రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది

వజ్రాల వేట, వజ్రం, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, పన్నాలోని సరోఖా గ్రామ పరిధిలో ఉన్న గనిని అఖిలేశ్ పాల్, మరో ఆరుగురితో కలిసి రెండేళ్ల కిందట లీజుకు తీసుకున్నారు.
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

తమ జీవితాలను మార్చేసే అద్భుతమైన వస్తువును కనుగొన్నట్లు మధ్య భారతదేశంలోని వజ్రాల గనుల ప్రాంతమైన పన్నాకు చెందిన ఏడుగురు సామాన్య కూలీలు తెలిపారు.

రెండేళ్ల కిందట తాము లీజుకు తీసుకున్న భూమిలో ఓ పెద్ద వజ్రం దొరికిందని ఎంతో ఆనందంతో చెప్పారు.

తూకం వేయగా, ఆ విలువైన రాయి 17.96 క్యారెట్ల బరువున్నట్లు తేలింది. పన్నా వజ్రాల అధికారి రవి పటేల్ మాట్లాడుతూ, 'జెమ్ క్వాలిటీ' పరంగా అత్యుత్తమ రకాలైన సహజ వజ్రాల్లో ఇదొకటని అన్నారు.

ఈ వజ్రం చాలా విలువైనదని పటేల్ పేర్కొన్నారు. దీనిని అక్టోబర్ మొదటి వారంలో వేలం వేయనున్నట్లు చెప్పారు. ఈ వజ్రం విలువ కనీసం 50 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశారు.

పన్నాలో వజ్రాలు దొరకడం కొత్తేమీ కాదు. భారత్‌లో అత్యధిక వజ్రాల నిల్వలు ఉన్న ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాల్లో పన్నా కూడా ఒకటి. ఇక్కడి ప్రజలు పేదరికం, నీటి ఎద్దడి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పట్టణంలో అరకొర ఉద్యోగావకాశాల కారణంగా, స్థానికులు వజ్రాలు దొరికితే తమ జీవితాలు మారిపోతాయని ఆశిస్తుంటారు. అందువల్ల, వజ్రాల అన్వేషకులకు పన్నా గమ్యస్థానంగా మారింది.

కానీ, వజ్రం దొరికిన వ్యక్తికే అది సొంతమవుతుందని మాత్రం కాదు.

వజ్రాల వేట, వజ్రం, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాల్లో పన్నా కూడా ఒకటి.

పన్నాలోని వజ్రాల గనుల్లో పనిచేసే వారిలో ఎక్కువ శాతం రోజువారీ కూలీలేనని కథనాలు చెబుతున్నాయి. వారు ఆ భూములను లీజుకు తీసుకున్న యజమానుల కోసం వజ్రాల వేట కొనసాగిస్తారు. ఒకవేళ వారికి వజ్రం దొరికితే, తద్వారా వచ్చే డబ్బు ఆ లీజుదారుడికే వెళ్తుంది.

అయితే, తాజాగా దొరికిన ఈ వజ్రం విషయంలో మాత్రం అది దొరికిన వారికే ప్రయోజనం కలగనుంది. ఇలా అరుదుగా జరుగుతుంటుంది.

పన్నాలోని సరోఖా గ్రామ పరిధిలో ఉన్న ఈ గనిని అఖిలేశ్ పాల్, మరో ఆరుగురితో కలిసి రెండేళ్ల కిందట చాలా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకున్నట్లు పీటీఐ తెలిపింది.

ఇక్కడ ఏడాదిగా మైనింగ్ జరపలేదని, ఇటీవలే తిరిగి ప్రారంభించినట్లు పాల్ చెప్పారు. భారీ వర్షాలు కురిసిన అనంతరం సోమవారం గనిని పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ఈ రాయి కనిపించింది.

"వజ్రాల కోసం మేం దాదాపు రెండేళ్ల పాటు అక్కడ మైనింగ్ చేశాం. కానీ, అదృష్టం వరించలేదు. అందుకే ఏడాదిగా ఆ మైన్‌ను మూసేశాం. దాని పక్కనే మరో మైన్ తీసుకుని వజ్రాల వేట మొదలుపెట్టాం" అని ఆయన చెప్పారు.

"ఈ కొత్త మైన్‌ను చూడడానికి వెళ్లినప్పుడు, పక్కనే ఉన్న పాత మైన్‌ను కూడా ఒకసారి చూద్దామని వెళ్లాం. అప్పుడే అది కనిపించింది. అది పైనే ఉంది."

అక్టోబర్‌లో జరిగే వేలంలో ఈ వజ్రాన్ని విక్రయానికి పెట్టనున్నట్లు రవి పటేల్ చెప్పారు. ఈ వేలంలో భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా కొనుగోలుదారులు పాల్గొనే అవకాశం ఉంది.

మొత్తం విక్రయ నగదులో ప్రభుత్వం 12 శాతం రాయల్టీగా మినహాయించుకోగా, మిగిలిన మొత్తం ఏడుగురు కార్మికులకు సమానంగా అందుతుందని కథనాలు చెబుతున్నాయి.

ఈ వజ్రం కొందరు కూలీల జీవితాలను మార్చేయనుంది. ఆర్థిక స్థోమత లేక ఇప్పటివరకూ పెళ్లిళ్లు కాలేదని, ఈ డబ్బుతో వివాహం చేసుకునేందుకు మార్గం సుగమమవుతుందని వారిలో ముగ్గురు చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)