షెల్ గేమ్: అమెరికా అధ్యక్షుడు కారులో వెళ్లినా, విమానం ఎక్కినా, హెలికాప్టర్‌‌లో ప్రయాణించినా.. సీక్రెట్ సర్వీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది

ట్రంప్, అమెరికా, వైట్‌ హౌస్, సీఐఏ

ఫొటో సోర్స్, Stephen Huntley/HVC

    • రచయిత, బెర్న్‌డ్ డెబ్సుమన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జులై 8న టీవీ కెమెరాల ముందు ఎయిర్ ఫోర్స్ వన్ విమానమెక్కారు.

అప్పుడాయన తుర్కియేలో నాటో సదస్సులో పాల్గొని తిరిగి అమెరికా వెళ్తున్నారు.

కానీ ఆ బోయింగ్ విమానం అంకారా నుంచి బయలుదేరే సమయానికి ట్రంప్‌ను రహస్యంగా ఓ క్యాటరింగ్ ట్రక్‌లో సీ-32ఏ అనే సైనిక విమానానికి తరలించినట్టు సమాచారం.

ఇలాంటి వ్యూహాలు కొత్తవి కావు. ఇది చాలా సాధారణమే అని అమెరికా సీక్రెట్ సర్వీస్‌పై విస్తృతంగా రచనలు చేసిన రొనాల్డ్ కెస్లర్ చెప్పారు.

''అధ్యక్షుడికి హాని చేయాలని ప్రయత్నించేవారి దృష్టి మళ్లించడానికి చాలాకాలంగా ఇలాంటి వ్యూహాలు అమల్లో ఉన్నాయి'' అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒకేలా కనిపించే రెండు వాహనాలు

అధ్యక్షుల భద్రతబృందాల్లో పనిచేసిన సీక్రెట్ సర్వీస్ మాజీ ఉన్నతాధికారి రాబర్ట్ మెక్ డొనాల్డ్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం మోటర్ కేడ్‌లలో తరచూ వ్యూహాలు అమలు చేస్తారని చెప్పారు.

మోటర్ కేడ్‌లలో డజన్ల కొద్దీ భద్రత, సహాయ వాహనాలుంటాయి.

అంబులెన్సులు, వైట్ హౌస్ రిపోర్టర్లను తీసుకెళ్లే వ్యాన్లుంటాయి.

అధ్యక్షుడు ప్రయాణించే రెండు ‘బీస్ట్’ వాహనాలు కూడా మోటర్ కేడ్‌లలో ఉంటాయి.

ఒక వాహనంలో అధ్యక్షుడు ప్రయాణిస్తారు. మరొకటి దానికి దగ్గరగానే ప్రయాణిస్తుంది.

గమ్యస్థానానికి వెళ్లేవరకు ఈ రెండు వాహనాలు తమ స్థానాలను మార్చుకుంటూ వెళ్తాయి.

''దీన్ని మేం షెల్ గేమ్ అని పిలుస్తాం'' అని జార్జ్ డబ్ల్యు బుష్ హయాంలో ఆ వాహనాల్లో ఒకదాన్ని నడిపిన మెక్‌డొనాల్డ్ చెప్పారు.

''వాషింగ్టన్ డీసీలో కూడా మేం ఆండ్రూస్ జాయింట్ బేస్‌కు వెళ్తున్నప్పుడు ఆ రెండు వాహనాలు ఓ హైవే ఓవర్ పాస్ కింద స్థానాలు మార్చుకునేవి. అయితే అది మోటర్ కేడ్‌లో ఉన్నవారికి లేదా ఆ సొరంగంలో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. తప్పుదోవ పట్టించడానికి వివిధపద్ధతులు ఉపయోగిస్తాం'' అని ఆయన చెప్పారు.

అధ్యక్షుని హెలికాప్టర్ అయిన మెరైన్ వన్ కూడా సాధారణంగా మూడు హెలికాప్టర్ల సమూహంగా ప్రయాణిస్తుంది.

దాడి చేసేవారికి అధ్యక్షుడు ఏ హెలికాప్టర్‌లో ఉన్నారో తెలియకుండా ఉండేందుకు అవి స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి.

విదేశీ పర్యటనల వంటి క్లిష్టమైన, అధిక ప్రమాదం ఉన్న ప్రయాణాల్లో మరింత ఎక్కువగా మోసపూరిత చర్యలు చేపడతారు.

''ఇలాంటి ఘటనలు తరచూ జరగవు. కానీ అధ్యక్ష భద్రత బాధ్యతలు నిర్వహించే సీక్రెట్ సర్వీస్‌కు ఇది ఎప్పుడూ అందుబాటులో ఉండే ఎంపిక'' అని ఆయన అన్నారు.

ట్రంప్, అమెరికా, వైట్‌ హౌస్, సీఐఏ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ ప్రయాణించే విమానం మార్చడంపై అమెరికా సీక్రెట్ సర్వీస్ స్పందించలేదు.

‘తీవ్రమైన ముప్పుగా పరిగణించారా..?’

''అధ్యక్షుడు యుద్ధప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయన ఏ విమానంలో లేదా ఏ మార్గంలో ప్రయాణిస్తారో శత్రువులకు అర్థం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు'' అని ఆయన చెప్పారు.

2000 మార్చిలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు గుర్తులు లేని ఓ ఎగ్జిక్యూటివ్ జెట్‌లో వెళ్లారు. ఆ విమానం దిగే ముందు ఎయిర్ ఫోర్స్ వన్ రంగులతో ఉన్న ఒక డీకాయ్ విమానం ముందుగా దిగింది.

మూడేళ్ల తర్వాత ఓ సారి జార్జ్ డబ్ల్యూ బుష్ థాంక్స్ గివింగ్‌ను టెక్సాస్‌లో గడుపుతారని వైట్ హౌస్ ప్రకటించింది.

కానీ ఆయన చీకటిగా ఉంచిన ఎయిర్ ఫోర్స్ వన్‌లో బాగ్దాద్‌కు చేరుకున్నారు.

2023లో అధ్యక్షుడు జో బైడన్ కూడా కేవలం ఒక రిపోర్టర్, ఓ ఫోటోగ్రాఫర్‌తో కూడిన చిన్న మీడియా బృందంతో రహస్యంగా యుక్రెయిన్‌కు వెళ్లారు.

ఈ మూడు సందర్భాల్లో కూడా విమానంలో ఉన్న మీడియాకు ఈ రహస్య వ్యూహం గురించి తెలుసు.

కానీ ఆ విషయాన్ని బయటపెట్టొద్దని చెబుతారు.

తాజా ఘటనలో విమానానికి ఉన్న అసలు ముప్పుఏంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

సీక్రెట్ సర్వీస్ ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించలేదు. వైట్ హౌస్ కూడా దీనిని ధ్రువీకరించలేదు. ఖండించలేదు. అధ్యక్షుణ్ని రక్షించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తామని మాత్రమే తెలిపింది.

వివిధ పరిస్థితుల కోసం ముందుగానే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో కొత్త ముప్పులు ఎదురైతే సీక్రెట్ సర్వీస్ వెంటనే వ్యూహాలను మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని వారు అంటున్నారు.

ట్రంప్‌ను రహస్యంగా మరో విమానానికి మార్చడం అనేది ఆ ముప్పును చాలా తీవ్రమైనదిగా భావించారనేదానికి సంకేతమని మెక్ డొనాల్డ్ చెప్పారు.

ట్రంప్, అమెరికా, వైట్‌ హౌస్, సీఐఏ

ఫొటో సోర్స్, Getty Images

‘అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు’

''తుర్కియేలో ముప్పు ఎక్కువగా ఉందని నాకు అర్ధమయింది. అధ్యక్షుని సిబ్బంది, సీక్రెట్ సర్వీస్, వైట్ హౌస్ మిలటరీ ఆఫీస్‌కు వెంటనే సమాచారం ఇచ్చి ఉండొచ్చు. వాళ్లంతా ఒక గదిలో సమావేశమై నిఘా సమాచారాన్ని పరిశీలించి ఉంటారు. ఆ సమాచారం ద్వారా ముప్పును తగ్గించేందుకు ఓ ప్రణాళిక రూపొందించి ఉంటారు'' అని మెక్ డొనాల్డ్ వివరించారు

మెక్ డొనాల్డ్ అభిప్రాయాన్ని మార్క్ పోలిమెరోపొలోస్ కూడా సమర్థించారు. ఆయన సీఐఏలో 26ఏళ్లు పనిచేశారు. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా రహస్య ఆపరేషన్లను పర్యవేక్షించారు.

''ఇక్కడ అసలు ముఖ్యమైన విషయం ముప్పు స్వభావం. సీక్రెట్ సర్వీస్ ఇంత పెద్ద మోసపూరిత ఆపరేషన్ చేపట్టాల్సినంత తీవ్రమైన ముప్పు ఏంటనేదే ప్రశ్న'' అని ఆయన అన్నారు.

అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఆ సమయంలో ప్రభుత్వం లేదా గూఢచారి సంస్థలకు విమానంలో ఉన్నవారిని హెచ్చరించే బాధ్యత ఉందా అనేదేనేని పోలిమెరోపోలోస్ చెప్పారు.

''విమానం కూల్చివేయాలని ప్రణాళిక వేశారనుకుందాం. ఆ విషయం ముందుగానే మాకు తెలిస్తే 'అలా జరగనివ్వం'' అని ఆయన అన్నారు.

''ఐసిస్ మాస్కోలో ఓ లక్ష్యంపై దాడి చేయబోతోందని మాకు తెలిస్తే మేం రష్యన్లను హెచ్చరిస్తాం. ఎందుకంటే అందులో ఒక అమెరికా పౌరుడు మరణించే అవకాశం ఉన్నా దాన్ని జరగనివ్వం.

విమానంలో మిగిలిపోయినవారు నిజంగా ఎంత ప్రమాదంలో ఉన్నారు? లేదా అసలు ప్రమాదమే లేదా?'' అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు'' అని చెప్పారు.

విండోస్‌ను మూసి ఉంచాలని పదే పదే ఆదేశించారని విమానంలో జర్నలిస్టులు తెలిపారు.

ఇది అసాధారణం కాదని మెక్ డొనాల్డ్ చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారనేదానికి ఇది సంకేతమని అన్నారు.

''పైన ఎగురుతున్న పెద్ద విమానంలో విండోలు తీసి, లోపల లైట్లు వెలిగితే అది ఏ రకమైన విమానమో ఎవరైనా గుర్తించగలరు. పారదర్శకత అవసరం ఉందని నేను అంగీకరిస్తా. కానీ ఆ ప్రయాణికులు కూడా ఈ మొత్తం ప్రయాణబృందంలో భాగమే. మీరు, మిగతా అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవడం కూడా మాకు ముఖ్యం'' అని ఆయన చెప్పారు.

ముప్పులు జరిగే అవకాశాల గురించి లేదా అధ్యక్షుని భద్రత కోసం చేపట్టిన చర్యల గురించి ప్రజలకు వివరించాల్సిన చట్టపరమైన బాధ్యత సీక్రెట్ సర్వీస్‌కు లేదని ఆయన చెప్పారు. ఆ నిర్ణయాన్ని వైట్ హౌస్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీక్రెట్ సర్వీస్ ప్రజాసంబంధాల సంస్థ కాదన్నారు.

''రహస్యాలను కాపాడడంలో మేం చాలా నిపుణులం. మా పేరే దానికి నిదర్శనం. ప్రతి ఒక్కరూ ప్రతీ విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు'' అని ఆయన ముగించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)