క్యాబేజీలను ఫ్రెష్‌గా ఉంచడానికి ఫార్మాల్డిహైడ్‌ వాడకం.. చైనాలో దర్యాప్తు

ఫార్మాల్డిహైడ్‌, క్యాబేజీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా బికర్
    • హోదా, చైనా కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

చైనాలో క్యాబేజీలను తాజాగా ఉంచేందుకు ఫార్మాల్డిహైడ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై అక్కడి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

క్యాబేజీలను ఓ సొల్యూషన్‌లో ముంచిన అనంతరం వాటిని రవాణా కోసం ట్రక్కుల్లోకి ఎక్కిస్తున్న వీడియోను పరిశీలించిన ఈశాన్య చైనాలోని హెబెయ్ ప్రావిన్స్ అధికారులు , అది నిజమైనదేనని నిర్ధరించినట్లు తెలిపారు.

పర్యావరణ అంశాలపై రాసే ఓ బ్లాగర్ గత వారం ఈ వీడియోను తొలిసారిగా విడుదల చేశారు.

జీవ నమూనాలను భద్రపరచడానికి ఉపయోగించే రంగులేని రసాయనమైన ఫార్మాల్డిహైడ్‌ను ఆహారాన్ని తాజాగా ఉంచేందుకు ఉపయోగించడం చైనాలో పూర్తిగా నిషేధం.

ఫార్మాల్డిహైడ్ క్యాన్సర్‌కు కారణమవుతుందని కూడా గుర్తించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫార్మాల్డిహైడ్‌, క్యాబేజీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో క్యాబేజీలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనానే. వాటిలో ఎక్కువ భాగం ఆసియాలోని పొరుగు దేశాలకు ఎగుమతి అవుతాయి.

ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ మీడియా సంస్థలు తెలిపాయి.

ప్రజల్లో భయాందోళనలు తలెత్తకుండా, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రభావితమైన కూరగాయలను గుర్తించి వాటి సరఫరా మార్గాన్ని ట్రేస్ చేసి చర్యలు తీసుకోనున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

"ఏవైనా చట్టవిరుద్ధమైన లేదా నిబంధనలకు విరుద్ధమైన చర్యలను గుర్తిస్తే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాం" అని కాంగ్‌బావో కౌంటీ స్థానిక అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

చైనా రాజధాని బీజింగ్‌లో తాజా కూరగాయలు ఇతర ఆహార ఉత్పత్తుల ప్రధాన సరఫరా కేంద్రాల్లో ఒకటైన షిన్‌ఫాదీ మార్కెట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మార్కెట్‌కు వచ్చే క్యాబేజీలు ఎక్కడి నుంచి వచ్చాయో పరిశీలించామని, ప్రభావితమైన క్యాబేజీలేవీ తమ మార్కెట్‌లోకి రాలేదని తెలిపింది.

ఈ ఘటన చైనాలో విస్తృతంగా మీడియా దృష్టిని ఆకర్షించింది.

"హోల్‌సేల్ వ్యాపారులు తమ తక్షణ ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి సారించి, వినియోగదారుల ప్రాణాలు, ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించారు. వారు చట్టపరమైన హద్దును దాటి, నైతిక పరిమితినీ ఉల్లంఘించారు" అని పీపుల్స్ డైలీలో ప్రచురితమైన సంపాదకీయంలోవ్యాఖ్యానించారు.

చైనాలో ఏటా 3 కోట్ల టన్నులకు పైగా క్యాబేజీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ప్రపంచ వార్షిక ఉత్పత్తిలో దాదాపు సగం. క్యాబేజీలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో వియత్నాం, దక్షిణ కొరియా, రష్యా కూడా ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)