లియోనల్ మెస్సీ: ‘ఇంకెంతకాలం ఆడతానో తెలియదు’-తండ్రి మరణం వేళ వ్యాఖ్యానించిన సాకర్ స్టార్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లొరైన్ మెక్‌కెన్నా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
తండ్రి మరణం తర్వాత లియోనల్ మెస్సీ ఇంటర్ మయామీ తరపున సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా బరిలో దిగాడు. తాను త్వరలో రిటైరవుతానని ఇటీవల మెస్సీ సంకేతాలిచ్చాడు.
మెస్సీ తండ్రి జార్జ్.. అర్జెంటీనాలోని ఆయన సొంత పట్టణం రొసారియోలో గతవారం చనిపోయారు. 68 ఏళ్ల జార్జ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఫుట్‌బాల్‌లో తన భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నానని, ఇంకెంతకాలం ఫుట్‌బాల్ ఆడతానో తనకు తెలియదని సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్టులో 39 ఏళ్ల మెస్సీ రాశాడు.
మెస్సీ తండ్రి జార్జ్ అంత్యక్రియలు ఆదివారం(ఆగస్టు 9)అర్జెంటీనాలో జరిగాయి. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం మెస్సీ అమెరికాకు తిరిగి వచ్చాడు.
లియోన్‌ని మయామీ 3-2 తేడాతో ఓడించిన లీగ్స్ కప్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో సగం ఆట ముగిసిన తర్వాత బరిలో దిగిన మెస్సీకి అభిమానులకు ఘనంగా స్వాగతం పలికారు.

‘ఇంకో వరల్డ్ కప్ ఆడాలన్నది నాన్న కోరిక’
లీగ్స్ కప్‌లో మాంటెర్రీ చేతిలో మయామీ 2-1తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లో మెస్సీ ఆడలేదు. లియోన్‌తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.
లీగ్స్ కప్‌ను 2023లో విస్తరించారు. ఆ ఏడాదే మెస్సీ మయామీ జట్టులో చేరాడు. ఆ జట్టు అప్పుడు ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత మయామీ టోర్నీ తొలి దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి.
మెస్సీకి 14ఏళ్ల వయసున్నప్పటి నుంచి తండ్రి జార్జ్ అతనికి ఏజెంట్‌గా ఉన్నారు. ఫుట్‌బాల్ చరిత్రలో మేటి ఆటగాళ్లలో ఒకరిగా మెస్సీ ఎదగడాన్ని ఆయన చూశారు. 2022లో జట్టుకు నేతృత్వం వహించి అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించడాన్ని చూశారు.
2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకుందిగానీ స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 0-1
తేడాతో ఓడిపోయింది.
మరో వరల్డ్ కప్ ఆడాలని అనారోగ్యంతో బాధపడుతూ కూడా తండ్రి తనను కోరారని మెస్సీ రాశాడు.

ఫొటో సోర్స్, Getty Images
మయామీ జట్టు ఆటగాళ్లేమంటున్నారు?
తండ్రి మరణానంతరం మెస్సీ తిరిగి జట్టులో చేరడం నమ్మలేని విషయంలా అనిపించిందని మయామీ మిడ్ ఫీల్డర్ యాన్నిక్ బ్రైట్ అన్నాడు. లియోన్‌పై మయామీ గెలిచిన రెండో గోల్‌ను బ్రైట్ చేశాడు. తమ కెప్టెన్‌కు అండగా నిలవాలని మాత్రమే తమ టీమ్ సభ్యులందరం కోరుకున్నామని ఆయన చెప్పాడు.
'''నేనిది ఊహించలేదు. ఆటపై అతనికున్న శ్రద్ధకు ఇది నిదర్శనం. అతన్నిక్కడ చూసినప్పుడు నా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకున్నా'' అని బ్రైట్ అన్నాడు.
''ఇది క్లిష్టమైన సమయం. మేం అతనికి దగ్గరగా ఉండి సాధ్యమైనంత మద్దతుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా పెద్ద విషాదం'' అని బ్రైట్ అన్నాడు.
మిగతావారికంటే మెస్సీ భిన్నమైన వ్యక్తని లియోన్ కోచ్ జేవియర్ గాండోల్ఫీ అన్నాడు. తన ధైర్యం, వ్యక్తిత్వం ఎలాంటివో అతను మరోసారి చూపించాడని గాండోల్ఫీ చెప్పాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























