అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

అరుణాచలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భక్తులు
ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో
    • రచయిత, మాయకృష్ణన్ కన్నన్
    • హోదా, బీబీసీ తమిళ్ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ మార్గంలోని ‘ఇడుక్కు పిళ్లయార్’ ఆలయంలో(మోక్ష మార్గం) చిక్కుకుపోయి బయటకు రాలేక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత ఆలయంలోపలకు వెళ్లడంపై ఆంక్షలు విధించారు.

అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ అనే ఆలయం చాలా ఇరుకుగా ఉంటుంది. దీన్ని తెలుగు భక్తులు మోక్ష మార్గంగా పిలుస్తుంటారు.

భక్తులు వెనకద్వారం నుంచి ఒరిగి పడుకున్నట్టుగా ఆలయంలోపలికి ప్రవేశించి, చేతులను ఆసరాగా చేసుకుకుని నెమ్మదిగా ముందుకు కదిలి ముందు ద్వారంలోంచి బయటకు వస్తారు.

ఈ మార్గంలో ఒకరు మాత్రమే లోపలికి వెళ్లగలరు. ముఖ్యంగా స్థూలకాయులు లోపలికి వెళ్లి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.

గుహలాంటి మార్గం నుంచి బయటకు రాగానే నంది విగ్రహం కనిపిస్తుంది. భక్తులు బయట నంది, పిళ్ళయార్‌ను పూజిస్తారు.

తెలుగు రాష్ట్రాల భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చుని ఈ ఇరుకైన గుహలోకి ప్రవేశించి బయటకు వస్తుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘బయటకు రాలేకపోతున్నానన్న ఆందోళనలో’

ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ తన కుటుంబంతో కలిసి గిరి ప్రదక్షిణకు వెళ్లారు. రాత్రిపూట ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి వచ్చిన మణికుమార్ గుహలాంటి ఇరుకైన మార్గంలోకి ప్రవేశించారు. ఆ గుహ నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు.

బయటకు రావడంలో ఎదురైన ఇబ్బందితో ఆందోళనకు గురైన మణికుమార్‌కు రక్తపోటు పడిపోయి, అస్వస్థతకు లోనయ్యారని, ఈ క్రమంలో స్పృహ తప్పిందని పోలీసులు తెలిపారు.

దీంతో మణికుమార్‌ను చికిత్స కోసం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో మణికుమార్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్టు ప్రకటించారు. తిరువణ్నామలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న భక్తులు గుహ లాంటి ప్రదేశంలోకి ప్రవేశించడం, బయటకు రావడం వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డాక్టర్ శ్వేత అంటున్నారు.

అధిక రద్దీ, ఇరుకైన ప్రదేశాల్లో ఏర్పడే ఒత్తిడి ఇలాంటి ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

అరుణాచలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భక్తులు
ఫొటో క్యాప్షన్, ఆలయ పరిసరాల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు.

ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల భక్తులే ఎక్కువ

అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి శతాబ్దానికి పైగా చరిత్ర ఉందని, ఇది కుబేర లింగం, ఈశాన్య లింగం మధ్య ఉన్న ఉన్న ఒక చిన్న ఆలయమని అరుణాచలంలోని అన్నామలయ్యార్ ఆలయ ప్రధాన పూజారి పీటీ రమేశ్ ‘బీబీసీ తమిళ్’కు తెలిపారు.

"భక్తులు తమ పూజలు, నమ్మకాల ఆధారంగా ఈ దర్శనం చేసుకుంటున్నారు" అని ఆయన చెప్పారు.

"ఈ ఇడుక్కు పిళ్ళయార్ ఆలయం చిన్నది. ఇక్కడ తమిళనాడుకంటే తెలుగు రాష్ట్రాల భక్తులే దర్శనం కోసం పొడవైన క్యూలలో నిలబడతారు" అని అరుణాచలంలోని గిరివలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించే తిరుకోవిలూర్ ప్రాంతానికి చెందిన భక్తుడు పళనిస్వామి చెప్పారు.

"నేను చాలా సంవత్సరాలుగా తిరువణ్ణామలైకి వస్తున్నాను, కానీ ఈ ఆలయంలో ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకున్నా. ఆ గుహలో ఒరిగి పడుకుని అక్కడికి వెళ్లాలి. స్థూలకాయులకు లోపలికి వెళ్లడం, బయటకు రావడం చాలా కష్టంగా ఉంటుంది" అని పళనిస్వామి చెప్పారు.

అరుణాచలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భక్తులు
ఫొటో క్యాప్షన్, పైల్ ఫోటో

ఆలయం ప్రవేశ మార్గం వెడల్పు ఒక అడుగు, ఎత్తు రెండు అడుగులు

‘14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ ఆలయం ప్రవేశ ద్వారం ఒక అడుగు వెడల్పు, రెండు అడుగుల ఎత్తు ఉంటుంది" అని తిరువణ్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయ జాయింట్ కమిషనర్ పరణిథరన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మరణించిన నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ఆలయం సమీపంలో అవగాహన సందేశాలతో కూడిన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

" ఇడుక్కు పిళ్ళయార్ ఆలయ ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. భక్తుల సంక్షేమం, భద్రత దృష్ట్యా స్థూలకాయులు, బలహీనంగా ఉన్నవారు, వృద్ధులను లోపలికి అనుమతించరు" అని హెచ్చరిక బోర్డులో ఉంది.

ప్రస్తుతం గిరివల పండుగ రోజుల్లోనే కాకుండా ముఖ్యమైన ప్రత్యేక రోజులలో కూడా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నందున ఇడుక్కు పిళ్ళయార్ ఆలయ ప్రాంతంలో భద్రతా విధుల కోసం శాశ్వతంగా పోలీసు సిబ్బందిని నియమించాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు ఒక లేఖ సమర్పించామని, దానికి పోలీస్ శాఖ సానుకూలంగా స్పందించిందని జాయింట్ కమిషనర్ పరణిథరన్ తెలిపారు.

ఆంధ్ర భక్తుడు మృతి తరువాత గుహలో చిక్కుకుపోయిన ఒక మహిళను రక్షిస్తున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"అది పాత వీడియో. దాన్ని కొన్ని నెలల క్రితం తీశారు. ఇప్పుడు తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు" అని పరణిథరన్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)