ఫ్యూజీ పర్వతంపై కూల్ డ్రింక్, స్నాక్ ఇచ్చి ఏడేళ్ల కొడుకును ఒంటరిగా వదిలేసి ఇంకా పైకి వెళ్లిన తండ్రి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డాన్ సేల్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
జపాన్‌లో అత్యంత ఎత్తైన పర్వతంపై కేవలం ఒక కూల్‌డ్రింక్, స్నాక్ ఇచ్చి కొడుకును కొన్ని గంటలపాటు ఒంటరిగా వదిలేసిన తండ్రిని పోలీసులు మందలించారని స్థానిక మీడియా పేర్కొంది.
పొగమంచు కమ్ముకుని, వర్షం పడుతున్న వాతావరణంలో.. ఫ్యూజీ పర్వతంపై 2,000 మీటర్లకు (6,500 అడుగులు) పైగా ఎత్తులో ఓ బెంచ్ మీద ఆ ఏడేళ్ల పిల్లాడు కూర్చుని ఉండగా కొందరు చూశారు.
తాను అలసిపోయానని బాలుడు చెప్పడంతో, "ఇక్కడే ఆగు" అని చెప్పిన 48 ఏళ్ల తండ్రి, తన పెద్ద కొడుకుతో కలిసి పైకి ఎక్కడం కొనసాగించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
పర్వత శిఖరం వైపు వెళ్లే మార్గంలో ఆరో స్టేషన్ సమీపంలో బాలుడిని అక్కడున్న ‘మౌంటెయిన్ హట్’ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి మూడు గంటల నడక దూరంలో ఉండే ఎనిమిదో స్టేషన్‌లో బాలుడి తండ్రి ఉన్నట్లు గుర్తించారు.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 07:30 గంటలకు ఆ బాలుడు ఒంటరిగా ఉండటాన్ని సిబ్బంది చూశారు.

అనంతరం పైనున్న స్టేషన్ నుంచి తిరిగి వచ్చి కొడుకును కలుసుకున్న తండ్రిని అధికారులు తీవ్రంగా మందలించారు.
"కలిసి పర్వతం ఎక్కే ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చినా సరే, ఇలా పిల్లాడిని వదిలేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఒక అధికారి అతనికి చెప్పినట్లు 'జపాన్ టుడే' పేర్కొంది. తాను తీసుకున్న ఆ "తొందరపాటు" నిర్ణయానికి అతను క్షమాపణలు చెప్పారు.
ఆ కుటుంబం ఫ్యుజినోమియా మార్గంలో పర్వతారోహణ చేస్తోంది. పర్వతంపై ఐదో స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదేశానికి ప్రజా రవాణా ద్వారా చేరుకోవచ్చు.
అక్కడి నుంచి శిఖరాన్ని చేరుకోవడానికి సుమారు ఐదు గంటలు, కిందకు దిగడానికి మరో మూడు గంటలు పడుతుందని పర్వతారోహణ గైడ్‌లు చెబుతున్నారు.
క్రియాశీల అగ్నిపర్వతం
3,776 మీటర్ల (12,389 అడుగులు) ఎత్తులో ఉండే ఫ్యూజీ పర్వతంపై ఇటీవలి కాలంలో పలు పర్వతారోహణ ప్రమాదాలు జరిగాయి.
జులైలో ఈ మార్గంలో పర్వతం ఎక్కేందుకు ప్రయత్నిస్తూ కిందపడిన 99 ఏళ్ల వృద్ధురాలిని సహాయ సిబ్బంది రక్షించారు. ఆ ప్రమాదంలో ఆమె తుంటి, వీపు భాగాలకు గాయాలయ్యాయి.
గత ఏడాది, అధికారిక పర్వతారోహణ సీజన్ కాకుండా వేరే సమయంలో వెళ్లిన 27 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థి ఒకరిని నాలుగు రోజుల్లో రెండుసార్లు రక్షించాల్సి వచ్చింది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వెతుక్కుంటూ అతను మళ్లీ వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
టోక్యోకు నైరుతి దిశలో ఉన్న ఫ్యూజీ పర్వతం ఒక క్రియాశీల అగ్నిపర్వతం. దీనికి 2013లో ప్రపంచ వారసత్వ హోదా లభించింది.
ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది దీనిని అధిరోహిస్తారు. అయితే రద్దీని నివారించడానికి కొన్ని మార్గాల్లో రోజువారీ పరిమితులు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























