల కోసం పనిచేస్తున్నారు.
''ప్రతి ఒక్కరి జీవితం విలువైనదే.. కొల్లీన్ జీవితం కూడా విలువైనదే. ఈ సమయంలో పైక్ తన జీవితం విలువైనదని నిరూపించుకోవడం కోసం నిజంగా జీవించేందుకు చేసే పోరాటం కంటే ఎక్కువగా పోరాడుతున్నారని భావిస్తున్నా'' అంటారు సెల్లార్స్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























