గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''

- రచయిత, అకిసా వాండెరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
పశ్చిమ కెన్యాలోని ఓ మారుమూల గ్రామంలో మేకల కాపరికి బంగారపు ముక్క దొరికింది.
దీంతో ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బంగారం కోసం ఎగబడ్డారని ఆయన బీబీసీతో చెప్పారు.
చెపొరోర్ గ్రామానికి చెందిన మనస్సే లోమాచర్ (33) కొన్ని వారాల కిందట తనకు దొరికిన మూడు గ్రాముల బంగారపు ముక్కను 36,000 కెన్యా షిల్లింగులకు (రూ.26,615) అమ్మారు.
ఈ విషయం తెలిసిన తర్వాతే వేలమంది తమ గ్రామానికి తరలివచ్చారని ఆయన భావిస్తున్నారు.
నెలరోజుల కిందటి వరకు పొదలు, పశువుల మేత మైదానాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు పెద్ద గుంతలు, మట్టి దిబ్బలు, తాత్కాలిక మైనింగ్ క్యాంపులతో నిండిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.


ఫొటో సోర్స్, Edwin Naitale / BBC
బంగారం కోసం పోటెత్తిన జనం..
లోమాచర్కు బంగారం దొరకడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా లేక ఇటీవల గుర్తించిన ఇతర అంశాలు కారణమా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
బంగారం కోసం వెదుకులాట తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దాదాపు 10వేల మంది ఇక్కడకు వచ్చారని స్థానిక అధికారులు చెప్పారు.
కెన్యా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు సరైన ఆదాయం లభించడం లేదు. ఇక్కడ బంగారం కోసం వెదుకుతున్న కెన్యా, ఉగాండా ప్రజలకు చిన్న ముక్క దొరికినా వారి భవిష్యత్ మారిపోతుంది.

ఫొటో సోర్స్, Edwin Naitale / BBC
"బంగారం దొరికితే స్కూలు ఫీజులు కడతా"
ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్పడప్పుడు బంగారం కోసం వెదుకుతూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో బంగారం దొరకడం చాలా అరుదు.
బంగారం ముక్క తనకు యాదృచ్ఛికంగానే దొరికిందని లోమాచర్ చెప్పారు.
తప్పిపోయిన మేక కోసం వెతుకుతుండగా నదీ తీరంలో కొందరు మహిళలు మట్టిని జల్లెడ పడుతూ ఆయనకు కనిపించారు.
"నేను కూడా వారితో కలిశా. అలా ఈ ప్రాంతంలో బంగారం ఉందనే విషయం మా గ్రామానికి తెలిసింది" అని ఆయన చెప్పారు.
పొరుగున ఉన్న నపావోయ్ గ్రామానికి చెందిన రైతు, పశువుల కాపరి పాట్రిక్ లోకోలియా తన కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సంపాదించాలనే ఆశతో బంగారాన్ని వెదికే పనిలో పడ్డారు.
"నా పిల్లలు చదువుకుంటున్నారు. వారి స్కూల్ ఫీజులు చెల్లించడం నాకు పెద్ద సమస్యగా మారింది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
బంగారం కోసం తవ్వకాల్లో అంతకు ముందుకు తనకు ఎలాంటి అనుభవం లేదని చెపారోర్ దగ్గర్లో ఉన్న జిల్లా నుంచి వచ్చిన 18 ఏళ్ల అబిగైల్ చెలెంగాట్ చెప్పారు.
తన స్కూల్ ఫీజులతో పాటు తమ్ముళ్లు, చెల్లెళ్ల చదువు కోసం బంగారం దొరుకుతుందనే ఆశతో ఇక్కడకు వచ్చానని ఆమె అన్నారు.
ఆమె వెనుక వందల మంది ఒకరికొకరు తోడుగా పారలు, గునపాలతో రాతి నేలను తవ్వుతూ కనిపించారు.
వాళ్లు తవ్విన మట్టిని కొంతమంది దగ్గరలో ఉన్న ఒక నది వద్దకు తీసుకెళుతున్నారు. అక్కడ మురికి నీళ్లలో కూర్చున్న మహిళలు ఆ మట్టిని కడుగుతున్నారు. అందులో బంగారం ముక్కలు దొరకవచ్చని వారి ఆశ.
మట్టిని తవ్వే పనిలో అనుభవం ఉన్నవాళ్లు గుంతల్లోకి దిగి మట్టిని తవ్వుతూ, రాళ్లు పగలగొడుతూ అన్వేషణ కొనసాగిస్తున్నారు.
లోమాచర్ లాగా శ్రమించి విజయం సాధించిన వారి కథలు ఇక్కడ మిగిలిన వారిలో ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి.
ఆ రెండు సంఘటనలు
బంగారం విషయంలో రెండు సంఘటనల తర్వాతే ఈ హడావుడి మొదలై ఉండవచ్చని వెస్ట్ పోకోట్ కౌంటీ డిప్యూటీ కమిషనర్ శామ్యూల్ కియారీ భావిస్తున్నారు.
"కొంతమంది యువకులకు పెద్ద మొత్తంలో బంగారం లాంటిది దొరికింది. మరుసటి రోజే అదే ప్రాంతంలో మహిళలకు కూడా భారీగా బంగారం లభించింది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
నది తీరంలో మహిళలు ఏళ్ల తరబడి కొద్దిపాటి అల్లూవియల్ (నది ద్వారా కొట్టుకొచ్చిన) బంగారాన్ని కనుగొంటూనే ఉన్నారని దీని ద్వారా వారు వారానికి రూ. 6 వేల నుంచి రూ.25 వేలు సంపాదిస్తారని కియారీ వివరించారు.
అయితే ఆగస్టు ప్రారంభంలో బంగారం కొంచెం పెద్ద ముక్కలుగా దొరకడంతో అనేక మంది ఇక్కడకు రావడం మొదలు పెట్టారు.
దొరికిన బంగారం గురించి వదంతులు వ్యాపించడంతో మట్టిని తవ్వడంలో గతంలో ఎలాంటి అనుభవం లేని వాళ్లు కూడా బంగారం మీద ఆశతో ఇక్కడకు భారీగా తరలి వస్తున్నారు.
తొలినాళ్ల రద్దీతో పోలిస్తే ప్రస్తుతం కొందరు ఈ పని మానేశారు. ఇప్పుడు బంగారం కోసం వెదికే వారి సంఖ్య దాదాపు 25 వందలకు పడిపోయింది.
ఇక్కడ బంగారం దొరికిందనే దానిపై ఎలాంటి సందేహం లేకున్నా, భూమిలో బంగారం నిక్షేపాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి? వాణిజ్య పరంగా అవి లాభదాయకమేనా అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.
"తమ వద్దకు రోజూ దాదాపు 100 మంది వస్తున్నారని చిన్న తరహా బంగారు వ్యాపారులు మాతో చెప్పారు. అయితే వారికి దొరికిందంతా నిజంగా బంగారమా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు" అని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.
ఇక్కడ మట్టి దిబ్బల్లో దొరికిన బంగారం విలువ కొన్ని వందల కెన్యా షిల్లింగుల నుంచి గరిష్ఠంగా 78వేల షిల్లింగులు ( రూ. 48 వేలు) ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

చిన్న గ్రామంలో కొత్త వ్యాపారాలు
వెస్ట్ పోకోట్ కౌంటీ పక్కనే ఉగాండా ఉంది. సరిహద్దుకు అటు ఇటు ఉన్న ప్రజల మధ్య చాలా కాలంగా సామాజిక, కుటుంబ సంబంధాలున్నాయి.
తూర్పు ఉగాండాలోని బుసియాకు చెందిన ముగిషా గాడ్ఫ్రే తన స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకుని చెపొరోర్కు వచ్చారు. ఆయనకు ఖనిజాల తవ్వకంలో అనుభవం ఉంది.
ఇక్కడ బంగారం దొరికిందనే సమాచారం తెలిసిన తర్వాత లక్ష ఉగాండా షిల్లింగులు (రూ.2400) ఖర్చు చేసి ఇక్కడకు చేరుకున్నారు.
అయితే చెపారోర్లో ప్రజల పరిస్థితులు అస్సలు బాగాలేవని ఆయన చెప్పారు.
"మేము చెట్ల కిందే నిద్రపోతాం. తెల్లారగానే పని మొదలు పెడతాం. కొన్నిసార్లు రేయింబపవళ్లు తేడా లేకుండా కష్టపడతాం" అని బీబీసీతో గాడ్ఫ్రే చెప్పారు.
ఇప్పటివరకు ఆయనకు ఏమీ దొరకలేదు. అయినా ఆయన నిరాశ చెందడం లేదు.
"ఏదైనా దొరికితే తప్ప మేము తిరిగి వెళ్లలేం. మాకు కావలసినది దొరికిన తర్వాతే ఇంటికెళతాం" అని ఆయన అన్నారు.
కొంతమందికి బంగారం కోసం తవ్వకాలు జరపాల్సిన అవసరం లేకుండానే కొత్త అవకాశాలు లభించాయి.
గ్రామానికి కొత్తగా వస్తున్న వారికి ఆహారం, నీరు, ఇతర నిత్యవసరాలను అమ్మేందుకు ఈ ప్రాంతం చుట్టూ 200కి పైగా షాపులు పుట్టుకొచ్చాయని స్థానిక అధికారులు చెప్పారు.
ఇక్కడ షాపు పెట్టేందుకు ఐరీన్ అమేజా పక్కనే ఉన్న బారింగో కౌంటీ నుంచి వచ్చారు. ఆమె తన షాపులో బాటిల్ వాటర్, కూల్ డ్రింక్స్, బ్రెడ్, పాలు, ఇతర ఆహార పదార్థాలు అమ్ముతున్నారు.
"ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు నా వ్యాపారాన్ని కొనసాగించడానికి, దాన్ని మరింత విస్తరించడానికి అవసరమైనంత డబ్బు సంపాదించగలనని అనుకుంటున్నా" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Edwin Naitale / BBC
పోలీస్ పెట్రోలింగ్
ఈ ప్రాంతానికి వస్తున్న ప్రజల అవసరాలకు తగినట్లు ఇక్కడ వసతులు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
"ఇది అడవి ప్రాంతం. పైగా కొండల మధ్య ఉంది. మాకు స్నానం చేయడానికి, కనీసం తాగడానికి కూడా స్వచ్ఛమైన నీరు లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చీకటి పడిన తర్వాత మహిళలకు సమస్యలు పెరుగుతాయని ఆమె అన్నారు.
"ఇక్కడ నిద్రపోయే వారిలో ఎక్కువ మంది పురుషులే కావడంతో, మహిళలు సురక్షితమైన స్థలాన్ని వెతుక్కోవాల్సి వస్తోంది" అని అమేజా చెప్పారు.
కనీస మౌలిక సదుపాయాలు, పైపుల ద్వారా నీటి సరఫరా, సరైన పారిశుధ్యం లేని ఈ ప్రాంతానికి కొత్తగా వస్తున్న జనాభా వల్ల ఒత్తిడి విపరీతంగా పెరిగిందని స్థానిక అధికారులు అంగీకరిస్తున్నారు.
పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా చూడటానికి ప్రజారోగ్య అధికారులను రంగంలోకి దించారు.
లైంగిక దాడుల ఆందోళనలు, మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ పెట్రోలింగ్ పెంచినట్లు అధికారులు తెలిపారు.
సెప్టెంబరులో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో పిల్లలు కూడా ఈ మైనింగ్ కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత విద్యార్థులు మైనింగ్ సైట్లలో ఉండకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Edwin Naitale / BBC
మట్టిలో బంగారం ఎంత ఉంది?
బంగారం కోసం వెదుకుతున్న వారు ఇప్పుడు మరింత లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు.
మైనింగ్ ద్వారా సేకరించిన మట్టిని ప్రాసెసింగ్ కోసం సమీపంలోని ఒర్టుమ్ పట్టణానికి ఇప్పటికే పలు ట్రక్కులలో తరలించారు.
అధికారులు ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఫలితాలు వచ్చే వరకు ఇక్కడి మైనింగ్ పరిమాణం, వాణిజ్యపరంగా దాని మనుగడపై అనిశ్చితి ఉంటుంది.
అయితే మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేయడం కాకుండా క్రమబద్ధీకరించడమే దీనికి పరిష్కారమని లోమాచర్ భావిస్తున్నారు.
స్థానికంగా బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వాళ్లు సురక్షిత, సమర్థవంతమైన పద్ధతుల్లో బంగారాన్ని కనుగొని వెలికితీయడానికి ప్రభుత్వం సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
"మా ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఇతర ఖనిజాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మెటల్ డిటెక్టర్ల వంటి పరికరాలను అందించి ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుతున్నాం" అని ఆయన అన్నారు.
గ్రామంలో పేదరికానికి నిదర్శనంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఆయన చూపించారు.
"చుట్టూ చూస్తే, రేకుల కప్పులు ఉన్న ఇళ్లు దాదాపు ఎక్కడా కనిపించవు. చాలా వరకు గడ్డిపాకలే" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























