ఎరక్కపోయి దూరారు.. ఇరుక్కుపోయారు.. నగల దుకాణంలో దొంగతనానికి వెళ్లి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన దొంగలు

ఫొటో సోర్స్, Umargam Police Station
గుజరాత్‌లోని వల్సాడ్ జిల్లా ఉమర్‌గామ్‌లో జరిగిన ఒక దొంగతనం ఇప్పుడు చర్చనీయమవుతోంది.
సాధారణంగా పోలీసులను చూస్తే పారిపోయే దొంగలే.. తాము దొంగతనం చేస్తున్న నగల దుకాణం నుంచే ఏకంగా అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112కి ఫోన్ చేసి పోలీసులను పిలిచారు.
ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ‘బీబీసీ గుజరాతీ’ ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించింది. సాక్షులతో పాటు అధికారులతో మాట్లాడింది.
పోలీసు అధికారి అందించిన సమాచారం, ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. ఆగస్టు 19న జరిగిన ఈ దొంగతనం కేసులో ఆ 'దొంగలే' పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల నుంచి 18 వేల రూపాయల విలువైన నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ దొంగలే పోలీసులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?


ఫొటో సోర్స్, Apoorva Parekh
అసలేం జరిగింది?
ఈ ఘటన గురించి సాక్షి, కేసులో ఫిర్యాదుదారుడి స్నేహితుడైన ఆకాశ్ భాయ్ మాట్లాడుతూ, "మా ఇంటికి సమీపంలో బీజే జ్యువెలర్స్ అనే దుకాణాన్ని నా స్నేహితుడు మనీష్, ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. సరిగ్గా ఆ దుకాణం ఎదురుగా ఉండే స్నేహితుడు నిఖిల్ కాపడి, ఆయన సోదరుడు 19వ తేదీ అర్ధరాత్రి దాటాక నాకు, నా సోదరుడికి ఫోన్ చేశారు. ఇద్దరు దొంగలు ఎలక్ట్రిక్ కట్టర్‌తో తాళం కోసి దుకాణంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు" అన్నారు.
ఆకాష్ మాట్లాడుతూ.. "ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి దాటే వరకు నిఖిల్ మొబైల్ చూస్తూ ఉన్నాడు. తనకు పదేపదే కట్టర్ శబ్దం వినిపిస్తోందని అతను మాతో చెప్పాడు. అంత రాత్రి పూట ఎవరి ఇంట్లోనూ పని జరగదనే అనుమానం అతనికి వచ్చింది. దొంగలు కూడా చాలా జాగ్రత్తగా దుకాణం షట్టర్‌కు ఉన్న తాళాలను కోస్తున్నారని అతను చెప్పాడు. దొంగలు కాసేపు కట్టర్‌తో తాళం కోయడం, దాక్కోవడం, మళ్లీ వచ్చి కోయడం చేస్తున్నారు" అని చెప్పారు.
"ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎలక్ట్రిక్ కట్టర్‌తో పనిచేయడానికి వాళ్లు దుకాణానికి ఎదురుగా ఉన్న నిఖిల్ ఇంటి బయట ఉన్న మీటర్ నుంచే కరెంటు కనెక్షన్ తీసుకున్నారు. అలా కట్టర్‌ను ఉపయోగిస్తున్నారు" అన్నారు ఆకాశ్.
"ఆ కట్టర్ శబ్దం విని నిఖిల్ కిందకు రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా దొంగలు అతని ఇంటి బయటి తలుపు మూసేశారు. ఈ విషయం నిఖిల్ మాకు చెప్పడంతో మేం ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాం. అప్పటికే దొంగలు దుకాణంలోకి లోపలికి చొరబడ్డారు"
"లోపలికి వెళ్లాక వాళ్లు షట్టర్‌ను కొద్దిగా తెరిచి ఉంచారు. మేం చేరుకోగానే ముందుగా ఆ షట్టర్‌ను మూసేశాం. ఇదంతా 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది. అప్పటికే తెల్లవారుజాము సుమారు 3 గంటలైంది" అన్నారు ఆకాశ్.
"మేం ఫోన్‌లో పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించాం, కానీ కాల్ కలవలేదు"
"దీంతో నేను దగ్గర్లోని పోస్ట్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చాను. అయితే, అంతలోనే వేరే పోలీస్ వాహనం ఒకటి అక్కడికి చేరుకుంది" అని చెప్పారు ఆకాశ్.
"దుకాణం లోపల ఉన్న దొంగలే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోలీసులను పిలిపించారని అప్పుడు మాకు తెలిసింది" అన్నారాయన.
దొంగలు దుకాణంలోకి దూరాక ఆకాశ్ బృందం అక్కడకు వచ్చి షట్టర్ క్లోజ్ చేయడంతో లోపల ఉండిపోయిన దొంగలు బయటకు వచ్చే అవకాశం లేక చివరకు సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేశారు.

ఫొటో సోర్స్, Apoorva Parekh
పోలీసులు ఏమన్నారు?
ఈ మొత్తం ఘటన గురించి ఉమర్‌గామ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌డీ తువర్ బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ.. "దొంగలు దుకాణం లోపలి నుంచి ఫోన్ చేసి పోలీసులను పిలిపించారన్న మాట వాస్తవమే. అయితే, ఈ ఘటన గురించి స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు" అని తెలిపారు.
"దొంగలు దుకాణంలో ఇరుక్కుపోయారు. బయట స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దాంతో వారికి భయం వేసినట్లుంది. అందుకే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోలీసులను సంఘటనా స్థలానికి పిలిచారు" అని చెప్పారు.
"ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాం. మేం నిందితులను తనిఖీ చేసినప్పుడు వారి వద్ద బంగారు, వెండి నగలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఇక వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతాం" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌డీ తువర్ అన్నారు.
ఉమర్‌గామ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, నిందితులిద్దరూ (దినేష్ పాఠక్, విపిన్ పాఠక్) మహారాష్ట్రలో నివసిస్తున్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్.
ఇద్దరిపై బీఎన్ఎస్ 2023లోని సెక్షన్ 331 (4), 305 (ఎ), 54 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వారి న్యాయవాదిని సంప్రదించడానికి ప్రయత్నిస్తాం. వారి వాదన వచ్చాక ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























