'నాగాలాండ్ నుంచి ఆస్కార్ దారిలోకి' గ్లోబల్ సినిమాకు ఓ అరుదైన ప్రపంచాన్ని చూపిన భారతీయ చిత్రం

అంఘ్ సినిమా నాగాల్యండ్, ఆస్కర్స్
ఫొటో క్యాప్షన్, టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవలో అంఘ్ సినిమా ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకుంది.
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అంఘ్ సినిమా ఎంతో సంతోషాన్నిచ్చే ఓ నమ్మశక్యం కాని కథలా అనిపిస్తుంది.

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ నుంచి వచ్చిన సినిమా ఇది. 20 లక్షలకంటే తక్కువ జనాభా ఉన్న ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో తీసిన ఈ చిత్రం కొన్యక్ భాషలో ఉంటుంది. ఈ గిరిజన భాష చాలామంది భారతీయులకే అంతగా తెలియదు. ఇక విదేశీ ప్రేక్షకుల సంగతి చెప్పక్కరలేదు. దర్శకుడు థేజా రియోకు ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. ఇందులోని చాలా మంది నటులు తొలిసారిగా కెమెరా ముందు నిలబడినవారే.

అయినా ఈ నెలలో జరిగిన టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవలో ఈ సినిమా ప్లాట్‌ఫామ్ ప్రైజ్‌ను గెలుచుకుంది. జ్యూరీ అందించే కీలక పురస్కారాల్లో ఇది ఒకటి.

దర్శకుడి దృక్పథంతో ప్రత్యేకంగా చిత్రీకరించిన సినిమాలను గుర్తించడమే ఈ పురస్కారం ఉద్దేశం. రియో చూపిన తాజా దృక్పథాన్ని, అంతర్జాతీయ తెరపై అరుదుగా కనిపించే ఒక ప్రపంచాన్ని ఈ సినిమా ఆవిష్కరించిన తీరును జ్యూరీ ప్రశంసించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అంఘ్ సినిమా నాగాల్యండ్, ఆస్కర్స్
ఫొటో క్యాప్షన్, టొరోంటోలో సినిమా బృందం

ఈ విజయం అంఘ్ సినిమాకు 2027 అకాడమీ అవార్డుల కైవసానికి ఒక మార్గాన్ని కూడా చూపిందని చెప్పుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం, ఆరు నిర్దిష్ట అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పురస్కారాలను గెలుచుకున్న సినిమాలు, తమ దేశం అధికారికంగా సమర్పించే సినిమా దరఖాస్తులపైనే ఆధారపడకుండా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పరిశీలనకు అర్హత పొందవచ్చు.

అయితే దీనర్థం అంఘ్ ఆస్కార్‌కు నామినేట్ అయిందని కాదు. కానీ భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్ నుంచి వచ్చిన కొన్యక్ భాషా సినిమా అంతర్జాతీయ సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రియో కూడా ఈ పరిణామాన్ని ఇంకా కొంత ఆశ్చర్యంతోనే స్వీకరిస్తున్నారు. పురస్కారాన్నందుకున్న దాదాపు 72 గంటల తర్వాత దిల్లీలో ఆయనతో మాట్లాడినప్పుడు, టొరంటో, విమాన ప్రయాణాలు, ఇంటర్వ్యూలు, మళ్లీ ఇంటర్వ్యూలతో ఊపిరి సలపలేదని అన్నారు.

"పోటీలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకంటే ఎంతో అనుభవజ్ఞులైన దర్శకుల సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అంఘ్‌పై నిర్మాతలకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. మేము గెలుస్తామని వాళ్లు అనుకున్నారు. కానీ నేను అలా అనుకోలేదు" అంటారు రియో.

సినిమాల్లోకి రాకముందు ఆయన ర్యాపర్ కావాలనుకున్నారు. "నాగాలాండ్‌కు చెందిన పిల్లాడిలా కాకుండా కాంప్టన్‌ నగరానికి చెందిన పిల్లాడిలా ఉండాలనుకున్నా" అని ఆయన అంటారు. అమెరికన్ హిప్‌హాప్ గ్రూప్ ది రూట్స్‌కు ప్రధాన ర్యాపర్ అయిన బ్లాక్ థాట్ నుంచి తనకు ఇష్టమైన ఇరానియన్ దర్శకుడు అబ్బాస్ కియరోస్తమీ వరకు రియోకు విస్తృత అభిరుచులు ఉన్నాయి.

అంఘ్ సినిమా నాగాల్యండ్, ఆస్కర్స్
ఫొటో క్యాప్షన్, సినిమాలో కథ జరిగిన సంవత్సరం కూడా కీలకమే.

థేజా రియో తన తొలి ఫీచర్ సినిమా కోసం తన స్వస్థలంవైపే చూశారు.

1960ల ప్రారంభంలో జరిగే కథగా రూపొందిన అంఘ్, కొన్యక్ గ్రామానికి అధిపతైన అంఘ్బా, అతని చిన్న కుమారుడి కథను చెబుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం మారుతున్న కొద్దీ వారి జీవితాల్లో కూడా మార్పులు మొదలవుతాయి. కొన్యాక్‌లు నాగాలాండ్‌లోని 17 ప్రధాన గిరిజన తెగల్లో ఒకటి. వీరు ప్రధానంగా తూర్పున ఉన్న మోన్ జిల్లాలో నివసిస్తారు. అక్కడ ఇలాంటి గ్రామాధిపతులను అంఘ్‌ అని పిలుస్తారు. ఇప్పటికీ కొంతమంది వృద్ధ పురుషుల ముఖాలపై వారి తెగలో చరిత్రాత్మకమైన తలలవేటకు సంబంధించిన పచ్చబొట్లు కనిపిస్తాయి.

క్రైస్తవం విస్తరిస్తున్నప్పటికీ తమ ప్రాంతంలో తమ పూర్వీకుల విశ్వాసాలను కొనసాగించేవారిలో అంఘ్బా, అతని కుమారుడు చివరి వారు.

అప్పుడే ఒక అమెరికన్ మిషనరీ అక్కడికి వస్తారు. ఈ మిషినరీ పాత్రను స్కాట్లాండ్ నటుడు డగ్లస్ హెన్షాల్ పోషించారు. ఆ మిషినరీను తండ్రి అతడిని వ్యతిరేకిస్తాడు. కానీ కుమారుడికి మాత్రం ఆసక్తి మొదలవుతుంది.

కొన్నేళ్ల క్రితం మరో ప్రాజెక్టు కోసం మోన్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తనకు ఈ సినిమా ఆలోచన వచ్చిందని రియో చెప్పారు. అక్కడ తనను ఆకట్టుకున్న విషయం- వేర్వేరు తరాలకు చెందిన వ్యక్తులంతా ఒకే చోట కలిసిమెలిసి జీవిస్తున్నట్లు అనిపించడమే.

ఒకే కుటుంబంలో ఒక తాత ఒకప్పుడు తలల వేటలో పాల్గొన్న వ్యక్తి అయి ఉంటారు. అతని ముఖంపై ఆ కాలానికి చెందిన పచ్చబొట్లు ఇంకా ఉంటాయి. అదే కుటుంబంలో రెండు తరాల తర్వాత అతని మనవడు ఒక రాక్ బ్యాండ్‌లో గిటార్ వాయిస్తూ ఉంటారు అని ఆయన చెప్పారు.

"మీరు టైమ్ మెషీన్ ఎక్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. గతం, వర్తమానం ఒకదానిలో ఒకటి కలగలిసిపోయినట్టుగా ఉంటుంది" అని రియో అన్నారు.

సినిమాలో కథ జరిగే సంవత్సరం కూడా కీలకమే. ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉన్న నాగాలాండ్ 1963 డిసెంబర్‌లో అస్సాం నుండి విడిపోయి అధికారికంగా ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. అప్పట్లో రాజకీయంగా, సామాజికంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అప్పటికే నాగాలాండ్‌లోని వివిధ సమాజాల్లో క్రైస్తవ మతం కొన్ని దశాబ్దాలుగా విస్తరిస్తూ వస్తోంది. దాని ప్రభావం కేవలం మత విశ్వాసాలకే పరిమితం కాలేదు. ఆచారాలు, సంప్రదాయాలు, రోజువారీ జీవన విధానాల్లోనూ మార్పులు వచ్చాయి.

కొన్యక్ సమాజ పరిశోధకుడైన డాక్టర్ బి. అమో కొన్యక్ మాట్లాడుతూ ఆ కాలంలో జరిగిన మార్పులు దాదాపు ఓ సంస్కృతి మాయమైపోవడం లాంటివే అని చెప్పారు.

కొన్ని ఆచారాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరికొన్ని శకలాలుగా మిగిలిపోయాయి. అవి పెద్దల జ్ఞాపకాల్లో, కుటుంబ వారసత్వ వస్తువుల్లో నిలిచాయి. ఒకప్పుడు రోజువారీ జీవితంలో భాగమైనవి, ఆ తర్వాత వారసత్వంగా మిగిలిపోయాయి.

అయితే సంస్కృతి పూర్తిగా ఆగిపోలేదని డాక్టర్ కొన్యక్ చెబుతున్నారు. ప్రజలు తమ సంస్కృతిలోని కొన్ని భాగాలను కొత్త మతపరమైన, సామాజిక ప్రపంచాల్లోకి తీసుకెళ్లారు. సంప్రదాయాలు కొనసాగాయి. అయితే వాటి రూపం మారడంతో వాటి అర్థాలు కూడా మారాయి.

అంఘ్ సినిమా నాగాల్యండ్, ఆస్కర్స్
ఫొటో క్యాప్షన్, కెమెరా ఏం చూస్తుందన్నదే కాదు, అది ఏ కోణం నుంచి చూస్తుందన్నదీ అంతే ముఖ్యం.

ఈ మార్పునే రియో తన సినిమాలో చూపించాలనుకున్నారు.

"గత 50 లేదా 60 ఏళ్లలో అసాధారణమైన మార్పులు జరిగాయి" అని ఆయన చెప్పారు. ఆ మార్పులు తరాల మధ్య దూరాన్ని పెంచాయి.

అంఘ్ సినిమాలో తండ్రి, కుమారుడి మధ్య ఉన్న సంబంధం ద్వారా ఈ మార్పును ఆయన పరిశీలించారు. ‘‘ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమిస్తారు. పరస్పరం బాగోగులు పట్టించుకుంటారు’’ అయినా వారి ప్రపంచాలు క్రమంగా వేర్వేరు దిశల్లోకి వెళ్లడం మొదలవుతుంది.

సినీ విమర్శకులు సిద్ధాంత్ అద్లఖా ఈ సినిమాలో కనిపించే సందిగ్ధతే తనను ఆకట్టుకుందని చెప్పారు. " అభివృద్ధి, సంప్రదాయం ఒకే సరళరేఖలో సాగాల్సిన అవసరం లేదు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి కూడా ఉండవచ్చు" అన్నారు.

ఈ సినిమా ఇంకా చాలామంది ప్రేక్షకులకు చేరలేదు. కానీ ఈ సినిమా చిన్నపాటి ట్రైలర్‌లో రియో ఈ ప్రపంచాన్ని ఎలా నిర్మించారో కొంత కనిపిస్తుంది. ఎత్తైన పచ్చని కొండలు పొగమంచును కప్పుకొని ఉంటాయి. అడవుల్లో, గ్రామీణ మర్గాల్లో మనుషుల కదలికలు కనిపిస్తాయి. చీకటిలో మంటలు, దీపాల వెలుగులో ముఖాలు ప్రకాశవంతమవుతాయి.

ఆ ప్రాంతపు ప్రకృతి అందంగా ఉంటుంది. కానీ అది కేవలం అందమైన దృశ్యాలకే పరిమితం కాదు. ఆచారాలు, కుటుంబం, భౌగోళిక పరిస్థితులతో ఒక చిన్న ప్రపంచం గూడు కట్టుకొని టుంది. అదే సమయంలో దాని సరిహద్దుల వెలుపల నుంచి ఒక పెద్ద ప్రపంచం దానిపై ప్రభావం చూపడం మొదలవుతుంది.

అంగ్బా పాత్రను పోషించిన అంగ్‌లాంగ్‌ కొన్యక్‌కు ఇది తొలి సినిమా. ఆయన దృశ్యాలను, ఆ పాత్ర అణచివేసుకున్న కోపాన్ని రియో ఎంతో సున్నితంగా చిత్రీకరించిన తీరును అద్లఖా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కెమెరా ఏం చూస్తుందన్నదే కాదు, అది ఏ కోణం నుంచి చూస్తుందన్నదీ అంతే ముఖ్యం.

కొన్యక్ ప్రజలను చాలా కాలంగా బయటి వ్యక్తుల దృష్టితోనే చూస్తున్నారు.

పచ్చబొట్లు వేసుకున్న ముఖాలు, ఆభరణాలు, ఆయుధాలు, తలల వేట వంటి అంశాలపై ఆసక్తితో వచ్చిన అన్వేషకులు, బ్రిటిష్ అధికారులు, మిషనరీలు, ఫొటోగ్రాఫర్లు ఈ సమాజాన్ని తమ దృష్టితో చిత్రీకరించారని డాక్టర్ కొన్యక్ చెబుతున్నారు. అయితే ఆ చిత్రాల వెనుక ఉన్న ప్రజల జీవితాలు మాత్రం తరచూ కనిపించకుండా పోయాయి.

అంఘ్ సినిమా నాగాల్యండ్, ఆస్కర్స్
ఫొటో క్యాప్షన్, రియో, సినిమాటోగ్రాఫర్ ఆడమ్ పియెట్‌కెవిచ్ కలిసి అంఘ్ సినిమాను 16 ఎంఎం ఫిల్మ్‌పై చిత్రీకరించారు.

తాను కూడా ఆ చరిత్రను వారసత్వంగా పొందుతున్న విషయాన్ని రియో గుర్తించారు.

"నాగాలాండ్‌పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువగా అక్కడి ప్రజలను ఒక అన్వేషకుడి దృష్టి కొణం నుంచి చూపిస్తాయి, ఆ ప్రజల దృష్టితో కాదు" అని ఆయన చెప్పారు.

అంఘ్ ద్వారా ఆ దృష్టి కోణాన్ని తిప్పాలనుకున్నారు. ఈ పాత్రలలోకి ప్రవేశించాలని ప్రేక్షకులను ఆయన కోరారు.

ఈ మార్పు చిన్నదే అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం గణనీయమైనది. కొన్యక్‌లు గతంలో మిగిలిపోయిన ఒక విచిత్రమైన సమాజంగా కాకుండా, డాక్టర్ కొన్యక్ చెప్పినట్లు ప్రేమ, దుఃఖం, సంఘర్షణ, విశ్వాసం, అనిశ్చితి, తరాలరాల మార్పుల మధ్య జీవిస్తున్న మనుషులుగా కనిపిస్తారు.

సంభాషణలు, దుస్తులు, ప్రొడక్షన్ డిజైన్ కోసం కొన్యక్ సమాజానికి చెందిన సలహాదారులు పనిచేశారు. నటీనటుల్లో చాలామంది మొదటిసారి నటించిన కొన్యక్ వ్యక్తులే. సినిమాలో కనిపించే అడవి కూడా అక్కడి ప్రజలు రాకపోకలు సాగించేదే. వారి జీవితాల్లో అది భాగం. అద్లఖా చెప్పినట్లు, రియో ఆ అడవిని కేవలం ఒక నేపథ్యంగా కాకుండా, చరిత్ర కలిగిన ఒక ఇంటిగా చూపించారు. ఒక పట్టణ దర్శకుడు ముంబయి లేదా న్యూయార్క్‌ను చూపించే విధంగానే ఆయన ఆ ప్రాంతాన్ని చిత్రీకరించారు.

రియో, సినిమాటోగ్రాఫర్ ఆడమ్ పియెట్‌కెవిచ్ కలిసి అంఘ్ సినిమాను 16 ఎంఎం ఫిల్మ్‌పై చిత్రీకరించారు. 1950లు, 60ల్లో మిషనరీలు, నాగాలాండ్ సమాజాలపై తీసిన ఫొటోలు, వీడియోలను వారు ఆధారంగా తీసుకున్నారు.

ఆ పాత చిత్రాల్లో కనిపించే ఫిల్మ్ గ్రెయిన్, దృశ్య నిర్మాణం, వాతావరణాన్ని తిరిగి సృష్టించడంతో పాటు, కెమెరా కొన్యక్‌ల దృష్టికోణాన్ని బంధించేలా చూసుకున్నారు.

అది ఒక అద్భుతమైన నిర్ణయం. కాని సవాళ్ళతో కూడుకుంది.

డిజిటల్ ఫుటేజ్‌లా కాకుండా, ఒకసారి చిత్రీకరించిన ఫిల్మ్‌ను అక్కడికక్కడే చూసి పరిశీలించడం సాధ్యం కాదు. ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు ఫిల్మ్ రోల్స్‌ను ప్రాసెసింగ్ కోసం ముంబయికి పంపించాల్సి వచ్చేది. తాము ఏం చిత్రీకరించామో ఖచ్చితంగా తెలియకుండానే చిత్రబృందం షూటింగ్ కొనసాగించాల్సి వచ్చేది.

ఇంతకన్నా అసాధారణమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి.

హెన్షాల్‌తో కలిసి రాత్రి షూటింగ్ చేస్తున్న సమయంలో, రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక పాత జీపును ఫ్రేమ్‌లోకి తీసుకురావాల్సి ఉంది. రిహార్సల్స్ సమయంలో అది ఎలాంటి సమస్య లేకుండా పనిచేసింది. కానీ కెమెరాలు ఆన్ చేసిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ కాలేదు. పలుమార్లు ప్రయత్నించిన తర్వాత జీప్ ఫ్రేమ్‌లోకి వస్తున్న ఒక్క టేక్‌ను మాత్రమే చిత్రబృందం చిత్రీకరించగలిగింది.

"ఆ రాత్రి చాలా కష్టంగా గడిచింది" అని రియో చెప్పారు.

రియోకు అంఘ్ తొలి ఫీచర్ సినిమా అయినప్పటికీ, దేశ పటంపై విస్తరిస్తున్న భారతీయ సినిమాకు అదొక నిదర్శనం

అస్సాంకు చెందిన రీమా దాస్, మేఘాలయకు చెందిన డొమినిక్ సంగ్మా వంటి ఈశాన్య రాష్ట్రాల దర్శకుల సినిమాలు భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సంక్లిష్టతను ప్రతిబింబిస్తాయని విమర్శకుడు అద్లఖా పేర్కొన్నారు.

అయితే, నాగాలాండ్ చిత్ర పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఇతర ప్రధాన కేంద్రాల స్థాయికి చేరుకోవాల్సి ఉందని థేజా రియో అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఇప్పటికే స్థిరపడిన సినీ కేంద్రాలకు ఉన్న స్థాయిలో అక్కడి సినిమాలకు విస్తృతమైన ఆడియన్స్ లేరు.

"చెప్పాల్సిన ఎన్నో అందమైన కథలు, వాటిని చెప్పేందుకు ఎంతో ప్రతిభ ఉన్న దర్శకులు అక్కడ ఉన్నారు" అని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి మాత్రం రియో నాగాలాండ్‌కు తిరిగి వెళ్లాలని ఎదురు చూస్తున్నారు.

"నా స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడాలి" అన్నారు ఆయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)