10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

ఫొటో సోర్స్, Punit PARANJPE/AFP via Getty Images
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024ను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ యాక్ట్-2026' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
పేపర్ లీకేజీలు, వ్యవస్థీకృత మాఫియా కాపీయింగ్‌ను అడ్డుకోవడం దీని లక్ష్యం.
దీనితోపాటు పరీక్షలు నిర్వహించే సంస్థల బాధ్యతను ఖరారు చేస్తూ ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
అయితే, పార్లమెంటు ఉభయ సభల్లోనూ జరుగుతున్న గందరగోళం కారణంగా ఈ బిల్లుపై ఇప్పటివరకు చర్చ ప్రారంభం కాలేదు..
2026 సవరణ బిల్లులో ఉన్న ముఖ్యమైన మార్పులు ఇవే:


2024 చట్టం:
- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష
- గరిష్ఠంగా 10 లక్షల రూపాయల వరకు జరిమానా
2026 సవరణ బిల్లు:
- జైలు శిక్షా కాలాన్ని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెంచాలని ప్రతిపాదన
- జరిమానాను గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదన
పరీక్షలు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలు
2024 చట్టంలో పరీక్షలు నిర్వహించే సంస్థల బాధ్యతలను ఖరారు చేశారు. అయితే 2026 బిల్లులో వీటిని మరింత కఠినతరం చేశారు.
2026 సవరణ బిల్లులో:
- తప్పు చేసినట్లు రుజువైతే పరీక్ష నిర్వహించే ఏజెన్సీలపై రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు.
- ఏజెన్సీకి చెందిన బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకునే నిబంధన ఉంది.

ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images

2026 బిల్లులో వ్యవస్థీకృత పద్ధతిలో పేపర్ లీకేజీలకు పాల్పడే ముఠాలకు శిక్ష, జరిమానా పెంచాలని ప్రతిపాదించారు.
2024 చట్టం:
- కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష
- కనీసం కోటి రూపాయల జరిమానా
2026 సవరణ బిల్లు:
- కనీసం ఏడేళ్ల జైలు శిక్ష
- కనీసం రూ. 10 కోట్ల జరిమానా
2026 సవరణ బిల్లులో పేపర్ లీకేజీలు, పరీక్షలకు సంబంధించిన నేరాల విచారణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే నిబంధనను చేర్చారు. దీనివల్ల ఇలాంటి కేసుల విచారణ వేగంగా జరుగుతుంది. ఇది కాకుండా, విచారణ సకాలంలో పూర్తి కావడానికి వీలుగా, విచారణను రెండు నెలల గడువులోగా పూర్తి చేయాలని బిల్లులో కాలపరిమితిని నిర్ణయించారు.
బిల్లులో పరీక్షలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నిబంధనను చేర్చారు.
ఇలాంటి కేసుల్లో వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. వేగవంతమైన, సమర్థవంతమైన విచారణ ప్రక్రియ కోసం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే నిబంధనను బిల్లులో పొందుపరిచారు.

ఫొటో సోర్స్, Anshuman Poyrekar/Hindustan Times via Getty Images
బలమైన అప్పీల్ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెబుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులపై దాఖలయ్యే అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విచారించాలని బిల్లులో ప్రతిపాదించారు.
అలాగే, అప్పీల్ స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల లోపు దానిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో, తీర్పు వచ్చిన 30 రోజుల లోపల అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆలస్యానికి గల కారణాలపై హైకోర్టు సంతృప్తి చెందితే.. ఆ ఆలస్యం 90 రోజులకు మించకూడదని బిల్లులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

పరీక్షల సంస్కరణలపై సాంకేతిక రంగ ప్రముఖుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జులై 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఆ టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే పరీక్షల విశ్వసనీయతను కాపాడటానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
"విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారు జైళ్లలో మగ్గుతున్నారు. మనం ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశాం. రేపు పార్లమెంటులో కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు.
"అయితే, మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన పరీక్షా విధానం నమ్మదగినదిగా, పారదర్శకంగా ఉండాలి. పరీక్షల్లో సాంకేతికతను గరిష్ఠంగా ఉపయోగించాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని గారి నాయకత్వంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం" అని పేర్కొన్నారు.
వార్తా సంస్థలు ఏఎన్ఐ, ఐఏఎన్ఎస్ కథనాల ప్రకారం.. "ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్‌లో సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులు"
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























