అహ్మదాబాద్: అక్కడ పురుషులు మహిళల్లా వస్త్రాలు ధరించి గర్బా ఎందుకు ఆడతారు, దీనివెనకున్న కథేంటి?

గర్భా ఆడటానికి సాదుమాత ఆలయం ముందు పురుషులు స్త్రీల వేషధారణతో గుమిగూడతారు
ఫొటో క్యాప్షన్, గర్భా ఆడటానికి సాదుమాత ఆలయం ముందు పురుషులు స్త్రీల వేషధారణతో గుమిగూడతారు
    • రచయిత, జై శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అహ్మదాబాద్‌లోని షాపూర్ ప్రాంతంలో సాధుమాత పోర్‌లో, దేవీ నవరాత్రులలో 8వ రోజున వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది.

ఆ రోజు రాత్రి అక్కడి పురుషులందరూ పదహారు రకాల వేషధారణలతో సిద్ధమవుతారు. వారు మహిళల్లా సంప్రదాయ గుజరాతీ చీరలను లేదా చనియా చోళీలను ధరిస్తారు. జుట్టును కొప్పులా ముడివేసుకుంటారు. పాపిటబిళ్ల, ఇతర ఆభరణాలు ధరిస్తారు, కళ్లకు కాటుక పెట్టుకుంటారు.

ఇలా మహిళల్లా అలంకరించుకున్న పురుషులు సాధుమాత ఆలయం ముందు గర్భా నృత్యం చేయడానికి చేరుకుంటారు.

ఈ గర్బా నృత్యం చేయడాన్ని వారు ఓ వినోద కార్యక్రమంలా కాకుండా ఓ ప్రాయశ్చిత్త ప్రక్రియగా విశ్వసిస్తారు.

గర్బా నృత్యం చేస్తూ వారంతా 'సాదుమాత నో పవాడో' అంటూ పాడతారు. పవాడో అంటే వీరగాథను చెప్పే సాహిత్య ప్రక్రియ. కానీ ఇక్కడ మాత్రం ఈ పవాడో పురుషుల పశ్చాత్తాపాన్ని గుర్తు చేస్తుంది . ఈ పవాడోను విషాదభరిత స్వరంతో వివిధ రాగాల్లో ఆలాపిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"మేం నీ బిడ్డలం సాధుమాతా...

మా పాపాలను క్షమించు, తల్లీ నీ చరణాలే శరణు

మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి ఆయన శాలువాకప్పుకుని నీ చెంతకు వచ్చారు

కరుణామయి.. దయచేసి మాపై నీ ఆశీస్సులు కురిపించు!" అని వేడుకుంటారు.

అయితే ఈ ప్రాంత పురుషులు మహిళల దుస్తులు ధరించి గర్బా నృత్యం ఎందుకు చేస్తారు? దీని వెనుక అసలు కథేంటి?

అహ్మదాబాద్, గర్బా, సాదుమాత, గుజరాత్
ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో ఆడవారిలా బట్టలు వేసుకొని మగాళ్లు గర్బా ఆడుతారు.

సాదుమా ఎవరు?

ఇది దాదాపు క్రీ.శ.1816లో జరిగిన ఘటన. చరణ్-బరోట్ సమాజానికి చెందిన జానపద కథలు, మౌఖిక చరిత్రపై జరిగిన వివిధ పరిశోధనలు, కొన్ని చారిత్రక వాస్తవాల మేరకు సాదుబా అత్యంత సౌందర్యవతి.

ఆమె సిద్ధ్‌పూర్‌కు చెందిన వ్యక్తిగా కొందరు పండితులు చెబుతుంటారు. ఆమె అహ్మదాబాద్‌కు చెందిన హరిసింగ్ (కొందరు హథీసింగ్ అని కూడా పిలుస్తున్నారు) బరోట్‌ను వివాహం చేసుకున్నారు. అందుకే ఆమె ఇంటి పేరు భట్ అని కూడా కొందరు చెబుతుంటారు.

"19వ శతాబ్దం ప్రారంభంలో, మరాఠా పీష్వాలు, గైక్వాడ్‌ల ఉమ్మడి పాలనలో అహ్మదాబాద్ తీవ్ర అణచివేతను ఎదుర్కొంది" అని అహ్మదాబాద్‌కు చెందిన చరిత్రకారుడు, రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన అహ్మదాబాద్-రాయల్ సిటీ టు మెగా సిటీ అనే పుస్తకంలో రాశారు.

అహ్మదాబాద్, గర్బా, సాదుమాత, గుజరాత్
ఫొటో క్యాప్షన్, సాదుమాత ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

పీష్వాల కాలపు చివరి సర్‌సుబా (జిల్లా రెవెన్యూ వసూళ్లను, పాలనను పర్యవేక్షించే అత్యున్నత ప్రాంతీయ అధికారి)రామచంద్ర ములాలేకర్ తన పట్టణ ప్రజల నుంచి పన్ను వసూలు చేయడానికి అత్యంత అవినీతికరమైన పద్ధతిని అనుసరించారు.

ప్రజల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక వేగుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరిని స్థానికంగా చడియాలు అని పిలిచేవారు. ఈ చడియాలు ప్రజలకు సంబంధించిన నిజమైన, లేదా వదంతులను సర్‌సుబాకు చేర్చేవారు.

పట్టణంలోని ధనవంతులు, పేరున్న పౌరుల వ్యక్తిగత జీవితాలు, ఆర్థిక లావాదేవీల సమాచారం, వారిపై ఉన్న ఆరోపణలు, పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని ఈ చడియాలు సర్‌సుబాకు చేర్చేవారు. అప్పుడు ఆయన వారికి నోటీసులు జారీ చేసి జరిమానాలు, పన్నులు వసూలు చేసేవారు.

ఎవరైనా జరిమానాలు చెల్లించేందుకు నిరాకరిస్తే వారిని చిత్రవధ చేసేవారు.

జరిమానా చెల్లించేవరకు జైల్లో పెట్టి హింసించేవారు.

"ఈ చడియాలు పీష్వాలకు గూఢచారులుగా ఉండేవారు. వీరికి ఒక పెద్ద నెట్‌వర్క్ ఉండేది. వీరు నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారు" అని బరోట్ సామాజిక వర్గానికి చెందిన, సాదుమాత ఆలయ నిర్వాహకుడు తుషార్ బరోట్ బీబీసీ గుజరాతీకి చెప్పారు.

"అలాంటి చడియాలు సాదుబాపై తప్పుడు ప్రచారం చేశారు. దీంతో ఆమెను అరెస్టు చేసి తీసుకురావాలని సర్‌సుబా ఆదేశించారు" అని అహ్మదాబాద్ జర్నీ టు ద మెగా సిటీ పేరుతో రాసిన పుస్తకంలో రచయిత మహేశ్ షా చెప్పారు.

"భట్‌ వర్గానికి చెందిన పతివ్రత అయిన సాదుబాపై వ్యభిచారి అని చడియా బృందం తప్పుడు ప్రచారం చేసింది. దీని ఆధారంగానే ఆమెను అరెస్టు చేసేందుకు సర్‌సుబా సైనికులనుపంపించారు" అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

అహ్మదాబాద్, గర్బా, సాదుమాత, గుజరాత్
ఫొటో క్యాప్షన్, పూర్వీకులు చేసిన తప్పునకు క్షమాపణలు కోరుతూ గర్బా ఆడుతున్న పురుషులు

'ట్రాగా' సంప్రదాయంలో తల్లీ బిడ్డ మృతి

సైన్యం సాదుబాను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె తీవ్ర దుఃఖానికి, ఆగ్రహానికి గురయ్యారు.

"ఆ కాలంలో, భట్ సమాజంలో తమ గౌరవాన్ని ప్రతిష్టను, సత్యాన్ని కాపాడుకోవడానికి ‘త్రాగా’ (ప్రాణత్యాగం చేసుకోవడం) అనే ఒక ప్రత్యేక సంప్రదాయం ఉండేది" అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దీంతో ఈ 'త్రాగా' సంప్రదాయాన్ని నిర్వహించవలసిందిగా సదూబా తన భర్త హరిసింగ్‌ను ఒత్తిడి చేశారు. ఈ సంప్రదాయంలో భాగంగా హరిసింగ్ తన కుమార్తెను చంపేశారు. అయితే కొందరు చరిత్రకారులు కుమార్తెకు బదులుగా కుమారుడిని చంపినట్లు కూడా ప్రస్తావిస్తారు.

"ఇంత జరిగినప్పటికీ, ఆ చాడియా సదుబాను సర్ సుబేదార్ అంతఃపురానికి తీసుకువెళ్ల డానికి ఎంతగానో ఆరాటపడ్డాడు. అందువల్ల సదుబా తన భర్తతో తనను కూడా చంపమని చెప్పారు. ఈ విధంగా తల్లీ బిడ్డ ఇద్దరూ ప్రాణత్యాగం చేసుకున్నారు’’ అని అహ్మాదాబాద్ -రాయల్ సిటీ టు మెగాసిటీ పుస్తకంలో ఉంది.

ఆ సమయంలో గుజరాత్ అంతటా భట్ సమాజంలో 'త్రాగా' సంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. భాట్ సమాజానికి చెందిన ఏ వ్యక్తిని చంపినా అది 'మహా పాపం'గా పరిగణించేవారు. సదుబా ఆమె బిడ్డ మరణవార్త వినగానే భట్ సమాజ ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

వారు ఈ అన్యాయాన్ని నిరసిస్తూ అహ్మదాబాద్‌లోని భద్ర ప్రాంతంలో ఉన్న రాజభవనం వెలుపల ఆజం ఖాన్ సరాయ్ వద్ద గుమిగూడారు.

"ఇద్దరి హత్యకు కారణమైన చడియాను శిక్షించాలని, జరిమానా విధించాలని ప్రజలంతా సర్‌సుబాను డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌ను సర్‌సుబా తిరస్కరించిన తర్వాత ప్రజలకు స్థానిక వ్యాపారులు, మతపెద్దలు, ఫకీర్లు మద్దతు పలికారు. వారు ఒక రోజంతా ధర్నాలు చేశారు. ఆ రోజు నగరంలోని దుకాణాలు మూతపడ్డాయి. ఆ సమయంలో చడియా సర్‌సుబా రాజభవనంలోనే ఆశ్రయం పొందారు" అని అహ్మదాబాద్- రాయల్ సిటీ టు మెగా సిటీ పుస్తకంలో పేర్కొన్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, బ్రిటిష్‌వాళ్లు కూడా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని ఆ పుస్తకంలో ఉంది. ఆందోళన చేస్తున్న ప్రజలు రాజభవనం బయట కనిపించిన ఇద్దరు చడియాలపై దాడి చేశారని, వారిలో ఒకరు చనిపోయారని కూడా రాసుకొచ్చారు.

చడియాను చంపబోమని, గాడిదపై ఊరేగిస్తామని హామీ ఇచ్చి ఆయన్ని అప్పగించేలా సర్‌సుబాను ఒప్పించారు, కానీ మాటను నిలబెట్టుకోలేదని చరిత్రకారులు చెబుతున్నారు.

"ఒటియాను రాజభవనానికి కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత కలుపూర్ గేట్ వద్ద కోపోద్రిక్తులైన ప్రజలు ఆయనపై రాళ్లు రువ్వి హతమార్చారు" అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

అహ్మదాబాద్, గర్బా, సాదుమాత, గుజరాత్
ఫొటో క్యాప్షన్, సాదుమాత ఆలయం

పశ్చాత్తాపంతో సాదుబా ఆలయం నిర్మాణం

ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత అంటే 1817లో సాదుబా చేసిన త్యాగానికి గుర్తుగా ప్రజలు షాపూర్‌లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.

"ప్రజలు ఆమెను సతిగా ప్రకటించారు. ఆమె గౌరవార్థం సాదుబా పావాడ నిర్మించారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఏకే ఫోర్బ్స్ రాసిన 'రాసమాల' అనే పుస్తకంలో సాదుబా ఆలయానికి సంబంధించిన స్కెచ్ ప్రచురితమైంది. తర్వాత ఇరవయ్యో శతాబ్దంలో అహ్మదాబాద్‌కు సంబంధించిన అనేక చారిత్రక వ్యాసాల్లో, పరిశోధనల్లో సాదుబా కథ కనిపించింది."

"ఒక అమాయకురాలైన మహిళను కాపాడుకోలేకపోయామని భట్ సామాజిక వర్గం ప్రజలు భావించారు. అందుకే చిన్న ఆలయాన్ని నిర్మించి, అందులో అరుగు లాంటిదాన్ని ఏర్పాటు చేసుకొని, బావిని తవ్వించారు" అని తుషార్ బరోట్ చెప్పారు.

"క్షమాపణలు కోరే ప్రయత్నంగా మా పూర్వీకులు దేవీ నవరాత్రుల ఎనిమిదో రోజున గర్బా నృత్యం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది" అని భట్ సామాజిక వర్గానికి చెందిన నిలేశ్‌బాయ్ బరోట్ చెప్పారు.

"ఆలయంపై నమ్మకం పెరగడంతో ఇప్పుడు ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందిన మగవాళ్లే కాకుండా ఇతరులు కూడా గర్బా ఆడుతున్నారు" అని మధుభాయ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)