ఆశా భోస్లే మరణం: తన ప్రతిభ, పట్టుదలతో లతా మంగేష్కర్‌ సింహాసనానికి సవాల్ విసిరిన గాయని

ఆశా భోస్లే, బాలీవుడ్, సినిమా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆశా భోస్లే ఆదివారం కన్నుమూశారు.
    • రచయిత, యాసిర్ ఉస్మాన్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 8 నిమిషాలు

ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం కన్నుమూశారు. ఆశా భోస్లే శనివారం కార్డియాక్ అరెస్ట్‌‌కు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప గాయనిగా ఆమె పేరు పొందారు. ప్లే బ్యాక్ సింగర్‌గా ఆమె ఎన్నో మరపురాని పాటలను పాడారు.

'నయా దౌర్' నుంచి 'తీస్త్రీ మంచిల్' వరకు, 'హరే రామా హరే కృష్ణా' నుంచి 'ఉమ్రావ్ జాన్' వరకు 'ఇజాజత్' నుంచి 'రంగీలా' వరకు... కాలం మారింది, తరాలు మారాయి, వెండితెరపై హీరోయిన్లు మారారు.

కానీ, ఆశా భోస్లే గొంతు మాత్రం ఎప్పటికీ నవ యవ్వనంగానే నిలిచిపోయింది.

తెలుగులో ‘జీవితం సప్తసాగర గీతం’ అంటూ ఆమె పాడిన పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. పలు తెలుగు సినిమాలకు కూడా ఆమె పాటలు పాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆశా భోస్లే, బాలీవుడ్, సినిమా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఆమె స్వరంలోని చమత్కారం, సరదా పాటల గురించి చెప్పుకునే క్రమంలో ఆమె సుదీర్ఘ, కఠిన పోరాటం గురించి చర్చ తక్కువగా జరుగుతుంది.

నిజానికి అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ఆశా భోస్లే 'నంబర్ టూ' స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'నంబర్ వన్' స్థానంలో ఆమె సోదరి, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఉండేవారు.

హిందీ నేపథ్య గాన రంగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, లతా అనే ప్రకాశవంతమైన సూర్యుని ముందు తనకంటూ ఒక జ్యోతిని వెలిగించుకోవాలని ఆశా నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో ఇది దాదాపు అసాధ్యం. కానీ, తన పట్టుదల, అసమానమైన ప్రతిభతో సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె.

ఆశా భోస్లే మరణం, పాటలు, బాలీవుడ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2008లో ముంబయిలో ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ (మధ్యలో) 72వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆశా భోస్లే (ఎడమ) , లతా మంగేష్కర్.

సంగీత వారసత్వం

ఆశాకు చిన్నతనంలోనే సంగీతంతో అనుబంధం ఏర్పడింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, మరాఠీ రంగస్థల ప్రముఖులు. ఆయన ఐదుగురు పిల్లలు లత, మీనా, ఆశ, ఉషా, కుమారుడు హృదయనాథ్ మధ్య చిన్నప్పటి నుంచే స్వరాల సరిగమలు వినిపించేవి.

బాల్యంలో లత, చిన్నారి ఆశాల జోడీ విడదీయలేనిది. ఆశా తన అక్క వెంటే నీడలా నడిచేవారు. కానీ, ఆశాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయారు.

తండ్రి మరణంతో మంగేష్కర్ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. జీవనోపాధి కోసం ఆ కుటుంబం పుణే, కొల్హాపూర్ మీదుగా 1945లో బొంబాయి (ముంబయి) చేరుకుంది. ఇక్కడ 14 ఏళ్ల లత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని సినీ ప్రపంచపు కష్టతరమైన బాటల్లో తన పోరాటం మొదలుపెట్టారు. త్వరలోనే ఆశా కూడా ఆ పోరాటంలో తోడయ్యారు.

ఆశా భోస్లే మరణం, పాటలు, బాలీవుడ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

మొదటి అడుగు

1948లో 'చునరియా' సినిమాతో ఆశా నేపథ్య గాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

గీతా దత్, షంషాద్ బేగమ్‌లతో కలిసి ఆమె తన మొదటి పాట 'సావన్ ఆయా రే' పాడారు. దీనికి సరిగ్గా ఏడాది తర్వాత, 1949లో 'రాత్ కీ రాణి' సినిమాతో ఆమెకు మొదటి సోలో పాట అవకాశం దక్కింది.

అదే ఏడాది సోదరి లతా మంగేష్కర్‌కు 'టర్నింగ్ పాయింట్'గా నిలిచింది. 'మహల్' సినిమాలోని 'ఆయేగా ఆనేవాలా' పాట లతను రాత్రికి రాత్రే విజయ శిఖరాలకు చేర్చింది.

1950వ దశకంలో లత వేగంగా ఎదిగారు. నౌషాద్, సి.రామచంద్ర, శంకర్-జైకిషన్, ఎస్.డి. బర్మన్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల మొదటి చాయిస్‌గా ఆమె మారారు.

ఆశా భోస్లే మరణం, పాటలు, బాలీవుడ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

లత ఎదుగుదల - ఆశా పోరాటం

హిందీ నేపథ్య గానంపై లత ఏకఛత్రాధిపత్యం చలాయిస్తుంటే, ఆశా ఎంత కష్టపడినా ఆ గుర్తింపు దక్కలేదు. ఆ రోజుల్లో ఆశాకు ఎక్కువగా బి-గ్రేడ్ లేదా తక్కువ బడ్జెట్ సినిమాల్లోనే అవకాశాలు వచ్చేవి.

ఎ.ఆర్. ఖురేషీ, సజ్జాద్ హుస్సేన్, సర్దార్ మాలిక్ వంటి సంగీత దర్శకులతో పని చేస్తున్నా, పెద్ద సంగీత దర్శకులు, అగ్ర నిర్మాణ సంస్థలు ఆమెకు దూరంగా ఉన్నాయి.

ఆశా భోస్లే జీవితచరిత్ర రాసిన సినీ చరిత్రకారుడు రాజు భారతాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఆరంభంలో ఆశా భోస్లే అద్భుతమేమీ కాదు. అవకాశాల కోసం ఆమె పడ్డ తపన చూశాను. నిర్మాతలకు లత అందుబాటులో లేకపోతే వారి తదుపరి ఎంపిక గీతా దత్ లేదా షంషాద్ బేగమ్ ఉండేవారు. ఆ జాబితాలో ఆశా పేరు ఎక్కడా ఉండేది కాదు" అన్నారు.

"అందుకే తనకు ఏది దొరికితే అది పాడారు. ఆమెకు ఉన్న మరో సమస్య 'మరాఠీ కలగలిసిన హిందీ', అలాగే ఉచ్ఛారణ. లతలా ఉర్దూ మెరుగుపరుచుకోవడంపై ఆమె అంతగా దృష్టి పెట్టలేదు. అదీగాక ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితం ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలతో నిండి ఉంది" అన్నారు.

రాజు భారతాన్ ప్రస్తావించిన ఆ వ్యక్తిగత సంఘటన ఆశాకు పదహారేళ్ల వయసులో జరిగింది. ఆమె 31 ఏళ్ల వయసున్న గణపత్ రావు భోస్లేను తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్లారు. కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇద్దరు సోదరీమణుల మధ్య దూరం పెంచింది. ఆ చేదు జ్ఞాపకాలు చాలా కాలం కొనసాగాయి.

ఈ సంబంధం తన చెల్లెలికి మంచిది కాదని లతా మంగేష్కర్ భావించారు. తన ఇంటర్వ్యూలో ఆశా భోస్లే ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఇలా అన్నారు: "లతా దీదీ ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక దశలో మా సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఏళ్ల పాటు మేం మాట్లాడుకోలేదు".

గణపత్ రావు భోస్లేతో పెళ్లి ఆశా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి పెద్ద విషాదం. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా రాశారు: "వారిది ఒక సంప్రదాయ కుటుంబం. 'సింగింగ్ స్టార్' కోడలిగా రావడం వారికి ఇష్టం లేదు. నా భర్త చాలా కఠిన స్వభావి, ఇతరులను బాధపెట్టడంలో ఆయన ఆనందం పొందుతారేమో అనిపించేది. కానీ, బయట ఎవరికీ ఈ విషయం తెలియదు"

ఒత్తిడి, అశాంతితో నిండిన ఆ సంవత్సరాల్లో ఆశా కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అదే సమయంలో లత విజయ శిఖరాలకు చేరుకున్నారు.

ఎస్.డి. బర్మన్

ఫొటో సోర్స్, khagesh dev burman

ఫొటో క్యాప్షన్, ఎస్.డి. బర్మన్

ఓపీ నయ్యర్, ఎస్.డి. బర్మన్ అండ

ఆశా కెరీర్‌కు బిమల్ రాయ్ 'పరిణీత' (1953), రాజ్ కపూర్ 'బూట్ పాలిష్' (1954) పాటలు తొలి బలాన్ని ఇచ్చాయి.

అయితే సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌ను కలవడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. లత లేకపోయినా సూపర్ హిట్ సంగీతాన్ని అందించగలనని నయ్యర్ నమ్మేవారు. లత కూడా ఆయనతో పని చేసేవారు కాదు.

నయ్యర్ మొదటి ఎంపిక గీతా దత్ అయినా, 'సి.ఐ.డి.' సినిమా తర్వాత ఆయన సంగీతంలో ఆశా భోస్లే స్థానం సంపాదించారు. ఆమె గొంతులోని లోతైన స్వరాలను ఆయన గుర్తించి అవకాశమివ్వడంతో వారు 'నయా దౌర్' (1957)తో చరిత్ర సృష్టించారు. 'ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ', 'మాంగ్ కే సాత్ తుమ్హారా' వంటి పాటలు ఆశాను మొదటిసారి కథానాయిక గొంతుగా మార్చాయి. దీనివల్ల బి.ఆర్. చోప్రా వంటి పెద్ద క్యాంపులలో ఆమెకు చోటు దక్కింది.

అదే ఏడాది (1957) ఎస్.డి. బర్మన్, లతా మంగేష్కర్ మధ్య వచ్చిన విభేదాలు ఆశాకు కొత్త తలుపులు తెరిచాయి. తదుపరి ఐదేళ్లు బర్మన్ లతతో పని చేయలేదు. అప్పుడు ఆశా ఆయన ప్రధాన గాయనిగా ఎదిగారు. ఈ విషయంలో లతా తన సోదరిపై కోపంగా ఉన్నారని ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ ఐదేళ్లలో ఆశా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఎస్.డి. బర్మన్, కిశోర్ కుమార్, ఆశా భోస్లే, మజ్రూహ్ సుల్తాన్‌పురి బృందం శృంగారభరిత, సరదా పాటల కొత్త ఒరవడిని మొదలుపెట్టింది.

'హాల్ కైసా హై జనాబ్ కా' (చల్తీ కా నామ్ గాడీ), 'ఆంఖో మే క్యా జీ', 'ఛోడ్ దో ఆంచల్' (పేయింగ్ గెస్ట్), 'దీవానా మస్తానా హువా దిల్' (బంబాయి కా బాబు) వంటి పాటలను ప్రజలు నేటికీ గుర్తుంచుకుంటారు.

ఆశాను బర్మన్ కేవలం సరదా పాటలకే పరిమితం చేయకుండా, ఆమె గొంతులోని గాంభీర్యాన్ని మెరుగుపరిచారు.

'కాలా పానీ' సినిమాలో 'అచ్చా జీ మై హారీ' వంటి రొమాంటిక్ పాటతో పాటు 'నజర్ లగీ రాజా తోరే బంగ్లే పర్' వంటి తుమ్రీ శైలి పాటను పాడించారు. అలాగే 'సుజాత', 'లాజ్వంతి' వంటి సినిమాల్లో ఎంతో గంభీరమైన పాటలను పాడించి, ఆశా అన్ని రకాల పాటలలో దిట్ట అని నిరూపించారు.

నయ్యర్, సాన్నిహిత్యం

ఓపీ నయ్యర్, ఎస్.డి. బర్మన్ కాలం ఆశాకు కేవలం పని దొరికిన సమయం మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును మలుచుకున్న 'సువర్ణ అధ్యాయం'. కానీ. ఈ వెలుగుల వెనుక 'వ్యక్తిగతంగా చీకట్లు' కూడా ఉన్నాయి.

1960లో ముగ్గురు పిల్లలతో ఉన్న ఆశా వివాహ బంధం ఒక విషాద మలుపుతో ముగిసింది. ఈ ఒడిదుడుకుల మధ్య సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌తో ఆమెకు పెరిగిన సాన్నిహిత్యం సినీ వర్గాల్లో చర్చనీయమైంది.

లతా, నయ్యర్ దారులు వేరు కావడంతో, ఆశా ఆయనకు దగ్గరవ్వడం ఇద్దరు సోదరీమణుల మధ్య దూరాన్ని మరింత పెంచింది.

కానీ, ఆశా కెరీర్‌లో ఇది అత్యుత్తమ కాలంగా నిలిచింది. ఈ జోడీ హిందీ సంగీతానికి 'ఆయియే మెహర్బాన్' (హౌరా బ్రిడ్జ్), 'ఆవో హుజూర్ తుమ్కో', 'కజ్రా మొహబ్బత్ వాలా' (కిస్మత్), 'యే హై రేష్మీ జుల్ఫోన్ కా అంధేరా' (మేరే సనమ్) వంటి చిరస్మరణీయ గీతాలను అందించింది.

ఆశాను లత నీడ నుంచి బయటకు తీసుకువచ్చి, ఒక 'బోల్డ్', విభిన్న శైలి గల గాయనిగా నిలబెట్టిన క్రెడిట్ ఓపీ నయ్యర్‌కే దక్కుతుంది. నయ్యర్‌తో తన భాగస్వామ్యంలో ఆశా 60 సినిమాల్లో 324 పాటలు పాడారు, అంటే సగటున ప్రతి సినిమాలో ఐదు కంటే ఎక్కువ పాటలు.

అయితే ఇన్ని విజయవంతమైన పాటలు ఉన్నప్పటికీ, సంగీత ప్రపంచంలోని ప్రతి పెద్ద సినిమా పాట లత స్వరం మీదుగానే సాగేది. ఆశా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నా, హిందీ నేపథ్య గాన ప్రపంచంపై లతా మంగేష్కర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది.

రాజు భారతాన్ రాసిన ఆశా భోస్లే జీవితచరిత్ర ప్రకారం, 1950, 60వ దశకాల్లో సంగీత ప్రపంచంపై లత ప్రభావం ఎంతలా ఉండేదంటే, ఆమె ఒక పాటకి 500 రూపాయలు తీసుకుంటే, ఆశా కేవలం 100-150 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఏం పాడాలి, ఎవరికి పాడాలి అని ఎంచుకునే స్వేచ్ఛ లతకు ఉండేది, కానీ ఆశాకు ఆ అవకాశం లేదు. ఈ వివక్ష ఆమెను లోలోపల కలిచివేసేది. అక్క నుంచి మద్దతు లోపించడం కూడా వారి మధ్య దూరానికి కారణమైంది. ఆశా దీనిని సవాలుగా తీసుకుని, తన కాళ్ల మీద తాను నిలబడి నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నారు.

అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ఈ ఘర్షణ, అసూయ ప్రతిధ్వనులు వెండితెరపై కూడా వినిపించాయి. దర్శకురాలు సాయి పరాంజపే తన 'సాజ్' (1997) సినిమాలో చూపించిన సంగీత ప్రపంచంలోని ఇద్దరు సోదరీమణుల కథ వారిదేనని భావిస్తారు.

ఆర్డీ బర్మన్‌, ఆశా భోస్లే

ఫొటో సోర్స్, Pancham Unmixed

ఫొటో క్యాప్షన్, రికార్డింగ్ సమయంలో ఆర్డీ బర్మన్‌తో ఆశా భోస్లే

పంచమ్ - ఆశా

ఎస్.డి. బర్మన్‌తో పని చేస్తున్నప్పుడే ఆశాకు ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ (పంచమ్) పరిచయమయ్యారు. వయసులో చిన్నవాడైన పంచమ్, తన తండ్రి వారసత్వం మధ్య తనదైన గుర్తింపు కోసం వెతుకుతున్నారు. రాబోయే కాలంలో ఈ జోడీ స్వరాల కొత్త చరిత్ర సృష్టించబోతోందని అప్పుడు ఎవరూ ఊహించలేదు.

1966లో నాసిర్ హుస్సేన్ సినిమా 'తీస్రీ మంజిల్'తో వారి మొదటి వృత్తిపరమైన ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచే ఆ సృజనాత్మక భాగస్వామ్యానికి పునాది పడింది. ఇది హిందీ సినీ సంగీత స్వభావాన్నే మార్చేసింది. ఒకవైపు 'ఓ మేరే సోనా రే' వంటి శృంగార మాధుర్యం ఉంటే, మరోవైపు 'ఓ హసీనా జుల్ఫోన్ వాలీ' వంటి తుపాను వేగం ఉండేది. ఆ పాటలో ఆశా తన శ్వాసను నియంత్రించి పలికించిన స్వరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఆర్.డి. బర్మన్ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఆయన మనసులో ప్రపంచ సంగీతం నిండి ఉంది. ఆయన హిందీ సినిమాలో ఫంక్, జాజ్, క్యాబరే, రాక్-ఎన్-రోల్ వంటివి ప్రయోగించాలనుకున్నారు. కానీ, ఈ క్లిష్టమైన బాణీలను పాడటానికి సాగే గుణం ఉన్న, సాహసం చేయగల గొంతు కావాలి. ఆశా భోస్లే ఆ స్వరం అయ్యారు. పంచమ్ తన సంగీతంలో పాశ్చాత్య ధోరణులను మేళవిస్తే, ఆశా గొంతు ఆ సంగీతానికి ఒక కొత్త ఆకర్షణను, స్వేచ్ఛా భావాలను అద్దింది.

పంచమ్ దృష్టి కేవలం సందడి గల పాటలకే పరిమితం కాలేదు. లోకం అప్పటివరకు వినని ఆశా గొంతులోని లోతును కూడా ఆయన గుర్తించారు. 'పియా తూ అబ్ తో ఆజా' (కారవాన్), 'దమ్ మారో దమ్' (హరే రామ హరే కృష్ణ) వంటి పాటలు ఆశను 'క్యాబరే క్వీన్'గా లేదా ఆధునిక 'వెస్ట్రన్ వైబ్' గల గాయనిగా నిలబెడితే, 'ఇజాజత్' (1987) సినిమాలో 'మేరా కుచ్ సామాన్', 'ఖాలీ హాత్ శామ్ ఆయీ హై' వంటి గీతాలతో కవిత్వంలోని బాధను ఎంత నిశ్శబ్దంగా చెప్పవచ్చో నిరూపించారు.

ముఖ్యంగా 'మేరా కుచ్ సామాన్' పాటలో ఎటువంటి లయ (రిథమ్) లేని కవితాత్మక వాక్యాలను ఆశా పలికించిన తీరు నేటికీ గాయకులకు ఒక పాఠశాల లాంటిది.

పంచమ్‌తో ఈ జుగల్బందీలో ఆశా క్యాబరే చమత్కారం నుంచి గజల్ నిలకడ వరకు, శాస్త్రీయ సంగీత సంక్లిష్టత వరకు ప్రతి అచ్చులోనూ తనను తాను మలుచుకున్నారు.

ఆశా భోస్లే , ఏఆర్ రెహమాన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆశా భోస్లే , ఏఆర్ రెహమాన్ (ఫైల్ ఫోటో)

'ఉమ్రావ్ జాన్'తో కొత్తగా..

అప్పటివరకు హిందీ సినిమాలో గజల్ అంటే కేవలం లతా మంగేష్కర్ మాత్రమే అనే భావన ఉండేది. ముజఫర్ అలీ నిర్మించిన 'ఉమ్రావ్ జాన్' కోసం సంగీత దర్శకుడు ఖయ్యాం కొత్త ఒరవడిని సృష్టించే ప్రయత్నం చేశారు.

దీనికోసం ఖయ్యాం ఆశా భోస్లేను ఎంచుకున్నారు, అయితే ఆమెకు ఒక షరతు విధించారు: "మాకు పాటల్లో 'ఆశా' వద్దు."

అంటే ఆశా తనకి అలవాటైన చమత్కారాన్ని, సందడిని వదిలేసి, నిలకడ గల శాస్త్రీయ శైలిని అలవరచుకోవాలని ఆయన ఉద్దేశం.

ఆశా తన స్వరాన్ని ఒకటిన్నర స్థాయి (స్కేల్) తగ్గించి పాడాలని ఖయ్యాం కోరుకున్నారు. అంత తక్కువ స్థాయిలో పాడటం ఆశాకు కొత్త విషయం. ఎనిమిది రోజుల కఠిన సాధన తర్వాత రికార్డింగ్ మొదలైనప్పుడు, ఒక క్షణంలో తాను పాడలేనేమోనని ఆమె భయపడ్డారు.

కానీ, రికార్డింగ్ పూర్తయ్యాక తన పాటను తాను విన్నప్పుడు ఆశా ఆశ్చర్యపోయారు.

'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖో కీ మస్తీ కే', 'యే క్యా జగా హై దోస్తో' వంటి అమర గజల్స్ ప్రపంచానికి ఆశా గొంతులోని మృదువైన, గంభీరమైన కోణాన్ని పరిచయం చేశాయి.

దీని ఫలితం చరిత్రలో లిఖితమైంది. 'ఉమ్రావ్ జాన్' సినిమాకు ఖయ్యాం, ఆశా భోస్లే ఇద్దరికీ జాతీయ అవార్డులు దక్కాయి. కాలచక్రం తిరుగుతూనే ఉంది, సంగీత పరికరాలు మారుతూనే ఉన్నాయి. కానీ ఆశా స్వరంలోని శక్తి ఎప్పుడూ తగ్గలేదు.

ఆ తర్వాతి కాలంలో ఎ.ఆర్. రెహమాన్‌తో కలిసి 'రంగీలా', 'లగాన్', 'తాల్' వంటి సినిమాల్లో తన స్వరాలకు వయస్సుతో సంబంధం లేదని ఆమె మళ్లీ నిరూపించారు.

ఆమె కాలం నాటి ఎందరో గాయకులు మారుతున్న సంగీత పోకడలను, రీమిక్స్‌లను చూసి అసంతృప్తి వ్యక్తం చేసినా, ఆశా మాత్రం కొత్త తరాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఆమె స్వయంగా తన పాత పాటల రీమిక్స్ ఆల్బమ్‌లు విడుదల చేసి, కొత్త తరానికి ఆ 'మాయా సంగీతాన్ని' పరిచయం చేశారు.

ఆశా భోస్లే ప్రయాణం ముళ్ల బాటలా సాగింది. తన సొంత అక్క నీడ నుంచి బయటపడటానికి చేసిన పోరాటం అది. చివరకు ఆమె పట్టుదలే గెలిచింది. తాను ఏ రంగులోనైనా ఒదిగిపోయే పరిపూర్ణ కళాకారిణి అని ఆమె ప్రపంచానికి చాటిచెప్పారు. నిన్నటికీ యవ్వనంగా ఉండి, ప్రతి కాలపు ఆత్మను తాకే స్వరం ఆమెది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)