సింహం పంజా నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఎందుకు వదిలేసిందంటే

Lion

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గోపాల్ కటేసియా, అల్పేష్ డాభీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గరాజియా గ్రామంలో సోమవారం నాడు ఓ సింహం కాలూభాయ్ పర్మార్(50) అనే పశువుల కాపరిపై దాడి చేసింది.

ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భావ్‌నగర్ పట్టణంలోని 'సర్ తఖ్త్ సింహ్‌జీ జనరల్ హాస్పిటల్'కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

భావ్‌నగర్ జిల్లాలో మనుషులపై సింహాలు దాడి చేసినట్లు చెబుతున్న ఘటనల్లో ఇది రెండోది.

అంతకుముందు, జూన్ 18న పాలితానా తాలూకా పక్కనే ఉన్న మహువా తాలూకా గఢ్డా గ్రామంలో నాగ్‌జీభాయ్ గుజరియా అనే యువకుడి మృతదేహం ఆయన ఇంటి సమీపంలోని పొదల్లో కనిపించింది.

నాగ్‌జీభాయ్ సింహాల దాడిలోనే మరణించారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.

(గమనిక: ఈ కథనంలో కలచివేసే వివరాలున్నాయి)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుజరాత్, గరాజియా, సింహం దాడిలో పశువుల కాపరి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సింహం కాలూభాయ్‌ని సుమారు అరగంట పాటు పట్టి ఉంచి, ఆ తర్వాత వదిలిపెట్టింది.

సింహానికి ఆ వ్యక్తి ఎలా చిక్కారు?

బీబీసీ న్యూస్ గుజరాతీ ప్రతినిధి అల్పేష్ డాభీ అందించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సోమవారం ఉదయం సుమారు 8:30 గంటలకు తాను ఇంట్లో ఉన్న సమయంలో జరిగిందని కాలూభాయ్ ఆసుపత్రి నుంచి మీడియాతో చెప్పారు.

"నేను ఉదయం 8:30 గంటలకు మా ఆవుకు నీళ్లు తాగించడానికి వెళ్తుండగా అక్కడ ఒక సింహం కూర్చుని ఉంది. అది ఒక్కసారిగా నాపైకి దూకింది. మొదట నా భుజంపై కొట్టి నన్ను కింద పడేసింది. ఆ తర్వాత నా చేతిని నోట్లో కరుచుకుంది. సుమారు అరగంట పాటు నన్ను అలాగే పట్టి ఉంచింది. ఆ తర్వాత నేను దానిని ప్రేమగా నిమరడంతో నన్ను వదిలేసింది" అని కాలూభాయ్ చెప్పారు.

శేత్రుంజీ వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరాగ్ అమీన్ బీబీసీతో ఈ దాడిని ధ్రువీకరిస్తూ, గరాజియా గ్రామంలో ఒక రైతుపై సింహం దాడి చేసిందని, ఆయనకు గాయాలయ్యాయని చెప్పారు.

గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం అందించినప్పటికీ, సింహం అక్కడి నుంచి వెళ్లిపోయేంతవరకు అధికారులు గ్రామానికి చేరుకోలేకపోయారని కాలూభాయ్ అన్నారు.

దాడి జరుగుతున్న సమయంలో రికార్డు చేసిన వీడియోలో, చుట్టుపక్కల ప్రజలు కేకలు వేయడం, సింహంపైకి రాళ్లు రువ్వడం కనిపిస్తోంది.

గుజరాత్, గరాజియా, సింహం దాడిలో పశువుల కాపరి

ఫొటో సోర్స్, Bipin Tankaria/BBC

ఫొటో క్యాప్షన్, గరాజియా గ్రామానికి సమీపంలో ఉన్న శేత్రుంజయ్ పర్వత ప్రాంతంలో సింహాలు, చిరుతపులులు నివసిస్తుంటాయి

ఎలా వదిలేసింది?

సింహం తనను గట్టిగా పట్టుకున్న తర్వాత గ్రామస్తులు కూడా తనకు పెద్దగా సహాయం చేయలేకపోయారని కాలూభాయ్ చెప్పారు. వీడియోలో సింహం హఠాత్తుగా కాలూభాయ్‌ను వదిలేసి వెళ్లడం కనిపిస్తోంది.

సింహం తనను వదిలిపెట్టి తన ఆవుల వైపు వెళ్లిందని కాలూభాయ్ అన్నారు.

అయితే, సింహం కాలూభాయ్‌కి చెందిన రెండు ఆవులకు ఎలాంటి నష్టం కలిగించకుండానే వెళ్లిపోయిందని గ్రామానికి చెందిన కరమ్‌శీభాయ్ చౌహాన్ బీబీసీకి తెలిపారు.

"సింహం హఠాత్తుగా గ్రామంలోకి చొరబడి కాలూభాయ్ పొరుగువారి పొలంలోకి వెళ్లి ఆయన వైపు దూసుకొచ్చింది. కానీ, అక్కడున్న గేదె తన కొమ్ములతో ఎదురు తిరగడంతో సింహం అక్కడి నుంచి వెనక్కి తగ్గి కాలూభాయ్ ఇంటి వైపు వెళ్లింది. అక్కడే రెండు ఆవులూ కట్టేసి ఉన్నాయి. కానీ, సింహం ఆవులను వదిలి కాలూభాయ్‌పై దాడి చేసింది. చివరికి, ఆయన్ను వదిలేసి ఆ ఆవుల వైపు పరిగెత్తింది. అయితే, ఆవులకు ఎలాంటి హాని చేయకుండానే పారిపోయింది" అని కరమ్‌శీభాయ్ చెప్పారు.

"ఈ దాడిలో కాలూభాయ్ మెడ, భుజం, చేతికి గాయాలయ్యాయి. మొదట ఆయనను చికిత్స కోసం పాలితానాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, గాయాలు తీవ్రంగా ఉండటంతో భావ్‌నగర్ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు" అని ఆయన వివరించారు.

ఎందుకు దాడి చేసింది?

పాలితానా పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేత్రుంజయ్ పర్వతం కింద గరాజియా గ్రామం ఉంది. శేత్రుంజయ్ పర్వతం ఒక రిజర్వ్ ఫారెస్ట్ అని, ఇక్కడ సింహాలు, చిరుతపులులు నివసిస్తుంటాయని స్థానిక అటవీ శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

ఈ గ్రామం శేత్రుంజీ వైల్డ్‌లైఫ్ డివిజన్‌లోని పాలితానా రేంజ్ పరిధిలోకి వస్తుంది.

"ఒక రోజు ముందు ఈ సింహాలు గరాజియాకు సమీపంలో ఉన్న సోన్‌పారీ గ్రామంలో ఒక వ్యక్తిని చంపేశాయి. ఆ వ్యక్తిని చంపిన తర్వాత, మూడు సింహాలు తమ నివాసం వైపు వెళుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ తెల్లవారడం, ప్రజల రాకపోకలు పెరగడం జరిగాయి. ఈ సింహాల గుంపులో ఒక యువ మగ సింహం కూడా ఉంది. ప్రజలు కేకలు వేయడంతో అది భయపడింది. ఆ సమయంలో, అది ఒక పశువుల యజమానిపై దాడి చేసింది. అయితే, సింహం ఆ పశువుల యజమానిని చంపడానికి ప్రయత్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో అది పశువుల యజమానిని గాయపరిచి వెళ్లిపోవడం కనిపిస్తోంది" అని చిరాగ్ అమీన్ బీబీసీతో చెప్పారు.

తన పశువులను రక్షించుకోవడానికి వెళ్లడంతో సింహం తనపై దాడి చేసిందని కాలూభాయ్ చెప్పినట్లు అటవీశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

గుజరాత్, గరాజియా, సింహం దాడిలో పశువుల కాపరి

ఫొటో సోర్స్, Bipin Tankaria/BBC

ఫొటో క్యాప్షన్, పాలితానా పట్టణ అడుగు భాగం (తలహటి) నుంచి ప్రారంభమై శేత్రుంజయ్ పర్వతం పైకి వెళ్లే మెట్ల దృశ్యం.

ఈ ప్రాంతంలో సింహాలు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి?

1990వ దశకం ప్రారంభం వరకు సింహాలు కేవలం గిర్ అడవులుగా పిలిచే గిర్ నేషనల్ పార్క్, వైల్డ్‌లైఫ్ శాంక్చురీలలో మాత్రమే కనిపించేవి. ఈ అడవి ప్రస్తుతం జూనాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలి జిల్లాలలో విస్తరించి ఉంది.

సింహాల సంఖ్య పెరగడంతో, 1990వ దశకం మధ్యలో అవి గిర్ అడవుల వెలుపల విస్తరించడం ప్రారంభించి అమ్రేలిలోని పనియా ప్రాంతంలో కనిపించాయి.

ఆ తర్వాత శేత్రుంజీ నది ఒడ్డున తమ ప్రాంతాన్ని విస్తరించుకుంటూ సింహాలు అమ్రేలిలోని లిలియాలోకి వచ్చాయి. అక్కడి నుంచి భావ్‌నగర్‌లోని మహువా తాలూకాకు చేరుకుని, గత దశాబ్ద కాలంగా అక్కడే ఉంటున్నాయి. మహువా నుంచి మరింత ముందుకు సాగుతూ పాలితానా తాలూకాలోని శేత్రుంజయ్ పర్వతం, దాని పరిసర ప్రాంతాలలో కూడా ఇవి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

గతనెలలో శేత్రుంజయ్ పర్వతం మెట్లు ఎక్కుతున్న ఒక యాత్రికుడి బ్యాగును నోటకరచుకుని పారిపోతున్న సింహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గిర్ అడవులకు దూరంగా, జనాభా ఎక్కువగా ఉండే రెవెన్యూ ప్రాంతాలలో సింహాలను రక్షించడానికి, మనుషులు-సింహాల మధ్య ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో 'శేత్రుంజీ వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్'ను ఏర్పాటు చేసి, అటవీ శాఖ నుంచి సిబ్బందిని కేటాయించింది. పాలితానా పట్టణంలో ఈ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఉంది.

"గత మూడేళ్లుగా మా గ్రామం చుట్టుపక్కల సింహాల సంచారం పెరిగింది. అవి పశువులను వేధిస్తూనే ఉంటాయి. కానీ సింహం మనుషులపై దాడి చేయడం మా గ్రామంలో ఇదే మొదటిసారి" అని కరమ్‌శీభాయ్ చెప్పారు.

గరాజియాలో కనిపించిన మూడు సింహాల ఉనికిని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారని, చర్యలు తీసుకుంటున్నారని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరాగ్ అమీన్ తెలిపారు.

"బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో మా సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రి వర్గాలతో సమన్వయం చేసుకుంటున్నారు" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)