You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డీలిమిటేషన్: రేవంత్ రెడ్డి చెబుతున్న 'హైబ్రిడ్' మోడల్ ఏమిటి? అది సాధ్యం కాదని బీజేపీ ఎందుకు అంటోంది?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు.
''లోక్‌సభ సీట్ల పునర్విభజన విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రపోజ్ చేయదలుచుకున్నాం. పెంచాలనుకుంటున్న సీట్లలో 50శాతం ప్రొరేటా (దామాషా) ప్రకారం ఇచ్చుకోండి. మిగిలిన 50శాతం సీట్లు జీఎస్డీపీ ప్రాతిపదికన.. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్రాతిపదికన విభజించండి'' అని ప్రతిపాదించారు రేవంత్ రెడ్డి.
దీనివల్ల జనాభా పెరుగుదలను నియంత్రించి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రాష్ట్రాలను గౌరవించినట్లు అవుతుందని చెప్పారు. హైబ్రిడ్ మోడల్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు 'ఎక్స్'లో పోస్టు చేశారు.
అయితే, రేవంత్ రెడ్డి ప్రతిపాదనను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. ''జీఎస్డీపీ ఆధారంగా డీలిమిటేషన్ జరిగే అవకాశం ప్రపంచంలో ఎక్కడా ఉండదు'' అని చెప్పారు.
సాధారణంగా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుందని, జీఎస్డీపీ ఆధారంగా కూడా చేయాలనుకుంటే దక్షిణాదికి మేలు జరగొచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
జీఎస్డీపీ ఆధారంగా ఎవరెక్కడ?
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) అనేది ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కొలవడానికి ముఖ్య సూచిక. ఇది సాధారణంగా ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర పరిధిలో ఉత్పత్తి అయిన అన్ని తుది వస్తువులు, సేవల మొత్తం పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటుంది.
సాధారణ పరిభాషలో చెప్పాలంటే... రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయం ఇది.
భారత్‌లో రాష్ట్రాల జీఎస్డీపీలో చాలా వ్యత్యాసాలున్నాయి.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2025 నివేదిక ప్రకారం, 2011-12 ప్రాతిపదికగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల సూచీ ప్రకారం రూ.26.12లక్షల కోట్ల జీఎస్డీపీతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రాలపరంగా 2024-25 సంవత్సరానికి జీఎస్డీపీలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల జీఎస్డీపీ ఎక్కువగా ఉందనేది దక్షిణాది నేతల వాదన.
అయితే ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల జీఎస్డీపీ మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నింటి కంటే తక్కువగా ఉంది.
''దూరం కాదు, అగాధం ఏర్పడుతుంది''
కేంద్రప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోని స్థానాలను 50శాతం పెంచాలనే ప్రతిపాదన తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.
డీలిమిటేషన్లో భాగంగా పెంచాలనుకుంటున్న లోక్‌సభ స్థానాల్లో సగం స్థానాలు దీని ఆధారంగానే కేటాయించాలని ఆయన సూచిస్తున్నారు.
''జీఎస్డీపీ పరంగా దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, దక్షిణాది రాష్ట్రాలకు కచ్చితంగా డీలిమిటేషన్లో కొంత మేలు జరిగే అవకాశం ఉంది'' అని ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి వివరించారు.
మరోవైపు, డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న స్థానాలకు 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
దీనివల్ల దక్షిణ, ఉత్తర భారతం మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
''ప్రస్తుతం కేరళలో 20 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతరం 60 సీట్లు. ప్రోరేటా ప్రకారం, అంటే.. ఇప్పుడున్న సీట్లలో సగం సీట్లు పెంచితే కేరళలో లోక్ సభ స్థానాలు 30కు పెరుగుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో 120కు చేరుకుంటాయి. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం 90కు చేరుకుంటుంది'' అన్నారు.
''ఇప్పుడు దూరం ఉంది. అప్పుడు ఏకంగా అగాథం ఏర్పడుతుంది. అందుకే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నా'' అని వివరించారు రేవంత్ రెడ్డి.
గత ఐదు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటించి ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన చెబుతున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, పైగా లోక్‌సభలో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్య శాతం ఇప్పటి కంటే స్వల్పంగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారంనాడు లోక్‌సభలో చెప్పారు.
డీలిమిటేషన్లో భాగంగా రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచుతామని ఆయన అన్నారు.
ప్రస్తుతం లోక్ సభలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీల వాటా 23.74 శాతం ఉందని, నియోజకవర్గాల పునర్విభజన అమలు తర్వాత అది 23.97 శాతానికి చేరుతుందని అమిత్‌షా చెప్పారు.
ఈ బిల్లుల విషయంలో విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పార్లమెంట్ ఆమోదం లేకుండా బిల్లులు ఆమోదం పొందలేవనే విషయాన్ని వాళ్లు గుర్తించాలని అమిత్ షా కోరారు.
2029 వరకు జరిగే ఎన్నికలన్నీ ప్రస్తుతం ఉన్న విధానంలోనే జరుగుతాయని ఆయన చెప్పారు.
బిల్లులో ఏం ప్రతిపాదించారంటే..
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్రం మూడు బిల్లులు ప్రవేశపెడుతోంది. అవి కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు 2026, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026.
వీటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026 కీలకంగా మారింది. ఇది 2023 సెప్టెంబరులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించినది. నియోజక వర్గాల పునర్విభజన బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 81కు సవరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఆర్టికల్ ప్రకారం, రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికైన వారి సంఖ్య 530కు మించకూడదని, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకునే లోక్‌సభ సభ్యుల సంఖ్య గరిష్ఠంగా 20 ఉండాలి.
ఇప్పుడు ఎంపీలకు సర్క్యులేట్ చేసిన బిల్లు కాపీల ప్రకారం, ఆర్టికల్ 81కు సవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
దీని ప్రకారం, రాష్ట్రాల నుంచి లోక్‌సభ స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య గరిష్ఠంగా 815గానూ, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా లోక్‌సభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య గరిష్ఠంగా 35గానూ ఉండాలని ప్రతిపాదించింది.
కేంద్రం ప్రతిపాదించిన వివరాల ప్రకారం, లోక్‌సభకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 850కు మించకుండా ఉంటుంది.
ఇందులో ఎన్ని స్థానాలను నిర్ణయిస్తారనేది డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది.
లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 550 స్థానాలకు మించకూడదనే నిబంధన ఉండగా.. డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు 543 సీట్లుగా నిర్ణయించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.
నాలుగుసార్లు డీలిమిటేషన్ కమిషన్లు
భారత్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు డీలిమిటేషన్ (పునర్విభజన) కమిషన్లు వేశారు.
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 1952లో మొదటిసారిగా డీలిమిటేషన్ కమిషన్ చట్టం తీసుకువచ్చి కమిషన్ వేశారు.
ఆ తర్వాత 1963, 1973, 2002లో కమిషన్లు వేసి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను ఖరారు చేశారు.
ఇప్పటివరకు డీలిమిటేషన్ జనాభా లెక్కల ప్రకారమే
ఇప్పటివరకు జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలన్నీ అంతకుముందు నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా జరిగాయి.
1952లో జరిగిన డీలిమిటేషన్‌కు 1951 జనాభా లెక్కలు మూలం.
1963లో డీలిమిటేషన్‌కు 1961 జనాభా లెక్కలు, 1973లో డీలిమిటేషన్‌కు 1971 జనాభా లెక్కలు, 2002లో జరిగిన డీలిమిటేషన్‌కు 1971, 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రస్తుతం జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిందని చిట్టెడి కృష్ణారెడ్డి వివరించారు.
ఇప్పుడు జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ చేయాలనుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు.
బీజేపీ ఏం చెబుతోంది?
రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
''నేను ఒక్కటే అడుగుతున్నా. అసెంబ్లీ సీట్లు తెలంగాణలో ఎకనామిక్ ఇండెక్స్, జీడీపీ వృద్ధి రేటు ఆధారంగా చేయాలనుకున్నప్పుడు ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అసెంబ్లీ సీట్లు పెంచుతారా?'' అని ప్రశ్నించారు.
అయితే, డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చేసేది కాదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.
''డీలిమిటేషన్‌పై ఏర్పాటయ్యే కమిషన్ అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని ఓ ఫార్ములాను సూచిస్తుంది'' అని 'ఎక్స్'లో పోస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)