మనుస్మృతి: రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మహిళా నాయకులు ఏమంటున్నారు?

మనుస్మృతి, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

మనుస్మృతిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మహిళల గురించి మనుస్మృతిలో కొన్ని శ్లోకాలు ప్రస్తావిస్తూ.. మహిళలను ఎవరి అధీనంలోనూ ఉంచకూడదంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.

మనుస్మృతిని వాడుకుని రాహుల్ గాంధీ స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ అంటోంది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల మహిళా ప్రతినిధులు, రాజకీయ విశ్లేషకులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ

ఫొటో సోర్స్, insta/Dr.Kadiyam Kavya

ఫొటో క్యాప్షన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య

‘అంబేడ్కర్ మాటలే రాహుల్ గాంధీ చెప్పారు’

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, అదే విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారని చెప్పారు వరంగల్ ఎంపీ కడియం కావ్య.

''ఇందిరా గాంధీ, సోనియా గాంధీ సహా ఎంతోమంది మహిళలకు కాంగ్రెస్ హయాంలోనే దేశంలో అత్యున్నత పదవులు నిర్వర్తించే అవకాశం లభించింది. మహిళలు ఇలా ఉండాలి అని చెప్పడం కాదు.. మహిళలు ఎలా ఉండాలి అనేది వారికి పదవులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చూపించింది. స్వతంత్రంగా ఉండేందుకు మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది'' అని అన్నారు కావ్య.

మనుస్మృతి విషయంలో బీఆర్ అంబేడ్కర్ గతంలో చెప్పిన మాటలనే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పారని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీని విమర్శించే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, మణిపుర్‌లో మహిళలపై హింసకు బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కావ్య అన్నారు.

మహిళలకు స్థానిక సంస్థలలో 50శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దే అని కడియం కావ్య అన్నారు.

బీజేపీ, ఆంధ్రప్రదేశ్, అధికార ప్రతినిధి, సాధినేని యామినీ శర్మ

ఫొటో సోర్స్, FB/ Sadineni Yamini Sharma BJP

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ

‘మనుస్మృతి పేరుతో స్వార్ధ రాజకీయాలు’

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ బీబీసీతో మాట్లాడారు.

''ప్రతి యుగానికి ఒక సొంత 'యుగధర్మం' ఉంటుంది కాబట్టి ప్రస్తుత ఆధునిక భారత దేశంలో మనుస్మృతి చెల్లదు. దానిని ఎవరూ అనుసరించడం లేదు. రాహుల్ గాంధీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కాలం చెల్లిన మనుస్మృతిని వాడుకోవడం ఆపాలి'' అని ఆమె సూచించారు.

సనాతన ధర్మం అంటే 'నిత్య నూతనం'... అంటే కాలాతీతమైందని, నిరంతరం నూతనత్వాన్ని సంతరించుకునేదని ఆమె చెప్పారు.

''రాహుల్ గాంధీ, ఆయన కుటుంబానికి హిందూ ధర్మం గురించి, శాశ్వతమైన వేదాలకు, స్మృతులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అస్సలు తెలియదు'' అని విమర్శించారు యామినీ శర్మ.

నేడు హిందూ కుటుంబాల్లోని మహిళలు చదువుకోవడం, ఉద్యోగం చేయడానికి ఎలాంటి ఆంక్షలూ లేవని ఆమె అభిప్రాయపడ్డారు.

''తప్పుడు ఇంగ్లిష్ అనువాదాల ఆధారంగా హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలి. కొన్ని దేశాలు తమ మహిళలకు కనీస హక్కులు కల్పించడంలో చారిత్రకంగా ఎంతో వెనుకబడి ఉన్న సమయంలోనే.. అంటే శతాబ్దాల క్రితమే భారతీయ మహిళలు పాలనా వ్యవస్థ, ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థానాలను అధిరోహించారు'' అని యామినీ శర్మ చెప్పారు.

అయితే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నెగిటివ్ పర్‌స్పెక్టివ్‌తో కాకుండా మహిళా స్వాతంత్య్ర కోణంలో చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి బీబీసీతో చెప్పారు.

''రాహుల్ గాంధీ ఏ విషయం మాట్లాడినా నెగిటివ్ ఆలోచనతో చూస్తున్నారు.. అది అవసరం లేదు. మహిళలు స్వతంత్రంగా ఉండాలని చెప్పడంలో తప్పేముంది'' అన్నారామె.

‘మతం కోణంలో కాదు.. హక్కుల పరంగా చూడాలి’

మనుస్మృతి విషయంలో రాహుల్ వ్యాఖ్యలు హిందూ మతం కోణంలో కాకుండా మహిళల హక్కుల పరంగా చూడాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.

''ఇది ఒక మతానికి సంబంధించిన సమస్యగా కాదు.. మహిళల సమస్యగా చూడాలి. మహిళలు స్వతహాగా ఎదగాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీది. ఆ కోణంలోనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయి. అయినా, మనుస్మృతిలో ఉన్న విషయాన్నే చెప్పారు గానీ లేని విషయాన్ని ఆయనేమీ ప్రస్తావించలేదు. బీజేపీ ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం మానుకోవాలి'' అని స్వర్ణ బీబీసీతో చెప్పారు.

అంబేడ్కర్, స్వర్ణ

ఫొటో సోర్స్, FB/Errabelli Swarna

ఫొటో క్యాప్షన్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

''అసమానతలు తొలగిపోతేనే సమస్యకు పరిష్కారం''

మనుస్మృతి విషయంలో రాహుల్ గాంధీ కొత్త విషయాలేమీ చెప్పలేదని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత బీబీసీతో చెప్పారు.

''మహిళలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాదు, ఏ పార్టీ అయినా వారికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత సమాజం చాలా మారిపోయింది. మహిళలు, పురుషులు అనే భేదాలు పోయి చాలా కాలమైంది'' అని అన్నారు.

మహిళల విషయంలో అసమానతలు పూర్తిగా తొలగిపోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే అణచివేత కూడా తొలగిపోతుందని ప్రొఫెసర్ సుజాత అభిప్రాయపడ్డారు.

ఇదే అంశంపై ఓయూ జర్నలిజం విభాగం మాజీ ప్రొఫెసర్ పద్మజా షా బీబీసీతో మాట్లాడారు.

''ఈ విషయాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మనుస్మృతి భావజాలాన్ని పట్టుకుని వేలాడటం కరెక్ట్ కాదు'' అని అన్నారు.

అన్ని మతాలలో మార్పులు రావాలనుకునే వారు, ముందుగా తమ మతంలో మార్పులు తీసుకురావాల్సిన విషయాన్ని గుర్తించాలని పద్మజా షా అన్నారు.

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు?

మహారాష్ట్రలోని పుణెలో ఆగస్ట్ 22న జరిగిన 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమంలో మనుస్మృతిలోని పలు శ్లోకాలను ప్రస్తావించారు రాహుల్ గాంధీ.

"మహిళలను ఎవరి అధీనంలోనూ ఉంచకూడదు" అని ఆ సందర్భంగా అన్నారు రాహుల్.

"ఒక సమస్య ఉంది, అది చాలా పెద్ద సమస్య. నేను పురుషులతో మాట్లాడినప్పుడల్లా మహిళలను మూడు కోణాల్లోనే చూస్తుంటారు. మహిళలను కూతురు, భార్య లేదా తల్లి రూపంలోనే చూస్తారు.

తల్లి, భార్య, కూతురుగా చూడటంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ, మీ గుర్తింపు అదొక్కటే కాకూడదు. మహిళలు ప్రొఫెషనల్స్, క్రీడాకారిణులు, నాయకులు, క్రియేటర్లు, ఆంత్రప్రెన్యూర్లు.. ఇంకా ఎంతో సాధిస్తున్నారు. అయినా పురుషులు వారికి ఈ మూడు గుర్తింపులనే ఇస్తారు. ఈ మూడు గుర్తింపులకు పురుషులతో సంబంధం ఉంది... తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా" అని రాహుల్ అన్నారు.

"నేను ఇక్కడ మనుస్మృతిని ఉదహరించాలనుకుంటున్నాను. బాల్యంలో మహిళ తన తండ్రి అధీనంలో ఉండాలని అందులో రాసి ఉంది. యవ్వనంలో భర్త అధీనంలో ఉండాలి, భర్త లేనప్పుడు కొడుకుల అధీనంలో ఉండాలి. ఒక మహిళ ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేదని అందులో ఉంది" అన్నారు.

"ఈ విషయం మనుస్మృతిలోనే రాసి ఉంది. ఈ పదాలను చూసి సిగ్గుపడాలి. ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పి ఉండకూడదు" అని రాహుల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)