పశ్చిమ బెంగాల్‌లో బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి ‘ఎన్‌కౌంటర్’.. మృతుడి తల్లి ఏమన్నారంటే

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రత్యూష్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పశ్చిమబెంగాల్‌లోని బరూయీపుర్‌లో బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుల్లో ఒకరు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. నిందితుడిని ప్రభాస్ మండల్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత బాధితురాలి కుటుంబం ఆయన్ను గుర్తించింది.
దక్షిణ కోల్‌కతా శివార్లలోని బరూయీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యాపుర్‌లో బాలికను అత్యాచారం, హత్య చేసినట్టు జులై 4న ఆరోపణలొచ్చాయి.
బాలిక మృతదేహాన్ని మరుసటి రోజు ఓ చెరువులో గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మండల్‌ను మంగళవారం రాత్రి పోలీసు అధికారులు చెరువు దగ్గరకు తీసుకెళ్లారు.
ఆ సమయంలో తమ వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌ను తీసుకుని పారిపోయేందుకు ప్రభాస్ ప్రయత్నించారని, దాంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు.
కాల్పుల అనంతరం నిందితుడిని బరూయీపుర్ సబ్-డివిజనల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.


ఫొటో సోర్స్, ANI
పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి.
బాలిక నీటిలో మునిగి చనిపోయిందని ప్రాథమిక పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సరైనరీతిలో స్పందించి ఉంటే బాలిక బతికేదని స్థానికులు ఆరోపించారు.
''మేం రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసుల దగ్గరకు వెళ్లాం. కానీ వాళ్లు విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. స్థానికుల నుంచి ఆదివారం ఉదయం మాకు సమాచారమందింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి మేం దోషిని గుర్తించి పట్టుకున్నాం'' అని స్థానికంగా నివసించే ఒకరు చెప్పారు.
''పోలీస్ స్టేషన్‌ల దోషి నేరం అంగీకరించారు. మృతదేహాన్ని చెరువునుంచి బయటకు తీసేందుకు మేం ఆయన్ను వెంట తీసుకెళ్లాం. అప్పటికి కూడా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేకాకుండా శంతను మండల్ అనే స్థానిక బీజేపీ నాయకుడు దోషి తప్పించుకోవడానికి సహకరించారు'' అని ఆయన ఆరోపించారు.
ఆయన దోషిగా చెబుతున్న వ్యక్తి ప్రభాస్ మండల్. రాత్రి పొద్దుపోయాక పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు.
ప్రభాస్ మండల్‌పై అత్యాచారం, హత్య ఆరోపణలు కోర్టులో ఇంకా నిరూపితం కాలేదు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం(ఏపీడీఆర్)సెంట్రల్ కమిటీ సభ్యుడు రంజిత్ సూర్ ఈ ఘటనను ఖండించారు.
''ఈ ఘటన అనుమానాస్పదంగా ఉంది. ఈ మొత్తం ఘటనలో కీలక సాక్షి ఆ వ్యక్తి. ఆ సాక్షిని లేకుండా చేయడం ద్వారా ఈ కేసు విషయంలో తమ వైఫల్యాన్ని పోలీసులు కప్పిపుచ్చుకోడానికి అవకాశమేర్పడుతుంది. అనేక రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ల చుట్టూ చెప్పే కథలు ఒకేలా ఉంటాయి. పోలీసు ఆయుధం లాక్కుని నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్చి చంపామని చెబుతారు'' అని రంజిత్ సూర్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మరోవైపు మృతుని తల్లి తన కుమారుడి మరణంపై మాట్లాడారు.
‘‘నేను అప్పుడే నిద్ర లేచా. ఇద్దరు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నా కొడుకు చనిపోయినట్లు వారు చెప్పారు. ఆస్పత్రికి వెళ్తారా అని అడిగారు. మా ఆయన ఆరోగ్యం బాగా లేదు. నేను రాలేనని చెప్పా. మీరేం చేస్తారో చేయండి. నాకెలాంటి అభ్యంతరం లేదని నేను చెప్పా.
నా కొడుకు మృతదేహాన్ని నేను చూడాలనుకోవడం లేదు. అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారో నాకు తెలియదు. నా కొడుకు ఇలాంటి నేరం చేసి ఉంటే ఈ శిక్షకు అర్హుడు'' అని మృతుడి తల్లి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కేసు రీకన్‌స్ట్రక్షన్ సమయంలో ఒకే తరహా ఎన్‌కౌంటర్లు
పోలీసు ఆయుధంతో నిందితుడు పారిపోతుండగా కాల్చి చంపామని పోలీసులు చెబుతున్న ఘటనలు భారత్‌లో గతంలోనూ జరిగాయి.
2019లో హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో తమ ఆయుధాలు లాక్కుని నిందితులు పారిపోడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇలాంటి హత్యలను ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. దోషిని పారదర్శకమైన న్యాయప్రక్రియ ద్వారా మాత్రమే శిక్షించాలని కోరింది.
భారత్‌లో ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు జరిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనకాలంలో 17,043ఎన్‌కౌంటర్‌లు జరిగినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం 289 మంది చనిపోయారు. నేరానికి సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసుల ఆయుధాలు లాక్కుని నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్టు చాలా ఘటనల్లో పోలీసులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























