You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బ్యాక్ బటన్ హైజాకింగ్’కు పాల్పడే వెబ్‌సైట్ల పనిపడతామంటున్న గూగుల్
- రచయిత, లారా క్రెస్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
- చదివే సమయం: 3 నిమిషాలు
‘బ్యాక్ బటన్ హైజాకింగ్’తో యూజర్లను తమ సైట్ నుంచి బయటకు వెళ్లకుండా ఆపుతున్న వెబ్‌సైట్లపై చర్యలు తీసుకునేందుకు తన విధానాలలో మార్పులు తెస్తున్నట్టు గూగుల్ తెలిపింది.
"బ్యాక్ బటన్ హైజాకింగ్" అంటే ఒక వెబ్‌సైట్ బ్రౌజర్ పనితీరులో జోక్యం చేసుకుని, యూజర్ "బ్యాక్" బటన్ నొక్కినప్పుడు మునుపటి పేజీకి వెళ్లకుండా అడ్డుకునే విధానం.
ఇది యూజర్ అదే సైట్‌లోనే ఉండిపోయేలా చేస్తుంది. లేదంటే అనవసరమైన ప్రకటనలు కనిపించేలా చేస్తుంది.
‘ఇలాంటి ధోరణి పెరుగుతోందని గమనించాం’ అని క్రోమ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేసిన టెక్ సంస్థ గూగుల్ ఓ బ్లాగ్‌పోస్టులో తెలిపింది.
జూన్ 15 నుంచి ఈ విధానాన్ని "హానికరమైన చర్య"గా పరిగణిస్తామని, ఇలా చేసే సైట్లను గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ప్రాధాన్యం లేకుండా చేయడమో, లేదా పూర్తిగా తొలగించడమో చేస్తామని వెల్లడించింది.
"బ్యాక్ బటన్ హైజాకింగ్ అనేది బ్రౌజర్ పనితీరులో జోక్యం చేసుకుని, యూజర్ తాను కోరుకున్న విధంగా నావిగేట్ చేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల యూజర్లు అసహనానికి గురవుతారు" అని గూగుల్ తెలిపింది.
"ఇలాంటి అనుభవాల వల్ల తాము మోసానికి గురైనట్టు అనిపిస్తోందని యూజర్లు చెబుతున్నారు. దీని ఫలితంగా, తెలియని సైట్లను సందర్శించడానికి వారు వెనుకాడుతున్నారు" అని కూడా పేర్కొంది.
యూజర్ బ్రౌజర్ హిస్టరీలో "మానిపులేటివ్" పేజీలను చేర్చి, పూర్వపు పేజీకి తిరిగి వెళ్లకుండా అడ్డుకునే ఏ విధానాలనైనా ఉపయోగించే సైట్లపై చర్యలు తీసుకుంటామని గూగుల్ తెలిపింది.
"బ్యాక్ బటన్ హైజాకింగ్ వంటి చర్యలు యూజర్ అనుభవాన్ని దెబ్బతీస్తాయి. వెబ్‌సైట్ ఎలా పనిచేయాలనే ప్రజల అంచనాలకు ఇది భంగం కలిగిస్తుంది. అందుకే గూగుల్ దీనిని హానికరమైన ప్రవర్తనగా పరిగణించి చర్యలు తీసుకోవడం సమంజసం" అని ది చార్టర్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఐటీ బీసీఎస్ డిజిటల్ డైరక్టర్ ఆడమ్ థాంప్సన్ అన్నారు.
ఇలాంటి శిక్షలు ఎదుర్కోకూడదనుకునే సైట్ యజమానులు, యూజర్ బ్రౌజర్ హిస్టరీలో నావిగేట్ సామర్థ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని గూగుల్ సూచించింది.
అలాగే తమ సాంకేతిక అమలును పూర్తిగా సమీక్షించుకోవాలని తెలిపింది.
ఏదైనా సైట్‌పై చర్యలు తీసుకున్న తరువాత, ఆ సమస్యలను సరిచేస్తే, తమపై తీసుకున్న చర్యలను పునఃపరిశీలించాల్సిందిగా గూగుల్‌ను అభ్యర్థించవచ్చని తెలిపింది
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)