సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై విమర్శలు ఏంటి?

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, facebook.com/revanthofficial

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై రాజకీయ దుమారం రేగింది.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని 'కావాలని' చేసిందని ఖర్గే విమర్శించారు. ఈ విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది.

పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రం ప్రభుత్వం కూడా స్పందించింది.

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పర్యటనను కుదించుకుని హైదరాబాద్ రానున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, facebook.com/revanthofficial

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది.

రేవంత్ రెడ్డి షెడ్యూల్ లో ఏముందంటే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 21 నుంచి 29 మధ్య యూకే, యూఎస్ఏ లో పర్యటించాల్సి ఉంది.

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం చూస్తే, తొలుత ఆయన ఆగస్టు 20న న్యూదిల్లీ నుంచి బయల్దేరి లండన్ చేరుకుంటారని ఉంది.

21, 22 తేదీల్లో యూకేలో పర్యటిస్తారు. 23న లండన్ నుంచి బయల్దేరి అమెరికాలోని బోస్టన్ చేరుకోవాల్సి ఉంటుంది.

24న హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్ సందర్శిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అదే రోజు రాత్రికి బయల్దేరి బోస్టన్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు.

నార్త్ ఈస్ట్రన్ క్యాంపస్, వర్జీనియా యూనివర్సిటీ బృందాలతో సమావవేశమవుతారు. ఆగస్టు 26న ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్(యూఎస్ఏ) మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్ బయల్దేరి వస్తారని షెడ్యూల్ ప్రకారం ఉంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆగస్టు 23న యూకే నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు.

అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలుస్తారనే వ్యక్తుల పేర్ల విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.

"రేవంత్ రెడ్డి తన పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవాలని భావించారు. వీరిద్దరి అప్పాయింట్‌మెంట్లు లేదా వారిని కలవడమే అమెరికా పర్యటన ఉద్దేశం కాదు. యూనివర్సిటీలను సందర్శించి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని భావించారు" అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు బీబీసీతో చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించవద్దని కోరారు.

అయితే, రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. యూఎస్ఏ పర్యటనకు మాత్రం ''రాజకీయ అనుమతి'' నిరాకరించింది.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, cm.telangana.gov.in

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డి లండన్‌లోని చారిత్రక అంబేద్కర్ హౌస్‌ను సందర్శించారు.

సీఎం కార్యాలయం ఏం చెప్పిందంటే..

విధివిధానాలు, ప్రోటొకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూకే, అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతిని తెలంగాణ ప్రభుత్వం కోరిందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.

''తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.'' అని చెప్పింది.

తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతి, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే ఈ పర్యటనకు "రాజకీయ అనుమతి'' నిరాకరణ'పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారని ఆయన కార్యాలయం తెలిపింది.

అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని, అమెరికా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని ప్రకటించింది.

''ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవని రేవంత్ రెడ్డి చెప్పారు'' అని ఆయన కార్యాలయం తెలిపింది.

వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను అధికారుల బృందం కొనసాగించాలని, ఆయా విశ్వవిద్యాలయాలతో అవసరమైన అన్ని అవగాహన ఒప్పందాలను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సీఎంవో వెల్లడించింది.

మరోవైపు, యూకేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బ్రందం పర్యటించి వివిధ యూనివర్సిటీలు, ఇతర సంస్థలను సందర్శించింది.

ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, x.com/MEAIndia

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం గురించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది.

''ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా లేదు''

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ''రాజకీయ అనుమతి'' ఇవ్వకపోవడంపై కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు.

ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలకు రాజకీయ అనుమతి ఇవ్వడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని రెండు వారాలకోసారి నిర్వహించే మీడియా సమావేశంలో జైశ్వాల్ చెప్పారు.

''ఇలాంటి సందర్భాల్లో వారు ప్రతిపాదించే కార్యక్రమాలు, వారు నిర్వహిస్తున్న పదవి, పర్యటన ఉద్దేశ్యానికి తగినట్లుగా ఉండాలి. ఇక్కడ అమెరికా పర్యటన విషయంలో అలాంటివేమీ లేవు. అందువల్లనే అనుమతి నిరాకరించారు'' అని చెప్పారు.

రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతి ఇచ్చినట్లుగా రణధీర్ జైశ్వాల్ ఇదే సందర్భంలో గుర్తు చేశారు.

ఈ వివాదంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

రేవంత్ రెడ్డి పర్యటన హోదాకు తగ్గట్టుగా లేదని కేంద్రం చెప్పడం సిగ్గుచేటు అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో పేర్కొన్నారు.

అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించినప్పటికీ, రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

''తెలంగాణ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరు. విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం మానుకోవాలి'' అని అన్నారు.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశీ పర్యటనలకు అనుమతులిచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం 'సెలక్టివ్‌గా' వ్యవహరిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే..

కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన కొందరికే కావాలని విదేశీ పర్యటనలకు అనుమతిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

"అమెరికాలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వారు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్రనాయకత్వాలను సంప్రదిస్తుంటారు. దానివల్లనే ముఖ్యమంత్రులు అమెరికా, యూకే వంటి దేశాలలో పర్యటించి పెట్టుబడులు ఆకర్షిస్తుంటారు. అలాంటి సందర్భంలో పర్యటనలకు అనుమతి ఇవ్వకపోవడం ఏ మాత్రం తగదు" అని మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, facebook.com/NRRBJP

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడాన్ని కాంగ్రెస్ అనవసరంగా రాజకీయం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

బీజేపీ ఏం చెబుతోంది..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు.

''రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రోటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుంది.'' అని ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో యూపీఏ హయాంలో ముఖ్యమంత్రుల పర్యటనలకు కేంద్ర అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

సీఎంల విదేశీ పర్యటనలకు అనుమతి అవసరమా?

భారత్ నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు అధికారికంగా లేదా ప్రైవేటు విదేశీ పర్యటనలకు వెళ్తుంటే కచ్చితంగా కేంద్రానికి చెప్పి అనుమతి పొందాల్సి ఉంటుంది.

కేబినెట్ సెక్రటరీ, కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చి అనుమతి పొందాలని నిబంధన ఉంది.

ముందస్తుగా రాజకీయ అనుమతి(పొలిటికల్ క్లియరెన్స్), ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్‌సీఆర్ఏ) అనుమతి తప్పనిసరి.

వీటితోపాటు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసి అనుమతి పొందాలనే నిబంధన కూడా ఉంది.

అయితే, కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ''పొలిటికల్ క్లియరెన్స్'' వస్తే, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆ దరఖాస్తును పరిశీలించి అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది.

రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని గతంలోనూ ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది.

దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు మమత బెనర్జీలకు ఇలాగే జరిగిందని ఆ పత్రిక కథనం పేర్కొంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, 2026 ఫిబ్రవరిలో యూకే, ఇజ్రాయెల్ పర్యటనకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్రం రాజకీయ అనుమతి ఇవ్వలేని ప్రస్తావించింది.

2024లోనూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జపాన్, దక్షిణ కొరియా పర్యటనలకు అనుమతి ఇవ్వగా, పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదని రాసింది.

2025లో కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్, 2017, 2018, 2021లో మమతబెనర్జీ, 2019లో అరవింద్ కేజ్రీవాల్ విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో రాసింది.

అలాగే యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ నాటి అస్సాం సీఎం తరుణ్ గొగొయ్, ఝార్ఖండ్ సీఎం అర్జున్ ముండాకు విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి నిరాకరించిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)