మాత్రలు చల్లని నీటితో వేసుకోవాలా? వేడి నీటితో వేసుకోవాలా?

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ట్యాబ్లెట్‌ను నోట్లో వేసుకొని గుటుక్కున నీళ్లు తాగుతాం. అంతే, పెద్ద పని అయిపోయినట్లు ఫీలవుతాం.

కొంతమంది చల్లటి నీటితో, కొందరు వేడి నీటితో మాత్రలు వేసుకుంటారు.

ఇక మందులు మింగడం నచ్చనివారు వాటి రుచి తెలియకుండా టీ, కాఫీ, పాలు లేదా కూల్ డ్రింక్స్‌తో తాగుతుంటారు.

కొందరు డాక్టర్ చెప్పిన టైమ్ ప్రకారం, మరికొందరు తమకు గుర్తొచ్చినప్పుడే ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు.

మరి.. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు ట్యాబ్లెట్స్ వేసుకోవడం సరైనదేనా?

మనం తాగే నీటితో పాటు, మందులు వేసుకునే సమయం వంటివి చిన్న విషయాలే అయినా అవి చాలా పెద్ద ప్రభావం చూపుతాయని మీకు తెలుసా?

మీరు ట్యాబ్లెట్లను ఎలా వేసుకుంటారనేది వాటి శోషణ, ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ట్యాబ్లెట్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

పొట్టలో చాలా గంటల పాటు..

ఔషధాలు అనేవి మనకు సిరప్, సస్పెన్షన్స్, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, పౌడర్లు, ఇంజక్షన్ వంటి రూపాల్లో అందుబాటులో ఉంటాయి.

ద్రవ రూపంలో లభించే ఔషధాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. కానీ వీటిని నిల్వ చేయడం, చెడిపోకుండా ఎక్కువ కాలం భద్రపరచడం కష్టం.

కాబట్టి చాలా మందుల్ని ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ రూపంలో తయారు చేస్తుంటారు. పైగా అన్ని రకాల ఔషధాలను ద్రవాల రూపంలో తీసుకోలేం.

ముఖ్యంగా స్లో రిలీజ్ (నెమ్మదిగా విడుదలయ్యే) ఔషధాలు. అంటే మన పొట్టలోకి వెళ్లాక ఈ ఔషధం చాలా గంటల పాటు పనిచేస్తుంది.

స్లో రిలీజ్ మెడిసిన్స్ చాలా గంటల పాటు కొద్ది కొద్దిగా ఔషధాన్ని విడుదల చేస్తాయి. ఈ రకం మాత్రలను నలపడం, చూర్ణం లాంటివి చేయకూడదు. నలిపితే మొత్తం మందు ఒక్కసారే విడుదలై ప్రమాదకరంగా మారొచ్చు.

చన్నీళ్లా? వేడి నీళ్లా?

సరే, ఇప్పుడు మాత్రలు వేసుకోవడానికి ఎలాంటి నీరు తాగాలో చూద్దాం.

మాత్రలను ఎలాంటి నీటితో వేసుకోవాలి? ఎలా వేసుకోకూడదనే అనే అంశాలను ఫిజిషియన్ గోపేశ్ ‘బీబీసీ’కి వివరించారు.

ట్యాబ్లెట్, క్యాప్సూల్ ఏదైనా గోరువెచ్చని నీటితో తీసుకోవడం ఉత్తమమని ఆయన తెలిపారు. ఘన రూపంలో ఉండే టాబ్లెట్ కానీ.. గింజల రూపంలోని మందుతో కానీ, పొడి రూపంలోని మందుతో కానీ నింపే క్యాప్సూల్ కానీ గోరు వెచ్చని నీటితో వేసుకున్నప్పుడే అది సరిగా పనిచేస్తుందని తెలిపారు.

చల్లని నీరైతే ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్ అందులో కరగడం ఆలస్యమవుతుందని.. బాగా వేడిగా ఉన్న నీరైతే ఆ ట్యాబ్లెట్ లేదా క్యాప్యూల్‌లోని మందు ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

అయితే, ఏ ట్యాబ్లెట్ అయినా సిరప్ అయినా ఇంకేదైనా ఔషధం కానీ డాక్టర్ సూచించినవి.. డాక్టర్ సూచించిన పద్ధతిలోనే తీసుకోవాలని, సొంత వైద్యం ఎంత మాత్రం వద్దని ఆయన హెచ్చరించారు.

ఇదే విషయంపై ‘కిమ్స్ హెల్త్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో డాక్టర్ ఎన్. విజయలక్ష్మి కూడా ఇలాంటి వివరణే అందించారు.

ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. మనం వేసుకున్న మందుల్ని పొట్ట, పేగుల్లోని జీవ కణాలు శోషించుకుంటాయి.

ఈ శోషణ సరిగా జరగాలంటే పొట్టలోని అంతర్గత వాతావరణం సరిగ్గా ఉండాలి. అంటే పొట్ట, పేగుల్లోని ల్యూమెన్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి.

చల్లటి నీరు ఔషధాలు కరిగే వేగాన్ని తగ్గిస్తుంది. అలాగే పొట్టలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీంతో జీవ వ్యవస్థలోకి ఔషధాల శోషణ సరిగ్గా జరగదు.

చల్లటి నీటితో మాత్రలను వేసుకున్నప్పుడు, మనం తీసుకున్న మాత్రలను శరీరం ప్రాసెస్ చేయడానికి బదులుగా పొట్టలో చేరిన చల్లటి నీటిని వెచ్చబరచడంపైనే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.

అన్నం తిన్నప్పుడు చల్లటి నీరు తాగినా ఆహారంలోని పోషకాలను శోషించుకోవడానికి బదులుగా శరీర ఉష్ణోగ్రతకు తగినట్లుగా చల్లటి నీటిని వెచ్చబరచడంపైనే శరీరం తన శక్తిని ఖర్చు చేస్తుంది.

వేడి నీళ్లతో ఓకేనా

వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో ఔషధాలను తీసుకోవడం వల్ల అవి వేగంగా కరిగి, త్వరగా వాటి పని మొదలుపెడతాయని ఆ కథనంలో డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.

వ్యవస్థలోకి వేగంగా చేరి వాటి పని మొదలుపెట్టడమే మందుల లక్ష్యం. చల్లటి నీటితో మాత్రలను వేసుకోవడం వల్ల ఈ ప్రక్రియను ఆలస్యమవుతుందని పేర్కొన్నారు.

అలాగే బాగా వేడిగా ఉన్న నీటిని కూడా వాడకూడదని, అది ఔషధాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. మందులను వేసుకోవడానికి గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని వాడాలని సూచించారు.

పాలు, మినరల్ వాటర్, జ్యూస్‌తో మందులు వేసుకోవచ్చా?

మంచినీటితోనే మందులు వేసుకోవడం ఉత్తమమని పాలు, మినరల్ వాటర్, జ్యూస్‌, బీర్, వైన్ వంటివి కొన్నిసార్లు వాటి ప్రభావాలను మార్చేస్తాయని ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్మన్ అసోసియేషన్స్ ఆఫ్ ఫార్మాసిస్ట్‌ అధికార ప్రతినిధి ఉర్సులా సెల్లర్‌బెర్గ్‌ను ఉటంకిస్తూ 'ది హిందూ' ఒక కథనంలో పేర్కొంది.

'పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఔషధాన్ని బంధించి రక్తప్రవాహంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. ఒక కప్పు కాఫీలో పాల చుక్క పడినా అది మందుల పనితీరుపై ప్రభావం చూపించొచ్చు. కాల్షియం ఫోర్టిఫైడ్ జ్యూస్‌లు, కాల్షియం ఎక్కువగా ఉండే మినరల్ వాటర్ వల్ల కూడా ఇదే జరుగుతుంది' అని ఆమె హెచ్చరించారు.

పాలు, డెయిరీ ఉత్పత్తులు అనేవి కొన్ని రకాల ఔషధాలు, ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్స్, ఆస్టియోపోరోసిస్, అనేక రకాల యాంటీబయాటిక్స్ వంటి క్రియాశీల ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తాయని ఉర్సులా సెల్లర్‌బెర్గ్‌ పేర్కొన్నారు.

ద్రాక్ష రసం

మిగతా పండ్ల రసాలతో పోలిస్తే ద్రాక్ష రసం అనేక రకాల ఔషధాల ప్రభావాలను, వాటి సైడ్ ఎఫెక్ట్స్‌ను పెంచుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

'ఔషధాలను విచ్ఛిన్నం చేసే మన శరీరంలోని ఎంజైమ్‌లను ద్రాక్ష రసం అడ్డుకుంటుంది' అని సెల్లర్‌బర్గ్ చెప్పారు.

ద్రాక్ష రసం వల్ల హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు, లిపిడ్ మెటబాలిక్ డిజార్డర్లు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలకు సంబంధించిన ఔషధాలు ప్రభావితం అవుతాయి.

నారింజ, ఆపిల్ జ్యూస్‌లతో ఇటువంటి ప్రతికూల ప్రభావాలు ఇప్పటివరకు గుర్తించలేదు.

ఆల్కహాల్

మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యంతో తీసుకోకూడదు.

ఎందుకంటే, మద్యం కూడా కొన్ని క్రియాశీల ఔషధాలతో చర్య జరిపి దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు.

ఎన్ని నీళ్లు తాగాలి?

కొంతమంది నీళ్లు తీసుకోకుండా నేరుగా మందులు వేసుకుంటారు.

దీనివల్ల కోటింగ్ లేని మాత్ర అయితే నాలుకకు అతుక్కుపోతుంది. అలాగే నాలుక అంతా చేదు రుచి పరుచుకుంటుంది.

నీరు లేకుండా ట్యాబ్లెట్ తీసుకుటే అది గొంతులో ఇరుక్కుపోయి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని ముంబయిలోని ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ప్రదీప్ సింగ్‌ను ఉటంకిస్తూ హెల్త్‌సైట్. కామ్ పేర్కొంది.

'నీళ్లు లేకుండా మాత్ర వేసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాదు. మాత్ర అలాగే జీర్ణ వ్యవస్థలో ప్రయాణం చేసి మలం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ట్యాబ్లెట్ జీర్ణం కాకుండా బయటకు వెళ్లిపోయిందంటే దానర్థం శరీరానికి దాని ప్రయోజనాలేవీ అందలేదని.

ఉదాహరణకు ఐబూప్రొఫేన్ వంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మాత్రలను తగినంత నీటితో తీసుకోకపోతే జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసి కడుపులో పూత, అల్సర్లకు దారి తీస్తుంది' అని డాక్టర్ ప్రదీప్ వివరించారు.

మాత్ర వేసుకునేటప్పుడు మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే ఒక గ్లాస్ నీళ్లను తాగొచ్చు. మీకు తెలియకపోతే వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి.

(ఆధారం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, nhs.uk, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్)

(నోట్: ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, మందులకు సంబంధించిన విషయాలలో నేరుగా వైద్యుల సూచనలు పాటించాలి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)