పాకిస్తానీ సైన్యం సౌదీ అరేబియాలో ఏం చేస్తోంది?

పాకిస్తాన్, సౌదీ అరేబియా, రాజకీయాలు, అమెరికా, సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2026 ఏప్రిల్ 10, న ఇస్లామాబాద్‌లోని 'రెడ్ జోన్' ప్రాంతంలో పాకిస్తానీ సైనికులు. (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, నస్రీన్ హతుమ్
    • హోదా, బీబీసీ అరబిక్
  • చదివే సమయం: 6 నిమిషాలు

కొన్ని రోజుల క్రితం పాకిస్తానీ యుద్ధ విమానాలు, సైనిక దళాలు సౌదీ అరేబియాకు చేరుకున్నాయి. గతేడాది ఇరుదేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగానే ఈ మోహరింపు జరిగిందని భావిస్తున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా దాన్ని రెండో దేశంపై కూడా దాడిగానే పరిగణిస్తారు. దాడికి గురైన దేశానికి రెండో దేశం సైనిక సహాయం అందిస్తుంది.

ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే మార్గాన్ని కనుగొనే లక్ష్యంతో ఇరాన్-అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో ఈ పరిణామం జరిగింది.

అయితే తొలిదశ చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించనప్పటికీ, రాబోయే రోజుల్లో రెండో విడత చర్చలు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతతో పాటు ఉమ్మడి రక్షణ సహకారాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా పాకిస్తానీ సైనికులను మోహరించినట్లు సౌదీ రక్షణ శాఖ స్పష్టం చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘'పాకిస్తాన్ సైనికులు సౌదీ అరేబియా వచ్చింది ఎవరిపైనా దాడి చేయడానికి కాదు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాకిస్తానీ అధికారి ఒకరు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపారు.

ఈ సమయంలో ఇటువంటి చర్య తీసుకోవడం అన్నది దాని వ్యూహాత్మక పరిణామాల గురించి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా భద్రతా హామీల భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు జరిపిన తీరు, ఆ దేశాలకు అమెరికా ఇచ్చిన భద్రతా హామీలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

అంతేకాకుండా చైనా సహకారంపై ఆధారపడిన పాకిస్తాన్‌కు, సైనిక సాంకేతికతను అమెరికా రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేయడం కూడా పెద్ద సవాలుగా మారింది.

పాకిస్తాన్ తనను తాను అమెరికా, ఇరాన్ రెండు దేశాలకూ మిత్రదేశంగా చెప్పుకుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దాడుల తర్వాత సౌదీ అరేబియాకు తన సైన్యాన్ని పంపడమన్నది పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సుమారు ఏడాది కిందట పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సౌదీ అరేబియా తనకంటూ ఒక అదనపు భద్రతా వలయాన్ని సృష్టించుకుందని, తద్వారా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పాకిస్తాన్, సౌదీ అరేబియా, రాజకీయాలు, అమెరికా, సైనికులు

ఫొటో సోర్స్, Royal Court of Saudi Arabia/Anadolu Agency via Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా గతేడాది రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.(ఫైల్ ఫోటో)

అమెరికాపై నమ్మకం తగ్గిపోయిందా?

గల్ఫ్ దేశాల్లో అమెరికా-ఇరాన్ యుద్ధ నిర్ణయంపై అసంతృప్తి పెరిగింది. అమెరికా తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, గల్ఫ్ దేశాల నష్టాలను పట్టించుకోలేదనే భావన ఉంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) గల్ఫ్ దేశాల్లోని కీలకమైన చమురు, పౌర సౌకర్యాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. దీంతో, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని అక్కడి దేశాల్లో అసహనం పెరిగింది.

రెండు దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం కింద సౌదీ గడ్డపై పాకిస్తానీ వైమానిక దళాన్ని మోహరించడం, సౌదీ అరేబియా తన భద్రతా హామీలను భిన్నంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చూపిస్తోందని సౌదీ భద్రతా, వ్యూహాత్మక నిపుణులు హసన్ అల్-షహ్రీ అంటున్నారు.

ఒకవైపు అమెరికాతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, మరోవైపు పాకిస్తాన్‌తో ప్రత్యేక సమాంతర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేసుకునే ఈ చర్యను ఒక తెలివైన ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు.

2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్-ఎస్ఎమ్‌డీఏ) ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే, అది రెండింటిపై జరిగినట్టే పరిగణిస్తారు.

ఇటీవల గల్ఫ్ దేశాల్లో అమెరికా భద్రతపై నమ్మకం కొంత తగ్గింది. తాజా పరిణామాలను కూడా అదే కోణంలో చూస్తున్నారు.

పాకిస్తాన్‌తో కుదిరిన ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం సౌదీ అరేబియాను ఎలా బలోపేతం చేస్తుందో అల్-షహ్రీ వివరించారు.

సౌదీ అరేబియాలో పాక్ సైన్యం ఉండటం వల్ల ఇరాన్, దాని మిత్రదేశాలు సౌదీ అరేబియా లేదా గల్ఫ్ దేశాలపై దాడి చేయడానికి ముందు మరోసారి ఆలోచించే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు.

పాకిస్తాన్, సౌదీ అరేబియా, రాజకీయాలు, అమెరికా, సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియా థాడ్, బాలిస్టిక్ రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)

పాకిస్తాన్ ఏం సందేశమివ్వాలనుకుంటోంది?

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం మొదలుకావడానికి కొన్ని నెలల ముందే ఈ రక్షణ ఒప్పందం కుదిరింది.

అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం సౌదీ అరేబియాకు రావడం, ఈ ఒప్పందం ఎంత ముఖ్యమో చూపిస్తోంది. అయితే దీని ఉద్దేశ్యం దాడి చేయడం కాదని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.

2015లో యెమెన్ యుద్ధ సమయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను సైనిక సాయం కోరింది, కానీ ఆ సమయంలో పాకిస్తాన్ పార్లమెంట్ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

'ఇప్పుడు రెండు దేశాల మధ్య అధికారిక రక్షణ ఒప్పందం కుదిరినందున పరిస్థితి భిన్నంగా ఉంది' అని అల్-షహ్రీ అన్నారు.

"యెమెన్ యుద్ధంలో సౌదీ అరేబియా దాడి స్వభావం (అటాకింగ్ మోడ్)తో వ్యవహరించింది, అయితే ప్రస్తుత సంఘర్షణలో సౌదీ అరేబియా వైఖరి ఇప్పటివరకు రక్షణాత్మకం(డిఫెన్సివ్)గానే ఉంది" అని రక్షణ వ్యవహారాలపై రాసే అమెరికన్ జర్నలిస్ట్ సెబాస్టియన్ రాబ్లిన్ బీబీసీతో అన్నారు.

"సౌదీ అరేబియాలో పాకిస్తాన్ సైనిక మోహరింపు కేవలం ప్రతీకాత్మకం. ఇది పాకిస్తాన్ తన మిత్రదేశాలతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉందని చూపించే సంకేతం మాత్రమే" అని సెంటర్ ఫర్ అరబ్-యురేషియన్ స్టడీస్‌లోని సౌత్ ఏషియా స్టడీస్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ ముస్తఫా షలాష్ అన్నారు.

యుద్ధం మొదలైన ఒక నెల తర్వాత పాకిస్తాన్ పాత్రపై వచ్చిన సందేహాలకు ఇది ఒక సమాధానమని, అందువల్ల దీన్ని పెద్ద స్థాయి సైనిక భాగస్వామ్యం కంటే ఒక సంకేతాత్మక చర్యగానే చూడాలని ఆయన అన్నారు.

సౌదీ అరేబియాతో ఒప్పందం ఉన్నప్పటికీ, ఇరాన్ దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడంలో పాకిస్తాన్ సౌదీ అరేబియాకు ఎందుకు సహాయం చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తడం గమనార్హం.

సౌదీ అరేబియా అమెరికాకు ఏదైనా సందేశం పంపుతోందా?

పాకిస్తాన్ ఒక ప్రధాన సైనిక, అణుశక్తి అయినప్పటికీ ఆర్థికంగా బలహీనంగా ఉందని డాక్టర్ షలాష్ బీబీసీతో అన్నారు.

పాకిస్తాన్ కోసం సౌదీ-ఖతార్ దేశాలు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 46,604.5 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని అందించే అవకాశం ఉందని ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలతో కూడా ఆయన దీన్ని ముడిపెట్టారు. కానీ దీన్నిఅధికారికంగా ధృవీకరించలేదు.

'ఏప్రిల్ 15న సౌదీ ఆర్థిక శాఖ నుంచి 2 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధులు అందాయి' అని పోయిన గురువారం ఎక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ పోస్ట్ చేసింది.

మరోవైపు అమెరికాతో 'అస్థిరమైన' సంబంధాల మధ్య సౌదీ అరేబియా ఇతర పార్టనర్‌షిప్‌లను అభివృద్ధి చేస్తోందని సెబాస్టియన్ రాబ్లిన్ అభిప్రాయపడ్డారు.

"ఇది ఒక విధంగా అమెరికాకు సందేశం ఇవ్వడమే. తమ భాగస్వామ్యాన్ని కొనసాగించాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన" అని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం సౌదీ అరేబియాలో ఉండటం, సౌదీకి ఇతర మిత్రదేశాలను కూడా తనతో కలుపుకునే సామర్థ్యం ఉందని చూపిస్తోంది.

అయితే ఇరాన్ దృక్కోణం నుంచి కూడా పాకిస్తాన్ ఉనికి ముఖ్యమైందని రాబ్లిన్ అన్నారు.

"ఏదైనా ఇరాన్ డ్రోన్ దాడిలో పాకిస్తాన్ సైనికుడు మరణిస్తే, అది ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ రెండు దేశాలు నేరుగా సరిహద్దు పంచుకుంటూ ఉండటం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టం కావచ్చు" అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)