‘‘పాకిస్తాన్ బాగా పనిచేస్తోంది’’ - ట్రంప్ ప్రశంసలు, ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం ఉందని వెల్లడి

ఫొటో సోర్స్, Ian Maule/Bloomberg via Getty Images Trump Turns From Iran To Economy As GOP Faces Midterm Stress
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం తాను స్వయంగా ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ఒక ప్రశ్నకు సమాధానంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించిన ట్రంప్.. ఆయన తనకు 'మంచి మిత్రుడు' అన్నారు.
శాంతి ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం తెహ్రాన్‌లో ఉండడం గమనార్హం.
ఆయన గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు.
ఇరాన్‌తో శాంతి చర్చలు, పాకిస్తాన్‌లో పర్యటించే అవకాశాల గురించి వైట్‌హౌస్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ "పాకిస్తాన్ బాగా పనిచేస్తోంది. పాకిస్తాన్‌లో ఒప్పందం కుదిరితే, ఇస్లామాబాద్ వెళ్తాను" అన్నారు.
పాకిస్తాన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, "పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ప్రధాన మంత్రి చాలా బాగా పనిచేస్తున్నారు. నేను అక్కడికి వెళ్లే అవకాశముంది" అన్నారు.
న్యూయార్క్ పోస్టుకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావచ్చని పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, @USAmbIndia
మోదీపైనా ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవలి ఫోన్ సంభాషణ గురించి అడిగినప్పుడు, "ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. ఆయన నా స్నేహితుడు, గొప్పగా పనిచేస్తున్నారు" అని ట్రంప్ అన్నారు.
మరోవైపు, అమెరికా - ఇరాన్ మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, హోం మంత్రి మొహ్సీన్ నఖ్వీ తమ ప్రతినిధి బృందంతో తెహ్రాన్ వెళ్లారు.
ఇస్లామాబాద్‌లో గత శనివారం అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు 21 గంటలపాటు సాగిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.
చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ తమ ప్రతినిధుల బృందంతో శనివారం ఇస్లామాబాద్ వచ్చారు.
ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు.

ఫొటో సోర్స్, JIM WATSON/AFP via Getty Images
'ఇరాన్ యుద్ధం త్వరగా ముగిసిపోవాలి'
అమెరికాలోని నెవాడాలో గురువారం రాత్రి జరిగిన టాక్స్ డే రౌండ్‌టేబుల్ సమావేశంలో ఇరాన్ యుద్ధం గురించి కూడా డోనల్డ్ ట్రంప్ ప్రస్తావించారు.
ఇరాన్ యుద్ధం 'త్వరగా ముగిసిపోవాలి' అని ట్రంప్ అన్నారు.
"ఇరాన్‌లో యుద్ధం అంశం బాగా పురోగమిస్తోందని చెబుతాను, అది త్వరగా ముగిసిపోవాలి" అని ఆయన అన్నారు.
రెండో విడత శాంతి చర్చల కోసం చర్చలు 'కొనసాగుతున్నాయని' వైట్‌హౌస్ చెబుతోంది. కానీ చర్చల సమయం, ప్రదేశం ఇంకా ఖరారు కాలేదు.
హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగించి, ఇరాన్ నౌకలను ఇబ్బందులు కలిగిస్తే కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరగొచ్చని ఈ వారం మొదట్లో ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనం సోమవారం నుంచి ప్రారంభమవడం గమనార్హం.
తొలి 24 గంటల్లో ఏ ఓడ కూడా దిగ్బంధనాన్ని ఉల్లంఘించలేదని, అయితే ఒమన్ గల్ఫ్‌లో 6 వాణిజ్య నౌకలు వెనుదిరగాల్సి వచ్చిందని అమెరికా సైన్యం బుధవారం తెలిపింది.
అయితే, ఇరాన్ కొత్త హెచ్చరికలకు ముందు ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, "మా పని ఇంకా పూర్తి కాలేదు" అన్నారు. యుద్ధం ముగింపునకు చాలా దగ్గరగా ఉందని, ఇరాన్‌తో మంచి ఒప్పందం ఖరారవుతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ - లెబనాన్ కాల్పుల విరమణ
అంతకుముందు, ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు హిజ్బొల్లా(దక్షిణ లెబనాన్‌లోని ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూపు) కట్టుబడి ఉండాలని డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
"ఈ క్లిష్ట సమయంలో హిజ్బొల్లా సముచితంగా ప్రవర్తిస్తుందని ఆశిస్తున్నా" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.
"అలా చేస్తే, అది వారికి మంచి సమయం అవుతుంది. ఇకపై హత్యలు ఉండవు, చివరికి శాంతి నెలకొనాలి."
దానికి ముందు, లెబనాన్ - ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు.
భారత కాలమానం ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
కాల్పుల విరమణ ప్రకటన చేస్తూ రాసిన పోస్టులో తాను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు.
సాంకేతికంగా చూస్తే, ఇజ్రాయెల్ - హిజ్బొల్లా స్ధావరమైన లెబనాన్ మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
ఈ కాల్పుల విరమణ సమయంలో, హిజ్బొల్లా దాడులకు మాత్రమే ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందిస్తుందని ఇజ్రాయెల్ అధికారి బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
ఇరాన్ మద్దతు గల ఈ గ్రూపు ఆయుధాలు వీడితే సమగ్ర శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































