విశాఖ: స్కూల్‌కెళ్లిన ఆరేళ్ల బాలుడు క్లాసురూములోనే మృతి, టీచర్ కొట్టినందుకేనని తల్లిదండ్రుల ఆరోపణ

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
(ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలు ఉంటాయి.)
విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి పాఠశాలలోనే ప్రాణాలు కోల్పోయారు.
హోంవర్క్ చేయలేదన్న కారణంతో బాలుడిని టీచర్ కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తరగతి గదిలోనే బాలుడు కుప్పకూలిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ తరగతి గదిలో అసలేం జరిగింది? బాలుడు ఎందుకు కుప్పకూలాడు? పాఠశాల సిబ్బంది వెంటనే ఏం చేశారు? పోలీసులు ఏమంటున్నారు?

బాలుడి మృతి, అసలేం జరిగిందంటే?
ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ ఎప్పటిలాగే గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు.
క్లాస్ టీచర్ (స్కూల్ యాజమాన్యం సదరు టీచర్ పేరు వెల్లడించలేదు) ఉదయం 11.30 నుంచి 12.00 గంటల మధ్యలో పిల్లలందరి హోం వర్క్స్ చెక్ చేస్తున్నారు. వరుస క్రమంలో ప్రణయ్ తేజ్ వంతు వచ్చింది.
హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో టీచర్ మందలిస్తున్న సమయంలోనే ప్రణయ్ తేజ్ టీచర్‌పైనే కుప్పకూలినట్లు సీసీటీవీ దృశ్యాలు చూపుతున్నాయి.

పాఠశాల సిబ్బంది వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. బాలుడి మృతికి ఉపాధ్యాయురాలి చర్యలే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
''ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అయితే బాలుడి మరణానికి కచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక, వైద్యుల నివేదికతోనే నిర్ధరణ కావాల్సి ఉంది'' అని విశాఖ వన్ టౌన్ పోలీసులు బీబీసీకి తెలిపారు.
హోంవర్క్ చేయలేదన్న కారణంతో బాలుడిని టీచర్ గట్టిగా మందలించి కొట్టారంటూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేజీహెచ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

టూర్ వెళ్లాం...అందుకే హోం వర్క్ పూర్తి చేయలేకపోయాడు: బాలుడి తండ్రి
కేజీహెచ్ మార్చురీ వద్ద తండ్రి గురువారం (20.08.26) బీబీసీతో మాట్లాడారు. ఆయన క్యాటరింగ్ చేస్తుంటారు. తల్లి గృహిణి.
"మేం దైవ దర్శనాల కోసం మూడు రోజులు టూర్ వెళ్లాం. ఆ కారణంగా మా బాబు స్కూల్‌కు వెళ్లలేదు. దాంతో అతడు ఆ మూడు రోజుల హోంవర్క్ పూర్తి చేయలేకపోయాడు. గురువారం హోం వర్క్ గురించి అడిగిన టీచర్, అది పూర్తి చేయకపోవడంతో బాబును మందలించి, కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. మేం టూర్ వెళ్లిన కారణంగానే హోంవర్క్ పూర్తి చేయలేకపోయాడు. ఆ కారణంతోనే టీచర్ కొట్టింది" అని బీబీసీతో కృష్ణప్రసాద్ చెప్పారు.
"బాలుడిని టీచర్ మందలిస్తుండగా...అక్కడే ఆ బాలుడు అచేతనంగా పడిపోయాడు. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి 'బ్రాట్ డెడ్'గా వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు చేపడతాం" అని బీబీసీతో విశాఖ ఆర్డీవో దిలీప్ చక్రవర్తి చెప్పారు.
ముందు ఆందోళన, తర్వాత కేసు వద్దని..
సంఘటన జరిగిన వెంటనే బాలుడిని స్కూల్ యాజమాన్యం సమీపంలోనే ఉన్న కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత తల్లిదండ్రులు అక్కడే అందోళనకు దిగారు.
ఆ తర్వాత మీడియా అక్కడికి చేరుకోవడం ఆందోళన తీవ్రత పెరగడంతో అధికారులు ఒక్కొక్కరుగా కేజీహెచ్ మార్చురీకి రావడం ప్రారంభమైంది. అదే సమయంలో స్కూల్ యాజమాన్యం తరఫున కొందరు అక్కడికి వచ్చారు. వీరంతా తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడే ఉన్న పోలీసులు తల్లిదండ్రులను కేసు నమోదు కోసం సంప్రదించారు. కానీ, తల్లిదండ్రులు తమకు ఎటువంటి కేసు వద్దని, తమ బాబు మృతదేహాన్ని ఇస్తే చాలంటూ పోలీసులను వారించారు. దాంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. మీడియాను కూడా తల్లిదండ్రులు దూరం పెట్టారు.

ఫొటో సోర్స్, UGC
లోకేశ్ ట్వీట్‌తో...
సాయంత్రం 6.31 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 'ఎక్స్' వేదికగా చిన్నారి మృతి సంఘటపై స్పందించారు.
విశాఖపట్నంలో ఓ స్కూల్‌లో చిన్నారి మరణించడం విచారకరమని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తన ఎక్స్ పోస్ట్‌లో లోకేశ్ అన్నారు.
‘‘ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలి. వారు కోల్పోయిన బిడ్డను ఎవరూ తిరిగి తీసుకురాలేరు. వారి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేదు. ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా ఉంటుంది" అని తన పోస్టులో రాశారు.
ఆ తర్వాత తల్లిదండ్రులు నుంచి పోలీసులు కేసు నమోదు చేశారు.

పాథాలజీ రిపోర్ట్ అడిగాం: పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేశారా? అని విశాఖ మహారాణిపేటలోని వన్ టౌన్ పోలీసులను బీబీసీ శుక్రవారం ఉదయం ప్రశ్నించింది.
"ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులు కేజీహెచ్ వద్దకు వచ్చి స్కూల్ పై, అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.
ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. అందులో కనిస్తున్న దృశ్యాలు, మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనుమానాస్పద మృతి (బీఎన్ఎస్ ఎస్ 2023లో సెక్షన్ 194) కింద కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పాథాలజీ రిపోర్టు అడిగాం.
ఆ తర్వాత పోస్టు మార్టం నివేదిక వస్తే దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్తాం. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేయమని డిమాండ్ చేసిన తల్లిదండ్రులు, సాయంత్రానికి కేసు వద్దన్నారు. కాకపోతే పోలీసులుగా చట్టప్రకారం ఘటన జరిగిన తర్వాత అక్కడేం జరిగింది? అనే విషయంపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం" అని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

టీచర్ కొట్టినట్లు కనిపిస్తోంది: డీఈవో ప్రేమ్ కుమార్
ఈ ఘటనపై బీబీబీతో డీఈవో ప్రేమ్ కుమార్ మాట్లాడారు.
"ఆ స్కూల్‌లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. దానిలో ఉపాధ్యాయురాలు బాలుడితో కోపంగా మాట్లాడుతున్నట్లు ఉంది. అలాగే ఒకసారి చెంపపైన కొట్టినట్లుగా కనపడుతోంది.
భయం వల్ల , కొట్టడం వలన ఆ బాలుడు మరణించాడా? ఇంకేమైనా ఇతర ఆరోగ్య కారణాలున్నాయా అనే అంశంపై పోస్ట్ మార్టం నివేదిక కోసం చూస్తున్నాం.
అది రాగానే అధికారులకు వివరణాత్మక నివేదిక పంపి టీచర్, స్కూల్ మేనేజ్‌మెంట్‌పై చర్యలు తీసుకుంటాం" అని విశాఖపట్నం డీఈవో ప్రేమ్ కుమార్ బీబీసీకి తెలిపారు.

పోస్టుమార్టం రిపోర్టే కీలకం...
పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి కారణాలు తెలుస్తాయని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. అందులో భాగంగా పాథాలజీ రిపోర్టుని అడిగామని వారు చెప్పారు.
సహజంగా అనుమానాస్పద మృతి కేసుల్లో (సెక్షన్ 194 BNSS కింద) పోలీసులు విచారణ బాధ్యత తీసుకున్నాక...పోలీసుల అభ్యర్థన మేరకు వైద్యులు/ఫోరెన్సిక్/పాథాలజీ నిపుణులు మృతదేహాన్ని పరీక్షించి, నమూనాలు సేకరిస్తారు.
ఆ నమూనాలను పోలీసులే సంబంధిత ఫోరెన్సిక్/పాథాలజీ ల్యాబ్‌కు పంపిస్తారు. దీనిపై రిపోర్టు వచ్చిన తర్వాత పోస్టుమార్టం రిపోర్టుని తయారు చేసి నివేదికను అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా ఈ సమయం ఆధారపడి ఉంటుందన్నారు.
"ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే బాలుడి మృతికి కచ్చితమైన కారణాలు (భయం వల్ల గుండె ఆగిపోవడం, భౌతిక దాడి వల్ల గాయాలు, ఇతర కారణాలు) తెలుస్తాయి. పిల్లాడి ఒంటిపై ఏమైనా గాయాలున్నాయా? ఆకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా? ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు పాథాలజీ రిపోర్ట్ అడిగాం. రిపోర్టు వచ్చాక దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తాం" అని సీఐ వరప్రసాద్ బీబీసీతో చెప్పారు.
దురదృష్టకర ఘటన: పల్లా శ్రీనివాసరావు
ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
"ఈ ఘటనపై పూర్తి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అయితే నా అభిప్రాయం ప్రకారం… ఇది దురదృష్టకరమైన ఘటన. ముందుగానే ఏవేవో నిర్ధరణలకు రాకుండా ఉండాలి.
తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల్లో శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కదలకుండా ఉండే అలవాట్లు గుండె సంబంధిత సమస్యలకు ఒక కారణంగా మారవచ్చు. అందుకే పిల్లలను ఆటస్థలాలకు తీసుకెళ్లి, ఆడుకునేలా చేయాలి" అని ఆయన సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































