పిఠాపురం ఏఈ కుటుంబం మృతి కేసు: ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయిన సాదిక్‌ను కాకినాడ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

ఫొటో సోర్స్, x.com/ Kakinada District Police
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.
ఆగస్ట్ 24న సోమవారం కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ... ఏఈ నూకరాజు రాసిన మరణవాంగ్మూలంతో పాటు ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖ, సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాదిక్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు.
సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మృతికి కారణాలు, మతం మారాలనే ఒత్తిడి, బ్లాక్ మెయిలింగ్, మృతులపై నిందితుడు పాల్పడిన బెదిరింపులు తదితర అంశాలపై ఇంకా సమగ్ర దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని ఎస్పీ వివరించారు.

ఆత్మహత్యల నుంచి హత్య కేసు వరకు.. అసలేం జరిగిందంటే
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్ కొల్లిపూడి నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఆగస్ట్ 16న రాత్రి 11.30గంటలకు రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించారు.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
మనవడు పదేళ్ల కార్తీకేయ రెడ్డికి ఈత రావడంతో పాటు సమీపంలోని మత్స్యకారులు రక్షించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డారు.
మిగతా ముగ్గురు గల్లంతు కాగా 19వ తేదీన నూకరాజు మృతదేహం లభ్యమైందని, అనంతరం మిగతా ఇద్దరి మృతదేహాలు దొరికాయని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రాజమండ్రి టూటౌన్ సర్కిల్ ఇనస్పెక్టర్ గణేశ్ బీబీసీకి తెలిపారు.
నూకరాజు 16వ తేదీ రాత్రి ఆత్మహత్య ప్రయత్నానికి ముందు 11.27నిమిషాలకు ఆయన రాసిన సూసైడ్ లెటర్‌ను తన తోటి అధికారులు ఉన్న వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారని సీఐ తెలిపారు.
కాకినాడ జిల్లా కలెక్టర్‌కు రాసిన ఆ లేఖలో.. కాకినాడ షూటింగ్ స్పోర్ట్ అకాడమీ ఫౌండర్, కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు పేర్కొన్నారని సీఐ చెప్పారు.
తన అల్లుడు ఈ ఏడాది జూలై 2న మరణించారని, అప్పటినుంచి కుమార్తెను సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని, అతని కారణంగా తన కుమార్తెకు, మనవడికి ప్రాణహాని ఉందన్న మనస్థాపంతో చనిపోతున్నట్లు లెటర్‌లో ఏఈ నూకరాజు పేర్కొన్నారని సీఐ గణేశ్ వివరించారు.

ఫొటో సోర్స్, UGC
ఆ తర్వాత బయటపడిన సౌజన్య రాసిన లేఖ
16వ తేదీన నూకరాజు రాసిన లేఖ బయటపడగా, ఆ తర్వాత 17వ తేదీన నూకరాజు కుమార్తె రాసిన లేఖ ఆమె టూవీలర్‌లో దొరికందని, అందులో తమ పరిస్థితికి కారణం సాదిక్ ఖాన్ అంటూ స్పష్టం రాసి ఉందని సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి కాకినాడ సమీపంలోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి ఈ ఏడాది జూలై 2వ తేదీన మరణించారని, ఆయన కూడా సాదిక్ వేధింపులతోనే చనిపోయారంటూ తాజాగా సౌజన్య రాసిన లేఖ దొరికిందని భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు అప్పుడు బీబీసీతో మాట్లాడిన భాస్కర్‌రెడ్డి .. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి మరణంలోనూ సాధిక్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
'ఈ ఏడాది జూలై రెండవ తేదీన నా కొడుకు చనిపోయాడు.. అప్పుడు అది సహజ మరణమే అనుకున్నాం కానీ. నా కోడలు, మనవడు, వియ్యంకుడు భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించగా మనవడు కార్తీక్ రెడ్డి మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. మనవడు చెప్పిన వివరాల ప్రకారం కోడలు సౌజన్య బండిలో మూడు కవర్లు ఉన్నాయి. వాటిని పోలీసుల సమక్షంలోనే తీసి చూడగా తన కుమారుడు అయిన జగదీశ్వర్ రెడ్డికి ఏదో మందులు ఇచ్చి సాధిక్ చంపినట్లు సౌజన్య రాసిన లెటర్లో ఉంది' అని భాస్కర్‌రెడ్డి తెలిపారు.
అలాగే తన కోడలు సౌజన్య ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసినట్లు, అతనికి సహకరించకపోతే నూకరాజు కుటుంబాన్ని మొత్తం చంపుతానని బెదిరించినట్లు ఆ లేఖలో రాసి ఉందని ఆయన చెప్పారు.
దాంతో తన కుమారుడి మరణంపై అనుమానం వచ్చి దర్యాప్తు చేయాలని కోరానని భాస్కర్‌రెడ్డి తెలిపారు.
భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా అప్పటికే సాదిక్ పరారయ్యాడని ఐదురోజుల కిందటే పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి తిరుగుతున్న లేఖల గురించి తాము ఏం చెప్పలేమనీ తమ దగ్గర ఉన్న పక్కా ఆధారాల మేరకు ఛార్జ్‌షీట్ వేస్తామని ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
యూపీలోని మేరఠ్‌లో ఎలా పట్టుకున్నారంటే
ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పదిమంది పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు.
ఈ నెల 16వ తేదీన పరారైన సాదిక్‌ను 22వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు.
'నిందితుడు సాదిక్ ఖాన్ ఈ ఘటన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చాలా ఎత్తులు వేశాడు. ట్రేస్ చేయకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లు వాడలేదు. అతన్ని పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించాం. ఐదు రాష్ట్రాల్లో గాలించాం. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో సాదిక్‌ఖాన్‌ను అరెస్ట్ చేశాం. అతన్ని పట్టుకునేందుకు మా బృందాలు చాలా కష్టపడ్డాయి' అని ఎస్పీ బిందుమాధవ్ వివరించారు.
ఎలా పట్టుకున్నారనే వివరాలను సిట్‌లోని సభ్యుడైన ఓ పోలీసు అధికారి బీబీసీకి వివరించారు.
''ఈనెల 16వ తేదీన రాత్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం తెలుసుకున్న సాదిక్ వెంటనే అదే రోజు రాత్రి 12.45గంటలకు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఫోన్లు. సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు అన్నీ కాకినాడలోనే వదిలేసి రైలు ఎక్కారు.
రైల్లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని తన కుటుంబసభ్యురాలికి ఫోన్ చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఆ కుటుంబసభ్యురాలి ఫోన్ ట్రాక్ చేసి.. ఏ ఫోన్ నుంచి సాదిక్ కాల్ చేశారో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తి తనకు సాదిక్ ఎవరో తెలియదని రైల్లో పరిచయమని, అతను రైలు మధ్యలోనే కర్టాటకలో ఓ రైల్వే స్టేషన్‌లో దిగిపోయాడని చెప్పారు.
ఆ తర్వాత సాదిక్ అక్కడి నుంచి షోలాపూర్ వెళ్లి అక్కడ లాడ్జి తీసుకుని ఒక రోజు ఉండి.. ఆపై ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. పోలీసులు ముందస్తుగానే అతని స్నేహితులను విచారించిన నేపథ్యంలో సాదిక్ మేరఠ్ వెళ్లగానే పోలీసులకు తెలిసింది.
దీంతో ప్రత్యేక బృందం స్థానిక పోలీసుల సహకారంతో ఆగస్టు 22వ తేదీన నౌచండీ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు'' అని ఆ అధికారి బీబీసీకి వివరించారు.
అక్కడ సాదిక్‌ను అరెస్ట్ చేసిన అనంతరం నిందితుడిని మేరఠ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని కాకినాడ తీసుకొచ్చి కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించినట్టు సర్పవరం సీఐ ప్రకాష్ బీబీసీకి వెల్లడించారు.
దీంతో అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించామని, కేసులో కీలక విషయాలు, సంచలన ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు రాబట్టేందుకు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయాల్సి ఉందని సీఐ తెలిపారు.
అంతకు ముందు మీడియా సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ.. నిందితుడిని కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































