'శరీరాలను ముక్కలు చేయమని, మనుషుల మాంసం తినమని బలవంతం చేసేవారు', డ్రగ్స్ గ్యాంగుల దారుణాలివి..

    • రచయిత, డారియో బ్రూక్స్
    • హోదా, బీబీసీ న్యూస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

మెక్సికోలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు కనిపించకుండా పోవడంతో, వారిని వెతుక్కుంటూ వెళ్లిన వారి తల్లిదండ్రులు ఫేస్‌బుక్ లైవ్ ప్రసారం చేయడంతో రాంచో ఇజాగ్విర్ అనే ప్రదేశం గురించి మొదటిసారి ప్రపంచానికి తెలిసింది.

అక్కడ భారీ సామూహిక సమాధి ఉండొచ్చన్న సమాచారంతో.. తమ బిడ్డల గురించి గురించి ఏదైనా ఆధారం దొరకుతుందేమోనన్న ఆశతో వారు రాంచోకు వెళ్లారు.

అక్కడ వారికి వందలాది చెప్పులు, దుస్తులు, సూట్‌కేసులు, బ్యాగులు కనిపించాయి. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్లిన వారివి అయిండొచ్చని.. కానీ వారిని చంపేశాక వాటిని అక్కడే వదిలేసినట్లుగా అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులకు అనిపించింది.

ఈ రాంచ్‌(డ్రగ్స్ గ్యాంగ్ శిక్షణ కేంద్రం)ను జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ - ఒక గ్యాంగ్) నియామక స్థలంగా ఉపయోగించినట్టు కనిపిస్తోంది. తర్వాత ఇక్కడ క్రమంగా హత్యలు జరిగాయి. 2025 మార్చిలో ఇది బయటపడటం మెక్సికోను షాక్‌కు గురిచేయడమే కాకుండా, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

'ఇది ఆ కార్టెల్(గ్యాంగ్) కోసం చౌక కూలీల కేంద్రంలా అనిపించింది' అని దాని నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులతో మాట్లాడి, 'విట్నెస్‌స్ టు హారర్: ది ట్రూత్ దే ట్రైడ్ టు హైడ్ ఎట్ రాంచో ఇజాగ్విర్' అనే పుస్తకాన్ని రాసిన సాండ్రా రోమాండియా అన్నారు.

"ముందుగా, ఈ గ్యాంగ్ ఉద్యోగాలు ఆఫర్ చేసేది. కంప్యూటర్ ఇంజనీర్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్ లేదా కూలీలాంటివి. మంచి జీతం ఇస్తామని నమ్మబలికేది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రకటనలు చేసేది" అని రోమాండియా బీబీసీకి తెలిపారు.

"ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి ఫోన్‌ లేదా మెసేజ్ ద్వారా కొన్ని పరీక్షలు రాయాలి. ఎంపికైన వారికి, మీకు ట్లాకేపాకే బస్ టెర్మినల్ (గ్వాడలజారా)కి బస్ టికెట్ పంపిస్తున్నామని చెప్పేవారు. ఇది జాలిస్కోలోని అతిపెద్ద టెర్మినల్స్‌లో ఒకటి. అక్కడికి చేరుకున్న తర్వాత వారిని ఉబర్ లేదా టాక్సీలో 'కంపెనీ ఆఫీసులకు' తీసుకెళ్లేవారు" అని రోమాండియా చెప్పారు.

"తర్వాత ఏం జరిగేది? ఉబర్ అని చెప్పిన వాహనం నిజానికి ఒక ప్రైవేట్ కారు. వాళ్లు అందులో ఎక్కగానే వారిని కిడ్నాప్ చేసేవారు. ఆయుధాలతో బెదిరించేవారు, ఫోన్లు లాక్కునేవారు. తర్వాత వారిని రాంచో ఇజాగ్విర్ లేదా ఇతర రాంచ్‌లకు తీసుకెళ్లి బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చేవారు, ఎవరైనా ఎదిరిస్తే అక్కడికక్కడే వాళ్లని చంపేసేవారు" అని రోమాండియా తెలిపారు.

ఆ ప్రదేశంలో ఉన్న చెప్పులు, ఇతర వస్తువులు భారీగా పోగుపడి ఉండడంతో.. అది కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌(అంటే పెద్దసంఖ్యలో ఖైదీలు, ముఖ్యంగా యుద్ధ ఖైదీలు, రాజకీయ ఖైదీలు, లేదా జాతి/మత మైనారిటీ సభ్యులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్బంధించే స్థలం. వీరిని సాధారణంగా న్యాయ విచారణ లేకుండా, బలవంతంగా పని చేయించడానికి లేదా శిక్షించడానికి ఉంచుతారు)లను గుర్తుచేసింది.

"రాంచో నుంచి ప్రాణాలతో బయటపడినవారు అక్కడి క్రూరమైన పరిస్థితుల గురించి చెప్పారు. వారిని ఒకరినొకరు కొట్టుకోమని లేదా హింసించమని బలవంతం చేసేవారు. కొన్నిసార్లు అందరి ముందు శిక్షించేవారు కూడా" అని రోమాండియా అన్నారు.

"ఇతరులను చంపమని, శరీరాలను ముక్కలు చేయమని, శవాలను కాల్చమని, మనుషుల మాంసం తినమని, గొలుసులతో కట్టేసి అలాగే ఉండమని బలవంతం చేసేవారు" అని రోమాండియా చెప్పారు.

"ఏది చెబితే అది చేయాల్సిందే. బాత్రూమ్‌కి వెళ్లడం, ప్యాంట్ వేసుకోవడం, బట్టలు విప్పడం అన్నీ ఆదేశాల ప్రకారం చేయాలి. 50 పుష్-అప్స్ చేయమని చెప్తే తప్పనిసరిగా చేయాలి. లేకపోతే కొట్టేవారు, లేదంటే చంపేసేవారు కూడా. గ్యాంగ్ నాయకుల వినోద వస్తువులుగా మారిపోయామని అక్కడి నుంచి బయటపడినవారు చెప్పారు" అని ఆమె వివరించారు.

"అక్కడ హత్యలు జరిగాయి, శవాలు కనిపించకుండా చేశారు. చాలామంది యువకులు 'ఉద్యోగం' అనే మాటతో మోసపోయి అక్కడికి వెళ్లారు, కానీ చివరికి వారు తిరిగి బయటకు రాలేదు" అని రాంచో ఇజాగ్విర్‌లో ఉన్నామని చెప్పిన పురుషులు, మహిళల వాంగ్మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి.

'అక్కడి నుంచి బయటపడాలంటే రెండే మార్గాలు: ఒకటి వాళ్లు నిన్ను చంపేయడం, లేదా నీకు నువ్వే ప్రాణాలు తీసుకోవడం' అని రోమాండియా పుస్తకానికి వాంగ్మూలం ఇచ్చిన ఒకరు చెప్పారు. అక్కడికి దురదృష్టవశాత్తూ చేరిన యువకులు ఎంతటి అతి భయంకరమైన పరిస్థితి అనుభవించారో దీనిద్వారా అర్ధమవుతోంది.

"మమ్మల్ని మోసం చేసి, బలవంతంగా రప్పించారు. తర్వాత కిడ్నాప్‌ చేసి హింసించారు. మా గ్రూపులో 100 మంది ఉన్నారు, కానీ చివరికి 30 మంది మాత్రమే మిగిలారు" అని మరో బాధితుడు వివరించారు.

"తర్వాత మరో కొత్త గ్రూప్‌ను అక్కడికి తీసుకొచ్చారు, ఆ సమయంలో నా చేతిలో ఒక ఆయుధం ఉంది. వారిని రక్షించడానికి నేను ఏదో ఒకటి చేసుండొచ్చు, కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే, ఏదైనా చేస్తే నన్ను కూడా కొట్టేవారని నాకు తెలుసు" అని ఆయన చెప్పారు.

"తన ప్రాణం కాపాడుకోవడానికి అతను హింసాత్మక కార్టెల్ సభ్యుడిలా వ్యవహరించాడు, కానీ నిజానికి ఆయన వీరిని రక్షించడానికి నేనేం చేయగలను? అని ఆలోచిస్తూనే ఉన్నాడు" అన్నారు రోమాండియా.

అక్కడికి వెళ్లినప్పుడు బుల్లెట్ కేసింగ్స్, మ్యాగజీన్లు, దాచిపెట్టిన సమాధులు, అలాగే కాలిన ఆనవాళ్లు కనిపించినట్టు గ్వెర్రెరోస్ బుస్కాదోరెస్ డే జాలిస్కో అనే గ్రూపు సభ్యుల తల్లిదండ్రులలో ఒకరైన రౌల్ సెర్విన్ చెప్పారు.

దీనిపై దర్యాప్తు చేపట్టిన రిపబ్లిక్ అటార్నీ జనరల్ కార్యాలయం (ఎఫ్‌జీఆర్), అక్కడ 'శవాలను దహనం చేసే ఓవెన్స్' లేదా మానవ అవశేషాలను సామూహికంగా తొలగించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.

'ఆ ప్రదేశాన్ని శిక్షణ స్థలంగా ఉపయోగించినట్టు దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైంది' అని గతేడాది మార్చి 5న ఎఫ్‌జీఆర్ ప్రకటించింది.

తర్వాత రాంచోకు సంబంధించి 47 మందిని అరెస్టు చేశారు. అలాగే ముగ్గురి మిస్సింగ్, హత్యల కేసులో 10 మంది నిందితులకు ఒక్కొక్కరికి 141 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

ఈ నేరాలకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో రాంచో ఇజాగ్విర్ ఉన్న టెవుచిట్‌లాన్ నగర మేయర్‌ను అరెస్ట్ చేశారు.

''ఏం జరిగిందనేదానిని కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు నాకనిపిస్తోంది'' అని రోమాండియా చెప్పారు.

''కేసుపై స్పష్టత ఇస్తామని ఎఫ్‌జీఆర్ హామీ ఇచ్చింది. కానీ అక్కడ శవాలను దహనం చేసే ఓవెన్లు, కాలిపోయిన మనిషి ఎముకలు ఉన్నట్టు స్పష్టంగా చెప్పలేదు. దర్యాప్తుకు ఇబ్బందులు కలగకూడదని ఇలా చేసినట్లు వారు చెప్పారు" అని ఆమె అన్నారు.

''వాళ్లెప్పుడూ ప్రజలకు ఈ విషయం చెప్పలేదు. కానీ, ఒక దశలో ప్రాసిక్యూటర్ అలెజాండ్రో గెర్ట్జ్ మనెరో అక్కడ ఒక కాలిపోయిన శరీరం ఉందని అంగీకరించారు. వాస్తవానికి, మేం చూసిన చిత్రాల్లో కాలిపోయిన ముక్కలు చాలా కనిపించాయి. అవి మనుషులవే అయ్యుండొచ్చు'' అని ఆమె అన్నారు.

అక్కడ పదేళ్లకుపైగా మృతదేహాలను దహనం చేసే ప్రక్రియ జరుగుతుండొచ్చని కొందరు శాస్త్రీయ నిపుణులు చెప్పారు.

కేసు గురించి అటార్నీ జనరల్ ఆఫీసుతో ఇంటర్వ్యూ కావాలని బీబీసీ ముండో కోరింది. కానీ ఈ కథనం ప్రచురించే నాటికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

మెక్సికోలో 1,30,000 మందికి పైగా వ్యక్తులు అదృశ్యమయ్యారు. వీరిలో ఎక్కువ మంది 2007 తర్వాతే కనిపించకుండాపోయారు. ఆ సమయంలోనే అధ్యక్షుడు ఫెలిపే కాల్డెరోన్ 'మాదక ద్రవ్యాలపై పోరాటం' మొదలుపెట్టారు.

" చాలా మిస్సింగ్ కేసుల్లో, కనిపించకుండా పోయిన వారిని డ్రగ్స్ కార్టెల్‌లో బలవంతంగా చేర్చారు, లేదా అందుకు ఎదురుతిరిగిన వారిని చంపేశారు కూడా."

వాంగ్మూలాల్లో ఇతర శిబిరాలు, రాంచోలు ఉన్నాయని చెప్పారని, కాబట్టి జాలిస్కోలోని ఇంకాకొన్ని దూర ప్రాంతాలపై కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని రోమాండియా అభిప్రాయపడ్డారు.

"యువత ఇంకా కనిపించకుండాపోతూనే ఉన్నారు. కాబట్టి ఏదీ మారలేదని నేను భావిస్తున్నా" అని ఆమె అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)