‘సర్’ వివాదం: జ్ఞానేశ్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఏముంది?

ఫొటో సోర్స్, ECISVEEP
ఎన్నికల కమిషనర్ల మధ్య ఉన్న విభేదాలపై ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ను ప్రతిపక్షాలు తీవ్రం చేశాయి.
శనివారంలోగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసన చేపడతామని హెచ్చరించింది.
శుక్రవారం కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ దిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
గత 10 నెలల కాలంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఈసీ నిర్ణయాలపై 14 సార్లు అభ్యంతరాలు లేవనెత్తారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఒక ప్రెస్‌నోట్ ద్వారా ఈ విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నించింది. ఈ ప్రెస్‌నోట్ విడుదలకు ముందు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు భేటీ అయ్యారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?
శనివారం సమావేశమైన ఎన్నికల సంఘం అధికారులు, ‘సర్’కు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
- ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలు లేదా ఇతర కారణాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్లు)లు వారి ఇళ్లకు వెళ్లి సేకరించి, వాటిని ఈసీఐనెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీనికోసం ఓటర్లను ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఆఫీసుకు పిలవరు.
- జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు) నైట్ షెల్టర్లలో ఉండే సామాన్యులు, పేదలు, కార్మికులు, నిరాశ్రయులైన పౌరుల కోసం ప్రత్యేక శిబిరాలు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల గరిష్ఠ సంఖ్యలో అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చవచ్చు.
- ‘సర్’కు ఫామ్ 6కు అటాచ్ చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. నాన్-‘సర్’ పీరియడ్‌కు చెందిన నమోదులకు ఓటర్ నమోదు నియమావళి- 1960 ప్రకారం ఉన్న ఫామ్స్ వర్తిస్తాయి.
- క్షేత్రస్థాయి అధికారులకు వారి చట్టపరమైన హక్కులకు అనుగుణంగా ఈసీఐనెట్ వ్యవస్థను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఇచ్చాం. ఈ వ్యవస్థ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్థరించుకోవడానికి, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఒక కమిటీ ఈసీఐనెట్‌ను పునఃపరిశీలిస్తుంది. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల నుంచి అందిన సూచనల ఆధారంగా గత కొన్ని నెలలుగా పోర్టల్‌లో అనేక మార్పులు జరిగాయి. ఇకపై, ఐటీ మాడ్యూల్స్, పోర్టల్‌కు సంబంధించిన అన్ని కొత్త కార్యక్రమాలు కమిషన్ ఆమోదం పొందే ముందు అధికారుల కమిటీలో చర్చిస్తారు.
- దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అభ్యర్థన మేరకు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి చివరి తేదీని 2026 అక్టోబర్ 30 వరకు, వాటి పరిష్కారానికి గడువును 2026 నవంబర్ 30 వరకు పొడిగించారు. మహారాష్ట్రలో, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువును 2026 అక్టోబర్ 12 వరకు, వాటి పరిష్కారాలకు గడువును 2026 నవంబర్ 10 వరకు పొడిగించారు.
- బిహార్, పశ్చిమ బెంగాల్ సహా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ‘సర్’ ప్రక్రియ పూర్తయింది. ఏ కారణం వల్లనైనా పేర్లు నమోదు కానివారు లేదా మొదటిసారి ఓటర్లుగా అర్హత పొందినవారు సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
- కమిషన్ సమావేశాలన్నింటి అజెండాలు ముందుగానే పంపిణీ చేస్తారు. మీటింగ్ మినిట్స్ కూడా జారీ చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సర్’పై మరికొన్ని నిర్ణయాలు ఏంటంటే...
అత్యంత వివాదాస్పదమైన ‘సర్’ అంశానికి సంబంధించి కమిషన్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను కూడా ప్రెస్ నోట్‌లో ప్రస్తావించారు.
అందులో ఏం చెప్పారంటే...
- ఇటీవలి కాలంలో, ‘సర్’ సంబంధించిన అంశాలతో సహా దేశవ్యాప్తంగా కమిషన్ అనేక నిర్ణయాలు తీసుకుంది.
- అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘సర్’కు సంబంధించిన 2025 జూన్ 24న ఉత్తర్వు జారీ చేశారు. ఇది బిహార్‌లో ప్రారంభమైంది, తర్వాత పశ్చిమ బెంగాల్, ఆపై మిగిలిన 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది.
- కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే ఈ ఉత్తర్వు జారీ అయ్యింది.
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ‘సర్’ షెడ్యూల్ 2025 ఆగస్టు 27న విడుదలైంది. అదే సమయంలో, కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్ 2026 మే 14న జారీ అయింది.
- మూడో దశలో ఉన్న మిగిలిన 12 రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య, తుది జాబితా ప్రచురణ తర్వాతే తెలుస్తుంది.
- ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని వారి నుంచి ఫామ్స్‌ను సేకరించేందుకు, ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టాలని గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) సంబంధిత బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, ANI
మాకు సమాధానం దొరకలేదు – కాంగ్రెస్
ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌పై కాంగ్రెస్ స్పందించింది. కీలకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని ఆరోపించింది.
"ఎన్నికల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన అత్యంత బలహీనంగా, అసంపూర్ణంగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వాస్తవమేనని ఇది ధృవీకరిస్తున్నప్పటికీ, అనేక కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు" అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఎక్స్‌లో రాశారు.
ఈసీ ప్రకటనపై మరింత స్పష్టత కోరుతూ ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు.
‘‘ఫారం-6లో చేసిన మార్పులను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించారు. వారిలో ఒకరు ఈ మార్పులను 'అనధికారికం' , 'చట్టవిరుద్ధం' అని అన్నారు. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) ప్రక్రియ వెలుపల పాత ఫారం-6ను ఉపయోగించవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది"
‘‘ఓటు హక్కును కోల్పోయిన బిహార్, పశ్చిమ బెంగాల్‌లోని యువ ఓటర్ల పరిస్థితి ఏంటి? ఈ రెండు రాష్ట్రాల్లో ‘సర్’ తర్వాత ఎన్నికలు జరిగాయి. కానీ, ఆ మధ్య కాలంలో ఎటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహించ లేదు.’’
‘‘జనవరి 2024 నుండి ఎటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహించనప్పుడు, పాత ఫారం-6కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?"
ఈసీఐనెట్ గురించి కూడా ఖేరా ప్రశ్నించారు.
"ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఇప్పటివరకు ఏం చేసింది? ఈసీఐనెట్‌ను సమీక్షించే బాధ్యతను ఇప్పుడు అదే కమిటీకి లేదా అలాంటిదే మరొక కమిటీకి ఎలా అప్పగిస్తారు’’ అని ఆయన ప్రశ్నించారు.
గోవాలోని 97 మంది ఓటర్లకు సంబంధించిన అంశాన్ని కూడా పవన్ ఖేరా లేవనెత్తారు.
"గోవాలో ఓటర్ల జాబితా నుంచి తీసేసిన 97 మందిలో, 81మంది ఇప్పుడు ఫారం-6ను నింపారని ఎన్నికల సంఘం చెబుతోంది. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వచ్చిన తర్వాతే ఈ చర్య తీసుకున్నారు. అయితే, ఇది ( ప్రెస్‌నోట్ ) అసలైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు" అని ఖేరా అన్నారు.
‘‘అసలు ఈ 97 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
బీజేపీ ఏమన్నది?
ఎన్నికల సంఘం ప్రకటన తరువాత, సీనియర్ బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు.
‘‘ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ఇంకా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై నిరాధారమైన, సిగ్గుచేటైన ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మేం దీనిని ఖండిస్తున్నాము" అన్నారు.
‘‘ఎన్నికల సంఘం ఒక వివరణాత్మక పత్రికా ప్రకటన జారీ చేసింది. ఆ సమావేశంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు.ఈ విషయం కూడా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ‘సర్’కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే తీసుకున్నారని అందులో చెప్పారు’’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
‘‘ ‘సర్’ ప్రక్రియ సరైందేనని 2026, మే 27న సుప్రీంకోర్టు ప్రకటించిన విషయాన్ని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పేర్కొంది. అసలు ఈ ప్రక్రియను సవాలు చేయడానికి సుప్రీంకోర్టుకు ఎవరు వెళ్లారు? డజన్ల కొద్దీ పిటిషన్లు దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, టీఎంసీలే. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు, కేరళలో కాంగ్రెస్, తమ విజయాన్ని ‘సర్’కు ఆపాదించి, దానిని సమర్థించింది" అని ఆయన అన్నారు.
‘‘మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు?’’ అని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
మరోవైపు ఎన్డీఏలో కీలక మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఈసీ ప్రెస్‌నోట్ మీద స్పందించింది. ‘‘ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ మన రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను, సమగ్రతను పునరుద్ఘాటిస్తుంది. ఇది ఈ విషయం చుట్టూ ఉన్న అన్ని అపోహలను తొలగిస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ లో రాశారు.
‘‘ఎస్ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, స్థిరపడిన సంస్థాగత విధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారు. మన రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత ముఖ్యం. భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమష్టి బాధ్యత" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
మరో మిత్రపక్షమైన ఎల్‌జేపీ కూడా ప్రకటన చేసింది.
‘‘ఈ రోజు ఎన్నికల సంఘం అన్ని కీలక అంశాలపై తన వైఖరిని ఒక్కొక్కటిగా స్పష్టం చేసింది. ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన వాస్తవాలు, ముగ్గురు కమిషనర్ల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం, కేబినెట్ కార్యదర్శితో జరిగిన సమావేశం గురించిన వివరాలు కూడా స్పష్టంగా వెల్లడించింది’’ అని ఎల్‌జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఎక్స్‌లో రాశారు.

ఫొటో సోర్స్, @_YogendraYadav
తప్పులు ఒప్పుకున్నట్లే -యోగేంద్ర యాదవ్
ఎన్నికల సంఘం పత్రికా ప్రకటనపై రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ స్పందించారు.
‘‘ఇది నేరాన్ని అంగీకరించినట్లే. ఇది కేవలం ఒక పత్రికా ప్రకటన కాదు. ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య కుదిరిన 'యుద్ధ విరమణ' ఒప్పందం, ఒక నేరాంగీకార ప్రకటన" అని ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
"కమిషన్ ఇప్పుడు సొంత ముద్రతో, తనపై వచ్చిన ప్రతి తీవ్రమైన ఆరోపణను ధృవీకరించింది. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే కాదు, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కూడా బయటపడ్డారు’’ అన్నారు.
‘‘రాజీనామా చేయడమే ఏకైక గౌరవప్రదమైన మార్గం. లేకపోతే, వారిని పదవి నుంచి తొలగించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























