రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, X/ncbn
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)
రంపచోడవరంలో ఈనెల 24న జరిగిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌లో పదో తరగతి విద్యార్థిని శివాని ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒకే వేదిక పంచుకుంది.
ఆ వేదికపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడి, బాగా చదివి 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానని ఆయనకు మాట కూడా ఇచ్చింది.
అయితే, ఆ కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత, జులై 26 రాత్రి, శివాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
పోలవరం జిల్లా రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ రెండు రోజుల మధ్య ఏం జరిగింది? శివాని మృతిపై పోలీసుల దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?

మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో
2026 జులై 24న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో రంపచోడవరం జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని శివానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఒకే వేదికపై మాట్లాడే అవకాశం లభించింది.
"సభకు నమస్కారం, నా పేరు శివానీ. మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0లో సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది" అంటూ చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది శివానీ.
చదువుపై తన లక్ష్యాలను, పాఠశాల అనుభవాలను ఆమె వివరించింది. ఆమె మాట్లాడిన తీరు ముఖ్యమంత్రిని ఆకట్టుకోవడంతో, ఆయన శివానిని తన పక్కన కూర్చోబెట్టుకుని అభినందించారు. ఈ సందర్భంగా తాను కష్టపడి చదివి ప్రభుత్వం ఇచ్చే "షైనింగ్ స్టార్" అవార్డు సాధిస్తానని శివాని సీఎంకి చెప్పింది.
"షైనింగ్ స్టార్ అవార్డు" అనేది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిభా పురస్కారం. ఇందులో మెరిట్ సర్టిఫికెట్, మెడల్‌తో పాటు రూ. 20 వేల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేస్తారు. 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది. ఆ కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత, జులై 26 రాత్రి శివాని మృతి చెందింది.
శివాని మృతి కేసులో రంపచోడవరం పోలీసులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
రంపచోడవరం పోలీసులు బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, శివాని తన అమ్మమ్మ వద్ద ఉంటూ, రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఆమె తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుండగా, తండ్రి హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు గత పదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో శివాని అప్పుడప్పుడు గోకవరం మండలంలో ఉంటున్న తండ్రి వద్దకు వెళ్లి వస్తుండేదని చెప్పారు.
జులై 26న తన పుట్టినరోజు సందర్భంగా శివాని తండ్రి వద్దకు వెళ్లి, అదే రోజు సాయంత్రం అమ్మమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం తన గదిలోకి వెళ్లిన ఆమె, మరుసటి రోజు ఉదయం మరణించి ఉండటం కుటుంబ సభ్యులు గమనించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఒక లేఖ లభించినట్లు పోలీసులు తెలిపారు.
చాక్లెట్లు కొనుక్కోడానికి డబ్బులిచ్చా: తండ్రి
"ఆదివారం (జులై 26) పాప పుట్టినరోజు. నన్ను కలిసేందుకు మా బిర్యానీ పాయింట్‌కు వచ్చింది. సాయంత్రం వరకు నాతోనే ఉంది. ఆ సమయంలో ఆమె ప్రవర్తనలో ఎటువంటి బాధ కనిపించలేదు. ముఖ్యమంత్రితో కలిసి ఒకే స్టేజ్ మీద మాట్లాడినందుకు అభినందించా. సాయంత్రం చీకటి పడుతున్నందున అక్కడే ఉండిపోవాలని నేను చెప్పినా నా మాట వినలేదు, బయలుదేరిపోయింది. చాక్లెట్లు కొనుక్కొడానికి డబ్బులు ఇచ్చాను. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేశాను. 'దారిలో ఉన్నా డాడీ' అని చెప్పింది. అదే నా కూతురు నాతో చెప్పిన చివరి మాటలు" అని శివాని తండ్రి బీబీసీతో చెప్పారు.
శివానీ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య విభేదాలున్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. అయితే ఈ విషయం ఒక్కటే ఘటనకు కారణమని నిర్ధరించే ఆధారాలు ఇప్పటి వరకు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సైకాలజిస్టులు ఏమన్నారంటే...
యుక్తవయసులో పిల్లలు అనేక భావోద్వేగ మార్పులను ఎదుర్కొంటారని, పెద్దవారికి చిన్న సమస్యగా కనిపించే విషయం కూడా వారికి చాలా తీవ్రమైనదిగా అనిపించే అవకాశం ఉంటుందని ఆంధ్రాయూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీతో అన్నారు.
"పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వారితో మాట్లాడటం, వారి మాటలను ఓపికగా వినడం చాలా ముఖ్యం. ఒకే సంఘటన ఆధారంగా ఇలాంటి విషాదాలకు కారణాన్ని నిర్ధరించడం సరికాదు. ప్రతి ఘటనకు సంబంధించిన పరిస్థితులను విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుంది" అని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు చెప్పారు.
ఇప్పటి వరకు ఏం తేలిదంటే...
శివాని మృతి వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించామని రంపచోడవరం ఎస్ఐ రమేశ్ బీబీసీతో చెప్పారు.
"శివాని తల్లిదండ్రులిద్దరు పదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. శివాని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. పాపకి ఏ అవసరం వచ్చినా కూడా అమ్మమ్మతో పాటు తల్లిదండ్రులు చూసుకునేవారు. పాపకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. శివాని రాసిన లేఖలోని అంశాలు మాత్రం తల్లిదండ్రులు కలిసి ఉంటే బాగుంటుందనే భావన వచ్చేటట్లు ఉన్నాయి. ఆ లేఖ ఎవరు రాశారనేది కూడా నిర్ధరణ కావాల్సి ఉంది. తను ఆత్మహత్య చేసుకుందా? లేక ఇంకా ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం" అని ఎస్ఐ రమేశ్ తెలిపారు.
శివానీ చాలా ధైర్యవంతురాలని, తల్లిదండ్రులిద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ బాధపడకుండా, చదువుకుంటూ అందరితోనూ కలివిడిగా తిరుగుతూ, సరదాగా ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారని ఎస్ఐ తెలిపారు. మరో వారం రోజుల్లో రిపోర్ట్ వస్తే, తుది నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఎస్ఐ రమేశ్ చెప్పారు.
'కాల్ డేటా సేకరిస్తున్నాం'
"దర్యాప్తులో భాగంగా ఏపీఎఫ్ఎస్‌ఎల్, క్లూస్ టీంలు ఘటనా స్థలి వద్ద ఆనవాళ్లు, ఫోటోలు, వీడియో డాక్యుమెంటేషన్, భౌతిక నమూనాలు సేకరించాయి. సంఘటన స్థలంలో లభించిన లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. శివాని తల్లిదండ్రుల ఫోన్లను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా సేకరిస్తున్నాం. కుటుంబ సభ్యులు, స్థానికులు, పాఠశాల సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేశాం అని ఎస్ఐ రమేశ్ వివరించారు.
ఈ ఘటనకు నిర్దిష్ట కారణం ఇంకా స్పష్టం కాలేదని, ఫోరెన్సిక్ తుది నివేదిక ఆధారంగా స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, x.com/ncbn
చంద్రబాబు ఏమన్నారంటే..
శివాని మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన విద్యార్థిని మరణించడం తనను కలచివేసిందని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
ఆ కార్యక్రమంలో శివాని తన చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తనతో మాట్లాడిన విషయాలు గుర్తుకు వస్తున్నాయని, మంచి భవిష్యత్తు ఉన్న గిరిజన విద్యార్థినిని ఇలా కోల్పోవడం బాధాకరమని అన్నారు.
శివాని మృతిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. టీచర్స్ మీటింగ్‌లో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని మరణం తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. విషయం తెలిసినప్పటి నుంచి శివాని మాటలు పదేపదే గుర్తుకు వస్తున్నాయని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా మిగిలిపోకుండా సహాయం కోరాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఘటనాస్థలిని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ బృందం, క్లూస్ టీమ్ పరిశీలించి ఆధారాలను సేకరించాయని రంపచోడవరం సీఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలు, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
(మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే, దిగువన ఉన్న హెల్ప్‌లైన్‌ల ద్వారా మీకు అవసరమైన సహాయం పొందవచ్చు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000).
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























