పంచదార ధరలు పెరగడానికి ఇథనాల్ కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దేశవ్యాప్తంగా కొన్నినెలలుగా చక్కెర ధరలు పెరుగుతున్నాయి.
ఆగస్టు 18న రాయిటర్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం భారత్‌లో ఈ ఒక్క నెలలోనే పంచదార ధరలు 20 శాతం పెరిగాయి.
ఆగస్టు 20న భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం కిలో చక్కెర ధర రీటైల్ మార్కెట్లో రూ. 55.7 పలికింది.
అదే నివేదిక ప్రకారం నెల రోజుల క్రితం పంచదార ధర 48.18 రూపాయలు. కాగా 2025 ఆగస్టు 20న చక్కెర ధర 46.3 రూపాయలు ఉంది.
పంచదార ధరలు ఇంతకు ముందెప్పుడూ ఇంత రేటు పలకలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో 2026లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయన్న అంచనా కూడా ప్రస్తుతం చక్కెర ధరలపై ప్రభావం చూపుతోందని వారు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో చెరుకు సాగు గత ఏడాదితో సమానంగా జరిగింది. ఇది గత ఐదేళ్ల సగటు సాగు విస్తీర్ణం కంటే దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు ఎక్కువ.
జన్మాష్టమితో మొదలయ్యే పండుగ సీజన్ దగ్గర పడుతుండడంతో పెరుగుతున్న పంచదార ధరలను అరికట్టడానికి ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో పాటు టోకు వ్యాపారులు నిల్వ ఉంచుకునే చక్కెర పరిమాణంపైనా పరిమితులను విధించింది.
ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ధరల పెరుగుదలలో ఎల్‌నినో ప్రభావమెంత?
భారత్‌లో చెరకుతో చక్కెరను ఉత్పత్తి చేసే 703 షుగర్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 335 ప్రైవేటువి, 325 సహకార రంగంలోనడిచేవి, 43 ప్రభుత్వ రంగానికి చెందినవి.
భారత్‌లో పంచదార సంవత్సరం అక్టోబరులో ప్రారంభమై, మరుసటి సంవత్సరం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. 2025-26 చక్కెర సంవత్సరంలో దేశంలో చక్కెర ఉత్పత్తి 32 బిలియన్ కిలోలుగా అంచనా వేయగా, వాస్తవ ఉత్పత్తి సుమారు 30 బిలియన్ కేజీలని చక్కెర మిల్లులకు ప్రాతినిధ్యం వహించే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు కేతన్ పటేల్ చెప్పారు.
"గత ఏడాది నమోదైన అధిక వర్షపాతం చెరకు పంటపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే అధిక దిగుబడినిచ్చే కో-0238 రకం చెరకు రకం ఉత్తరప్రదేశ్‌లో తుప్పు తెగులు బారిన పడింది.
ఈ రెండు కారణాల వల్ల చెరకు ఉత్పత్తి, అలాగే షుగర్ రికవరీ రేటు (100 కిలోల చెరకు నుంచి లభించే చక్కెర పరిమాణం) 12 కిలోల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో పంచదార ఉత్పత్తి అంచనాకంటే తక్కువగా ఉంది" అని అన్నారు.
భారత్‌లో పంచదార వినియోగం 26 నుంచి 28 బిలియన్ కిలోల వరకు ఉంటుందని కేతన్ పటేల్ చెప్పారు. సాధారణంగా ఏడాది చివరికి ఆరు నుంచి ఏడు బిలియన్ కిలోల చక్కెర మిగులుతుందని కేతన్ పటేల్ తెలిపారు.
"2024-25 సంవత్సరం చివరికి ఎండింగ్ స్టాక్ ఐదు నుంచి ఐదున్నర బిలియన్ కేజీలు మాత్రమే ఉంది. దీంతో 2025-26 సంవత్సరం తక్కువ ప్రారంభ నిల్వతో (ఓపెనింగ్ స్టాక్) మొదలైంది. ఆ తర్వాత పంచదార ఉత్పత్తి కూడా అంచనా కన్నా కొంత తక్కువగా ఉంది.
ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని అంచనా. అయితే ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్న ఏకైక అంశం బలహీనమైన రుతుపవనాలు మాత్రమే కాదు. ప్రజలు పానిక్ కొనుగోళ్లు (భయాందోళనతో చేసే హడావిడి కొనుగోళ్లు) చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఒకవైపు పంచదార నిల్వలు తక్కువుండడం, పండుగ సీజన్ కావడం, వర్షాల గురించి ఆందోళనలు వంటివి ఉన్నాయి. మరోవైపు, వినియోగం ఎక్కువగా ఉంది. ఫలితంగా ధరలు పెరిగాయి" అని కేతన్ పటేల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పంచదార కొరత ఉందా?
దేశంలో పత్తి పరిశ్రమ తర్వాత చెరకు పరిశ్రమ రెండో అతిపెద్ద వ్యవసాయ పరిశ్రమ అని భారత్‌లోని ప్రైవేట్ చక్కెర మిల్లుల సంఘమైన ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెబ్సైట్ తెలిపింది.
భారత్‌లో ఏటా సగటున 55 లక్షల నుంచి 60 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నారని దీని ద్వారా సగటున 45 కోట్ల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని ఐఎస్ఎమ్ఏ తెలిపింది.
ఈ పరిశ్రమ ఐదు కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోందని ఐఎస్ఎంఏ వెల్లడించింది.
చక్కెర ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం ఏమనుకుంటోందో తెలుసుకోవడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ బాంభనియాను ఫోన్, మెసేజ్ ద్వారా సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఎలాంటి స్పందన లభించలేదు.
అయితే దేశంలో చక్కెర కొరత లేదని జూలై 28న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
"మిల్లుల దగ్గర చక్కెర ధరలలో ఇటీవలి పెరుగుదల ప్రస్తుత సరఫరా-డిమాండ్ పరిస్థితికి అనుగుణంగా లేదని ప్రభుత్వం గమనించింది. కొంతమంది వ్యాపారులు, డీలర్లు, మార్కెట్ మధ్యవర్తులు(ఇక్కడ దళారులు) పంచదార నిల్వ చేయడం, ఊహాగానాల ఆధారంగా వ్యాపారం చేయడం, నిజంగా పంచదారను రవాణా చేయకుండా కాగితాలపై మాత్రమే వ్యాపారం చేయడం ద్వారా మార్కెట్లో కొరత ఉన్నట్టుగా ఒక కృత్రిమ పరిస్థితిని సృష్టించడంలో భాగమైనట్టు గమనించింది. ఇలాంటి లావాదేవీల వల్ల ధరల హెచ్చుతగ్గులు ఏర్పడి మిల్లుల దగ్గర, రీటైల్ మార్కెట్లో చక్కెర ధరలు పెరిగాయి"
"దేశీయ వినియోగానికి అవసరమైన చక్కెర నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రభుత్వం వినియోగదారులకు హామీ ఇస్తోంది" అని ప్రభుత్వం తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
చక్కెర ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలను చక్కెర ఉత్పత్తికి ఆఫ్-సీజన్‌గా పరిగణిస్తారని, అయితే ఈ నెలల్లో పండుగల సీజన్ ఉండడంతోత ఏటా ఈ సమయంలో మార్కెట్ ధరలు పెరుగుతాయని కేతన్ పటేల్ అంటున్నారు.
"ప్రస్తుతం ధర 50 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి సీజన్లో సాధారణంగా ధర 38 రూపాయల నుంచి 42 రూపాయల మధ్యే ఉంటుంది. ఆ ధర వల్ల మిల్లులు రైతులకు సరైన లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని కూడా సకాలంలో చెల్లించలేవు. అందుకే కొంతమంది రైతులు చెరకు సాగును వదిలి, మూడు లేదా ఆరు నెలల్లో లాభాలు ఇచ్చే ఇతర పంటలకు మారారు.
మార్కెట్ ధరలు పెరగడం వల్ల మిల్లులకు ఒక ప్రయోజనం ఉంటుంది. వారి వద్ద ఉన్న నిల్వలు అమ్ముడవుతాయి. తద్వారా వారు రైతులకు ఎఫ్ఆర్పీని సకాలంలో చెల్లించగలుగుతాయి.
అక్టోబర్ నుంచి మార్కెట్లోకి కొత్త పంచదార రావడంతో ధరలు తగ్గుతాయి" అని కేతన్ పటేల్ చెప్పారు.
"మార్కెట్లో ప్రస్తుతం పంచదార కొరత లేదు. అలాగని చక్కెర నిల్వలూ భారీగా లేవు. పరిస్థితి ఎలా ఉందంటే మార్కెట్లోకి ఎంత పంచదార వస్తే అంతా వెంటనే అమ్ముడైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర నిల్వలు తక్కువగా ఉండటమే దీనికి కారణం'' అని బీబీసీతో సురేంద్రనగర్‌కు చెందిన ప్రముఖ చక్కెర వ్యాపారి ధనరాజ్ కైలా అన్నారు.
‘‘మూడు బిలియన్ కేజీల చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించారు. పెద్ద మొత్తంలో చక్కెరను ఎగుమతి కూడా చేశారు. దేశంలోని చక్కెర మార్కెట్‌కు కోటిన్నర మంది వినియోగదారులు ఉన్నప్పుడు ఒక ఏడాది కరువు పరిస్థితులున్నా ఇథనాల్ బ్లెండింగ్ వంటి కార్యక్రమాలు ప్రమాదకరంగా మారతాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు కురవవని, చక్కెర ధర మరింత పెరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఫలితంగా గతంలో ఐదు కేజీల చక్కెర కొనేవారు ఇప్పుడు 50 కేజీలు కొంటున్నారు. 50 కేజీలు కొనేవారు 100 కేజీలు అడుగుతున్నారు" అని కైలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చక్కెర మార్కెట్ చాలా పెద్దది’
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం మొదలైన వాటిని తయారుచేసే ముడి చమురు వినియోగంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ భారత్‌లో ఉపయోగించే ముడి చమురులో 80 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఈ దిగుమతులను తగ్గించడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, స్వయం సమృద్ధిని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడానికి 2018లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి సాధించాల్సి ఉండగా ప్రభుత్వం దీనిని 2025 జూలైలోనే పూర్తి చేసింది.
భారత్‌లో చక్కెర పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. చక్కెర మిల్లులు రైతుల నుంచి చెరకును కొనుగోలు చేసినందుకు చెల్లించాల్సిన చెరకు ఎఫ్ఆర్పీని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఏ చక్కెర మిల్లు నెలకు ఎంత పంచదారను అమ్మవచ్చో, ఎంత ఎగుమతి చేయవచ్చో లేదో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దేశంలో పెద్దమొత్తంలో ఇథనాల్ కొనుగోలు చేసేది కూడాప్రభుత్వమే. అందువల్ల ఇథనాల్ ధరను కూడా పరోక్షంగా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
2025-26 చక్కెర సంవత్సరంలో ఇథనాల్ తయారీకి మూడు బిలియన్ కిలోల చక్కెరను ఉపయోగించారని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఇది దేశంలోని మొత్తం చక్కెర ఉత్పత్తిలో దాదాపు పది శాతం.
చెరకు రసం నుంచి, అలాగే ఆ రసం నుంచి చక్కెర తయారుచేసే సమయంలో వచ్చే సిరప్, ఏ-హెవీ మొలాసిస్, బి-హెవీ మొలాసిస్, సి-హెవీ మొలాసిస్ తయారు చేయడానికి ఉపయోగించే సిరప్‌ల నుంచి కూడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఇథనాల్‌లో దాదాపు మూడోవంతు చెరుకు ద్వారానే తయారవుతోందని ఒక నివేదిక తెలిపింది.
"ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఒక ముఖ్యమైన కార్యక్రమం. దీనివల్ల చక్కెర మిల్లులకు నగదు లభిస్తుంది. అయితే చక్కెర ఉత్పత్తికే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించకుండా ప్రభుత్వం అడ్డుకోలేదని ఆరోపించడం తేలిక. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొదట చక్కెర ఉత్పత్తికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెరకు, చక్కెర ఉత్పత్తిని కచ్చితంగా అంచనా వేయడానికి ప్రస్తుతం సరైన పద్ధతి లేదా సాంకేతికత అందుబాటులో లేకపోవడమే సమస్య" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రముఖ చక్కెర కర్మాగారానికి చెందిన సీనియర్ అధికారి బీబీసీతో చెప్పారు.
''మనం చక్కెర మార్కెట్ ఎంత పెద్దదో కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరను మళ్లించడం వల్లే ఇప్పుడు పంచదార కొరత ఏర్పడిందని ఆరోపించలేం'' అని ఆ అధికారి చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























