You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘భయపడ్డారా... మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వెనకాడుతున్నారా?’.. రాఘవ్ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శల దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ బాధ్యత నుంచి రాఘవ్ చడ్డాను తప్పించి ఆ స్థానంలో అశోక్ కుమార్ మిత్తల్‌ను నియమించింది.
శుక్రవారం రాఘవ్ చడ్డా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, తాను ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నానని, దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి వాటిల్లే నష్టం ఏంటని అడిగారు.
దీనికి ప్రతిస్పందనగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వరుసగా వీడియోలు విడుదల చేసి, రాఘవ్ చడ్డా పార్టీ, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మౌనంగా ఉన్నారని, అలాగే బీజేపీకి భయపడుతున్నారని ఆరోపించారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చడ్డా లండన్‌లో ఉండడాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశ్నించారు .
'రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వీడతారు లేదా ఆయనను బహిష్కరిస్తారు' అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వడింగ్ అన్నారు.
రాఘవ్ చడ్డా కేసులో కాంగ్రెస్ మాత్రమే కాకుండా, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగిన నష్టం ఏంటి?
రాఘవ్ చడ్డా స్థానంలో పార్టీ ఎంపీ అశోక్ మిత్తల్‌ను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమించాలని కోరుతూ రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది.
పార్లమెంటులో రాఘవ్ చడ్డాకు మాట్లాడేందుకు సమయం ఇవ్వవద్దని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోరినట్టు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
శుక్రవారం రాఘవ్ చడ్డా ఒక వీడియోను విడుదల చేశారు.
"నాకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా, నేను ప్రజా సమస్యల గురించి, సాధారణంగా పార్లమెంట్‌లో లేవనెత్తని అంశాల గురించి కూడా మాట్లాడతాను. ప్రజా సమస్యలను లేవనెత్తడం, వాటి గురించి మాట్లాడటం నేరమా?" అని ఆ వీడియోలో అన్నారు.
రాజ్యసభలో తాను మాట్లాడకుండా నిషేధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటేరియట్‌ను కోరిందని రాఘవ్ చడ్డా అన్నారు.
"నేను లేవనెత్తిన సమస్యల వల్ల సామాన్యులకు మేలు జరిగింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగిన నష్టం ఏంటి? నన్ను మాట్లాడకుండా ఎవరైనా ఎందుకు ఆపాలనుకుంటారు? నా గొంతును ఎందుకు నొక్కేయాలనుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
"ఈరోజు పార్లమెంటులో మాట్లాడే నా హక్కును లాగేసుకుని, నా గొంతు నొక్కేసిన వాళ్లకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను... నా మౌనాన్ని నా ఓటమిగా భావించకండి, సమయం వచ్చినప్పుడు పోటెత్తే ప్రవాహాన్ని నేను" అని ఆయన చెప్పారు.
"రాజ్యసభ లేదా లోక్‌సభలో పార్టీ నాయకుడు లేదా డిప్యూటీ లీడర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. రాఘవ్‌కంటే ముందు ఎన్.డి. గుప్తా డిప్యూటీ లీడర్‌గా ఉండేవారు. ఈరోజు నేను నాయకుడిని అయ్యాను, రేపు ఇంకెవరైనా వస్తారు" అని గురువారం వార్తా సంస్థ ఏఎన్ఐతో అశోక్ కుమార్ మిత్తల్ అన్నారు.
"మాది ప్రజాస్వామ్య పార్టీ. తన సభ్యులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రతి ఒక్కరిలోని ప్రతిభను వెలికితీయడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఈ బాధ్యతను నెరవేర్చి, మరింత నేర్చుకునేందుకు వీలుగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది" అని ఆయన అన్నారు.
పార్టీలో అంతా సవ్యంగానే ఉందని ఆయన అన్నారు. కానీ శుక్రవారం ఆప్ నాయకులు రాఘవ్ చడ్డాను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు.
రాఘవ్ చడ్డాకు మోదీ అంటే భయం పట్టుకుందని ఆప్ నేత అనురాగ్ ఢాండా అన్నారు.
"మేం కేజ్రీవాల్ సైనికులం. భయపడకపోవడమే మా గుర్తింపు. ఎవరైనా మోదీకి భయపడితే, వారు దేశం కోసం ఎలా పోరాడతారు? పార్లమెంట్‌లో కొద్దిసేపు మాట్లాడే అవకాశం వస్తుంది, ఆ సమయంలో దేశానికి ఉపయోగపడే చర్చే చయవచ్చు లేదా విమానాశ్రయ క్యాంటీన్‌లో సమోసాల ధరను తగ్గించమని అడగవచ్చు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"గత కొన్నేళ్లుగా నువ్వు భయపడుతున్నావ్ రాఘవ్. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నావ్. దేశానికి సంబంధించిన అసలు సమస్యలపై మాట్లాడటానికి వెనుకాడుతున్నావ్" అంటూ ఆయన పోస్ట్‌లో రాశారు.
ఆప్ దాడి చేయగా, ప్రతిపక్షం విమర్శించింది
"గ్యాస్ కొరత, బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, పంజాబ్‌లో పార్టీ హక్కులను లాక్కోవడం వంటి దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై రాఘవ్ మాట్లాడరు" అని రాజ్యసభలోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ అన్నారు.
"నేను రాఘవ్ చడ్డాకు చెప్పదలుచుకున్నదేమిటంటే, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అసలు విషయం ఏంటంటే, సీఈసీకి వ్యతిరేకంగా ఒక ప్రతిపాదన వస్తే, మీరు దానిపై సంతకం చేయరు... ఇలాంటి విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశి కూడా ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా బీజేపీకి భయపడుతున్నారని ఆరోపించారు.
"రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను... మీరు బీజేపీకి ఎందుకంత భయపడుతున్నారు? మోదీని ప్రశ్నించడానికి ఎందుకంత భయపడుతున్నారు? ఈరోజు మన కళ్లెదుటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేసి తమకనుకూలంగా వాడుకున్నారు. కానీ మీరు దానిపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తడం లేదు" అని ఆమె విడుదల చేసిన వీడియోలో ప్రశ్నించారు.
"అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్టు చేసినప్పుడు, మేమందరం వీధుల్లోకి వచ్చి పోరాడాం. అప్పుడు మీరు లండన్‌లో ఉన్నారు. కానీ ఈ రోజు నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది, మీరు భయంతో లండన్‌కు పారిపోయారా?" అని ఆమె అన్నారు.
"ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వం ఒక తప్పుడు కేసులో అరెస్టు చేసింది. ఆ సమయంలో మీరు దేశంలో కూడా లేరు. మీరు వెళ్లి ఎక్కడో దాక్కున్నారు" అని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
అంతేకాకుండా పార్లమెంటులో రాఘవ్ చడ్డా 'సాఫ్ట్ పీఆర్' చేస్తున్నారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
"పార్లమెంటులో చిన్న పార్టీకి చాలా పరిమిత సమయం ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా సమోసాల గురించి మాట్లాడడంకంటే, దేశంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించడం ముఖ్యం" అని ఆయన అన్నారు.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీలో తలెత్తిన వివాదంపై ప్రతిపక్షం విమర్శలు చేసింది.
"రాఘవ్ చడ్డా వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ వేరు. ఆయన లండన్ వెళ్లినప్పటి నుంచే పార్టీని వదిలిపెడతారని మాకు తెలుసు. ఆయన ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండరు. ఆయన ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, కానీ సాధారణ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వీడతారు లేదా పార్టీనే ఆయనను బహిష్కరిస్తుంది" అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ రాజా సింగ్ వడింగ్ అన్నారు.
"నేను దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాఘవ్ చడ్డా ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన దిల్లీ అసెంబ్లీలో కూడా మాట్లాడేవారు, అది బాగుండేది. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు వచ్చారు, ఇక్కడ కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నారు" అని బీజేపీ ఎంపీ రామ్‌వీర్ సింగ్ బిధూరి అన్నారు.
"రాఘవ్ చడ్డాను మాట్లాడకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎలా నిషేధించారో నాకు అర్థం కావడం లేదు. ఆయనను డిప్యూటీ లీడర్‌గా కొనసాగించాలా వద్దా అనేది పార్టీ అంతర్గత విషయం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీనియర్ సభ్యుడిని, ఎంపీని కూడా మాట్లాడకుండా నిషేధిస్తే, అది ప్రజాస్వామ్య హత్య అని నేను భావిస్తున్నాను. అరవింద్ కేజ్రీవాల్, ఆయన నాయకత్వం మొత్తం ఈ విషయాన్ని పునఃపరిశీలించుకోవాలి" అని ఆయన వార్తా సంస్థ పీటీఐతో అన్నారు.
ఒకప్పుడు నమ్మకమైన వ్యూహకర్త
2013లో అన్నా హజారే చేసిన 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమం తుది దశలో ఉన్నప్పుడు, రాఘవ్ చడ్డా అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు.
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చడ్డా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు.
పార్టీలో రాఘవ్ చడ్డాకు అప్పగించిన మొదటి బాధ్యత, దిల్లీ జన లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనలో న్యాయవాది రాహుల్ మెహ్రాకు సాయం చేయడం. ఈ బాధ్యతను ఆయనకు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అప్పగించారని డైలీ ఓ పత్రిక రిపోర్ట్ చేసింది.
రాఘవ్ చడ్డా పార్టీలో అతి పిన్న వయస్కుడైన అధికార ప్రతినిధి అయ్యారు. కొద్ది కాలంలోనే టెలివిజన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖచిత్రంగా మారారు.
2013లో ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన బృందంలో రాఘవ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కొద్ది కాలం పాటు పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం.
దశాబ్దం క్రితం అరవింద్ కేజ్రీవాల్ బృందంలో వాలంటీర్‌గా చేరిన రాఘవ్ చడ్డాను, ఇప్పుడు ఆయన అత్యంత విశ్వసనీయ వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణిస్తున్నారు.
2019లో ఆయన దక్షిణ దిల్లీ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2020లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి విజయం సాధించారు.
2022 మార్చిలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి రాఘవ్ చడ్డాతో పాటు మరో నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆ సమయంలో 33 ఏళ్ల వయసున్న రాఘవ్ చడ్డా అతి పిన్న వయస్కుడైన ఎంపీ అయ్యారు.
2022లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఘన విజయంలో రాఘవ్ చడ్డా కీలక పాత్ర పోషించారని నమ్ముతారు. పంజాబ్‌లో సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, 2022 చివర్లో ఆయనకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యత కూడా అప్పగించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)