సంప్రదాయ వైద్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌లో పెద్ద యుద్ధమే చేస్తున్న ఈ వైరల్ లివర్ డాక్టర్ గురించి తెలుసా..

కేరళ, లివర్ డాక్టర్, ఫిలిప్స్, సంప్రదాయ వైద్యంపై పోరాటం

ఫొటో సోర్స్, Arun Chandra Bose

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఫిలిప్స్ తన రోగులకు వ్యాధి వివరాలను, తదుపరి చికిత్సా విధానాన్ని అర్థమయ్యేలా చెబుతారు.
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ హెపటాలజీ క్లినిక్ వెలుపల ఉన్న వెయిటింగ్ రూమ్‌లో.. ఆశ నిరాశల మధ్య ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది.

లివర్(కాలేయ) వ్యాధి ముదిరిపోయి, అత్యవసర చికిత్స కోసం వచ్చిన ఒకాయన నీరసంగా నేలవైపు చూస్తూ కూర్చున్నారు. పక్కనే మరో కుటుంబం పాత మెడికల్ రిపోర్టుల ఫైల్‌ను గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఈ హాస్పిటల్ అయినా తమ వారిని కాపాడుతుందని నమ్మకంతో కూర్చున్నారు.

లోపల, డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు.

ఆయన ముందు ఒక రోగి కూర్చుని ఉన్నారు. ఫిలిప్స్ ముందుకు వంగి, ఒక ప్రశ్న అడిగి నిశ్శబ్దంగా ఉండిపోయారు. రోగి చెప్పే మాటలను ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆపై పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు చెప్తూనే, ఎంతో కరుణతో మాట్లాడారు. తదుపరి ఏం చేయాలో కేవలం పైపైన చెప్పి వదిలేయకుండా, ముందున్న కష్టసుఖాలను ఆ కుటుంబానికి వివరంగా అర్థమయ్యేలా చెప్పారు.

కేరళలోని ఆయన క్లినిక్‌లో నేను రెండు రోజులు గడిపాను. అక్కడ నేను ఒక భిన్నమైన వ్యక్తిని చూసేందుకు ఉన్నాను.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వివాదాల డాక్టర్

ఆన్‌లైన్ ప్రపంచంలో ఫిలిప్స్...భారతదేశంలో భారీ ప్రజాదరణతోపాటు, వ్యతిరేకతను కూడా కూడగట్టుకున్న వైద్యుల్లో ఒకరు. ఆధార సహిత వైద్య విధానం (ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్) తరఫున గట్టిగా వాదించి నిలబడే ఒక సాహస వీరుడిగా అభిమానులు ఆయన్ను కొనియాడితే, విమర్శకులు మాత్రం ఆయన్ను ప్రచారం కోరుకునే వివాదాస్పద వ్యక్తిగా చూస్తారు.

ఫిలిప్స్‌కు 'లివర్ డాక్' పేరుతో 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ఉంది. అందులో ఆయన హోమియోపతిని 'తప్పుడు వైద్యం'గా కొట్టిపారేశారు. ప్రత్యామ్నాయ వైద్యం( ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, మొక్కల నుంచి తీసిన ఔషధాలను వాడి చేసే వైద్యం) వైద్యులను నకిలీలుగా ముద్ర వేశారు. తనను విమర్శించేవాళ్లవి అద్దె మెదళ్లని అన్నారు.

ఫిలిప్స్‌కు భారతీయ వైద్య విధానాల గురించి అవగాహన లేదని, తమపై కావాలనే దాడి చేస్తున్నారని ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైద్యులు ఆరోపిస్తున్నారు.

ఆయన సోషల్ మీడియా ఖాతా నిండా ప్రజారోగ్య సమాచారం కనిపిస్తుంది. అలాగే సెలబ్రిటీలతో సహా ఇతరులతో పెట్టుకున్న వివాదాలూ ఉంటాయి. చాలామంది ఆయన శైలిని మొరటుగా అభివర్ణిస్తారు.

కేరళ, లివర్ డాక్టర్, సిరియాక్ అబ్బి ఫిలిప్స్, సంప్రదాయ వైద్యంపై పోరాటం

ఫొటో సోర్స్, Arun Chandra Bose

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో విక్రయించే ప్రోటీన్ పౌడర్ల నాణ్యతపై ప్రజల నుంచి నిధులు సేకరించి మరీ డాక్టర్ ఫిలిప్స్ పరిశోధనలు చేశారు.

ప్రభుత్వాల నిఘా.. కోర్టు కేసులు

సంప్రదాయ వైద్య విభాగాలను పర్యవేక్షించే కేంద్ర ఆయుష్ శాఖ.. కేవలం ఈయన గురించి చర్చించడానికి రెండుసార్లు అధికారిక కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఒక సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి ఈయన్ను ప్రశ్నించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ రెండు రోజుల పాటు రైల్లో ప్రయాణించి మరీ వచ్చారు. గత ఆరేళ్లలో ఫిలిప్స్ 16 కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో కొన్ని ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి.

అయినప్పటికీ, సోషల్ మీడియాలో కనిపించే ఆ రూపానికి.. నిజ జీవితంలో చూసే వ్యక్తికి చాలా తేడా ఉందనిపించింది.

మా సంభాషణలో ఆయన ఎంతో నిబ్బరంగా, నెమ్మదిగా మాట్లాడారు. ఆయన దగ్గర చాలాకాలంగా చికిత్స పొందుతున్న రోగులు, తోటి ఉద్యోగులు, తెలిసిన డాక్టర్లు కూడా ఆయన గురించి ఇలాగే చెప్పారు. ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా, నిగర్విగా, పద్ధతిగా ఉంటారని వివరించారు.

"ఇది నేను కావాలని అలవర్చుకున్న రూపం" అని ఫిలిప్స్‌ ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారు.

"నన్ను వాళ్లు అసహ్యించుకుంటారు. కానీ, నేను ఇచ్చే సమాచారాన్ని మాత్రం వాళ్లు తప్పుబట్టలేరు" అన్నారు.

"కొన్నిసార్లు మన మాట అవతలి వారికి వినబడాలంటే గట్టిగా అరవక తప్పదు. ట్రోల్స్ చేసేవారిని నేను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాను, తద్వారా నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లకుండా ఉంటుంది. జనం నన్ను మొరటువాడిగా లేదా కోపిష్టిగా భావిస్తే, అది నిజం కాకపోయినప్పటికీ ఆ నిందను మోయడానికి నేను సిద్ధమే" అని ఫిలిప్స్ అన్నారు.

భారత ప్రాచీన సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదం, అలాగే మద్యం.. ఈ రెండే ఆయన విమర్శలకు ప్రధాన లక్ష్యాలు. ఆయుర్వేదాన్ని దేశంలో కోట్లమంది నమ్ముతారు. ప్రభుత్వ నిధులతో నడిచే మెడికల్ కాలేజీల మద్దతు దీనికి ఉంది. అంతేకాదు, ప్రజల రోజువారీ జీవితంతో ఇది ముడిపడి ఉంది.

మరి దీనిని వ్యతిరేకించడమే ఒక మిషన్‌గా ఆయన ఎందుకు మార్చుకున్నారు? అంత ఘర్షణ పూరితమైన సోషల్ మీడియా రూపాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

దీనికి సమాధానం ఆయన ప్రయాణంలోనే ఉందంటారు.

కేరళ, లివర్ డాక్టర్, సిరియాక్ అబ్బి ఫిలిప్స్, సంప్రదాయ వైద్యంపై పోరాటం

ఫొటో సోర్స్, Arun Chandra Bose

ఫొటో క్యాప్షన్, ప్రత్యామ్నాయ వైద్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించినప్పటి నుంచి సిరియాక్ అబ్బి ఫిలిప్స్ సోషల్ మీడియాలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే వ్యక్తిగా మారారు.

ఇష్టం లేని వైద్య వృత్తి

ఫిలిప్స్‌కు అసలు డాక్టర్ కావాలనే కోరిక లేదు. ఆయనకు రాయడం అంటే ఇష్టం, సినిమాలంటే మక్కువ. వైద్యం ఆయనకు నచ్చిన రంగం కాదు.

కానీ, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఫిలిప్ అగస్టిన్ కొడుకుగా కేరళలో పెరగడం వల్ల.. ఆయన భవిష్యత్తు గురించి నిర్ణయం అప్పటికే జరిగిపోయింది.

మొదటి ప్రయత్నంలో ఆయన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత త్రిశూర్‌లోని ఒక రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్‌లో తొమ్మిది నెలలు గడపాల్సి వచ్చింది. అక్కడ చిన్నచిన్న గదుల్లో 40 మంది అబ్బాయిలు ఇరుక్కుని ఉండేవారు.

"మొదటి వారం రోజులు రాత్రి పూట ఏడుస్తూ నిద్రపోయేవాడిని" అని ఫిలిప్స్‌ గుర్తుచేసుకున్నారు. రెండో ప్రయత్నంలో ఆయనకు సీటు వచ్చింది.

"బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో నా ప్రవర్తన చాలా అల్లరిగా ఉండేది" అని ఆయన నవ్వుతూ చెప్పారు.

ఒక దశలో మద్యం విషతుల్యం కావడంతో, తన సొంత ప్రొఫెసర్ కిందే హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.

కోల్‌కతాలోని 3,500 పడకల ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎండీ చదువుతున్న సమయంలోనే ఫిలిప్స్‌కు వైద్యం పట్ల అసలైన అవగాహన వచ్చింది. అక్కడ మందులు, పరికరాలు, సిబ్బంది కొరత ఉండేది.

మందుల స్టాక్ అయిపోవడంతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ లేకుండానే డాక్టర్లు చికిత్స చేయడం ఫిలిప్స్‌ కళ్లారా చూశారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరులతో ఎవరి ప్రాణాలు కాపాడాలో తేల్చుకోలేక వైద్యులు సతమతమవడం గమనించారు.

"అంత తక్కువ వనరులు ఉన్నప్పటికీ, ప్రజలకు మంచి వైద్యం అందించడానికి అక్కడి సిబ్బంది శాయశక్తులా ప్రయత్నించేవారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా రోగులు సంతోషంగానే ఉండేవారు. మనుషుల మధ్య అలాంటి బంధాన్ని నేను అంతకుముందెన్నడూ చూడలేదు" అన్నారు ఫిలిప్స్.

తండ్రి ఆసుపత్రి కార్పొరేట్ పరం కావడంతో..

ఆ తర్వాత, ఫిలిప్స్ దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో హెపటాలజీ చదివారు. అక్కడే అకడమిక్ కెరీర్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో.. ఆయన తండ్రి నడుపుతున్న హాస్పిటల్‌ను ఒక కార్పొరేట్ సంస్థ కొనుగోలు చేసింది.

దీంతో తండ్రి ప్రాక్టీస్‌ను మళ్లీ మొదటి నుంచి నిలబెట్టేందుకు సహాయంగా ఫిలిప్స్ దిల్లీని వదిలి రావాల్సి వచ్చింది. ఈ నిర్ణయంలోనూ ఆయన ప్రమేయం పెద్దగా లేదు.

కేరళలోని ఒక కొత్త హాస్పిటల్‌లో పని చేయడం ప్రారంభించినప్పుడే.. మితిమీరిన మద్యం అలవాటు, నియంత్రణ లేని నాటు మూలికా మందుల వల్ల కాలేయం ఎంత దారుణంగా దెబ్బతింటుందో ఆయన మొదటిసారి గమనించారు.

తీవ్రమైన కామెర్లు, లివర్ ఫెయిల్యూర్ ఉన్న ఆరేళ్ల చిన్నారిని ఒక కుటుంబం ఆయన దగ్గరకు తీసుకొచ్చింది. జ్వరం, జలుబు తగ్గడం కోసం ఇంట్లో తయారు చేసిన ఏదో మూలికా కషాయాన్ని ఆ పాపకు తాగించడమే దీనికి కారణం.

"ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటానికి ఆ రెండు వారాల పాటు నేను ఎంత మానసిక వేదన అనుభవించానో మాటల్లో చెప్పలేను" అని ఫిలిప్స్ అన్నారు.

ఈ ఘటనే ప్రత్యామ్నాయ వైద్యాల ప్రభావంపై, అలాగే ఆ సమయంలో తన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న మద్యం అలవాట్లపై పరిశోధన చేయాలనే ఆసక్తిని ఆయనలో రేకెత్తించింది.

అప్పటి నుంచి ప్రత్యామ్నాయ వైద్యాల వెనుక ఉన్న విజ్ఞానాన్ని, వాటి చరిత్రను పూర్తిగా అధ్యయనం చేసినట్లు ఫిలిప్స్ చెప్పారు. కేవలం రోగులకు చికిత్స చేసే డాక్టర్‌గా మాత్రమే ఉండిపోకుండా, తన వృత్తికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని జోడించాలని ఆయన బలంగా అనుకున్నారు.

తాను చూసిన కేసులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. మొదట్లో దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ, ఆ తర్వాతే తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది.

దేశంలో కోట్లమందికి సంప్రదాయ వైద్యంపై అపారమైన నమ్మకం ఉంది. దీనిపై ఆధునిక వైద్య ప్రమాణాలను రుద్దడం అంటే సంస్కృతిని తుడిచిపెట్టడమే అని చాలామంది వాదిస్తారు. ఫిలిప్స్ కేవలం ఆ నమ్మకాలను ప్రశ్నించడమే కాకుండా, వాటిని నమ్మే వారిని అవమానిస్తున్నారనేది విమర్శకుల వాదన.

కానీ, ఆయన ఎక్కడా తగ్గడం లేదు.

"నేను ఆ వైద్యం చేసే వారిని నకిలీలు అనడం లేదు. ఆ వైద్య విధానాలకు ఆధారమైన సూత్రాలు శాస్త్రీయ ఆలోచనలపై గానీ, హేతుబద్ధమైన తర్కంపైగానీ ఆధారపడి లేవని మాత్రమే చెప్తున్నాను. ఆధునిక వైద్యం తన తప్పులను తనే సరిదిద్దుకుంటుంది. కానీ, ప్రత్యామ్నాయ వైద్యంలో ఆ పరిణతి కనిపించదు, అది తన వైఫల్యాలను ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడదు" అన్నారు ఫిలిప్స్.

భారతీయ సంప్రదాయ మందుల వల్ల కాలేయం ఎలా దెబ్బతింటుందనే విషయంపై ఆయన అప్పటి నుంచి ఎన్నో పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అందులో ఒక పరిశోధనను తప్పుబట్టినప్పుడు.. ఆయన పూర్తి శాస్త్రీయ ఆధారాలతో వివరంగా సమాధానం ఇచ్చి, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు.

భారత్‌లో విక్రయించే ప్రోటీన్ పౌడర్లు, జెనరిక్ మందుల నాణ్యతపై ప్రజల నుంచి నిధులు సేకరించి మరీ ఫిలిప్స్ పరిశోధనలు చేశారు. ఇటీవల ఒక డాక్టర్‌గా తన అనుభవాల ఆధారంగా ఒక పుస్తకం ప్రచురించారు.

కేరళ, లివర్ డాక్టర్, ఫిలిప్స్, సంప్రదాయ వైద్యంపై పోరాటం

ఫొటో సోర్స్, Arun Chandra Bose

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఫిలిప్స్ దగ్గరకు వచ్చే రోగులలో చాలామందికి కాలేయ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకుని ఉంటోంది. ఇది ఎక్కువగా మద్యం అలవాటు వల్ల వచ్చే జబ్బే.

వృత్తి తెచ్చిన ఒత్తిడి

అయితే, ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల ఆయన ఆర్థికంగా, మానసికంగా ఎంతో భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ప్రతిరోజూ చూసే పరిస్థితులు ఎవరినైనా కుంగుబాటుకు గురిచేస్తాయని ఫిలిప్స్ అంటారు.

ఆయన దగ్గరకు వచ్చే రోగులలో చాలామందికి కాలేయ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకుని ఉంటోంది. ముఖ్యంగా యువతలో, తీవ్రమైన కాలేయ వ్యాధులకు దారితీసే ప్రధాన కారణాలలో మద్యం వల్ల వచ్చే లివర్ జబ్బులు దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.

అలాంటి రోగులందరికీ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (కాలేయ మార్పిడి) సాధ్యం కాదు. కొందరు తీవ్రమైన పేదరికంలో ఉంటే, మరికొందరు సర్జరీ తట్టుకోలేనంత నీరసంగా ఉంటారు. ఇంకొందరు మద్యం అలవాటును అస్సలు మానుకోలేరు. వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటప్పుడు, ఆ మరణం వీలైనంత ప్రశాంతంగా ముగిసేలా చూడటమే ఆయన పని అవుతుంది.

"చనిపోయేంత వరకు రోగి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. రోగి ఇక బతకరనే విషయాన్ని కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పాలి, అలాగే వారు గౌరవప్రదంగా కన్నుమూసేలా చూసుకోవాలి" అని ఫిలిప్స్ అంటున్నారు.

ఆయన కాసేపు ఆగారు. డాక్టర్లు ఎప్పుడూ తమను తాము 'ఒక దేవుడిలా' చూపించుకోవల్సి ఉంటుందని.. అన్ని బాధలను తట్టుకుని, తాము మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు ఒక కవచాన్ని ధరించాల్సి వస్తుందని ఫిలిప్స్ చెప్పారు.

"కానీ నేను చెప్తున్నాను, లోపల పరిస్థితి అస్సలు ప్రశాంతంగా ఉండదు" అన్నారు.

ఆయన తన కెరీర్‌లో లెక్కలేనన్ని డెత్ సర్టిఫికెట్లపై సంతకాలు చేశారు. ఆ ప్రతి మరణం ఆయనకు గుర్తుంది.

కేరళ, లివర్ డాక్టర్, ఫిలిప్స్, సంప్రదాయ వైద్యంపై పోరాటం

ఫొటో సోర్స్, Arun Chandra Bose

ఫొటో క్యాప్షన్, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం ఎంతగానో ఇష్టపడే డాక్టర్ ఫిలిప్స్, కేరళలోని తన ఇంట్లో అత్యాధునిక గేమింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

మారిన దినచర్య

తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక రోగి గురించి జూనియర్ డాక్టర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఫిలిప్స్ మాట్లాడుతుండగా.. ఆయన ఒక ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాతే ఆయన తన దినచర్యను మార్చుకున్నారు.

ప్రస్తుతం ఫిలిప్స్ రోజుకు 25 మంది రోగులను మాత్రమే చూస్తున్నారు. తోటి వైద్యులతో పోలిస్తే, చివరికి ఇప్పటికీ రోజుకు 100 మందికి పైగా రోగులను చూసే ఆయన తండ్రితో పోల్చినా ఈ సంఖ్య చాలా తక్కువ.

నాలుగేళ్ల కిందటే ఆయన మద్యం తాగడం మానేశారు.

"నేను తాగుతూ.. నా దగ్గరకు వచ్చే రోగులను మద్యం మానేయమని అడగడం కరెక్ట్ కాదనిపించింది" అని ఫిలిప్స్ చెప్పారు.

ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం ఇష్టపడే ఫిలిప్స్, తన కుటుంబం కోసం, తన అలవాట్ల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు.

"నేను ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటానని జనం అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. నేను ఇంటర్నెట్‌లో గడిపే సమయం చాలా తక్కువ, కానీ అది ఒక స్పష్టమైన లక్ష్యంతో కూడుకుని ఉంటుంది" అన్నారు ఫిలిప్స్.

ఓపిక చాలా ఎక్కువ: భార్య టీనా

కోల్‌కతాలో ఉండే రోజుల్లోనే ఆయన జీవితంలోకి వచ్చిన భార్య టీనా, రోగులతో ఆయనకు ఉండే బంధాన్ని చాలా సరళమైన మాటల్లో చెప్పారు.

"ఆయనకు ఓపిక చాలా ఎక్కువ. నాకు ఏదైనా చెప్పాలన్నా లేదా నేర్పించాలన్నా, ఎంతో సమయం తీసుకుని మరీ అర్థమయ్యేలా వివరిస్తారు" అన్నారామె.

ఆమె కాసేపు ఆగి.. "సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తికి, నిజ జీవితంలో ఉండే మనిషికి అస్సలు సంబంధం లేదు" అని చెప్పారు.

మొదట్లో తన కొడుకు సోషల్ మీడియా ప్రవర్తన తనకు నచ్చేది కాదని ఆయన తండ్రి డాక్టర్ అగస్టిన్ చెప్పారు.

"అతని గురించి నాకు ఆందోళనగా ఉంటుంది, కానీ అతను చేస్తున్న పని ఎంత ముఖ్యమైనదో కూడా నాకు తెలుసు" అన్నారు.

అయినప్పటికీ ఆయనకు వ్యక్తిగత నష్టం ఎక్కువే జరిగింది.

గత ఆరేళ్లలో ప్రత్యామ్నాయ వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల నుంచి ఫిలిప్స్ అనేక కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. కొందరు న్యాయవాదులు ఆయన తరఫున ఉచితంగా వాదించినప్పటికీ, తనను తాను రక్షించుకోవడానికి ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఆయనతో కలిసి ఉమ్మడిగా ఒక పరిశోధనా పత్రాన్ని రాసినందుకు గాను.. ఒక సహోద్యోగిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన తర్వాత ఆ సహోద్యోగి భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు కొందరు పరిశోధకులు ఆయనతో కలిసి పరిశోధనా పత్రాలు ప్రచురించేటప్పుడు తమ పేర్లు పెట్టవద్దని కోరుతున్నారు.

వెనకడుగు లేదు

అయినప్పటికీ, ఆయన ఎక్కడా తగ్గడం లేదు.

"కోర్టు ఖర్చుల కోసం డబ్బు పెట్టడానికి ముందే.. ఈ మందులను ల్యాబ్‌లలో పరీక్షించి విశ్లేషించడం కోసం నా సొంత డబ్బులను ఖర్చు చేసేవాడిని. ప్రజల కోసం ఒకరు నిలబడి, వారికి ఎప్పటికీ తెలియని నిజాన్ని తెలియజేయడం అనేదే ముఖ్యం. మన సొంత రక్షణ, సౌకర్యాల గురించి చూసుకోవడం కంటే ఇదే చాలా ముఖ్యమైన విషయమని నేను భావిస్తాను" అని ఫిలిప్స్ అన్నారు.

కానీ, ఆయన తన పిల్లల గురించి మాట్లాడుతున్నపుడు, ఏదో మార్పు కనిపించింది. తన కుటుంబానికి వచ్చిన బెదిరింపుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్స్ కళ్లు చెమర్చాయి.

ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. భారత వైద్య రంగంలోనే అత్యంత ఘర్షణ పూరితమైన వ్యక్తిగా కనిపించే ఫిలిప్స్.. ఆ క్షణంలో కేవలం ఒక తండ్రిగా మారిపోయారు.

"నా కుటుంబ సభ్యులు ఎవరో ప్రజలకు తెలిస్తే.. వాళ్లు ఏం చేయడానికైనా తెగిస్తారని భయపడ్డాను" అని ఫిలిప్స్ అన్నారు.

"నాకు హాని ఉండొచ్చు, నా కుటుంబ సభ్యులకూ ప్రమాదం జరగవచ్చు" అన్నారు.

ప్రస్తుతం తాను రక్షణ చర్యలు తీసుకుంటున్నానని, అయితే తన పోరాటాన్ని ఆపే ఉద్దేశం ఎంత మాత్రం లేదని చెప్పారు.

"ప్రపంచంలో ఏదైనా ఒక మార్పు తీసుకురావాలంటే, అది ఎంత చిన్నదైనా సరే.. ఎక్కడో ఒకచోట రాజీ పడక తప్పదు. తాను నమ్మిన నిజం కోసం నిలబడిన వ్యక్తిగా నా పిల్లలు నన్ను గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను" అని ఫిలిప్స్ ముగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)