ఏపీ: బీసీలకు రిజర్వేషన్ పెంపును హైకోర్టు కొట్టేయడానికి కారణాలేంటి? దీనిపై ఎవరేమంటున్నారు?

హైకోర్టు, బీసీ రిజర్వేషన్ పెంపుదల, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 24 శాతం రిజర్వేషన్ ఉంది. దాన్ని 34 శాతానికి పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 24 శాతం రిజర్వేషన్ ఉంది. దాన్ని 34 శాతానికి పెంచుతామని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఆ మేరకు ఈ ఆగస్టులో జీవోలు కూడా విడుదల చేసింది. బీసీలకు తమ పార్టీ చేసిన గొప్ప మేలుగా ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ చెప్పుకుంది. అయితే తాజాగా రాష్ట్ర హైకోర్టు ఆ పెంపుదల చెల్లదని తీర్పునిచ్చింది. గ్రామ పంచాయతీల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది.

ఈ పెంపుదల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయనీ, అది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని తేల్చి చెప్పింది. దీంతో 2026 ఆగస్టు 20 నాటి జీవో 105, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఆగస్టు 19 నాటి 1065 జీవోలు రద్దయ్యాయి.

వార్డుల విభజన, మునిసిపాలిటీల్లో పంచాయితీలు కలపడం, బీసీల ఉప వర్గీకరణ వంటి లక్ష్యాలతో ఫైల్ అయిన పిటిషన్లనూ ఏపీ హైకోర్టు కొట్టేసింది. అయితే, ఎన్నికలు జరుపుకోవచ్చనీ, ఎస్ఐఆర్ ప్రక్రియతో సంబంధం లేదని తేల్చి చెప్పింది.

హైకోర్టు తీర్పు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి మీద వైయస్సార్, ఏపీ కాంగ్రెస్‌ పార్టీలు విమర్శలు చేయగా, వైసీపీ కుట్రల కారణంగానే హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పు వచ్చిందని తెలుగుదేశం విమర్శించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీసీలకు రిజర్వేషన్ పెంపుదలను హైకోర్టు కొట్టేయడానికి కారణాలు

1. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. కానీ, ఈ పెంపుదలతో అది దాటిపోతుంది కాబట్టి.

2. ఒకవేళ 50 శాతం దాటి రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రామాణికమైన సమాచారం (ఎంపరికల్ డాటా) సేకరించి, బీసీలు ఎందరున్నారు? వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారం సేకరించి, నియమిత పద్ధతిలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేరిస్తే, అప్పుడు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. కానీ, ఏపీ ప్రభుత్వం ఆ పనిచేయలేదు.

3. అంటే సమాచారాన్ని కుటుంబ సర్వే ద్వారా తీసుకున్నారు తప్ప, ప్రత్యేకంగా సమాచార సేకరణ జరగలేదు. ఆ సమాచారంతో రిజర్వేషన్ ఇవ్వలేరు.

సుప్రీంకోర్టు
ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)

సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వ నిర్ణయం

అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ గడువును అక్టోబర్‌ 31వ తేదీ వరకు పొడిగించారు.

బుధవారంతో గడువు ముగియగా మళ్లీ నెలపాటు పొడిగించారు.

బీసీ రిజర్వేషన్లు
ఫొటో క్యాప్షన్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రాజకీయ విమర్శలు

ఈ తీర్పుపై తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ కూడా టీడీపీ ప్రభుత్వ నిర్ణయం చిత్తశుద్ధి లేనిదని అన్నది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ‘‘మీరు బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా?’’ అని ఎక్స్ లో వై.ఎస్. జగన్ విమర్శించారు.

అయితే, హైకోర్టు తీర్పుకు కారణం వైసీపీయేనని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ‘‘బీసీ రిజర్వేషన్లపై జగన్ రెడ్డి కుట్ర మరోసారి బయటపడింది. తాను బీసీలకు మేలు చేస్తున్నానని చెబుతూనే.. బీసీలకు 34% రిజర్వేషన్లు వద్దంటూ తన అనుచరులతో కోర్టులో పిటిషన్లు వేయించి, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి’’ అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

ఏపీసీసీ ఉపాధ్యక్షుడు (పరిపాలన) కొలనుకొండ శివాజీ
ఫొటో క్యాప్షన్, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు (పరిపాలన) కొలనుకొండ శివాజీ

ఏపీ హైకోర్టు తీర్పు ఆశ్చర్యమేమీ కాదు: ఏపీ కాంగ్రెస్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు (పరిపాలన) కొలనుకొండ శివాజీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులు వస్తాయని గత 90 రోజులుగా కాంగ్రెస్ పార్టీ బీసీలను హెచ్చరిస్తూనే ఉందని ఆయన గుర్తుచేశారు.

ఒకవేళ ఏపీ ప్రభుత్వం నిజంగానే ఈ 34 శాతం రిజర్వేషన్లను కాపాడాలనుకుంటే, దానికి తగ్గట్లుగా చట్టాలు చేసి ఆ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి రక్షణ కల్పించి ఉండాల్సిందని శివాజీ అభిప్రాయపడ్డారు.

అలా చేస్తేనే బీసీ రిజర్వేషన్లకు బలమైన రక్షణ దక్కుతుందన్నారు. ఉదాహరణకు తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఇలాంటి రాజ్యాంగ రక్షణే ఉందని ఆయన గుర్తుచేశారు. 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జీవో నెం. 105, 106 వ్యవహారంలో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వాదనకు గట్టి ఎదురుదెబ్బ అని ఆయన అన్నారు.

(పాఠకుల అవగాహన కోసం ఈ వాక్యానికి అదనపు వివరణ: భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో ఏదైనా చట్టాన్ని చేరిస్తే, దాన్ని సాధారణంగా కోర్టుల్లో సవాలు చేయడానికి వీలుండదు. అందుకే బీసీ రిజర్వేషన్లను అందులో చేర్చడం ద్వారా చట్టపరమైన రక్షణ కల్పించవచ్చని ఇక్కడ ఉద్దేశం.)

ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు
ఫొటో క్యాప్షన్, కేంద్రంలో పట్టుబట్టి పార్లమెంటులో చట్టం చేస్తే సులువుగా అయిపోతుందని, ఇక్కడ పాలకపక్షాలపై అటువంటి ఒత్తిడి లేదని బీవీఎన్ సత్యనారాయణ అన్నారు.

బీసీ సంఘాలు ఏమన్నాయి?

ఈ విషయంపై ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఎన్ సత్యనారాయణ మాట్లాడారు.

‘‘తమిళనాడులో రిజర్వేషన్లు పెరగడానికి అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి. ఏఐఏడీఎంకే ప్రభుత్వ తీర్మానాన్ని డీఎంకే, కాంగ్రెస్ బలపరిచాయి. ఇప్పుడు ఏపీలో నాయకత్వం అలా చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, మరే ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అడ్డంకి కాని 50 శాతం పరిమితి ఇప్పుడు ఎందుకు అడ్డం అవుతుంది? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయిస్తే సులువుగా అయిపోతుంది. ఇక్కడ పాలకపక్షాలపై అటువంటి ఒత్తిడి లేదు’’ అని ఆయన అన్నారు.

ఏపీ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకముందే ఒక జీవో ద్వారా రిజర్వేషన్ పెంచేశారని, అది నిలబడదని వారికి కూడా తెలుసని సత్యనారాయణ అన్నారు.

‘‘తమిళనాడులో ఏం చేశారో, అన్ని పార్టీలూ ఒక మాట అనుకుని అదే చేయాలి. పైకి బీసీ రిజర్వేషన్లు అంటారు. కానీ వాస్తవంగా ఎవరికీ అది ఇష్టం ఉండదు. కాబట్టి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో పెట్టండి. మేం ఈ ప్రక్రియ అంతా సమగ్రంగా చేయాలనే ప్రార్థనతోనే కోర్టులో పిటిషన్ వేశాం. సోమవారం మా కేసుపై తీర్పు ఉంది’’ అని ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏపీ యూనిట్ ప్రెసిడెంట్ డా. ఆల వెంకటేశ్వర్లు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)