లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్‌ ఒప్పందంతో దీనికి సంబంధం లేదంటున్న నెతన్యాహు

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ఒప్పందం

ఫొటో సోర్స్, Kawnat HAJU / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని టైర్, నబాటియా ప్రాంతాలపై ఈ ఉదయం దాడులు జరిగాయి.
చదివే సమయం: 3 నిమిషాలు

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులకు దిగింది.

అమెరికా - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా, లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని టైర్, నబాటియా ప్రాంతాలపై ఈ ఉదయం దాడులు జరిగినట్లు బీబీసీ ప్రతినిధి హ్యూగో బచేగా తెలిపారు.

ఇరాన్ మద్దతు గల హిజ్బొల్లాతో సాగుతున్న పోరాటం కూడా ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుందనే వాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు.

దీనిపై లెబనాన్ ప్రభుత్వం, హిజ్బొల్లా స్పందించాల్సి ఉంది.

అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ మాత్రం, ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని సంకేతాలిచ్చింది.

ఒప్పందంలో లెబనాన్‌ను కూడా చేర్చాలని హిజ్బొల్లా గతంలోనే ఇరాన్‌ను కోరినట్లు రిపోర్టులున్నాయి.

మరోవైపు, సరిహద్దు వెంబడి లెబనాన్ భూభాగంలో 'సెక్యూరిటీ బఫర్ జోన్' ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే లెబనాన్‌లోకి ప్రవేశించడంతో, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్తాయనే ఆందోళనలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, Joe Raedle/Getty Images

కాల్పుల విరమణకు మద్దతు కానీ..

ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

'ఇరాన్ తక్షణమే నౌకా రవాణా మార్గాలను తెరవాలని, అమెరికా, ఇజ్రాయెల్ సహా ఈ గల్ఫ్‌లోని ఇతర దేశాలపై దాడులు ఆపాలని ట్రంప్ తీసుకున్న రెండు వారాల కాల్పుల విరమణ నిర్ణయానికి.. ఇజ్రాయెల్ మద్దతు తెలుపుతోంది. ఇరాన్ నుంచి ఎదురయ్యే అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పులు నిర్వీర్యం చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ అండగా ఉంటుంది. రాబోయే చర్చల్లో ఈ లక్ష్యాలను సాధించేందుకు అమెరికా కట్టుబడి ఉంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదు ' అని ఇజ్రాయెల్ పేర్కొంది.

లెబనాన్‌, దాడులు, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బుధవారం లెబనాన్‌లోని టైర్‌లో జరిగిన పేలుడు తర్వాత వ్యాపిస్తున్న పొగ.

ఒప్పందంలో లెబనాన్ ఉందా, లేదా?

కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ ఉందా? లేదా? అనే విషయంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని ఇందులో కీలక పాత్ర పోషించిన ఇరాన్, పాకిస్తాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెబుతున్నట్లు బీబీసీ ప్రతినిధి డేనియల్ డి సిమోన్ అన్నారు.

అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో 'లెబనాన్ లేదు' అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో, లెబనాన్ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

హిజ్బొల్లా ముప్పు తొలగిపోయే వరకు లిటానీ నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతం తమ నియంత్రణలోనే ఉంటుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలోని గ్రామాలు, ఇళ్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హిజ్బొల్లాను అక్కడి నుంచి తొలగించే వరకు ప్రజలను తిరిగి రానివ్వబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది.

కాల్పుల విరమణ ప్రకటనకు కొద్దిసేపటి ముందే దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది మరణించగా, 22 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గత కొన్నివారాలుగా హిజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)