తెలంగాణ: 'ఆయిల్ పామ్' వైపు మళ్లితే ఏమవుతుంది? పదేపదే ప్రభుత్వం ఈ మాట ఎందుకు చెబుతోంది?

ఫొటో సోర్స్, opm.telanagana.gov.in
ఈ మధ్యకాలంలో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ వ్యవసాయ రంగంపై మాట్లాడుతున్నప్పుడు పదేపదే చెబుతున్న మాట.. పంట మార్పిడి.
అది కూడా ఆయిల్ పామ్ సాగు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
సిద్ధిపేట జిల్లాలో ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీని ప్రభుత్వం 2026 మార్చిలో ప్రారంభించింది.
"వ్యవసాయంలో మార్పు రావాలి. పామాయిల్ పంట తెలంగాణలో 3 లక్షల ఎకరాలకు చేరింది. మూడు లక్షలే కాదు, పది లక్షల ఎకరాల్లో పండించినా సరే కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని ఆ సందర్భంలో చెప్పారు రేవంత్ రెడ్డి.
ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం ఇంతలా మాట్లాడటానికి కారణమేంటి?

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ఎలా ఉందంటే..
అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 2.92 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది.
గతేడాదితో పోలిస్తే ఒక్క 2025-26 సంవత్సరంలోనే 1.02 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. ఇక్కడ సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట సాగులో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట రావడానికి 1980లలో పరిస్థితులు కారణమని చెప్పారు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎ.కోదండ రెడ్డి.
''1989లో డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా పనిచేశాను. ఆయిల్ పామ్ మలేసియాలో బాగా పండుతోందని తెలిసి, అక్కడి నుంచి మొక్కలు తెప్పించి మొదటిసారిగా ఏపీలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో పంట వేయించాం'' అని ఆయన చెప్పారు.
తర్వాత అది ఏపీతోపాటు తెలంగాణకు విస్తరించిందని చెప్పారు.
ప్రస్తుతం మాట్లాడుతున్న పంటల మార్పిడికి, ఆయిల్ పామ్ సాగువైపు మళ్లడానికి సంబంధం లేదని కోదండ రెడ్డి చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్స్‌కు ఉన్న సానుకూల పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు దీనికి కారణమని వివరించారు.

ఫొటో సోర్స్, opm.telanagana.gov.in
భూమి ఇస్తే, సాగు చేస్తామన్న మలేసియా
2024 జూలైలో భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్లాంటేషన్ అండ్ కమోడిటిస్ మంత్రి దటుక్ శేరి జోహరి ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు.
''భారత్ కనుక భూమి కేటాయిస్తే, పామాయిల్ ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకుని ముందుకు సాగుతాం'' అని చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వెజిటబుల్ ఆయిల్స్ పరంగా 40 శాతం ఆయిల్ పామ్ పంటనే అందిస్తోందని 2021లో స్ప్రింగర్ నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది. నిత్యం 300 కోట్ల మంది ప్రజలు (ఇందులో ఎక్కువగా ఆసియాలోనే ఉన్నారు) పామాయిల్ వాడుతున్నారని ఆ పరిశోధనలో వెల్లడైంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంపై 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్' దృష్టి పెట్టింది.
ఇప్పటికే తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగవుతోంది.
''ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు ఎక్కువగా లభిస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో మరో ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం'' అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.

ఫొటో సోర్స్, opm.telanagana.gov.in
వరికి ప్రత్యామ్నాయంగా మారనుందా..?
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సమాచారం ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఆరున్నర లక్షల హెక్టార్లలో సాగును ప్రోత్సహించాలని 2025 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 2029-30 నాటికి 28 లక్షల టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
2025 నవంబరు నాటికి రెండున్నర లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
2014-15లో 1.91 లక్షల టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి ఉండగా, 2024-25 నాటికి అది 3.80 లక్షల టన్నులకు చేరుకుంది.
ప్రస్తుతం వరి, పత్తి పంటలు అంతగా ఆశాజనకంగా లేకపోవడంతోపాటు ఉత్పత్తి పెరిగిపోవడం రైతులు ఆయిల్ పామ్ వైపు మళ్లడానికి కారణమని జాతీయ ఆయిల్ పామ్ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''ప్రస్తుతం వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు మొక్కజొన్నను చూస్తున్నారు. కానీ గత కొంతకాలంగా సరైన మద్దతు ధర లభించక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ ప్రత్యామ్నాయంగా మారుతోంది'' అని వివరించారు.
పామాయిల్‌కు మద్దతు ధర ఎక్కువగా లభిస్తోందని క్రాంతి కుమార్ రెడ్డి వివరించారు.
కోవిడ్ ముందు టన్నుకు రూ.8 వేలు లోపు ఉండేదని, ప్రస్తుతం రూ.23 వేల వరకు పలుకుతోందని చెప్పారు. అంటే ఖర్చులు పోను ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు నికర లాభం ఉండే అవకాశం ఉందని క్రాంతి కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, opm.telanagana.gov.in
మూడేళ్లపాటు ఎదురుచూపులు
ఆయిల్ పామ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
మూడేళ్లపాటు మొక్కలను బాగా చూసుకోవాలి, వరితో పోల్చితే తక్కువ నీరు అవసరమని చెబుతున్నా సరే, నీరు మాత్రం పుష్కలంగా అవసరం ఉందని సిద్ధిపేటకు చెందిన రైతు వెంకట్ రెడ్డి వివరించారు.
మొక్క వేసిన మూడేళ్ల వరకు ఆదాయం ఉండదని ఆయనన్నారు.
అయితే, ఆ మూడేళ్లలో అంతర పంటలు సాగు చేసుకునేందుకు వీలుంటుందని క్రాంతి కుమార్ రెడ్డి చెబుతున్నారు.
ఎకరం ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీ కింద ఎరువులు, మొక్కలు, అంతర పంటలు వేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తోందని చెప్పారు. పాత మొక్కను అప్-రూట్ చేసుకునేందుకు మొక్కకు రూ. 250 సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు.
సాధారణంగా ఎకరాకు 7-8 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పంట బాగా వస్తే, పది టన్నుల వరకు కూడా ఉంటుందని వివరిస్తున్నారు.
టన్ను పామాయిల్ గింజల నుంచి దాదాపు 201 కేజీల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి జరుగుతుందని క్రాంతికుమార్ రెడ్డి చెప్పారు. దాని నుంచి రిఫైన్డ్ పామాయిల్ ఉత్పత్తి చేస్తారని వివరించారు.
''క్రూడ్ పామాయిల్ నుంచి రిఫైన్ చేసే క్రమంలో కేవలం 1-2శాతం మాత్రమే తగ్గుతుంది'' అని ఆయన వివరించారు.
వరి, పత్తి వంటి పంటలకు ఆయిల్ పామ్ ప్రత్యామ్నాయమా, కాదా.. అనే విషయాన్ని పక్కనపెడితే, గత కొన్నేళ్లుగా ధరలు, అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్స్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయిల్ పామ్ వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారని కోదండ రెడ్డి బీబీసీతో చెప్పారు.
మరోవైపు, తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.
"మరిన్ని ఫ్యాక్టరీలు రావాలి"
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పరంగా సర్వే చేసి, దానికి తగ్గట్టుగా సాగును ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ ఆయిల్ పామ్ రైతుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
''ఇప్పటికే మూడు ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చాయి, మరొకటి నిర్మాణంలో ఉంది. అయితే, మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది'' అని చెప్పారు.
గతంలో ఆయిల్ పామ్ కోశాక 24 గంటల్లో ఫ్యాక్టరీకి పంపించాలనే ప్రచారం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారాయన.
''కాయ కుళ్లిపోకుండా ఉంటే చాలు, రెండు, మూడు రోజులు నిల్వ ఉన్నా ఇబ్బంది ఉండటం లేదు'' అని రామచంద్ర ప్రసాద్ వివరించారు.

ఫొటో సోర్స్, Dr.Sujeeth
'ఎప్పుడూ పామాయిల్ కాకుండా మారుస్తుండాలి'
సగటున 70 కేజీల బరువున్న వ్యక్తి రోజుకు 4 నుంచి 6 టీ స్పూన్స్ (20 మి.లీ.) నూనె వినియోగించవచ్చని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సుజీత్ బీబీసీతో చెప్పారు.
ఏదైనా అతిగా తీసుకోవడం మంచిది కాదని చెప్పారు. పామాయిల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని చెప్పారు.
"నెలనెలా ఆయిల్స్ మార్చడం ముఖ్యం. ఒకే రకమైన ఆయిల్స్ వాడుతుండటం మంచిది కాదు. ఒకే రకమైన ఆయిల్ మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతుండటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీనివల్ల గుండెపై దుష్ప్రభావం పడుతుంది" అని వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































